Previous Page Next Page 
శరన్మేఘం పేజి 21

 

                                       14


    ప్రతి సెకనూ బరువుగా దొర్లుతోంది.
    ప్రతి నిమిషం భయంగా కదులుతోంది- మెదడు లో లక్ష ఆలోచనలు -
    గుండెలో కోటి సంకోచలు-
    గుండె లో కోటి సంకోచాలు.
    ఏం జరుగుతుందో -- ఏమౌతుందో--
    రాత్రి ఎంతకీ జరగటం లేదు. కాళరాత్రి గా కనిపిస్తోంది.
    అసలీ రాత్రి గడిచి తెల్లారుతుందా? ఈ కుటుంబానికి ఇది అంతిమ పర్తీక్షా సమయమా? కష్టాలన్నీ గడచి గట్టెక్కడమో, బాధలన్నీ ఏకమై కబళిం చేస్తే ఆ ప్రళయ తరంగంలో పడి అందరూ ములిగి పోవడమో ఏదో ఒక నిర్ణయం అయిపోయే మహో ప్రదవమైన ముహూర్తమా ఇది? దిక్కు తోచడం లేదు. భయం లేదు నే నున్నానని భుజం తట్టే దిక్కు కూడా లేదు. ఒక్కడు -- కేవలం  ఒక్కడు -- ఆ బాబిగాడిని గుండెలకి గట్టిగా హత్తుకుని, దిక్కులేని పక్షి లాగ, ఎంతో దయనీయంగా ఆ అర్ధరాత్రి ఇంటికి హాస్పిటల్ కీ మధ్య నడవలేక అల్లాడి పోతున్నాడు గోపాలం.---
    అక్కడ హాస్పిటల్ లో టి.బి వార్డు లో అన్నయ్య. తెల్లారితే చేసే లంగ్ ఆపరేషన్ తన భవిష్యత్తు ని ఎలా నిర్ణయిస్తుందో అని భయంతో క్రుంగి పోతున్న అన్నయ్య.
    మేటర్నరీ వార్డ్ లో పురుడు రాక , ప్రసవ వేదనతో సతమతమవుతూ నరకయాతన అనుభవిస్తున్న రత్నం.
    ఇంటిదగ్గర నూటరెండు డిగ్రీల జ్వరంతో వళ్ళు తెలియక మగత లో దిక్కు లేకుండా పడి ఉన్న వదిన --
    ఈ ముగ్గురి మధ్యా తిరుగుతూ , మధ్య మధ్య భుజం మీద ఉన్న బాబిగాడిని  ఊరుకొబెడుతూ భయంకరమైన ఆలోచనలతో మెదడు బద్దలై పోతుంటే , చేసేదేం లేక, ఈ రాత్రి ఇంక గడవ దేమిటి దేవుడా అని హడలిపోతూ ప్రతి సేకనూ లెక్క పెడుతూన్న గోపాలం --
    ఒక్క క్షణం . స్థిమితంగా ఉండడానికి వీలు లేకుండా, చుట్టూ చుట్ట బెడుతున్న నాగు పాముల్లా ఆలోచనలు--
    పాపం చేసి సంపాదించిన వెయ్యి రూపాయల్లోనూ , బాకీలు, రత్నం సరదాలు, అన్నీ పోగా మిగిలినవి మూడు వందలు. అందులో వంద రూపాయలు , రేపు అన్నయ్య కి ఆపరేషన్ చెయ్యబోయే డాక్టర్ కే ఇచ్చాడు తను. ఇంకో వంద రూపాయలు ఇయ్యాలి. అవసరం అవుతాయి. అర్జంటుగా మందులేమైనా కావలసి వస్తే ఉపయోగిస్తాయి. ఓ వంద రూపాయలు రెడీగా ఉంచుకోమన్నారు. సాయంత్రం అర్జంటు గా రత్నానికి నొప్పులు వచ్చి, రాజమ్మ గారిని కూడా తీసుకుని రత్నాన్ని హాస్పిటల్ లో చేర్చవలసి వస్తే, 70,80 రూపాయల దాకా ఖర్చు పెట్టవలసి వచ్చింది. ఇంకా ముందు ఎంత ఖర్చు పెట్టాలో ! ఈ ఖర్చు కి అంతకీ డబ్బేది? తన దగ్గరున్నది ఏం సరిపోతుంది? మిగిలింది ఎలా సర్దుకోవడం.
    ఈ డబ్బు సమస్య ఎలాగో పాలుపోక ఎవర్ని అడగాలో తెలీక, సతమత మౌతున్న ఈ సమయంలో  సరిగ్గా వదిన ఉద్యోగానికి రిజైన్ చేసింది. ఎందుకు రిజైన్ చేశావమ్మా అంటే మాట్లాడదు. అసలు అప్పటి నుంచే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎడతెగని దగ్గూ, పక్కలో నెప్పి తో చుట్ట బెట్టుకు పోవడం . వంటి మీద వడ్ల గింజ వేస్తె పేలాల గింజ అయేలాగ విపరీతమైన జ్వరం - ఈ బాధలు భరించలేక పాపం నిద్రమాత్రలు వేసుకుని మగతగా పడి ఉంటోంది. ఈ స్థితిలో చెప్పడం ఎందుకని తనూ అన్నయ్యా అలోచించి వారం రోజుల క్రితం వచ్చిన టెలిగ్రాం సంగతి చెప్పకుండా దాచి ఉంచారు. కాని పాపం వదిన మొహం చూస్తె జాలేస్తోంది. వాళ్ళ అమ్మ గారికి సీరియస్ గా ఉన్న సంగతి తెలియదు కదా -- తెలిస్తే ఎంత అల్లాడి పోతుందో.... ఈవిడ ఇలా ఒళ్ళు తెలియకుండా మంచంమీద పడి ఉంటె తనకి భయం వేస్తోంది! ఈవిడ ఏమౌతుందో అని. ఇంక ఉపేక్ష చెయ్యడానికి వీలులేదు. వైద్యం చేయించాలి. అన్నయ్య ఆపరేషన్, రత్నం పురుడూ ఇవేవో తేలగానే వదినని డాక్టరు కి చూపించాలి... మళ్ళీ ఆలోచనలు.
    అన్నయ్య కు చేసే ఆపరేషను సక్సెస్ అవుతుందా?

 

                            


    రత్నం సుఖ ప్రసవం అయి తిరిగి మనుషుల్లో పడుతుందా?
    వదిన ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ మామూలుగా అవుతుందా?
    ఇందులో ఏ ఒక్కటీ జరక్కపోయినా ఈ కుటుంబానికి ....ఈ ఆలోచనతో గోపాలం హృదయం భయంతో వేగంగా కొట్టుకోసాగింది.
    ఏ ఒక్క చోట స్థిమితంగా ఉండలేక గోపాలం ఆ అర్త్ధరాత్రి అలంగం తిరుగుతున్నాడు బాబి గాడిని భుజాన్న వేసుకుని ఒక చోట నుంచి ఒక చోటకి. టి.బి. వార్డ్ లో నిద్ర పట్టక అన్నయ్య బెడ్ మీద ఇటూ అటూ ఒత్తిగిల్లు తున్నాడు. మేటర్నరీ వార్డు లో స్క్రీను వెనక నుంచి రత్నం మూలుగు ఇంకా హృదయ విదారకంగా వినిపి స్తూనే ఉంది. ఇంట్లో సునంద కొట్టిన పాములా మంచం మీద చలనం లేకుండా, దయనీయంగా అలా పడుకునే ఉంది.
    ఇంకా తెల్లారేతట్టు కనిపించడం లేదు.
    ఎంతకీ తెమలని పొడుగైన రాత్రి కొండ చిలువ లా ఉంది గోపాలం ప్రాణానికి.
    ఆందోళన ఆలోచనల్ని మెలిపెట్టేస్తోంది .
    భయం గుండెని నొక్కేస్తోంది.
    భవిష్యత్తు ఎలా ఉంటుందో భగవంతుడా అని ప్రాణాలు అరచేత పట్టుకు కూర్చున్నాడు గోపాలం.
    అన్ని బెంగలూ ఇలా ఉండగా, ఆఫీసు వ్యవహారం ఒకటి ఉండుండి జ్ఞాపకం వచ్చి తనకు ఉన్న ధైర్యాన్ని కూడా హరింప చేస్తోంది.
    అప్పుడు  రెండు చెక్కులు పంపించిన ఆసామీ పైకి రిపోర్టు ఇచ్చాడు. తెలియక పొరబాటుని తను పదివేలు ఎక్కువ పంపితే ఆఫీసు వాళ్ళు తినేశారని, అది ఎంక్వయిరీ చెయ్యడానికి నేడో రేపో కమిషను రాబోతుంది. అయిన కాడికి తొమ్మిది వేలూ తిన్న ఆఫీసరు ఇవాళ తనకేం పట్టనట్లు తటస్థం గా ఊరుకున్నాడు. చెక్కుని బ్యాంకు లో మార్చింది తను - వస్తే తన మీదకే వస్తుంది కదా అని ఆఫీసరు ధైర్యం -- నిజమే -- తగిల్తే తనకే తగుల్తుంది దెబ్బ -- చెక్కు మార్చి పదివేలూ తనే కాజేసినట్లు కనిపిస్తోంది. అందులో తొమ్మిది వేలు ఆఫీసరు కి తను ఇచ్చాడు. కాని రుజువేది? ఇచ్చానంటే తన మాట నమ్మే వాళ్ళేవరు? పదివేలూ కట్ట మంటారు -- జైలుకి నడవ మంటారు. అప్పుడేమిటి దిక్కు తనకి?.... తన దగ్గర పదివేలూ అలా ఉంచి పది  గవ్వలు కూడా లేవు. ఇంత బ్రతికు బ్రతికి జైలుకి వెళ్ళడమే ! ఈ స్థితిలో అన్నయ్యనీ, వదినని, రత్నాన్నీ అందర్నీ వదిలి.
    ఆలోచించిన కొద్ది తల పగిలి పోతోంది గోపాలానికి.
    ఎన్ని సమస్యలు చుట్టూ ముట్టేశాయి తనని ఉన్నట్టుండి? పద్మవ్యూహం లో చిక్కుకున్నట్లుంది తన పని -- ఎలాగ వీటి నుంచి విడి బయట పడడం? అసలు బయట పడతాడా అని?--
    మనస్సంతా చికాకయిపోయి గట్టిగా ఏడవాలని పించింది గోపాలానికి. కాని అలా ఏడ్చి మనస్సులో బరువు తగ్గించుకునే అవకాశాన్ని కూడా అతనికి ఇవ్వలేదు బాబిగాడు. ఆ అర్ధరాత్రి వేళ లేచి " అమ్మ కావాలి" అని పేచీ ప్రారంభించి ఏడవడం మొదలెట్టాడు. గోపాలం వాడిని ఊరుకో  బెట్టిడానికి శత విధాల ప్రయత్నించాడు. ఎన్నో రకాలుగా మరిపించాలని చూశాడు. కాని బాబిగాడు "అమ్మే కావాలి" అంటూ గట్టిగా శోకం మొదలుపెట్టాడు. వాడి ఏడుపు కి విసుగొచ్చి వళ్ళు మండి ఫెడీ ఫెడీ మని వాడిని బాదేసి, వాడు దీనంగా గుక్క పట్టి ఏడ్చేస్తుంటే , వాడిని కౌగలించుకుని తనూ బావురు మన్నాడు గోపాలం ఏడ్చి ఏడ్చి అలిసిపోయి బాబిగాడు నిద్రపోయాడు గోపాలం గుండెల మీద వాడిని జోకోడూతున్న గోపాలానికి కూడా నెమ్మదిగా కళ్ళు మూతలు పడ్డాయి. తెరిచి చూసేటప్పటి కి బాగా తెల్లారింది.
    "మీరేమైనా అనండి... నా నడవడిని మాత్రం అనుమానించకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ మాట అనకండి" అంటూ పలవరిస్తోంది సునంద-'
    గోపాలం ఉలిక్కిపడి అటు చూసి, జాలిగా నిట్టూర్చాడు -- రత్నం జ్ఞాపకం వచ్చి గబగబా హాస్పిటల్ కి పరిగెట్టాడు. రత్నం ఎలా ఉందొ, పురుడు వచ్చిందో లేదో అనే అడుర్ధాతో -- వార్డ్ లోకి  వెళుతుంటే రాజమ్మ ఎదురైంది. "రత్నం ఇంకా వేదన పడుతూనే ఉందనీ, ఈ మందులు తెమ్మని డాక్టరమ్మ చెప్పిందనీ " చెప్పి గుడ్ల నీరు కుక్కుకుంటూ గోపాలానికి చీటీ అందించింది రాజమ్మ. చంటాడిని రాజమ్మ కిచ్చి గోపాలం మందుల షాపు కేసి కంగారు గా దూసుకు పోయాడు.
    మందులు కొని తిరిగి వస్తుంటే, ఆఫీసు బంట్రోతు ఎదురై, "బాబూ మీరు ఇక్కడున్నారా? మీ ఇంటి కెళ్ళి వస్తున్నా" అన్నాడు. గోపాలం జంకుతూ అడిగాడు. "ఏం? పొద్దున్నే ఏమిటి పనీ' అని - బంట్రోతు చెప్పాడు." పై అధికారులు వేసిన కమిషను వచ్చిందనీ-- అందులో ముగ్గురు సభ్యు లున్నారని -- వాళ్ళు ముగ్గురూ రాత్రి ఆఫీసరు గారితోటి మంతనాలు జరిపారనీ-- రిపోర్టు ఇచ్చిన ఆసామీ కూడా ఊళ్ళో కి వచ్చాడని-- అంతా కలిసి గోపాలం మీద కేసును బనాయించి అతనిని జైలుకు పంపించే లాగ ఉన్నారనీ-- ఈసంగతి ముందు తెలిస్తే తన ప్రయత్నం ఏదో తను గోపాలం చేసుకుంటాడనే ఉద్దేశంతో ముందుగా వచ్చి ఇందంతా చెప్తున్నాననీ తేల్చాడు బంట్రోతు. ఆ మాటలు విని అదిరిపడ్డాడు. "ఆ' అని పిచ్చిగా ఒక కేక వేశాడు. గోపాలం కొయ్య బారిపోయాడు -- కక్ష గట్టి భగవంతుడే బాధలన్నీ ఒక్కసారే తన మీదకి తరుముతున్నాడా అనిపించింది. భవిష్యత్తు ను తలుచుకొని నిలువెల్లా వణికి పోయాడు.
    అన్నయ్య అపరేషనూ', రత్నం పురుడూ, వదిన అనారోగ్యం, తన నిస్సహాయత స్థితీ అన్నీ, బంట్రోతు అని అయినా సంకోచించకుండా అతని ముందు ఏ కరువు పెట్టి కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకున్నాడు గోపాలం -- బంట్రోతు అతని స్థితికి జాలిపడి -- పరాయి వాడికేనా వద్దండి ఇలాంటి పరిస్థితి -- వింటుంటేనే భయంతో వళ్ళు జలదరిస్తోంది. అంటూ వెళ్ళిపోయాడు--
    ఆ తర్వాత గోపాలం కాళ్ళీడ్చు కుంటూ హాస్పిటల్ కి వెళ్లి మందులు రాజమ్మ కి అందించాడు. అతనికి మనస్సు మనస్సులో లేదు-- నేరం రుజువవుతుంది -- తనని శిక్షిస్తారు-- తనకి ఎలాగా జైలు తప్పదు.
    జైలు?
    గోపాలం మెదడు పనిచెయ్యడం మానేసింది.
    రత్నం సంగతి ఏమైందో అతని మనస్సుకి పట్టడం లేదు. అన్నయ్య ని ఆపరేషన్ దియేటరు లోకి తీసుకు వెళుతున్నట్లు కబురు వచ్చింది. ఊ కొట్టి ఊరుకున్నాడే కాని కదల్లేదు. పక్కనే బాబి గాడు నేల మీద దొర్లి ఏడుస్తున్నాడు. వాడిని తీసి ఊరుకోబెట్టాలనే ధ్యాసే లేకపోయింది గోపాలానికి. తన కళ్ళకి, కనిపిస్తున్నది, తన చెవులకి వినిపిస్తున్నదీ ఏం పట్టించు కోకుండా స్థాణువులా అలా నిలబడి ఉండిపోయాడు.
    అతని చెవులికి తనకి శిక్ష విధిస్తున్న జడ్జి గొంతే వినిపిస్తోంది.
    కళ్ళకి ఎదురుగుండా రాతి గోడల ఇనప కటకటాల జైలు తప్ప ఇంకేం కనిపించడం లేదు.
    రాక్షసి లా భయంకరంగా నోరు తెరిచి పిలుస్తూన్న ఆ జైలుని చూసి, గట్టిగా ఓ వెఱ్రి కేక పెట్టి వెనక్కి పరిగెట్టాడు గోపాలం.
    ఆ పరిగెట్టటం పరిగేట్టడం తిన్నగా ఇంటికి వెళ్ళి ఆగాడు.
    ఒగుర్చుకుంటూ వచ్చిన గోపాలాన్ని చూసి అప్పుడే కళ్ళు తెరిచిన సునంద , నీరసించి పోయిన బలహీన స్వరంతో, "రత్నం, ఏదీ?... మీ అన్నయ్య కి ఎలా వుంది? ఆపరేషన్ చేశారా?" అంటూ అడిగింది.
    తెల్లగా పాలిపోయిన సునంద, గోపాలం కళ్ళకి జడ్జి గారు మెళ్ళో కట్టుకున్న "బెంట్సు" లా కనిపించింది. ఆటే పిచ్చిగా చూస్తూ భయంతో వణికిపోతూ ఉండిపోయాడు.
    ఇంతలో పోస్టు మేన్ కేకేస్తే యాంత్రికంగా అటు కదిలాడు గోపాలం.
    పోస్ట్ మేన్ గోపాలాన్ని తన పేరు అడుగు తుండడం విని, సునంద పోస్ట్ మేన్ ని నీరసంగా తన మంచం దగ్గరికి పిలిచింది. పడుకుని ఉన్నదే ప్రయత్నం చేసి కొద్దిగా లేచి, రాసీదు మీద సంతకం చేసి పోస్ట్ మాన్ కి ఇచ్చి అతను ఇచ్చిన పెద్ద కవరు అందుకుంది. గోపాలానికి ఆ కవరు అందించి, "ఏమిటో అది చూడమంది సునంద. తను చెల్లించవలసిన పది వేలు గురించి, తనకి పడే శిక్ష గురించీ ఆలోచిస్తున్న గోపాలం కవరు పట్టుకుని నుంచున్నాడే గాని ఎంతకీ అది చింపి లోపల ఏముందో చూడడం లేదు చివరికి సునందే హెచ్చరించింది "ఏమిటలా వుండి పోయావు కవరు చంపి చూడమని నిర్జీవంగా నిలబడి ఆలోచిస్తున్నవాడల్లా , ఆ ఆలోచనల్లోంచి తేరుకొని, గోపాలం కవరు చింపాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS