Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 20


    సమాధానం యీయని సూర్యం పని పట్టిస్తానన్నట్లు చెట్టు నించి సరిగా తన ప్రక్కనే దూకింది.
    'అమ్మో-- కోతీ' అన్నాడు సూర్యం ప్రక్కకు గాబరాగా జరుగుతూ. మళ్లీ తడబడుతూ 'ఓహో నివ్వా గీతా?చెట్టు మీద కోతు లున్నాయను కున్నాను.'
    'చెట్టు క్రింద కొండ ముచ్చు కూర్చుందనుకోని గెంతాను.'
    'నీకు తెలీదు కామోసు కోతులకు కొండ ముచ్చులకు బద్ద వైరం.'
    'పొరపాటు గా అన్నాను. క్రింద కోతి కూర్చుందనే బటానీ లు వేసాను. ఆ రుచి చూసి యీ కోతి చెట్టేక్కుతుందను కున్నా.'
    'నాకు చెట్లెక్కటం చేతకాదు.'
    'నీకు చేతకాని ఎన్నో వున్నట్లు తెలిసి పోతోందిగా.'
    'పోనీ చెప్డూ-- తెలుసుకొని.....!
    'ఒకరు చెప్పితే సరిదిద్దుకుంటే నీ ప్రజ్ఞ ఏదీ? నీ చేతకాని తనాన్ని నివ్వె తెలుసుకుని సరిదిద్దు కుంటే గొప్పతనం.'
    'నివ్వు అలాగే చేస్తుంటావా?'
    'ఇది నాకు చేతకాదని చెప్పు చూస్తాను?'
    'ఏముంది?......' ఆలోచనలో పడ్డాడు.
    'ఏమీ లేదు...' వ్రేళ్ళతో లెక్క పెట్తూ 'నాలా వంట చేసేవాళ్ళు, నాలా పాడేవారు, ఆడేవారు, సరదాగా వుండేవారు, చల్లగా కబుర్లు చెప్పేవారు, పెంకితనం చేసే వాళ్ళు, సంతోషంగా వుండేవాళ్ళు -- యింకా చదివే వాళ్లు -- మా వీధిలో యెవరూ లేరు.'
    'ఎంతవరకు చదువుకున్నావ్.'
    'మీరెంతో నేనూ అంతే చదివాను.'
    'నా చదువెం నీకేం తెలుసు?'
    'అయ్యో! మా అక్క యింట్లో వుంటే' మా యింట్లో వున్నట్లు కాదూ! మీ గురించి   నాకెంతో తెలుసు! బోల్డు తెలుసు.'
    'ఏం తెలుసుకున్నానో చెప్పకూడదూ వింటాను.'
    'అందరి గూర్చి ఆడవాళ్ళు బాహాటంగా చెప్తారు. కానీ ఒక్కడి గూర్చి చెప్పలేరని తెలీదు...'
    'చెప్డూ.'
    'ఫా-- నే చెప్పను' అంటూ పుస్తకం లాక్కుని పరుగెత్తింది. సూర్యం అలా చూస్తూ నిల్చుండి పోయాడే గానీ ఆమె వెంట పరుగెత్త లేదు. ఇదివరకు భాభీ యింట్లో అప్పుడప్పుడు గీతను చూసాడు గానీ యింత చలాకీ పిల్ల అనుకోలేదు. ఆమె తిరిగి వచ్చి
    'అప్పుడే ముసలి వాళ్ళయిపోయారు. ఎంత మంది పిల్లలు సార్!'
    'లేరు.'
    'అయితే మీ వేపు అనుమానంగా చూడవలసి వస్తోంది.' అనగానే అంతరార్ధం గ్రహించుకుని 'అమ్మదొంగా" అంటూ వెంట తరిమాడు.
    ఆమె పరుగెత్తింది. పది అడుగులు వేసి సూర్యం ఆగిపోయాడు.

                                         9
    పిక్ నిక్ నించి తిరిగి వచ్చినా గీత కళ్ళకు కట్తోంది. అభిమానంలో అక్కకు మించి పోయినట్లుంది ఆమె. ఒకసారి విహార్ సరస్సు కు వెళ్లాడు. బొంబాయి నగరానికి నీటు సప్లయ్ చేసే సరస్సు లో యిదోకటి . అందమైన వుద్యానవనం నిర్మించి వేడుకగా గడపడానికి అవకాశం యిచ్చారు. ఇక్కడ గీత అతి నెమ్మదై పోయింది. ఏదో ఆలోచిస్తూ మాటాడ కుండా నడుస్తుంటే
    "ఏం , అలా వున్నావ్. గాలివాన వెలసి పోయినట్లుంది.' అన్నాడు సూర్యం.
    'ఇప్పుడే గాలివాన వచ్చే సూచనలున్నాయ్.' అంది.
    'సూర్యం మాటాడలేదు. అడుగులు జోడుగా వేసాడు. ఆ రాత్రి చాలాసేపటి వరకు గీత చేష్టలే తలలో తిరిగాయ్. ఆమె బొంబాయి పట్నం లోని విశాలత, అందం, ప్రాణంతో పెరిగిన బిడ్డ. ఆ పరిసరాల అందం, నైర్మల్యం, ఆడంబరం అంతా ఆమెను పెంచాయ్. పున్నమి నాటి వెన్నెల విశాల అందమైతే గీత అందం బొంబాయి లో వెలిగి పోతున్న మెర్కురీ లైట్ల లాంటిది. ఈ వెలుగుకు మేఘాల ప్రమేయం లేదు. వర్షం వచ్చినా , గాలి వీచినా నిత్యం వెలుగు తుంటుంది.
    పున్నమి వెన్నెల వేపు చూడగా వచ్చే మధురానుభూతులు మెర్క్యురీ లైట్ల వేపు చూడగా రాదు. కళ్ళు ఒకోసారి ఆ తళుకు చూడలేక పోవచ్చు. మళ్ళీ పౌర్ణమి యెప్పుడు వస్తుందా అని వేచి వున్నట్లు విశాల మళ్ళీ ఎప్పుడైనా కనిపించదా అన్న ఆశతోనే అతను నిద్రపోయాడు. ఈలోగా గడచిన పున్నమి నాటి బింబాన్ని వెలుగుని తలచుకుని ఆనందానుభూతులను పొందవలసిందే! ఈసారి విశాలను కలిసినా ఆమె అందని చందమామ లా వుంటుంది. ఆ పున్నమినాడు ఆకాశం లో మేఘాలు చందమామ ను కప్పవనే ధీమా ఎక్కడుంది? అతను నిరీక్షించటానికి  మళ్లీ అలవాటు పడిపోతున్నాడు.
    గీత యీ మధ్య తరచూ వస్తోంది. ఏవేవో మాటలు కలుపుతోంది. "మీ దగ్గర ఏం పుస్తకాలున్నాయో చూడని య్యండంది. అవన్నీ చూసి 'అన్ని సీరియస్ వె. ఇవి చదివి నవ్వ గలిగినదేమీ లేదు.' అంది.
    'ఇవి కూడా చదవండి. ఒక్క నవ్వుతోనే జీవితం పరిపూర్ణం కాదుగా.'
    'అయితే యేడుపూ వుండాలంటారా?'
    "మీరెప్పుడూ ఏడవ లేదా?'
    'చిన్నప్పుడు యేడ్చానెమో నాకు తెలీయదు. నేను గీతను అనే గర్వం వచ్చిన దగ్గర నించీ నేను దేనికీ బాధపడలేదు. ఎందుకూ కించ పడలేదు.'
    'అలవాటు లేకపోతె చికాకు. ఇప్పుడు కొద్దిగా బాధపడితే పెద్ద బాధ వచ్చినప్పుడు తట్టుకోగలరు.'
    'మీ వలెనే బాధపడాలి. నాకింకో బాధ లేదు.'
    'నేనేం చేసాను?'
    'బాధపడమని చెప్తున్నారుగా!"
    'ఒకరు చెప్పగానే అయిపోతుందా?'
    'పోనీ యెలా బాధపడాలో చెప్పండి."
    'నాకేం తెలుసు?'
    'మీరు బాధపడ్డ మనిషని మీ పుస్తకాలు మీ నడవడిక చెప్తోందిగా.'
    'బాధపడాలని కోరుకోకుండా బాధలు వచ్చి పడ్తాయ్. మీలాంటి వాళ్ళకి బహుశః బాధపడే అవసరం ;లేదనుకుంటాను?'
    'ఏం?'
    "మీరు చెప్పారుగా మీ గుణ గణాలు.'

                        
    "నా గుణగణాలు నేను చెప్పుకుంటే ఏం లాభం? ఎదుటి వాళ్ళు చెప్పాలి గానీ.'
    'నేను చెప్పాలని మీ వుద్దేశమా?'
    గీత తలదించేసింది.
    'గీతా! తోలి యౌవ్వనం లో నిన్నే గాని కలిసి వుంటే నిన్ను జీవిత కాలం మరచే వాడ్ని కాదు. ఇప్పుడు నిన్ను దీవించి మరిచి పోవడం తప్పించి యింకేం చెయ్యలేను.'
    గీత ఒకసారి తలయెత్తే సరికి ఆమె కళ్ళల్లో నీరు నిండి వున్నాయ్. సూర్యం కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయ్. ఆమె అక్కడ నించి ఆశను చంపుకోలేక కామోసు యింకా వదల్లేదు. ఈ మాటలు అనుకోకుండా అన్నాక సూర్యం ఆ మాటలు త్రిప్పి నిన్ను మరిచి పోలేను గీతా అందామనుకున్నాడు. అలా కావాలని అనుకోడానికి కారణం విశాల తనకు దూరం కావటం. మళ్లీ తన జీవితంలో సుఖ పెట్టడానికి అన్ని హంగులు వున్న యిలాంటి స్త్రీ దొరకదేమోనన్న వుబలాటం -- దాని వెనువెంటనే వచ్చే ముందు నాన్న దైన్యంగా 'మన కుటుంబం పెద్దది నాయనా, మనలో ఎవరేతప్పుటడుగు వేసినా కుటుంబం అంతటికీ కీడు ముట్టుకుంటుంది.' అన్న పలుకులు తన తలను దించేసాయ్. 'సర్దాకన్నాను నిన్ను నిజంగా మరచి పోలేను గీతా౧' అని నాలుక చివర వరకూ వచ్చే మాటలను ఆపేసాడు.
    గీత కన్నీరు తుడుచుకుంటూ 'నేను విచారిస్తానో లేదోనని-- మీరు నన్ను పరీక్షిస్తున్నారా?'
    ఆమె యింకా బలీయమైన కోర్కెతో ఆశను విడిచి పెట్టక పోవటంతో సూర్యం అప్రయత్నంగా నవ్వు ముఖం పెట్టేడు.
    'అమ్మ దొంగా! మెత్తనివాడి వనుకున్నా' అంటూ ఒక పుస్తకం పట్టుకొని వెళ్ళిపోయింది. సూర్యం బిక్క ముఖంతో కూర్చుండి పోయాడు.
    ఇక ఆఫీసు విషయం . తనపై నున్న ఆఫీసరు యేదైనా మోఖమాటం లేకుండా కుండ బద్దలు గొట్టినట్లు చెప్పే మనిషి. నిజం సాధారణంగా రుచించదు. తినగతినగా వేము తియ్యనుండు అన్నట్లు రానురాను ఆ నిజం రుచించసాగింది. తను అతని లానే బాహాటంగా యెందుకు నిజం చెప్పకూడదు? ఎదుట వాడు ఏం కష్టపడతాడో అని నిజాన్ని యెందుకు మరుగు పరచాలి? తోలి రెండు మూడు నెలలు యీ ఆఫీసరు తో వేగలేనని సూర్యం అనుకున్నాడు. దానికి కారణాలు యెన్నో కనిపించాయ్. తను వ్రాసిన డ్రాప్తులు ఇదివర కెందరో ఆఫీసర్లు మెచ్చుకునే వారు. అంతకంటే శ్రద్ధ తీసుకుని రాసి డ్రాప్ట్ పెడితే అడ్డంగా ఒక గీత గీసి ' కంపు కొంట్తోంది ' అని వ్రాసేవాడు. ఒకనాడు సూర్యం కు ఒళ్లు మండి 'ఇందులో తప్పేదో చెప్తారా?' అని అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS