వాళ్ళన్న మాట నిజమే నండి."
"మరి బ్రతుకు తెరువెలా?"
"ఎలాగో గడుస్తుంది. కొన్నాళ్ళు నిశ్చింతగా ఉంటె ఆరోగ్య వంతులవుతారు."
"ఉన్న డబ్బంతా ఖర్చాయి పోయింది. పాప కూడా పని మానేసింది."
"పోనివ్వండి.' ఎన్ని విధాలుగా ఓదార్చినా సీతారామయ్య దిగులుపడుతూనే ఉన్నాడు. కూతురి కన్ను గప్పి ఎప్పుడో ఒకప్పుడు బయటికి వెళ్ళి తన పనికై ప్రయత్నించే వాడు. అతన్ని వారించి విసుగు చెంది ఊర్కున్నాడు.
ఆరోజు ఆనంద్ కాలేజీ తీశారు. అతను వెళ్ళి, స్నేహితులతో , పరిచయస్తులతో కబురు చెప్పి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు పెద్ద గుంపు వుంది. వారిని నెట్టుకుని లోపలికి వెళ్ళాడు. ఆచేతనుడై నుదుట, చేతుల పై గాయాలతో పడిన సీతారామయ్య ను చూచాడు ఆ ప్రక్కనే సిరంజి చేత బట్టుకుని నిల్చున్న డాక్టరు కనిపించాడు. నీళ్ళు తెచ్చి డాక్టరు కిచ్చిన సురేఖ ఆనంద్ చేతులు పట్టుకుని బావురుమంది.
"ఏమైంది డాక్టరు గారూ?"
"మెంటల్ ఆస్పత్రి ముందు నడుస్తూ నడుస్తూ పడిపోయాడండి . మేము చూచి తీసుకోచ్చాము." ఎవరో చెప్పారు. "వారికి కృతజ్ఞతలు చెప్పి పంపాడు. డాక్టరు కు డబ్బిచ్చాడు. రాత్రి గడిస్తే గగనమే. మీ తృప్తి కోసము మందిచ్చాను. శరీరమంతా నీరు వచ్చింది. " అతన్ని పంపి వచ్చేసరికి సురేఖ తండ్రి మంచము దగ్గర కూర్చుని ఏడుస్తుంది. ఎలా ఓదార్చాలో తెలియలేదు. తను కాస్త దూరములో కూర్చున్నాడు. అరగంట కు తేరుకుని, తండ్రి తల వైపు కూర్చుని "భగవత్ గీత చదువసాగింది. రాత్రి ఎనిమిది గంటల కతనికి స్పృహ వచ్చింది.
"అమ్మా-----పాపా......" గాలిలోకి చేతులు చాపాడు. గీతా పారాయణము ఆపి వచ్చింది. ఆమె నిబ్బరంగా ఉండాలను కున్న ప్రయత్నమూ వృధా అయింది.
'ఛ కన్నీరు ఎందుకు? ' అతని కంఠం స్పష్టంగా ఉంది.
"పాలు తీసుకుంటారా నాన్నా?"
"అం, ఆనంద్ బాబేడి?"
"ఇక్కడే ఉన్నానండి." ఆనంద్ ఎదురుగా వచ్చాడు. రేఖ పాలు తేవడానికి వెళ్ళింది.
ఏవి నీ చేతులు. ఆనంద్ ఏనాటి బంధమో ఇంత అప్తుడవయ్యావు . నా తల్లి.' అతని గొంతు పూడుకు పోయింది.
"రేఖను గూర్చి మీరేం చింతించవద్దండి. నేనున్నానుగా." అతని చేతిలో చేయి వేశాడు. ఆ వృద్దుని కళ్ళు తృప్తిగా మెరిశాయి. పాలు తెచ్చిన కూతురి చేతిని, ఆనంద్ చేతిలో పెట్టాడు. కళ్ళతోనే ఎన్నో రకాలుగా అభ్యర్ధించాడు . పాలు త్రాగి నిశ్చింతగా కళ్ళు మూశాడు. అవి శాశ్వతంగా మూసుకుపోయాయని వారికి చాలాసేపటికి తెలిసింది.
* * * *
ఆనంద్ కాలేజీ నుండి తిరిగి వచ్చేసరికి వెనుక వైపు వరండా లో కూర్చుని శూన్యము లోకి చూస్తుంది రేఖ. అతనూ అయిదు నిమిషాలు నిలబడినా ఆమె గమనించనే లేదు.
"ఇంట్లోకి దొంగలు వచ్చి అంతా తీసుకు పోయినా ఇంతేనా రేఖా?' వెనుతిరిగి తన చెంత నిలబడిన ఆనంద్ ను చూచింది.
"క్షమించండి.మరిచి పోయాను." లేచి పోబోయింది. ఆమె చేయి పట్టి ఆపాడు.
"చూడు రేఖా . నువ్వు విచారంగా వుంటే నాకేం తోచదు. నాన్నగారు వృద్దులు. వారిని గూర్చి విచారించవద్దు" అతని భుజము పై తల వాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది.
"వారొక్కరే నాకున్నవారు."
"నేను నీకేం కానా?' కినుకగా అడిగాడు.
"లేదు. ఊర్కే అన్నాను. మీరే నాకిప్పుడు సర్వస్వమూ" త్వరగా వెళ్ళి కళ్ళు కడుక్కొని వచ్చింది.
"ఒంటరిగా కూర్చుంటే పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఇన్ స్టిట్యూట్ లో చేరు."
"వద్దండి. ఇప్పటికే మీచేత చాలా ఖర్చు పెట్టించాను నాన్నగారి అంత్య క్రియలకు వాటికి" ఆమె వారించింది.
"అదిగో మళ్ళీ అలా పరాయిదానిలా మాటాడుతావెం?"ఆమె వంక కోపంగా చూచాడు. కాని మనసులో డబ్బును గూర్చి దిగులుగానే వుంది. విలాస యాత్ర పేరుతొ రెండు వందలు ఎక్కువ తెప్పించాడు. సీతారామయ్య గారి అంత్యక్రియలకు సరిపోకపోతే. వ్రేలి కున్న ఉంగరము అమ్మాడు. రేఖ ఖర్చులు అదనంగా ఉండనే వున్నాయి.
"మీకు కోపము వస్తుంది. వాస్తవము ఆలోచించరేం? ఫీజు కట్టండి. ఇంట్లో కూర్చుని చదువుతాను." అన్నది. ఆమె మాటే సమంజసంగా కనిపించింది.
"నువ్విలా కూర్చోవద్దు. లే బీచ్ కెళ్ళి వద్దాము" అతని వెనకాల బీచ్ కెళ్ళింది. చెట్టాపట్టాలు వేసుకుని తిరిగితే కాలమే తెలియటము లేదు.
"మీ సమక్షం లో స్వర్గమే కనిపిస్తుంది ఆనంద్."
"నీవు నా దగ్గిరుంటే చాలు మరేమీ వద్దని పిస్తుంది రేఖా" తన్మయత్వంతో అమే కళ్ళలోకి చూచేవాడు.
"అయితే ఇవి కూడా వద్దా?' వలసిన నారింజ ముక్కలు అతని యెదురుగా పెట్టి కొంటెగా చూచేది.
"ఒట్టి పొగరు మోతుదానావు. ఇలా ప్రవర్తిస్తే అమ్మ నాల్గు అంటిస్తుంది."
"ఫరవాలేదు. తట్టుకునే శక్తి వుంది" నిబ్బరంగా అనేది.
"ఊర్కే అన్నాను గాని అమ్మ హృదయము అమృతమయము రేఖా."
'ఈ కొడుకును చూచే తెలుసుకోవచ్చు లెండి."
"థాంక్స్" కొంటెగా నవ్వి సిగరెట్టు వెలిగించాడు.
"ఈ పిచ్చి వేషాలు కట్టి పెట్టండి. ఊ అంటే సిగరెట్టు. పాడు అలవాట్ల కేం కరువు లేదు." అతని చేతిలోని సిగరెట్టు లాగేసింది.
"ఇందాకే మంచి మంచి బిరుదులిచ్చావు."
"మంచి బిరుదల చాటున ఈ పనులు చేయమనా, లెక్కతో రోజుకు రెండు సిగరెట్లు, రాత్రి ఎనిమిది దాటినాక పెదవి విప్పరాదు. చదువు కోవాలి."
"బాగున్నాయి ఆంక్షలు."
"ఇంకా వినండి. ఆదివారాలు తప్ప షికార్లు పోరాదు. ఉదయమే లేస్తూనే హస్కు వేసుకోరాదు. వారానికి ఒకేసారిసినిమా కెళ్ళాలి."
"అన్నము తినాలా వద్దా?"
"అందులకేం ఆక్షేపణ లేదు. కావల్సినది అడిగి చేయించు కోవచ్చు." ఆమె తమాషాకు చెప్పిన మాటలు కావు. అతను చదువు అశ్రద్ధ చేస్తే అలక సాగించేది.
ఆరోజు ఎంతో ఆత్రంగా వచ్చాడు ఆనంద్.
"ఏమిటండి అలా ముఖము వ్రేళ్ళాడేసుకుని వస్తున్నారు?"
"రేఖా! ఇప్పుడెం చేయాలి? అమ్మా, నాన్నా పాండిచ్చేరి కి వస్తున్నారట. రేపు ఇక్కడే ఉంటామని వ్రాశారు."
"ఉండనివ్వండి. వారిని సేవించి తరించవచ్చు."
"నీకు మతి గాని పోయిందా ఏం.?"
'అది మీకే తెలియాలి."
"మొండి మనిషివి. వారికి నీ గురించి ఏం చెప్పలేదు. ఒకేసారి వారికేం చెప్పాలి?"
"మీ కోడలు. నా ఇల్లాలు అని చెప్పలేరా?"
"రేఖా!' గట్టిగా అరిచాడు.
"అప్పుడే కోపము వచ్చిందా? ఫరవాలేదు. ఒక్కరోజు ఇంటి వారింట్లో సర్దుకుంటాను లెండి. వారికి కోపమొచ్చినా, బిగాదీసుకోవటానికి మీరింకా స్వతంత్రులు కారు."
"ఆ మాట మొదటే చెప్పి ఎడ్వరాదూ!" విసుగ్గా చూచాడు.
"శ్రీవారి ముఖము కోపం తో ఎలా ఉంటుందో నని." పక్కున నవ్వింది. అతనికి బాగా కోపము వచ్చింది. రెండు చెవులు మేలి వేశాడు.
రంగారావు గారు సతీ సమేతుడై వచ్చాడు. ఆనంద్ ఇంటిని చూచి ఇద్దరూ ఆశ్శర్య పోయారు.
"మా నాయనా! నీకు భాద్యతలు తెలిసి వచ్చాయిరా! ఇంటికి రాగానే మొదట నీ గది శుభ్రము చేయటానికే ఓ గంట పడుతుందను కున్నానురా. ఎంత చక్కగా పెట్టుకున్నావు."
"రోజూ గోల పెడతావుగా ఒక్కడిని దూరము పంపానని. చూడు కొన్నాళ్ళు ఒంటరిగా ఉంటె బాధ్యతలు తెలిసివస్తాయి. తమ పనులు తాము నేర్చుకుంటారు." వారి మాటలలోనే రేఖ ట్రేలో కాఫీ పట్టుకుని వచ్చింది. ఆనంద్ గుండెలో రైళ్ళు పరిగెత్తాయి. ట్రే వారి కెదురుగా పెట్టి నమస్కరించింది. వారి చూపులలో ప్రశ్నకు జవాబెలా చెప్తాడు.
"తీసుకోండి చల్లారిపోతుంది. ఇంటి వారి నుండి తెచ్చాను. మీ అబ్బాయి గారికేం తెలియదు. అప్పుడప్పుడు సాయము చెయ్యమని నాన్నగారు చెప్పారు." అని అటు నుండి వెళ్ళిపోయింది.
"వాళ్ళు తెలుగు వారా?"
"అం....కాదు అమ్మాయికి మాత్రమూ వస్తుంది...' తడబడుతూ చెప్పాడు. తరువాత వారి విషయాలలో వారు మునిగి పోయారు. కాసేపు విశ్రమించి , స్నానాలు చేసి బయలు దేరుతుండగా రేఖ ఎదురు వచ్చింది.
"మీరు బయట భోజనము చేసేరు, నేను తయారు చేస్తాను."
"ఎందుకమ్మా శ్రమా.....' వారించ బోయింది సరస్వతమ్మ.
"మొహమాటము వద్దండి. ఆనంద్ గారెంతో నేను అంతే" ఆ మాటలకు సరస్వతమ్మ కరిగి పోయింది. ఆడపిల్లలు లేని ఆ తల్లి హృదయము క్షణము ఆ ప్రేమకు ఉక్కిరిబిక్కిరి అయింది. రేఖను దగ్గరగా తీసుకుంది.
"నువ్వు చిన్నబుచ్చు కోవటము దేనికి అలాగే చేస్తాము. ఊరంతా తిరిగి అలసటగా ఇల్లు చేరారు. రేఖ వడ్డించగా తిని, అందరూ అలసి నిదురపోయారు. మరురోజు వుదయమే వారంతా పాండిచేరి వెళ్ళిపోయారు.
"నిన్ను....నిన్ను నాల్గు తన్నాలని పించింది. యెంత ధైర్యము. వాళ్ళు యింకా వివరాలు అడిగితె ఏం చేసేదానావు?" తల్లిదండ్రుల్ని పంపుతూనే రేఖపై విరుచుకు పడ్డాడు ఆనంద్.
"అంతా నిజము చెప్పేదాన్ని" నవ్వింది .
"మొండి ధైర్యము"
"మొండి ధైర్యముంటేనే ఈ ప్రపంచములో బ్రతుకుతాము దొరగారు."
"కొన్నిసార్లు గోతిలో కూడా పడతారండి. దొరసానిగారూ!" వెక్కిరించాడు.
