Previous Page Next Page 
మమత పేజి 21

 

                                    9

    ఈ కధ చదువుతున్న పాఠకులకు రెండు వర్గాలుగా విభజించడం అన్యాయం కాదనుకుంటాను.
    'అయ్యో! పసివాడు పాపం. చిక్కుల్లో పడ్డాడు. రఘుపతి యింట్లో జేరి' అనుకునే హెడ్ మాస్టారి వర్గం ఒకటి.
    'స్వామి రొట్టె విరిగి - నేతిలో పడింది. పదునైన పడుచు పిల్లకు ప్రయివేటు చెప్పే అవకాశ మే వస్తే - మాష్టారే ఎదురు ఫీజు యిచ్చినా తప్పు లేదంటాను.' అనే పరాంకుశం తాలూకు వర్గం మొకటి.
    'కోటలో పాగా వేశాడయ్యా స్వామి. గంగిగోవులా , నోట్లో వేలు పెట్టిన కొరకడం చాతకానట్టు అలా సాధువులా కనిపిస్తాడు గాని అసాధ్యుడండోయ్ మన స్వాముల వారు - ' అంటున్న పరాంకుశం మాటలు వరండాలో నుంచుని విన్నప్పుడు స్వామి బాధపడిన మాట కూడా నిజం.
    తనతో ప్రత్యక్షంగా అదే ధోరణి తో మాట్లాడే వాడు పరాంకుశం. ఒకనాటి ఉదయం - తెల్లవారకుండా చెరువు గట్టుకు వెళ్తున్న స్వామికి ఎదురు బడిన పరాంకుశం 'ఏం తమ్ముడూ! ట్యూషను బాగా సాగుతుందంటావా?' - అన్నాడు నవ్వుతూ పరామర్శిస్తూ.
    'ఏమిటండీ మీరనేది?'
    'ఏముందిబాబూ అనడానికి? అదృష్టవంతుడి నంటున్నా. చలి కుంపటి దగ్గర కమ్మని కబుర్లు చెబుతూ చలికాచుకుంటూ కబుర్లు చెబుతున్నట్టే కాదుటయ్యా అటువంటి పడుచుపిల్ల కు పాఠం చెప్పటమంటే? ఫీ యివ్వడనుకో ఆ రఘుపతి. పీడా పోయే . గది అద్దె కూడా అడిగే మనిషి కాదనుకో. డబ్బుకు సంబంధించినంతవరకూ ఒక మహాయోగి రఘుపతి గారు. తన - పర- అనే తారతమ్యం బొత్తిగా ఎరగడు పాపం. సర్వం జగన్నాధం- అనుకునే బాపతు. ఇంతకూ నువ్వు ఆవిడగారికి పాఠాలు చెబుతున్నావా?' ఆవిడగారే....'
    స్వామికి కోపం వచ్చింది.
    సమాధానం చెప్పకుండా తలవంచుకుని వెళ్ళిపోయాడు.
    ఆ తర్వాత హెడ్ మాష్టారు మాటల సందర్భంలో 'బాబూ' కుర్రవాడివని చెబుతున్నా. రఘుపతితో వ్యవహారమంటే నిప్పుతో చెలగాటం సుమా! పాఠం చేపతానికి వెళ్ళిన పరాంకుశాన్ని పళ్ళూడేలా కొట్టడూ అంటే - అంతటి ఉద్గంధుడన్న మాట, ఏదో లిటిగేషను లో యిరికిస్తారు జాగ్రత్త' అంటూ హెచ్చరించారు గూడా.
    ఎవరు ఎటువంటి వ్యాఖ్యానాలు చేసినా ఆ యింటి నుంచి బయట పడాలని గానీ, పావనికి ప్రయివేటు మానుకోవాలని గాని స్వామి అనుకోవడం జరుగలేదు. అంతకు మించి ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయనికి కూడా వచ్చాడు. 'ప్రేమించడం - పెళ్ళిచేసుకోవడం - ' ఇటువంటి ఇతివృత్తం తో వచ్చిన సినిమా లనేకం స్వామి చూశాడు. అంతమాత్రాన తానూ కూడా ప్రేమించి పెళ్ళి చేసుకునే పరిస్థితులు వస్తాయని గానీ - అటువంటి ప్రేమ వివాహం తన జీవితంలో జరుగుతుందని గానీ- ఎప్పుడూ కలగనలేదు స్వామి. ఒక విధంగా తనది ప్రేమ వివాహమే. భార్యాగా పావనిని పోల్చుకుంటూ,  భవిష్యజ్జీవితాన్ని ఊహించుకున్నంత మాత్రాన్నే అతని మనస్సు రెక్కలు కట్టుకుని దూరతీరాలకు యెగిరి పోతున్నది.

 

                         
    ఆలోచించిన కొద్ది, పావని విషయంలో తన ఆశలు పదింతలై , నూరింతలై  , నింగినంటి , ఊహకందని ఊర్ధ్వలోకం లోకి తొంగి చూస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్ది స్వామి ఆలోచనల కూ ఆశలకూ కేంద్రమయింది పావని.
    పావని మాటలూ చూపులూ చురకలై గుచ్చు కుంటున్నట్టనిపిస్తుంది. అది చలి మంట రేపిన వెచ్చదనం లా బెదిరిస్తున్నదే గాని బాధపెట్టటం లేదు.
    'మాష్టారూ! నో మాట చెప్పనా?' అంటూ ప్రారంభించేది పావని.
    "ఏమిటండి?' అనేవాడు మరొక విధంగా పిలవగలిగిన అధికారం యింకా రాలేదని సాహసించని స్వామి!
    'ఏం లేదులెండి.'
    'కాదు చెప్పండి'
    'మున్సుబు గారి కూతుళ్ళూ - భారతమ్మా ఒకటే నవ్వండి మిమ్మల్ని చూసి.'
    'ఎందుకండీ.'
    'నా తల తీసేసినంత పని అయిందనుకొండి . ఎంతమాట అందనండి-'
    'ఏమిటండీ ఆ మాట?'
    'ఇరవయ్యో శతాబ్దంలో బ్రతుకుతున్నామని మనందరం కాళ్ళ మీదపడి మొర పెట్టుకుందామే మీ పంతులు గారితో . అంత పర్సనాలిటీ వుండి ఆపిలకేమిటి- అన్నారండి.
    స్వామికి చురక తగిలినట్లనిపించింది.
    'ఒకటే గోల పట్టించారనుకొండి. నే వున్నంతసేపూ , మా జట్టంతా వానర మూకను కొండి. తోకలు లేకపోయినా. అయినా -- నిజం చెప్పేస్తున్నానండి - ,ముస్నుబు గారి గుబురు మీసాలను చూసి మా వానర మూకంతా ఎంత భయపడతారో , మీ పిలకను చూసి అంత నవ్వు తున్నారండి. నిన్న మీరు స్కూలు కెళ్ళాక , మా మూకంతా మీ గదిలో బైటాయించాం. ఇదే అనుకోండి విషయం. వదలరే. చెప్పుకోవడం విరగబడి నవ్వుకోవడం చీపురు కట్టతో సత్కరించి తరిమి వేయాలన్నంత కోపం వచ్చింది అమ్మకు. నమ్మరు చెబితే.
    'ఎవరు చేసుకుంటాడో గాని ఈ కొరకంచును.' అంటూ కేకలు మొదలు పెట్టింది. శారదమ్మ గారు వంటింట్లోంచి.
    'నన్ను చేసుకుని ఎవ్వరూ ఉద్దరించనక్కర్లేదులే వో మహాతల్లీ' అంటూ విసురుగా లోపలికి వెళ్ళిన పావని.
    శారదమ్మ గారి మనస్సు మాత్రం అర్ధం కాలేదు స్వామికీ. పావనికి మాత్రం తనకు భార్యను కాబోతున్నానని తెలిసిందా? తనను అల్లుణ్ణి చేసుకోవాలనుకుంటున్న శారదమ్మ గారు మాత్రం- కుమార్తెను గురించి అంత కటువుగా ఎందుకు మాట్లాడుతున్నదో అర్ధం కాలేదు. కాని తరచుగా స్వయంగా కూరలు, పచ్చళ్ళూ తీసుకొచ్చి శారడంమగారు కంచం ముందు పెడుతూ 'యింకా ఎన్నాళ్ళు నాయనా చేతులు కాల్చుకోవలసిన బాధ' అంటున్నప్పుడు మాత్రం- ఆ అపేక్షలో ఏదో ధ్వని వినిపించి మళ్ళీ తన అనుమానాలు నిరాధార మనిపించేవి.
    ఒకనాడు పావనికీ -- భారతికి మధ్య జరుగుతున్న ఒక విచిత్రమైన సంభాషణ స్వామి చెవిలో పడింది. పెళ్ళి కావలసిన వయసొచ్చి -- ఏళ్ళు గడిచిన నిరీక్షణ లో - చెవులు కొరుక్కుంటున్న స్నేహితురాళ్ళ సంభాషణ - ఎంత రసాత్మకంగా వుంటుందో - తెలుసుకునే అవకాశం - స్వామికి జీవితంలో మొదటిసారి లభించింది. అసలీ గదిలో పట్టి మంచం మీద కూర్చుని కబుర్ల లో మునిగి తేలుతున్న పావని గానీ- భారతి గాని స్వామి రావడం గుర్తించలేదు.
    'అమ్మోచంపావే బాబూ' అని కేక పెట్టింది భారతి.
    అడుగు ముందుకు వేయకుండా అలాగే నిలబడిపోయాడు స్వామి.
    'పావని విరగబడి నవ్వుతూ 'ఎంత నంగనాచివే- అంత నొప్పుంటుందేం?' అంటున్నది.
    'పోవే మోటు సరసం నువ్వూనూ, ఎలా కందిపోయాయో చూడు బుగ్గలు రక్కేశావు జంగ్లీ లా.'
    'అహా! ఔనమ్మా మరి. నే గిల్లితే అల్లాగే ఉంటుంది. గిల్లవలసిన వాళ్ళు గిల్లితే కమ్మగానే వుంటుంది మరి తొందరపడకూ.'
    కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు కన్నె పిల్లలిద్దరూ.
    'ఉరేయ్ స్వాములూ'
    కిటికీ రెక్కసందులోంచి సగం సగం కనిపిస్తున్న ఆ నేస్తాల సరసోక్తులు వింటున్న స్వామి- పట్టుపడిన దొంగలా త్రుళ్ళి పడి వెనక్కు తిరిగి 'అమ్మా!ఇదేనా రావడం?' అంటూ అదే రావడం ?' అంటూ అదే రావడం - అన్న సంగతి తెలిసీ - అనేశాడు తొందర పాటుతో.
    తెలు కుట్టినట్టు ఎగిరి పడింది తలెత్తి చూసిన భారతి.

                                                      *    *    *    *
    ఆరాత్రి -
    సీతమ్మ గారు - స్వామి తల్లి- పట్టరానంత సంబరపడి పోయా - రఘుపతి గారితో 'అన్నగారూ!' అంటూ ముచ్చట్లు చెబుతున్నది.
    శాస్త్రి గారు దిట్టంగా నశ్యం పట్టిస్తూ సీతమ్మగారి ప్రతి మాటకూ నంత కాలుపుతూ - ఇంట్లో అడుగు పెడుతున్న స్వామిని చూసి అడుగో? వచ్చాడమ్మా పెళ్ళి కొడుకు, ఏమిటయ్యా- యావన్మంది మీ నీ గురించి ముచ్చట్లు చెప్పుకుంటుంటే అలా జారుతున్నావ్- వోయబ్బో - ఇదంతా సిగ్గే - ఔన్లె - ఇదుగో సీతమ్మ తల్లీ ఈ భడవా కానల వ్యవహార మేమిటో తెలుసా? నా పెళ్ళిమటుకు ?' ఇలాగే మహా సరంభంతో ఒక మహా ఘనకార్యాన్ని సాధించిన సంతృప్తితో నలభై సంవత్సరాల నాటి తన పెళ్ళి చూపుల ముచ్చట్లు చెబుతున్నారు.
    'కటికితే అతకగంటారువదినగారూ.-'
    '............'
    'ఉన్నమాట చెపుతున్నా  వదినగారూ! మరీ గారాభం చేశారు లెండి వాళ్ళ నాన్న. మీరు కడుపులో పెట్టుకుంటారనే ఆశ-'
    బంగారు తీగెలాంటి కుర్రాడండీ రఘుపతి గారూ.'
    'నాకు తెలియదుటలెండి.'
    'పిల్ల కూడా -- అబ్బో! యీడూ జోడూ -- చూడటానికే ముచ్చటనిపిస్తుంటే - అదృష్టవంతురాలవిలే సీతమ్మ తల్లీ - కుందనపు బొమ్మ లాంటి కోడలు పిల్ల దొరికింది.'
    'అసలు అమ్మాయిని డాక్టరీ చదివిద్దామనుకున్నా. ఈ కోనేటిరావు నాకొంప తీయడం లో - ఆర్ధికంగా తారుమారై - నిజం చెప్పొద్దూ. అందుకనే -- కట్నమనే సరికి...'
    'కట్నాలు శాశ్వతమా అన్నగారూ? కలకాలం వాళ్ళు సుఖంగా బ్రతకాలి గానీ -'
    ముహూర్తాలూ పెట్టుకున్నారు.
    తల వంచుకు కూర్చున్న పావనిని మరొకసారి చూశాడు స్వామి.
    మరొకసారి 'అదృష్టవంతుణ్ణి' అనుకున్నాడు.
    బయలుదేరి తిరిగి వెళ్తూ అదేమాట అంది తల్లి సీతమ్మగారు. 'ఒరేయ్ స్వాములూ?' పిల్ల మాత్రం జ్యోతిరా. నువ్వు అదృష్టవంతుడివిరా నాకు తెలుసురా తండ్రీ. ఈ శుభముహూర్తం కోసమే కాదుట్రా నాయనా నే బ్రతికుంది?- ఆయనేవుంటే ' - అంటూ మాట పెగలి రాక - సంతోషంతో కరిగి, దుఃఖంలో మరిగిన కన్నీటిని తుడుచుకుని తృప్తిగా నవ్వింది.
    ఎన్నాళ్ళ తర్వాత నో ఆ నవ్వులో మెరుపు కనిపించింది.
    'ఏదో సామెత చెప్పినట్లు - కళ్యాణ మొచ్చినా - కక్కొచ్చినా,
    జనాన్ని తోసుకుంటూ బస్సేక్కుతూ గూడా జీవిత సత్యాలను మేళవించి మాట్లాడుతూనే వున్నారు ఆ ముహూర్తం పెట్టించి సీతమ్మ గారిని వెంట బెట్టుకు పోతున్న 'పెద్దదిక్కు ' శాస్త్రి గారు.
    పావనికి పాఠాలు చెప్పడం అలవాటై పోయింది. ఈ మూడు నెలలోనూ. మర్నాటి ఉదయం గూడా నిద్ర లేవగానే ఆమె కోసం వెతికాయి స్వామి కళ్ళు.
    పావనికి బదులు శారదమ్మ గారు కాఫీ గ్లాసు టేబిల్ మీద పెట్టి 'తీసుకో బాబూ చల్లారిపోతుంది.' అంటూ హెచ్చరించి వెళ్ళింది.
    పొగలు చిమ్ముతున్న కాఫీ త్రాగుతూ -- అందులో అలవాటైన వెచ్చని కమ్మదనం కనిపించలేదు స్వామికి. పావని జాడ కనిపించలేదు .అదే సమయంలో ప్రాణ స్నేహితురాలిన భారతిని కౌగలించుకుని ఆమె రోదిస్తున్న విషయం స్వామికి తెలియదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS