Previous Page Next Page 
మమత పేజి 22

 

 
    అక్రితం ఆరోజు తల్లి సీతమ్మ గారిని బస్సు ఎక్కించడానికి వెళ్ళిన స్వామి యింటికి రావడానికి ఓక గంట పట్టింది.
    ఈ గంట వ్యవధిలో ఒక రసాత్మక మైన సన్నివేశమే జరిగింది రఘుపతి గారింట్లో. విజయనగరం వెళ్ళి ఆ మసర్చ వారి సంబంధం కుదుర్చుకు వస్తా నంటూ ఇంచుమించు ఒక పచ్చనోటు విలువ గల పావని మెడలో మిగిలిన గొలుసు పుచ్చుకుని వెళ్ళిన పెళ్ళిళ్ళ పేరయ్య పర్వతవధాని గారు సరిగ్గా కూడని సమయంలో - ఏ సమయంలో అటువంటి మనిషి ఆ యింట్లో పాదం పెట్టగూడదో ఆ సమయంలోనే - ఆ యింట్లో నే - కాలు పెట్టాడు. రెండు చేతులతో తలపట్టుకుని నిట్టూర్పులు విడుస్తున్న రఘుపతిగారు గుమ్మంలో కనిపించినా అంతకు ముందు రాకుమారుణ్ణి లాంటి అల్లుణ్ణి కుదుర్చగలనంటూ వందలకు వందలు తఫాలవారిగా హరించి, ప్రాణం విసిగిన రఘుపతి గారి చేత తన్నులు, పుష్కలంగా అక్షింతలు వేయించుకుని బయటకు గెంటించుకున్న పర్వతావధాని గారు- అలనాటి 'వాగ్దానం' నిలబెట్టుకుంటానికే తరలివచ్చారు.
    'మీ సొమ్ము నిష్కారణంగా తిన్నానని అంతేసి మాటలంటూన్నారు బావగారూ. ఏనాటికైనా రాకుమారుడి లాంటి వరుణ్ణి తీసుకొచ్చి మీచేత కాళ్ళు కడిగించి కన్యాదారాపోయందే ఈజీవుడు పోడని గుర్తుంచుకోండి.'
    అంటూ ప్రతిజ్ఞ చేసిన పర్వతావధాని గారు ' అన్నమాట నిలబెట్టుకునే మీ యింట్లో అడుగు పెడుతున్నా బావగారూ ఈసారి" అంటూ ఆత్మరక్షణ విషయంలో అణుమాత్రం జాగ్రత్త తీసుకున్న తర్వాతనే రఘుపతి గారిని సమీపించటానికి సాహసించారు.
    రఘుపతి గారు 'మళ్ళీ ప్రారంభించావుటయ్యా హరికధ' అంటూ ముందు చిర్రెత్తి మాట్లాడినా , యిటువంటి ' సవాలక్ష ' వ్యవహారాలలో నెగ్గుకు వచ్చిన చాణుక్యుడు గనుక తట్టుకుని , కాలు నిలదొక్కుకుని , అంతకు ముందు కనీ వినీ యెరుగని విధంగా అపూర్వ కధాకాలక్షేపం ప్రారంభించారు పర్వతావధాని గారు.
    'రఘుపతి బావగారూ! మీరు సావదానులై నా  మొర ఆలకించవలె. మా తాత గారికి పెళ్ళి చేయించింది మ మీ తాతగారు. ఆ మహానుభావుని వితరణశీలానికి ఫలంగా పుట్టిన ప్రాణం నాది. తద్వారా మీ కుటుంబానికి ఆ జన్మాంతం ఋణపడి ఉన్నాననే మాట మరిచిపోలేక - సుసర్ల వారబ్బాయి విషయం ఇంత గట్టి ప్రయత్నం చేసి కుదుర్చుకు రాగలిగాను. ఎవరనుకున్నారు పెళ్ళి కొడుకు. మన కరణం గారి షడ్రకుడి వియ్యపురాలు కరణం గారి పెద్ద కుమార్తె ను - పావనమ్మ ను చూసి సంబరపడి పోయిందట. తత్పలితంగా మగపెళ్ళి వారు పిల్లను చూసుకోవలసిన అవసరం లేకుండానే'శుభం' అనడం జరిగింది. లాంచన ప్రాయంగా పెళ్ళి చూపుల ముచ్చట ఎలాగూ ఏర్పాటు చేసుకోవచ్చనుకొండి. చంద్రుడి లాంటి పెళ్ళి కొడుకు. బంగారం పండే మాన్యాలు ఏడుతరాలకు సరిపడా వారసత్వం పుచ్చుకోబోతున్న అదృష్టవంతుడు. పెద్ద ఇంజనీరింగు పరీక్ష లో యావన్మంది కుర్రకారుల్లో ఫస్టోచ్చి , సాక్షాత్తూ గవర్నరు గారి దగ్గర బంగారు పతకం అందిపుచ్చుకున్న మేధావి గానీ- అల్లాటప్పా వ్యవహారం కాదు. ఇతగాడు చేసిన ఆనకట్ట ప్లాను చూసి అమెరికా వాళ్ళే ఆశ్చర్యపోయి 'వేలకు వేలు జీతమిస్తాం మా దేశానికి ఉద్యోగానికి రావయ్యా స్వామి!' అంటూ రోజుకొక టేల్లీగ్రాము కాళ్ళ దగ్గరకు పంపిస్తున్నారట. తిరుగుతుంది చూడండి పావనమ్మ కార్లలోనూ, విమనాలల్లోనూ .'
    రఘుపతి గారు కరుగుతున్నారు.'
    కాదు-
    మూసలో పోసి లోహాన్ని కరిగిస్తున్నట్టు -- అవధాని గారే కరిగిస్తున్నారు రఘుపతి గారిని - ఇద్దరి సయోధ్యతా చూసి - వంట యింట్లోంచి బయటకొచ్చిన శారదమ్మ గారు నివ్వెరపోయారు. కిటికీ అవలినుండి ఈ హరికధ ప్రారంభంలో విసుగనిపించినా -- పావని కూడా ఆసక్తిగా ఆలకించడం మొదలుపెట్టింది.
    తనను అవధానిగారు చూడగానే -- ఆవలికి నడిచి - దొడ్లో బాదం చెట్టు క్రిందున్న మంచం మీద పడుకుని ఆలోచనలలో మునిగిపోయింది పావని. పది నిముషాల తర్వాత తల్లి తండ్రి తన పెళ్ళి విషయంలో వాగ్యుద్ధం ప్రారంభించారని అర్ధం చేసుకోవడంతో, మరొక లోకం నుంచి - మళ్ళీ బాదం చెట్టు క్రింద మంచ మీద కొచ్చి లేచి కూర్చుంది. రఘుపతి గారు ఉగ్రుడై తల్లి మీద చేయి చేసుకోవడం మొదటి సారి చూసింది.
    'తాంబూలాలు పుచ్చుకున్నామంటే - పెళ్ళి అయినట్లే. బిడ్డలను కన్నాం గాని - వాళ్ళ అదృష్టాలను కన్నామా? పెళ్ళి చూపులై , అంతా కుదుర్చుకుని- అందరం - శుభం- అనుకున్న తర్వాత మరొక సంబంధం విషయం ఆలోచించడం మహా పాపం.'
    -ఇదీ శారదమ్మ గారి వాదనలోని సారాంశం.
    'ఒక్కగానొక్క కూతురు. యింత బ్రతుకు బ్రతికాను - చివరకు దాని గొంతు కోయటానికా? పాపమే కానీ - కావలసింది నా బిడ్డ సుఖం నాకు. సుసర్ల వారి సంబంధం కుదరాలే గాని-'
    -ఇది రఘుపతి గారి వాదన లోని సారాంశం.
    'చేత రాగి పైసా లేదు. ఆస్తి అంతా మంగళం చేసుకున్నారు. పాడు దానాల్లో పడి. ఎత్తలేని పై ఎత్తులకు ఎగిరితే - ఎక్కడ నుంచి తెచ్చి యిస్తారు కట్నం? మన పల్లకీల మ్రోతల ముచ్చట ఊళ్ళో ఎవరికీ తెలియదు గనుక? నెత్తి మీద జుట్టున్న ఏ ఆసామీ యిస్తాడండీ మనకు అప్పు?'
    - ఇవి శారదమ్మ గారి ప్రశ్నలు.
    చిల్లరకొట్టు వీరాస్వామి కూడా చివరకు పెళ్ళి వారోస్తున్నారని వెచ్చాలకు అప్పుకు పంపితే -- చాలా బాకీ తెలిందంటూ తిరగోట్టిన సంగతి గుర్తు చేసింది. శారదమ్మ గారు. 'ఇస్త్రీ బట్టలు వేసుకుని సమయానికి వచ్చి కూర్చున్నారు. చిల్లరకొట్టు వీరాస్వామి దగ్గర గుండిగ తాకట్టు పెట్టినట్లు మీకు తెలుసా? ఎక్కడ దొంగతనం చేసుకొచ్చి గడువు తున్నాననుకుంటూన్నారీ కొంప? పొయ్యిలో పిల్లి లేవకపోయినా -- ఆపాడు ఊరి లిటిగేషన్లు తప్ప - మీకు ఇంటి విషయం పట్టిందా?'
    ఇలా పార్లమెంటు లో ప్రతిపక్షం వారి సప్లమెంటరీ ప్రశ్నల మాదిరి -- ప్రశ్నల వర్షం కురిపించింది శారదమ్మ గారు.
    ఒక్క ప్రశ్నకూ సమాధానం దొరక్క, ఈ విషయం సమగ్రంగా పరిశీలించటానికి కమిటీని వేస్తున్నాం - 'అనే ప్రభుత్వం కంటే - అనంత అధికార దర్పం ఎక్కువ ప్రదర్శించిన రఘుపతి గారు - బలప్రయోగం ద్వారా - తన పౌరుషాన్ని నిలబెట్టుకోవడం జరిగింది.
    శారదమ్మ గారు శోకాలు పెట్టకుండా వంటింట్లో చెంగు పరచుకుని పడుకుంది.
    పావని 'ఎంత పాపిష్టి బ్రతుకయింది ఆడజన్మ ఎత్తటంతో' అనుకుంటూ నిట్టూర్చింది.
    జీవితంలో మొదటిసారి భార్య మీద చేయి చేసుకున్న రఘుపతిగారు దొడ్లో కి వచ్చి, పావని ప్రక్కన మంచం మీద కూర్చొని - కళ్ళు తుడుచుకుంటున్న దృశ్యాన్ని పావని భరించలేక పోయింది.
    'ఎందుకు నాన్నారూ నాకోసం యింత బాధపడతారు.'
    పావని గొంతు పగిలింది.
    ఎన్నడూ ఎరగనిది తండ్రిని కౌగలించుకుని బావురుమంది పావని. ఎంతటి రాతి గుండెల గల మనిషి కూడా - ఆయువు పట్టును ముట్టడించిన ఏదో ఒక అనుభూతికి లొంగి కరిగిపోవడం జరుగుతుందేమో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS