Previous Page
రంగులవల పేజి 22


    ఇంటిముందు టాక్సీ ఆగింది- ఏడ్పులతో సీతాపతి దిగ్గున లేచి టాక్సీ దగ్గిరకు పరిగెత్తాడు. పెద్ద పెట్టున శోకాలు పెడుతూ, గుండెలు బాదుకుంటూ, తూలుతూ, ఇద్దరు కొడుకుల ఆసరాతో నడిచివచ్చి శవం దగ్గిర పడిన అత్తగారిని చూసే తులసికికన్నీళ్లు వచ్చాయి. గోపాలరావూ, అతడి భార్యా వచ్చి కూర్చుని ఏక బిగిన శోకాలు ప్రారంభించారు. గోపాలరావు పిల్లలు బెదురు బెదురుగా చూస్తూ దూరాన నించున్నారు. వాళ్ళెవరూ ఏడవలేదు కాని, చిన్నపిల్ల మాత్రం తల్లిని చూసి తనూ ఏడ్చేసింది. ఆ రాత్రంతా ఎవరూ ఎవర్నీ ఓదార్చుకోలేకపోయారు.
    తెల్లవారి-
    శవాన్నెత్తేవేళకు పాప వచ్చింది. ఇంటికి వేసిన తాళం చూసి, "నువ్వూ వీళ్ళ వెంట వెడుతున్నావా?" అని అడిగింది తులసిని.
    తులసి తల ఊపింది.    
    "నే నింట్లో ఉంటాను. మీరు వెళ్ళండి" అంది.
    "ఇక్కడిదాకా వచ్చావు. వాళ్ళేమన్నా అనుకుంటారు. నువ్వూ వెంట రాకూడదూ" అంది తులసి.
    "మీరు వచ్చేసరికి వండిపెడతాను. మీరు ముట్టుకోరుగా" అంది పాప.
    సీతాపతి చూశాడు గాని ఏమీ మాట్లాడలేదు.
    ఇంటికి వచ్చి మళ్ళీ స్నానాలు చేశారు. సీతాపతీ, గోపాలరావూ కలిసి మూర్చపోయినట్టుగా పడుకున్న తల్లిని లేపి తినమని ఎంత అడిగినా వద్దంది ఆవిడ. పలకరిస్తే ఏడుపుగా ఉంది.
    పాప మొదట గోపాలరావు పిల్లలకు భోజనాలు పెట్టేసింది. తరవాత నెమ్మదిగా ఒక్కొక్కళ్ళనే అడిగి, బ్రతిమాలి, అందరికీ తినబెట్టింది. తులసి మాత్రం తినలేదు.
    ఆ సాయంత్రం సీతాపతితో, "వెళ్ళొస్తాను, బావా" అంది పాప.
    సీతాపతి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
    "నిన్ను ఉండమని ఎలా అడగను, పాపా. ఈ శుక్రవారం పదో రోజు. తప్పకుండా వస్తావు గదూ" అన్నాడు.
    పాప తల వంచుకుని, మాట్లాడకుండా నిలుచుంది. సీతాపతి వెళ్ళిపోయాడు.
    "పోనీ, ఈ నాలుగు రోజులూ ఇక్కడే ఉండి పోరాదుటే. నాకు మరీ ఎలా చెయ్యాలో తోచకుండా ఉంది. ఆ తరవాతైతే వాళ్ళుకూడా బెజవాడ వెళ్ళిపోతారు" అంది తులసి.
    "మీరు వండుకుంటారుగా. నేనుకూడా ఎందుకు. వీలైతే ఆ శుక్రవారం మళ్ళీ వస్తానులే" అంది పాప.
    "నీ ఇష్టం" అంది తులసి.
    "సరే, వెడతాను" అంది పాప.
    ఆ క్షణాన-తనను తాను మరిచిపోయి- పాపను బిగ్గరగా కౌగిలించుకుని ఏడిచింది తులసి.
    "పాపా!" అంది.
    పాప స్పర్శలో ఆమెలోని దుఃఖం కట్టలు తెంచుకుంది. అక్క ఏడుపును పాప ఎంతవరకు అర్ధం చేసుకుందో గాని- ఆమె కళ్ళలోకూడా నీళ్ళు నిండేయి.
    "ఛీ! ఊరుకో, అక్కా" అంది.
    తులసి ఊరుకోలేదు.
    ఒక్క మాటా, పలుకూ లేకుండా ఊరికే ఏడిచింది.
    "అదిగో, వాళ్ళు చూస్తున్నారు. బావుండదు. ఊరుకో" అంది పాప.
    తులసికి పొర్లి పొర్లి వస్తున్న కన్నీళ్లు మరింత ఎక్కువైనాయి. ఆమె చేతులు పాప చుట్టూ మరింత బిగుసుకున్నాయి.
    "సరే, ఉంటానులే. వదులింక" అంది పాప, తులసి చేతులోనించి విడిపించుకొనటానికి మరో మార్గం లేనట్టుగా.
    తులసి కన్నీళ్లు తుడుచుకుంది.
    "రా, నా కన్నం పెట్టు" అంది.

                                  20

    గోపాలరావు వాళ్ళు వెళ్ళిపోయారు. సావిత్రికూడా వచ్చివెళ్ళింది. సీతాపతి తల్లిని ఇక్కడే ఉండిపొమ్మన్నాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు. అన్నీ ఊహించినట్టుగానే గోపాలరావు వచ్చేటప్పుడు రెండు వందల రూపాయలు వెంట తెచ్చాడు. కాని అవి సరిపోలేదు. సీతాపతి మరికొంత ఖర్చు పెట్టవలసి వచ్చింది. స్వగ్రామంలో ఉన్న తమ ఇంటికి ఇప్పుడెవరూ వెడతారని లేకపోయినా, తను బతికున్నన్నాళ్ళూ అది అమ్మకూడదంది తల్లి. అది తప్ప మరే స్థిరచరాస్తులూ లేకపోవటంవల్ల ఇంకేమీ వస్తుందని నమ్మకం కూడా లేదు. చాలా సంవత్సరాల క్రితం కట్టడం మానేసిన భీమాపాలిసీలో కొంత డబ్బు రావచ్చు, వెళ్ళి తీసుకురమ్మంది తల్లి, కొండంత ఆశతో అతడు ఊరెళ్ళి చూస్తే అందులో సుమారు ఐదు వందల రూపాయలు మాత్రం రావచ్చు నని తెలిసింది. ఈ విషయం గోపాలరావుకు ఎలా తెలిసిందో, "నాన్నగారి భీమాపాలిసీ ఉండిపోయిందని విన్నాను. అందులోంచి నాకూ ఏమన్నా ఇస్తావని ఆశిస్తున్నాను. డబ్బుకు ఇబ్బందిగా ఉంది. పెద్దవాడికి టాన్సిల్స్ ఆపరేషన్ చేయించాలి. నువ్వు నాన్నగారికి చాలా ఖర్చు పెట్టావు. కాని మనం తల్లితండ్రులకు ఎంత చేస్తే మాత్రం ఋణం తీరుతుంది! అన్యథా భావించకు" అంటూ రాశాడు. ఆ ఉత్తరం చూస్తే సీతాపతికి అన్నమీద కోపం రాలేదు. అతడి వ్యవహారదక్షత మీదా, స్వార్ధం మీదా అసహ్యం వెయ్యలేదు. లోకం ఇంతే, చాలా వ్యాపార దృష్టి అనుకున్నాడు. ఈ విషయంలో అన్నతో పోట్లాడటం అతడికి ఇష్టం లేదు.
    తనకూ, తులసికీ జీవితం మీద ప్రేమ తగ్గటమే కాదు, ఓ రకమైన వెగటుకూడా కలుగుతున్నది. తులసి మీద తన ప్రభావం ఏమిటో, చాలా విచిత్రంగా తనకు తెలియకుండానే జారిపోతున్నది. ఇప్పుడామె తనతో సన్నిహితంగా ఉండటం లేదని కాదు. కాని, మొదటి రోజులవలె తమ సాన్నిహిత్యంలో విద్యుత్తును ప్రవహింపచేసిన శక్తి ఏదో ఇప్పుడు కోల్పోయారు. అది ఎవరిలో ఉండేదోకూడా ఇప్పుడు తను తెలుసుకో లేడు. క్రమంగా తగ్గిపోయి, కనుమరుగైందాకా అది పోతున్నదన్న ధ్యాసే తనకు లేదు. కాని అదింక తిరిగిరాదని మాత్రం చాల అయిష్టంగా తెలుసుకున్నాడు. తల్లి ఇక్కడే ఉంటుందేమో, పాత గొడవలు మళ్ళీ తలఎత్తవచ్చు. ఇప్పుడు మళ్ళీ తల్లి వెళ్ళిపోగలదా?
    ప్రతి మనిషీ ఒక వల. పక్కవాళ్ళను ఆకర్షిస్తాడు. తను వాళ్ళను వలలో వేసుకున్నానని సంతోషిస్తాడు. కాని తనూ మరొకరి వలలో ఉన్నానని తెలుసుకోవడమే ఇష్టం ఉండదు. తులసి తనకు దూరమైపోతున్నది. ఈ నెలనించీ తను నేరుగా పొదుపు చేసుకుంటుందిట. దానిమీద తనకేమీ ఆస్కారం ఉండదట. బహుశా ఆమెను ఆపదలో ఆదుకోలేనందుకు కోపం వచ్చి ఉంటుంది. ఆమె కోపం తనిప్పుడు ఇదివరకటంత సులభంగా, సరదాగా తీర్చలేడు. ఎందుకో తెలియదు కాని తనకు పశ్చాత్తాపంగా ఉంది. ఎక్కడో పెద్ద పొరపాటు జరిగింది, దిద్దుకోలేడిక. దాని పరిణామమే ఈ అసంతోషం, అశాంతి, అసౌకర్యం. వీటితోనే తాము వల లల్లుకుంటారు. పరస్పరం మోసగించుకుంటారు. వలలోకి వెళ్ళటమే, వల విసరటమే ఒక సుఖం. తరవాతంతా నరకమే!
    ఏడవటం తన కిష్టం ఉండదు కాని, తులసిని కౌగలించుకుని, "మనకేం మిగ్లింది, తులసీ, అసంతృప్తి తప్ప!" అనాలనిపించింది. తులసి కన్నీటితో తనను ఓదార్చితే, సుపరిచితమైన ఆమె శరీరాన్ని తడుముతూ, "ఊరుకో, తులసీ, అన్నీ మరిచిపోదాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వున్నన్నాళ్ళూ నేను లెక్కచెయ్యను" అంటూ ఆమెను మరింత దగ్గిరగా తీసుకుంటే...
    కాని తులసి దగ్గిరకు రాదు.
    అలసి సొలసి, చమటతో తడిసిన శరీరంతో సాయంత్రం ఓపిక చచ్చి ఇంటికి వస్తుంది. తన తల్లితో, "అత్తగారూ, కాఫీ ఇవ్వనా?" అంటూ అడగదు. తల్లి ప్లాస్కులో ఉంచిన కాఫీ తాగేసి, వెళ్ళి స్నానం చేసివచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. వంటలో ఎవరికేం నచ్చుతాయో గమనించదు. తన ఇష్టంకూడా అంతగా పట్టించుకోదు. ఏదో వండి పారేసి, తను తినేస్తుంది.
    ఇప్పుడు తులసి కబుర్లు చెప్పదు. తను చెప్పినా వినదు. ఇంట్లో ఉన్నప్పుడు నిద్రో, వంటింట్లో ఒంటరిగా కాలం గడపటమో గాని కులాసాగా లేదు.
    తల్లి ఎన్నాళ్ళిలా ఏడుస్తుంది? రోజూ సాయంత్రం కాగానే, కూర్చుని శోకాలు పెడుతుంది. తనకు చాల ఎబ్బెట్టుగా ఉంటుంది. తనను తాను తిట్టుకుంటుంది. ఇదంతా మరో రకంగా తనకు తులసి పై నగలు జుగుప్స ను వెల్లడించటమా? అంతా 'హిపోక్రసీ' అనుకున్నాడు.
    తన కెందుకు దుఃఖం లేదు? తులసికి అసలు ఏమాత్రం బాధకూడా ఉన్నట్లు లేదు. తన బాధలే తనకు ముమ్మరమైనట్టుగా ఎవర్నీ పట్టించుకోరు. ఎంత విచిత్రంగా తన సమస్యలూ, తులసి సమస్యలూ వేరైనాయి! బహుశా అందువల్లే ఒకరి నొకరు ఊరడించుకోరు. ఎందుకిలా మనసులో 'ప్రేమ' చచ్చిపోతున్నది? తనకు 'విడుదల' కావాలి.
    ఈ సమస్యలనించి, ఈ గొడవలన్నీ మరిచి మళ్ళీ కొత్తగా బ్రతకటం ప్రారంభించగలిగితే ఎంత బావుండును!
    గోవిందరావును ఇంట్లో తెచ్చిపెట్టటంవల్ల చాలా నష్టాలే వచ్చాయి గాని తనకేమీ ఒరగలేదు. అనవసరంగా ఇంటి వ్యవహారాలను రచ్చకెక్కించినట్టైంది గోవిందరావు స్కౌండ్రల్...
    తాము ఇల్లు మారకపోతే బావుండేదేమో. ఈ గొడవలేమీ ఉండేవి కావు.
    తను తండ్రిని మళ్ళీ రమ్మనకపోతే,
    తల్లిని ఇక్కడే ఉండిపొమ్మనకపోతే,
    పాపను గురించి తులసిలో అన్ని అనుమానాలకు కారణం కాకపోతే,
    అసలు తను తులసిని పెళ్ళి చేసుకోకపోతే,
    లేదా-    
    తులసిని ఉద్యోగం చెయ్యవద్దని చెబితే...
    తను ఇంతకన్నా సుఖంగా గడపగలిగేవాడా?

                                21

    మళ్ళీ చలికాలం వచ్చింది.
    మామగారి ఆరో మాసికం ముగిసింది.
    భోజనం చేసి పడుకున్నారు భర్తా, అత్తగారూ.
    మధ్యాహ్నం మూడు గంటలైంది. తులసి డాబా ఎక్కింది. ఎండ సుఖంగా ఉంది. ఈ చలికాలం పగ లెంత హాయిగా ఉంటుంది! ఎంత గాయపడిన బ్రతుకైనా, ఈ ఎండలో, క్షణం ఆదమరిచి నిద్ర పోగలదు.
    పాప వెళ్ళిపోయింది.
    పాప జ్ఞాపకంతో తులసి కళ్ళు కన్నీటి చలమలయ్యాయి. శశిరేఖ చెప్పింది - పాప ఎవరో ముస్లింతో బొంబాయి లేచిపోయిందిట. లేచిపోయిందనటం తప్పు. స్వేచ్చగా బ్రతుకుతున్న మనిషి. అతనితో బొంబాయి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి మతం మార్చుకుని అతణ్ణి పెళ్ళాడుతుందట. 'పాపా, నీ తురక పేరేమిటి?' ఆడది ఒంటిగా బ్రతుకుతుంది. తన కేవేవో కోరికలూ, ఆశయాలూ ఉన్నాయంది. అక్కడికి వెళితే అవన్నీ నెరవేరతాయని వెళ్ళిందిట. తన కొక్కమాట చెప్పలేదు. ఇంటికైనా రాయలేదు. సిగ్గుపడిందా? వాళ్ళను బాధ పెట్టదలుచుకోలేదా? కాని తనింకా బ్రతికే ఉంది. తన కీ విషయం తెలిసీ, వాళ్ళకు చెప్పకుండా ఎలా ఉండగలదు? ఎవరికీ తనేమీ కాకపోయినా, వాళ్ళందరూ ఇంకా తనవాళ్ళు. లబోదిబోమని ఏడుస్తూ అమ్మా, నాన్నా వచ్చారు. తనను చూసి ఏడిచారు. కోపంతో తిట్టారు; శపించారు. తన మూలంగానే పాప ఈ పని చేసిందన్నారు.  మొగుడు రాయిలాగా, దేవుడులాగా అన్నీ గమనించేడే కాని ఒక్క మాట మాట్లాడలేదు. తనది తప్పు కాదనలేదు ఔనన లేదు, తనకు తెలుసు, ఎవరిందుకు కారణమో, పాపా, ఎక్కడున్నావే, ఎలా ఉన్నావే, ఒక్క ముక్క రాసెయ్యకూడదూ?    
    'పాపా,
    నీకు జడ వేసుకోవటం నేర్పించాను. మాల లల్లటం నేర్పించాను. ఎన్ని సార్లో అమ్మ నిన్ను కొట్టకుండా రక్షించాను. నీ బాగు కోరి నిన్నిక్కడకు రమ్మన్నాను. నాకన్నా మంచి ఉద్యోగం చేస్తాననీ, సుఖపడతావనీ అనుకున్నాను. నన్ను మరిచిపొయ్యావా, అందరిచేతా నన్నిలా తిట్టిస్తున్నావా, నీ కోసం నే నెలా కాలిపోతున్నానో నీకు తెలుసా! నాకు తెలుసే-ఆయనే చేశా డింతా. ఆయనే నీలో ఆ నిప్పు రగిల్చాడు. నాన్న ఇదంతా నమ్మడు. కానీ నాకు తెలుసు. ఆయనే నీ కీ దారులు చూపించాడు. ఇప్పుడు నే నా యన్నేమనను? ఏం చేసినా నా మొగుడు మరి. ఇక్కడికి రావటం నీలోని ఆలోచనలను మరింత రెచ్చగొట్టింది. నిన్నిక్కడికి రమ్మనటమే పొరబాటు. కాని, పాపా, అప్పటికి రెండేళ్ళక్రితం చూశాను నిన్ను. అప్పుడు నీకు సిగ్గుపడటం తప్ప మరేమీ తెలిసేది కాదు. పాఠం నేర్చుకోకుండా క్లాసుకి వెడితే, టీచరు కోప్పడటం దుస్సహంగా ఉంటుందనేదానివి. నాలాగా ఉద్యోగం చెయ్యాలని మహా ఉబలాటపడిపోతున్నాననే దానివి. మరి, అలాంటి నిన్ను జ్ఞాపకం పెట్టుకుని రమ్మన్నాను. నీ కప్పుడే లో-కట్ బ్లౌజులూ, చేతి పర్సులో అద్దమూ, పౌడరూ, జేబురుమాలుకు సెంటూ, కళ్ళలో భావయుక్తమైన చూపులూ వచ్చేయని నాకేం తెలుసు! నిన్ను మందలించటం నా పొరబాటా, కాని లేకపోతే నన్ను మింగేసేదానివి. నువ్వూ సుఖపడకపొయ్యేదానివి.
    'ఏం చెయ్యను, ఎలాగైనా తప్పు నాదే క్షమించు.
    'ఈ ఉద్యోగం నా కెందుకు? ఏం సుఖం మిగులుతున్నది? జీవితం మీద పట్టు సడలిపోతున్నది. మరెక్కడినించో ఉచ్చు బిగుసుకుంటున్నది. నిద్ర రానివ్వని అలసట, అసంతృప్తి నా బ్రతుకులోనే చిరునవ్వును చెరిపి వేస్తున్నవి.
    'సంవత్సరంగా ఫాన్ కోసం గాలిమేడలు కట్టేనేకాని కొనుక్కోలేకపొయ్యాను. చస్తాడని తెలిసిన మనిషికి మరో రోజు శ్వాస పొడిగించటానికి రెండు వందలు ఖర్చు పెట్టాలా? నేనెందుకు ఎవరికైనా లొంగి ఉండాలి? ఎవరు నా ఇష్టాయిష్టాలను చూస్తున్నారు? ఎవరొక్క సానుభూతి వాక్యం పలుకుతున్నారు?'
    
                           *    *    *

    సాయంత్రమవుతున్నది. ఎదురుగా పూలమొక్కలు ఎండకు వాడిపోయినాయి. గుడ్డలు ఆరి క్రింద పడ్డాయి. చల్లగా గాలి వీస్తున్నది. జంటలు రిక్షాల్లో నవ్వుకుంటూ వెళుతున్నారు. కుక్క ఒకటీ తను గేటుముందర మట్టి తవ్వుతున్నది. ఒకప్పుడు ఒంటరిగా, నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రదేశంలో కొత్త ఇళ్ళు వెలుస్తున్నాయి. సగం కట్టిన ఇళ్ళతో, లేస్తున్న గోడలతో, పునాదులతో, ముళ్ళకంచెలతో దృశ్యం ఆసక్తి జనకంగా ఉన్నది.
    "తులసి ఎక్కడి కెళ్ళిందమ్మా?" అంటున్నాడు సీతాపతి.
    గాలికి కొంగు చెవులదాకా లాక్కుంది తులసి.    


                                                (సమాప్తం)


 Previous Page

WRITERS
PUBLICATIONS