"జీవితంలో పెళ్లి చేసుకోగూడదని నిర్ణయించుకున్నానండి. అమ్మతో జరిగిన రామాయణ మహాభారతాన్ని విన్నారు గదా? నేను కొరకంచులా వుండు తున్నానాట. ఆవిడగారి గుండెల మీద . వీధుల్లో అడుక్కుతింటానట. కుమిలికుమిలి ఏడ్చా అనుకోండి.పెళ్ళి కాకపొతే ఆడది బ్రతకలేదంటారా? భారతమ్మ బాబాయి కూతురు టైపు ఉద్యోగం చేసుకు బ్రతకడంలా? మెట్రిక్కు ప్యాసై నేను మాత్రం ఎందుకు బ్రతకలేను? అనిపించింది. ఇవాళ నుంచి చాలా సీరియస్ గా చదవాలని మనం నిశ్చయం చేసుకున్నాం.'
నిశ్చయంగానే చెప్పింది మాటలు పావని.
ఆరిజు పాఠం చెప్పాడు స్వామి.
అమిత శ్రద్ధ శక్తులతో నేర్చుకుంటున్న పావనిని అలాగే రెప్పలార్పకుండా ఎంతసేపు చూస్తూ కూర్చున్న స్వామి ఆలోచనలు పరిపరి విధాలుగా పరుగులు తీసినై.
ఎన్నడూ అటువంటి దృష్టితో పావనిని గురించి ఆలోచించలేదు స్వామి. తలవంచుకుని మాట్లాడేవాడు. వోణి తగిలినప్పుడు నరహత్య జరిగినంత బాధపడ్డాడు. 'ఏమండీ! 'అని పిలవడం అలవాటై ప్ప్యింది. చదువుకునే రోజుల్లో సైకాలజీ చెపుతున్న మాష్టారు ముద్దుగా భార్యా, రత్నాన్ని 'పీనుగా! చాకలి మూటా- చింపిరి తట్టా-' యిత్యాది పర్యాయపదాలతో పిలిచేవాడు. సైకాలజీ చదివి చదివి చెప్పి చెప్పి ప అనుభవంతో తల నెరిసింతర్వాత 'ఆడదాన్ని ' ఎంత గట్టిగా తిడితే అంత మెత్తగా లొంగి మాట వింటుంది.' అనే సృష్టి సత్యం తెలుసుకున్న మష్టారాయన. ఎదురు గుండా కూర్చుని - భవిష్యత్తు లో దాగిన తమ దాంపత్యాన్ని గురించి జిగిబిగిగా అల్లుకుంటున్న ఆశల పందిరుల క్రింద దోబూచులాడుతున్న స్వామికి - ఆ సైకాలజీ మాష్టారి 'ముద్దు పిలుపుల సైకాలజీ' అర్ధం కాలేదు.
రోజూ రోజూకు చదువు విషయంలో పావని శ్రద్ధ పెరుగుతున్నదే గానీ తరగడం లేదు.
"నీలాంటి సమర్ధుడైన మాష్టారు పాఠం చెబితే అమ్మాయి ఎన్నడో పాసయ్యే దయ్యా మెట్రిక్కు. ఆ పరాంకుశాన్ని కొన్నాళ్ళు పెట్టాం పోకిరి వెధవనుకో పళ్ళు ఊడకొట్టించుకునే వరకూ తెచ్చుకున్నాడు నీలాంటి బుద్ది మంతుళ్ళు దొరకడం కష్టం బాబూ ఈరోజుల్లో అంటూ దీపం ముందు కూర్చుని వంచిన తల ఎత్తకుండా యింగ్లీషు పాఠం వల్లే వేస్తున్న కూతురిని చూసి అబ్బురపడి పోతూ అభినందించారు రఘుపతిగారు.
'ఎటువంటి ఘటాలు లొంగతీయలేక పోయారు నాయనా ఈ గడుగ్గోయని, పావనమ్మ తల్లికి యింత కుదురోస్తుందని జీవితంలో కల కనలేదు సుమా. ఆడది తిరిగి చెడింది - మగాడు తిరస్కరిద్దామా అని - యిప్పుడు గడపలోంచి కాలు బయట పెట్టడం లేదనుకోండి దయవల్ల ' అంది పళ్ళెండు ఫలహారాలు తినమంటూ టేబిలు మీద పెట్టింది శారదమ్మ గారు.
ఉదయం లేవగానే స్వయంగా కాఫీ పెట్టి 'మాష్టారికి' తెచ్చి యిచ్చేది పావని. అలాగే నివ్వెర పోతూ కాఫీ వెచ్చదనంలో కమ్మదనం అఘ్రాణిస్తూ వేళ్ళకు వ్రేళ్ళు తాకి త్రుళ్ళి పడ్డ చేతి నుండి చింది పడ్డ కాఫీ మరకల్ని పమిట చెంగుతో 'సారీ'అంటూ తుడుస్తూ డీ కొని పక్కున నవ్విన పావని ముఖం - తాను అంతకుముందు అనుకున్న దాని కంటే అందమయిందని గ్రహించాడు స్వామి.
తనకు తెలియకుండానే పావనికి పాఠాలు చెప్పాలనీ - ఆ చేతులతో తెచ్చిన కమ్మని కాఫీ త్రాగాలని - తన మనస్సు తొందర పడుతున్నది స్వామి.
'రేపే రాయాలి అమ్మకు ఉత్తరం' అనుకుంటూ , యిన్నాళ్ళూ సిగ్గు లాంటిది అడ్డమొచ్చి రాయనీయకుండా తన చేతులకు వేసిన బంగారు సంకెళ్ళను - ఉదయం కాఫీ మరకలు తుడిచే సరంభంలో డీ కొట్టిన పావని ముఖం గుర్తుకు వచ్చి - ఒక్కసారి త్రెంచుకుని- తియ్యటి బాధ - వంటిని వింటిలా విరిచిం తర్వాత ఆవలించి - చలోచ్చి - రగ్గులో దాక్కున్నాడు స్వామి కళ్ళు మూసుకుని రగ్గు వెచ్చదనంలో మునిగి సిగ్గు తెరలను విదిలించుకున్న మనస్సు రంగురంగుల కలల కోసం వెంపర్లాట ప్రారంభించింది.
* * * *
మెరుపుతీగ - చూసిన కళ్ళే తెలుసుకోగలవా సౌందర్యాన్ని. వర్ణన ప్రయోజనకరం కాదేమో. చూసిన కళ్ళకు వర్ణనతో పనిలేదు గనక. చూడని కళ్ళకు ఎటువంటి వర్ణనైనా ఎక్కువగా సహాయం చేయలేదు గనుక. అలంకారాలు మార్చినా పేర్చినా - నీడను చూచి నిజరూపాన్ని గుర్తు పట్టాలన్న వ్యర్ధ ప్రయత్నమే మిగులుతుందేమో.
నీడ వేరు- నిజం వేరు.
పోలికలున్నా - కొంతవరకే.
ఒక స్త్ర్టీ ని - ఒక పురుషుడు ఎంత దగ్గరనుంచి చూడగలడో - అంత దగ్గర నుంచి చూసిన స్వామి - మహా రచయితగా పుట్టి తన జీవిత కావ్యాన్ని వ్రాసినా -- 'ఏ తేనెటీగ కుట్టింది తరుణీ నీ చెంప లను?
ఈ తీరుగా కందింది గులాబీ పూతలా!' అంటూ వర్ణనతో ప్రారంభించినా - పావని రూపాన్ని పాఠకుల కళ్ళకు కట్టటం సాధ్యం కాదేమో.
ఆ పరిమళాల పుత్తడి బొమ్మ తుంటరిగా కన్నులు చిట్లించి క్రీగంట చూసినా - జరుతున్న పయ్యెద విదిలించి బిగిగా కప్పుకొని- త్రుళ్ళిన సిగ్గును వలికి పోకుండా పంటి కొనలతో పెదవుల్ని కొరికి పట్టి నవ్వి - తత్తరపాటు న కదులుతూ చెలికి చేయి తాకించినా - ఆ చూపులో ఆ చిరునవ్వు లలో , ఆ స్పర్శలో - ఎదజేరి పాలపొంగై పయ్యెద మెలి ముసుగు నుండి తొంగి చూస్తున్న విచ్చి విచ్చని ఆ వయసు సొగసుతో తళుక్కు మంటున్న మెరుపులను- స్వామి మాత్రం వర్ణించగలడిని నాకు నమ్మకం లేదు.
విజ్ఞాన శాస్త్రం తెరిచి పత్రికామ్లంతో కుస్తీ - పడుతున్న పావనిని చూసి 'పాపం! యింకముండు ఈ శిష్యురాలు కుస్తీ పట్ట వలసినది పాకశాస్త్రంతో" అనుకున్నాడు స్వామి అమెరుపును చూస్తూ.
ఊహించిన కొద్ది మసక మసకగా చిత్ర విచిత్రమైనచిత్రాలు - మనోపలకల మీద మెరుస్తున్నాయి స్వామికి. అస్పష్ట మైన జీవన మాధుర్యంతో విశృంఖలంగా వళ్ళు విరుచుకుంటూ నాట్యం చేస్తున్న ఊహలని , ఊహల గుసగుసలు.
ఇంతకాలం తన గుండెల గదుల చాటున - అంతరాంతరాలాల్లో నిద్రాణంగా దాగి - చైతన్య వాహినిగా పొంగుతున్న రహస్యాల గుసగుసలు. భవిష్యజ్జీవితాన్ని స్వప్న సౌధం లోనికి పోమ్మంటూ - లోని మాధుర్యాన్ని జుర్రుకొమ్మంటూ రెచ్చకోడుతున్న గుసగుసలు.
వింతగా కనిపిస్తున్న స్వప్న సౌధం పావని తనకినాడు -- తాను పరిశోధకునిలా శోధించాలి గామాల్సు. ఆ మహా సౌధంలో వెన్నల వంపుల రహస్య గాధలను చదువుకుంటున్న పావనిని- రహస్యాన్ని శోధిస్తున్న పరిశోదని లానే కాగుతున్న కళ్ళతో చూస్తూ నిట్టూర్చాడు స్వామి.
'ఏమిటి మాష్టారు అంత దీర్హంగా విదిచేస్తున్నారు నిట్టూర్పులు? తలనొప్పా'
'కాదండి!'
'కడుపు నొప్పా.'
'లేదండీ'
'మరి'
పల్చగా నవ్వాడు స్వామి మరొకసారి నిట్టూర్చి.
తొలిసారి తొణికి తందరించిన గుండెల అలుపు.
'ఏం చేస్తున్నాడు మాష్టారు మీరివేళ?'
'పచ్చిపులుసు --' అన్నాడు స్వామి త్రుళ్ళి పడి
'పాపం! ఎన్ని కష్టాలోచ్చాయ్ మాష్టారూ?'
"ఏముందండీ కష్టం?'
"కష్టాలు కాక ఏమిటి చెప్పండి? ఈ వంట -- ఈ చాకిరి - ఎప్పటికి తీరతాయంటారుమీ బాధలు?'
'మీరు చెప్పండి '
'ఏం పాడో . మగాళ్ళు వంట చేయడం చూస్తుంటే నాకండి....'
నడవలో బియ్యమేరుకుంటున్న శారదమ్మ గారు 'ఆడవాళ్ళు దేశాలుచ్చుకు తిరుగుతున్న రోజులొస్తే - మగవాళ్ళు వంటింట్లో కాపురం చేయక ఏం చేస్తారు?
నువ్వేం గేలి చేయనవసరం లేదులే తల్లీ. అంటూ కుమార్తె ను మందలించి - చాట పుచ్చుకు లోపలకు వెళ్ళిపోయింది.
'పోనీ నేవొండి పెట్టనా మాష్టారూ?'
'అబ్బే వద్దండీ' - నిజానికి పావని వంట తినడమంటే భయం స్వామికి.
పచ్చిపులుసు కలపటానికి కూడా పనికి రానంటారా?'
'అది కాదండి'
'నా చేతి వంట తినడం తప్పంటారా?'
తలెత్తి చూశాడు స్వామి-
'తింటానండి.'
'ఎప్పుడు - ముహూర్తం కావాలంటారా దానికి కూడా?'
'రావాలి కాదండి మరి దేనికైనా మూహూర్తం?'
'ఓ హోహో ! కవిత్వమే అయ్య బాబో - ఎప్పటి నుంచండోయ్ ?'
'చెప్పమంటారా?'
'చెప్పండి'
చెప్పలేదు స్వామి.
'చెప్పండి మాష్టారు?' గోముగా అడిగింది పావని.
'మిమ్మల్ని చూసినప్పటి నుంచీ.'
అనేశాడు అంత మాటా స్వామీ అప్రయత్నంగా.
నివ్వెరపోయింది పావని.
అంత ధైర్యంగా అంత సూటిగా మాట్లాడగ సాహసం స్వామి కూడా ఊహించలేదు పావని.
పావని కళ్ళల్లోకి చూశాడు స్వామి.
'ఊహు! ఏమిటో అనుకున్నా. అసాధ్యులే నన్నమాట. ఇది మగజాతి లక్షణం మహాప్రభో . మిమ్మల్ని అనాల్సిన పనిలేదు.'
'తప్పంటారండి?'
'అబ్బే - తప్పెందు కంటానండి- అంతంత స్ట్రాంగుగా టీ త్రాగడం తప్పంటాను. వెర్రి ముదిరిపోతే ప్రమాదమండోయ్ . ఇంక పాఠం చెప్పండి బాబూ.' పాడు పత్రికామ్లం -- నా ప్రాణం తీస్తుంది.' అంది సీరియస్ గా పావని.
స్వామి ఉత్సాహం కొంత తగ్గింది. పాఠం చెప్పాలనిపించక పోయినా, సీరియస్ గా పుస్తకం తెరిచాడు.
