12
రాధకు ఉద్యోగం దొరికింది. ఒక మందుల కంపెనీ లో అసిస్టెంట్ గా చేరింది. అమ్మాయి మాటల చాతుర్యం చోరవ చూసి ఉద్యోగం ఇచ్చారు. జీతం నెలకు నూట యాభై రూపాయలు.
ఆరోజున అన్నయ్య జైలు నుంచి ఇంటికి వచ్చినప్పుడు రాధ ఇంట్లో లేదు.
మొదటి నెల జీతం రాగానే మా ఇంటికి దగ్గర్లోనే ఒక చిన్న భాగం అద్దెకు తీసుకుని తల్లీనీ, చెల్లెల్ల్నీ, తమ్ముళ్ళ నిద్దర్నీ రాజమండ్రి తీసుకు వచ్చింది. రాధ వాళ్ళు కూడా దగ్గర్లోనే ఉండటం నాకూ సంతోషంగానే ఉన్నది. నా ట్రాన్స్ ఫర్ పిటిషన్ మీద కాకినాడ బదిలీ చెయ్యటానికి వీల్లేదని ఆర్డర్లు వచ్చాయి. ఆ ప్రయత్నం కూడా వారే చేశారనే విషయం తరువాత తెలిసింది.
అక్కయ్య అయిదో క్లాసు పుస్తకాలు పూర్తీ చేసింది. దాని మాటల ధోరణి వెకిలి తనమూ కాస్త తగ్గినట్లే కనుపించాయి. కాని పూర్తిగా పోలేదు. రాధ ఉపదేశాలు కూడా అక్కయ్య మనస్తత్వానికి టానిక్ లా పనిచేశాయి. వారి వద్ద నుంచీ ఉత్తరాలు లేవు. బాగా డబ్బు సంపాదిస్తున్నారనీ పార్టీలను పీడీస్తున్నరనీ ఆఫీసులో రామారావు గారు చెప్పేవారు.
చెప్పినట్లుగానే అన్నయ్య నెల మొదటి వారం లో ఏ రాత్రి పూటో ఉదయమో వచ్చి వంద రూపాయలూ ఇచ్చి వెళ్ళిపోయే వాడు.
ఇట్లా నాలుగు మాసాలు గడిచాయి. కష్టాలకయినా కార్పణ్యాలకయినా కొంత సమయమూ సందర్భమూ ఉంటాయి. నా జీవితానికి కను చూపు మేరలో ఈ కష్టాల సంకెళ్ళు విడిపోయే టట్లు లేవు.
ఒక రోజున విసుగెత్తి అమ్మతో పోట్లాడాను. ఆరోజు ఆదివారం. ఏమిటో గుబులు దొర్లింది. రాధ కూడా మా ఇంట్లోనే ఆ సమయంలో ఉన్నది. మాట్లాడకుండా అన్నీ వింటూ కూర్చుంది. అత్తయ్య గుళ్ళో పురాణానికి వెళ్ళింది ఈ సంసార పరిస్థితి చూసి ఆవిడ మరీ బాధతో కుమిలిపోతూ వీలు చిక్కినప్పుడల్లా గుళ్ళోకి వెళ్లి కూర్చునేది. అక్కయ్యకు పాఠాలు చెపుతున్నది రాధ "నీ కడుపున మేం నలుగురం ఏ సుముహూర్తాన పడ్డామో కాని అందరి జాతకాలూ అధోగతి లోకే లాక్కు పోయాయి. నీ కడుపు చలవ అంతటిది. బిడ్డల అదృష్ట దురదృష్టాలకు కారణం కొంత తల్లిదండ్రుల కర్మను బట్టి కూడా ఉంటుందేమో. నీ సంతానం లో ఎవరి జాతకాలూ బాగుండక పోవటం ఆలోచిస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది.' అన్నాను.
అమ్మకు కాస్త కోపం వచ్చింది. కేవలం కోపమే కాదు. కరుడు కట్టుకు పోయిన ఆవేదన. ఇదివరకు ఏ మాటన్నా అమ్మ ముఖాన నీళ్ళ కుండ ఉండేది. ఆ కళ్ళలో ఎప్పుడూ కన్నీరు కాపురం చేసేది. ఆ రోజున జైలు నుంచి అన్నయ్య వచ్చి వెళ్ళాక ఆ కళ్ళను కాళీ చేసి కన్నీరు వెళ్ళిపోయింది. ఆ చూపుల్లో ఆత్మీయత లేదు. ఈ జీవితాలు ఇంక బాగుపదవనే దృడ విశ్వాసం అమ్మ మనసులో ఇల్లు కట్టుకుని కాపురం చేస్తున్నది.
"అవునమ్మా నా మనస్సులోని బాధా అదే, కాకపోయినా ఏ భార్యాభర్తలకయినా కాపురం చేసి బిడ్డల్ని కనటమే తెల్సు కాని వాళ్ళ కర్మను కనటం తెలీదు. మీ ముగ్గురికన్న ఆ తప్పిపోయిన తమ్ముడే అదృష్ట వంతుడేమో. అంచేతనే ఆ భగవంతుడు ఈ నష్ట జాతకుల కూటమి నుంచి వాణ్ణి తప్పించాడు."
"పుట్టగానే వడ్ల గింజ వేస్తె ఈపాటికి నేను ఇంకో అమ్మ కడుపున పుట్టి అష్టఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండేదాన్ని. మాతో పాటు మా దురదృష్టాన్ని కూడా నువ్వే పెంచావమ్మా" అన్నది అక్కయ్య.

అంత బాధలోనూ అమ్మకు నవ్వొచ్చింది. "నీకూ కాస్త తెలివి తేటలు అబ్బుతున్నయ్యే. ఈ తెలివి తేటలు మరింత వృద్దయ్యి నీ కాపురానికి నువ్వు వెడితే నేను ఏ దిగులూ లేకుండా కళ్ళు మూస్తానే సునందా. అన్నయ్య బాగుపడాలంటే వాడు మరో జన్మ ఎత్తాల్సిందే. సుభాషిణి కాపురం బాగుపడాలంటే అయన బుర్రలో ఉన్న పురుగు తొలగి పోవాలి. అవును గానీ సుభా అతనేట్లాగూ ఉత్తరం రాయడు నువ్వయినా ఒక ఉత్తరం రాయకూడదుటే" కేక లేసినట్లుగా అన్నది అమ్మ. ఈ మాటలతో నాకెందుకనో కోపం వచ్చింది. తప్పంతా నాదే నన్నట్లుగా మాట్లాడుతోందని నేనూ తప్పుగానే అంచనా వేశాను.
"ఉత్తరాలతో కాపురాలు బాగుపడతాయిటే అమ్మా. పెళ్లి కాని చిన్నవాళ్ళకు ప్రేమలేఖలు సంధాన కర్తలయి పెళ్ళి పీటల మీదికి లాక్కు పోతయ్యేమోగాని , దూరమయిన కాపురాల్ని ఉత్తరాలు దగ్గరకు చేర్చలేవు. పైగా అర్షిస్తూ ఉత్తరాలు రాసిన కొద్దీ ఈ మగవాళ్ళ మనస్తత్వం రబ్బరు బెలూనులా మారి కాస్త పైకి పోతుంది."
అంతవరకూ ఏం మాట్లాడకుండా వింటూ కూర్చున్న రాధ తల అడ్డంగా తిప్పుతూ నా వైపు చూసి "ఆ రబ్బరు బెలూను కు ఒక సూది మొన తాకితే పేలిపోయి అదే కింద పడుతుంది. అందుకు ఉత్తరం కూడా ఒక సాధనమే సుభాషిణి" అన్నది.
"అయితే ఆ ఉత్తరమేదో నువ్వే రాసివ్వు నేను సంతకం చేస్తాను" కాస్త విసుగ్గా అన్నాను.
ఆ మర్నాడే ఒక ఉత్తరం రాసి తెచ్చింది రాధ. చదివి సంతకం పెట్టి పోస్టులో వెయ్య మన్నది. ఉత్తరం చదివాను.
రాజమండ్రి
శ్రీ శ్రీవారికి,
శ్రీవారి నుంచీ చిత్తగించవలెను వరకూ ఈ ఉత్తరం చదువుతారు కదూ!
అంతా కులాసా. కాకపోయినా కులాసాగా ఉన్నట్లు నటిస్తున్నాము. నటన, నడవడి ప్రతి వారికీ రెండు భుజాల లాంటివి ఈ రెండూ లేకపోతె అసలు చేతులే ఉండవు కదా.
సుఖాన్ని ప్రతి మనస్సు, శరీరమూ ఎల్లప్పుడూ కోరుతూనే ఉంటాయి. కాని ఆ సుఖానికే అనేక రకాలయినా గీటురాళ్ళు, అంటే ఎవరి ఉద్దేశమే వారికి గీటు రాయి. ఆ గీటు రాయి ఆధారంగానే ఈ ఉత్తరం రాస్తున్నాను.
సత్ప్రవర్తన , సచ్చీలమూ, ధర్మమూ అనేవి స్త్రీ పురుషు లిరువురికి కావలసినవి , వీటిని దృష్టి లో ఉంచుకునే వాటి మనుగడను కాపాడుకుంటూ మానవుడు సంచరిస్తేనే అతనికి మనుగడ కీర్తీ ప్రతిష్ట లతో విరాజిల్లుతుంది.
మన పెళ్ళికి ముందు నామీద మీరూ, మీమీద నేనూ ఎన్నో ఆశలూ అభిప్రాయాలూ పెంచుకున్నాం. భార్యాభర్తలు పడుగు పేకల్లా అల్లుకు పోతేనే ఆ సంసారం రాణించేది.
మితిమీరిన మానస్తాపంతో ఇక్కడ భార్య పిల్లలు అలమటిస్తుంటే అంతకన్న పది రెట్లు మిన్నగా మీరు తాత్కాలిక సుఖలాలసత్వంలో మునిగి పోయారు. సుఖ దుఃఖాలు కాపురం లో కలతలు లేకుండా అనుభవిస్తుంటే చూసేవాళ్ళూ , వినేవాళ్ళూ కూడా ఆదరాభిమానాలతో అర్ధం చేసుకుంటారు. కాని మన పరిస్థితి అందుకు విరుద్ధంగానే ఉన్నది. "కలసి ఉంటె కలదు సుఖం" అనే సామెత అనుభవయోగ్యమే కాని అర్ధరహితం కాదు. మంచయినా చెడయినా మనస్సు కూ, శరీరానికీ పూర్తిగా పడితేనే కాని ఎవరి కయినా సరే కనువిప్పు కలుగదు.
మీరు పుష్కలంగా డబ్బు సంపాదించండి. రోజుకొక కొత్త పిట్టను పట్టండి, సీసాలు ఖాళీ చెయ్యండి. శరీరంలో జవసత్వాలున్నంత వరకూ ఈ అనుభవాల నుంచి మీరు బయటపడలేరు. ఆరోజు వస్తే అందరూ మిమ్మల్నే బయటపడేస్తారు. అంతవరకూ భగవంతుడు కూడా కళ్ళు మూసుకునే ఉంటాడు.
నన్ను మీరు అసహ్యించుకున్న కొద్దీ పరోక్షంగా మీరు నాకు చేరువయే రోజులు దగ్గర పడుతున్నయ్యన్న మాట.
మీరు నన్ను ఆదరించక పోయినా నా ఆదరణ మీకు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. తాత్కాలికపు అనుభవాలు శాశ్వత బంధాన్ని ఎప్పుడూ విడదీయలేవు. కాకపొతే ఆ మలుపు తిరిగే వరకూ వేచి ఉండాలి. ఆ నిరీక్షణ లో నేను కృతకృత్యురాలి నవుతాననే నమ్మకం నాకున్నది.
మీ హృదయమనే కోవెలలో మూల విరాట్టు లేదు. విరిగిపోయిన ఉత్సవ విగ్రహాలు ఎన్నో! నా హృదయమనే కోవెలలో సర్వాంగ సుందరంగా అలంకరించ బడిన మూల విరాట్టు ఒకటే, ఒకే ఒక స్వామి. నా మనస్సు నే నిత్యమూ ఆ స్వామికి నైవేద్యం పెడుతున్నాను.
చిత్తగించవలెను.
మీ
ఉత్తరం చదివి సంతకం పెట్టాను. ఆ రోజునే పోస్టు చేశాను.
రెండు మాసాలు గడిచినా జాబు లేదు. పిల్ల వాళ్ళిద్దరూ తండ్రి కోసం దిగులుపడి పోయారు. అక్కయ్య చదువు ధోరణి లో పడింది. ఫస్టు ఫారం పుస్తకాలు చదువుతున్నది. రోజూ ఒక గంట రాధ పాఠాలు చెప్పేది. నేనూ రాత్రి చదువు చెప్పేదాన్ని. పెద్ద వాణ్ని బళ్లో వేశాను. వాడూ శ్రద్దగా చదువుతున్నాడు. పేర్ల పుస్తకం పట్టాడు.
అక్కయ్య విషయంలో నేనూ, రాధా మరొకసారి ప్లీడరు గార్ని సంప్రదించాం. ఇలాంటి కేసుల్లో దంపతుల్ని విడదీయలేక కొంతమంది న్యాయమూర్తు లు కేసులు వాయిదా వేస్తూ ఉంటారనీ, రాజీకి మరోసారి ప్రయత్నించమనీ సలహా ఇచ్చాడు. ఈ విషయాలన్నీటిలోనూ రాధ చాలా శ్రద్ధ చూపుతున్నది.
ఒకరోజున రాధ కాకినాడ వెళ్ళొస్తాననీ, వారి అడ్రసు ఇవ్వమనీ అడిగింది. "నేను ఆశ్చర్యపోయాను. వంటరిగా ఆడపిల్ల వారి దగ్గరకు వెళ్ళటానికి నాకు మనస్కరించ లేదు. కాని పట్టుదల పట్టడంతో సరేననక తప్పలేదు.
మర్నాడు కాకినాడ వెళ్ళి ఆ మర్నాడు తిరిగొచ్చింది రాధ. ఎంతో సంతోషంగా ఉన్న అమ్మాయిని చూసేసరికి వాతావరణం సుముఖంగానే ఉన్నదను కున్నాను. ఆ సంగతులన్నీ రాధ ఈ విధంగా చెప్పింది.
రాధ వెళ్ళేసరికి వారిద్దరూ భోజనానికి వెళ్ళే ప్రయత్నం లో ఉన్నారు. అమ్మాయిని చూడగానే వారు ఒక్కసారి ముఖం చిట్లించి, "ఓ, రాధా ఇట్లా వచ్చారేం, ఈ ఊళ్ళో ఉద్యోగం కుదిరిందా' అన్నారు. విషయాలన్నీ చెప్పిందిట రాధ.
'ఇవాళ నా కోసం మీరిద్దరూ సెలవు పెట్టాలి.' అన్నది. ఒక్క క్షణం ఆలోచించి.
"రాత్రికి మాట్లాడుకోవచ్చు. ఇవాళ చాలా పనుంది. ఈ ఊళ్ళో మీ స్నేహితురాలేవరయినా ఉంటే వెళ్ళి చూసొస్తే బావుంటుందేమో" అన్నారు.
'అక్కర్లేదు బావా. నేను ఇంట్లోనే ఉంటాను. మీరు ఆఫీసుకు వెళ్లి రండి. హోటల్లో భోజనం చేసొచ్చి హాయిగా ఏ నవలయినా చదువుకుంటూ కూర్చుంటాను. సాయంత్రం మాట్లాడు కుందాం. సరేనా."
ఇద్దరూ వెళ్ళిపోయారు. హోటల్లో భోజనం చేసివచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుని ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది రాధ. పక్కయింటావిడ వచ్చి రాధను పలకరించింది.
"నువ్వెవరమ్మాయి వమ్మా" రాధ కాస్త లౌక్యంగా మాట్లాడాలనుకుంది.
"మాదీ ఊరు కాదండీ. కుటుంబం గౌరవనీయమైనదే"
"వీళ్ళ వల్లో పడ్డావేం, పెళ్ళి కావలసిన దానివి కదా !"
"పెళ్ళయిన వాళ్ళు వీళ్ళ వల్లో పడొచ్చంటారా"
ఆవిడా నవ్వుతూ "భలే దానివే, వీళ్ళతో నేస్తం చేసి ఎందుకు చెడి పోతావని నీ మంచికే చెప్తున్నాను."
