ఓసి దీని కెన్ని తెలుసూ, ముక్కు మీద వేలేసుకున్నాను. బిస్కెట్లూ, రొట్టి తెచ్చుకుని మింగుతున్నాడట, రంగి చెప్పింది, కొనియ్యి కొన్నైనా అనుభవాలు వస్తే మంచిదే.
వ్యభిచారం ఒక్కటే వ్యసనమానుకుని, ఆ పాపం జోలికి వెళ్ళని పురుషులు తమంత సత్పురుషులు లేరనుకుని తక్కిన శతవిధాల భార్యలను బాధిస్తారు. వీళ్ళకు బుద్ది రావడమే రావడం.
అయిదో రోజున ఏమనుకున్నాడో ఏమో నారాయణ మా యింటికి వచ్చాడు. 'సరళని క్రిందికి రమ్మనండి" అని పైకి కబురు పంపించేడు. వారు ఇంట్లో లేరు. నేనా కబురు సరళకు చేరనియ్యక నేనే మేడ దిగి వచ్చాను. దిగుతుంటే నా కాళ్ళు ఒణికాయి.
'నమస్కారం . కూచోండి. బావున్నారా?' అన్నాను నేనూ కూచుంటూ.
'ఆ, మీ దయ వల్ల ఇదిగో యీ మాదిరిగా అతి కులసాగానే ఉన్నాను' వచ్చిన నవ్వు బలవంతాన పళ్ళ మధ్య పట్టి ఆపి అన్నాను.
'మద్యని మా దయేముంది లెండి, చేసుకున్న వారికి చేసుకున్నంత!"
'ఇలా ఎన్నాళ్ళు మా ఆవిడని బంధించి ఉంచదలిచారు?'
'బంధించి నిర్భంధించి ఎవర్నేన్నాళ్ళు ఉంచగలరు. అదిగాక ప్రపంచంలో అందరూ కఠినాత్ములే ఉండరు. ఆమెను ఆ పరిస్థితుల్లో వదిలేసి మీరైతే వెళ్లిపోగలిగారు గాని.....
"ఏం ఆమె కేమయింది?' అన్నాడతడు తొందరగా, ఆతృతగా.
"ఏమయితేనేం , మీకిప్పుడు కావలసి వచ్చింది. అదైనా ఎందుకు, మీకు అవసరం వచ్చింది గనుక. మీ కడుపులో ఎలకలు కీచుకీచు మంటున్నాయి కనుక.
అతడు సిగ్గుపడ్డట్టు తల వంచుకున్నాడు.
'గాయాలకు చీము పట్టేసింది- నిన్నటి దాకా పత్యమే పెట్టడానికి వీలులేనంతగా జ్వరం కాసింది. ఒక పట్టాన తగ్గుతుందనుకోలేదు. మేం ఆమెను యిలా తీసుకొచ్చి వైద్యం చేయించడం మీకు తప్పని తోస్తే మన్నించండి.'
అతడు మొహం రుమాలుతో తుడుచుకున్నాడు.
'మాకేం అభ్యంతరం లేదు. మీరిప్పుడే తీసుకు వెళ్ళిపోవచ్చు.'
'ఒక్కటి మాత్రం చెబుతాను. భార్య అన్న ఆమె అవసరం మీ కోర్కెలు తీర్చేవరకూ మీకూ వండి పెట్టె వరకూ మాత్రమే పరిమితం కాదు. తరువాత బౌతికంగా ఆమెను గాయపరిచినంత మాత్రాన మీ ఆధిక్యం బయట పడదు సరికదా, ఏవిధంగానూ మీ చాతగాని తనం కన్పబడదు. మీరు యిన్నాళ్ళకు యిక్కడికి వచ్చారా ఆమె మాత్రం మిమ్మల్ని తలచుకొని క్షణం లేదు. మీరు యిబ్బంది పడుతున్నారని బాధపడని నిముషం లేదు. అనురాగంతో నిండిన హృదయమది. దాని నెప్పుడూ గాయపరచనని మాట యివ్వండి. గులాబి రంగు బుగ్గలవి. ఆ అందం చెడగొట్టనని మాట యివ్వండి. మీ మగతనం మీ ఉద్యోగంలో చూపించండి. మేము ఆవిణ్ణి తీసుకు వచ్చిన పని అయిపొయింది. మీరిలా ఏ క్షణమైనా తీసుకు పోవచ్చు.'
కొద్దిసేపు అయిన తరువాత తలెత్తాడు. అతడి బుగ్గల నిండా తడి చేతుల కంటుకుంది. రుమాలుతో తుడి చేసుకున్నాడు.
'ఒకసారి అదెలా ఉందొ చూసి వస్తాను.'
'వెళ్ళండి, దానికేం అభ్యంతరం?'
నే నక్కడే కూచున్నాను. అతడో పావుగంటలో దిగి వచ్చాడు.
"అన్ని విధాల మీకు కృతజ్ఞుణ్ణి. అది వచ్చేస్తానంటోంది గాని యింకా బాగా నీరసంగా ఉంది. ఇంకో వారం ఉంచేస్తాను.'
'అంతకన్నానా?'
'నన్ను క్షమించండి.'
'ఇప్పుడు కాదు. మళ్ళీ మీరు ఆమె మీద చేయ్యేత్తలేదని తెలిసినప్పుడు, తప్పు లేకపోయినా ఆఫీసరు ముందు తల వంచనప్పుడు.'
'చూస్తారుగా?'
'ఇంకొక మాట.... ఎంత సరిపెట్టుకున్నా లేనిపోని చనువూ, చొరవా తీసుకున్నానెమో అని మీకు యిబ్బంది కలుగచేసేనేమోననీ , మీ మనసు నొప్పించాననీ నాకు బాధగానే ఉంది. దానికి మీరూ మమ్మల్ని మన్నించాలి.'
'ఎంతమాట!'
'ఉత్తి మాటతో తృప్తి పడేదాన్ని కాను - నాకు క్రియ కావాలి.'
'చెప్పండి, ఏం చెయ్యమన్నా చేస్తాను.'
'తప్పక చేస్తారుగా?'
'అలాగే.
'మీరు తెచ్చుకున్న బిస్కట్ల పొట్లం మా మధురిమకు యిచ్చేయండి. రొట్టె అలా మూత లేకుండా ఉంచేస్తే ఏ ఎలకో ఫలహారం చెయ్యక పోదు.'
'అయితే యివాళ నుంచి గాలి భోం చేయ్యమనా తమ శలవు?'
'మీకున్న కఠినత్వం మాకుంటే ఎప్పుడో దారిలోకి వచ్చి ఉందురు. ఇప్పటికే మీరు నీరసపడి పోయారని మా చెల్లి నన్ను కాల్చుకు తినేస్తుంది. అటూ యిటూ యిక పడలేను. ఈరాత్రి నుంచి మళ్ళీ మా చెల్లి వండి పెట్టెదాకా మీకు యిక్కడే భోజనం.'
నారాయణ నవ్వుతూ వెళ్ళిపోయాడు.
గోపాలరావు తరువాత చెప్పేవాడు. నారాయణ చిత్రంగా మారిపోయాడట. ముఖ్యంగా ఆఫీసులో అతడి ప్రవర్తన బాగా మారిపోయిందట. ఆఫీసరు ఏమన్నా ఇప్పుడతడు మునపట్లా పడడం లేదట. 'ఏం లేటుగా వచ్చావ్, ఒళ్ళు తెలియలేదా?' అంటే ' లేటుగా వస్తే లేటు మార్కు వేసుకోండి. ఇందులో ఎవరికి మాత్రం ఒళ్ళు తెలియవలసిన అవసరమేముంది?' అనే వరకూ ఎదిగాడుట. మునపట్లా పనిలో కూడా అస్తమానూ తప్పులు చెయ్యడం లేదుట. కర్మం చాలక చేస్తే 'మీకు లోపమని తోస్తే ఆ విషయం కాగితం మీద పెట్టండి. మాటంటే మాత్రం పడేవాణ్ణి కాను. పదవులు వేరు కావచ్చు . అందరం మనుషులమేగా!' అనగలుగుతున్నాడట కూడా. గుమస్తా అందరూ కూడా యిప్పుడతన్ని అభిమానంగా చూస్తున్నారట.
'చిత్ర మేమిటంటారా అమ్మా, అసలు మా ఆఫీసరు గారు ఇంట్లో మాటాడలేక ఆ అక్కసు ఆఫీసు కొచ్చి వెలిగక్కేవారని వినికిడి. ఇప్పుడు ఇంట్లో కూడా గట్టిగా చెప్పగలుగుతున్నాట్ట!'
నేను నవ్వుకొన్నాను. మోహ మేదురుగుండా పొగడతారు గానీ ఇవన్నీ ఎవడు నమ్ముతాడు లే అయినా వీళ్ళందరి గొడవా నా కెందుకు? అమాయకురాలు ఆ సరళ భర్త చేత దెబ్బలు తినకుండా ఉండడమే నాకు కావలసింది. నారాయణ అమాంతం చంప లేసుకుని పెళ్ళాన్ని చంకనేసుకున్నాడని నేను చెప్పలేను గాని మునుపటి లా గొడ్డుని బాదినట్టు బాదడం లేదని మాత్రం చెప్పగలను. ముఖ్యంగా సరళ లోని మార్పే చెప్పుకోదగ్గది. క్రమంగా నాకే సలహా లిచ్చెంతవరకూ పెరిగింది మానసిక ప్రవృత్తి!
* * * *
సరళ మళ్ళీ భర్తతో ఎదురింటికి వెళ్ళిపోయిన నాడే అనుకుంటా, అన్నయ్య దగ్గర్నించీ ఉత్తరం వచ్చింది.
'మంజూ ఈసారి మా యింటికి వచ్చి వెళ్ళిన తరువాత నాకు మునుపటంత సంతోషంగా లేదు. మీరిద్దరూ ఏ విషయంలో నైనా దెబ్బలాడుకున్నారేమోనని నా మనస్సు బాధపడుతోంది. ఏవైనా చిన్న చిన్న తగవులు వచ్చినా వాటిని లక్ష్య పెట్టకుండా బ్రతకడం నేర్చుకుంటే అవి మనల్న ఏం చెయ్యలేవు. అవే అస్తమానూ ఆలోచిస్తూ కూచుంటే మన బుద్దితో పాటు మన నోరూ తిన్నగా ఉండవు. ఎప్పుడూ అనుకోని దుష్పరిణామాలకి దారి తీస్తాయి. నిజానికి కీచు లాడుకొని భార్యాభర్తలే ఉండరు. చిరుచేదు లేందే జీవితానికి రుచి ఉండదు కూడా. నీ ఉత్తరం నాకు చేరకపోయినా అందులో భావాలు మీ యిద్దరి మొహాలూ చూసి స్పష్టంగా గ్రహించగలిగాను.
నీ భర్త విషయంలో ఏదైనా మార్పు వచ్చిందేమో, నీ చదువుకి ఆటంకం కలిగిస్తున్నాడెమోనని నీ భయమూ, ఉద్దేశము కావచ్చు. అది నిజమే. నీ చదువు విషయమై అతడు నా దగ్గిర కూడా చాలా ముక్తసరిగా మాట్లాడేడు. మన మందరమూ పరిస్థితుల ప్రభావాలకు బానిసలమూ, వారసులమూ కూడా. అతడు కలిగించే ఆటంకాన్ని తేలికగా తీసి పారేయ్యడానికి గాని వీలయితే ఎదిరించి అధిగమించడానికి గాని నువ్వు ప్రయత్నిస్తే అది జయప్రదం కాజాలదని గుర్తుంచుకో. అతడూ వివేకమూ, విశాల హృదయమూ కలవాడు. అతడా విధంగా ఆలోచించడానికి దారితీసిన కారణాలేవో తెలుసుకోడానికి ప్రయత్నించు. మంచి మాటలతో నచ్చచెప్పి అతన్ని నీ దారికి తీసుకురావడానికి ప్రయత్నించు. నువ్వు తలచుకుంటే అది అంతగా సాధించలేని కార్యమేమీ కాదు.
మీ వదిన గాని నేను గాని మీ సంసార విషయంలో ఎటువంటి కలతలూ ఊహించలేము. భరించలేము కూడా.
