దస్తావేజులు-- కాగితాలూ-- బ్యాంక్ ప్యాస్ బుక్కూ, అన్నింటికీ పిన్ చేసిన ఉత్తరం !
"ఏవిటి అవన్నీ?..... ఎక్కడ నుంచి?' అంది సునంద.
గోపాలం అటూ ఇటూ తిరగేసి -- "మీ నాన్నగారి దగ్గర్నుంచి " అన్నాడు.
"నాన్నా? నాకు ఎప్పుడూ ఉత్తరం రాయడే? ఏం రాశాడు చెప్మా -- చదువు" అంది ఆదుర్దాగా సునంద.
అమ్మా సునందా?
అమ్మకి జబ్బుగా ఉందని ఇచ్చిన టెలిగ్రాం కూడా నీ పట్టుదలని సడలించలేక పోయిందన్న మాట...సరేనమ్మా సరే! అమ్మే అక్ఖర్లేఖ పోయినదానికి ఈ ఆస్తి మాత్రం కావలసి వస్తుందా నా వెర్రి గాని. అయినా నా వెర్రి నాది -- ఆస్తి అంతా నా మనమల పేరా వ్రాసి దస్తావేజులన్నీ ఇందులో పంపా. తిరగ్గొట్టినా స్వీకరించినా ఆ హక్కు నా మనమలది- నీకొక హక్కు మాత్రం ఉంది. అదేవిటంటే బేంక్ లో ఉన్న పన్నెండు వేల రూపాయలూ ఆఖర్లేదని తిప్పెయ్యడానికి. నువ్వు తిరస్కరించి తిప్పిస్తే నాకు అది హృషీ కేశం లో అందుతుంది. అప్పుడది ఏ సంస్థకి ఇవ్వాలో నేను నిర్ణయించుకోవాలి... కైలసానికి పోతున్న ఈ ముసలి తండ్రి మీద ఆ నిర్ణయం బాధ్యత పెట్టవనీ ఇప్పుడేనా కొంచెం జాలి చూపిస్తావనీ ఏవిటో పిచ్చి నమ్మకం నాకు.... కైసాసానికి వెళ్ళినా ఆ నమ్మకం నాకు పోదమ్మ. అక్కడికి ఎందుకు వెళుతున్నానా, మరి ముందుగా వెళ్ళి మీ అమ్మ అక్కడేగా వేచి ఉంది నాకోసం?
నిన్నూ అల్లుడిని ఆశీర్వదిస్తూ
రాఘవయ్య.
"అమ్మ" అని గట్టిగా అరిచి సొమ్మసిల్లి పడిపోయింది సునంద. కాస్సేపటికి తేరుకుని గోపాలాన్ని చూసి బావురుమంటూ "గోపాలం ! మా అమ్మ చచ్చి పోయిందిట?.... చూడు ముందుగా నాకు టెలిగ్రాం ఇచ్చానంటున్నాడు మా నాన్నా..... టెలిగ్రాం ఇస్తే నేను వెళ్ళనూ? చెప్పు....టెలిగ్రాం చూసి కూడా ఊరుకుంటానా?' అంది సునంద.
"అయ్యో వదినా! టెలిగ్రాం రావడం నిజమే ! కాని మేమే ఊరుకున్నాం అమ్మా. నీకు చెప్పకుండా.... నీకు చాలా అన్యాయం చేశాం అంటూ తనలో తను పశ్చాత్తాప పడుతూ అనుకున్నాడు గోపాలం. కాస్సేపు ఏదో అలోచించి, ఇన్నాళ్ళు తీసుకోనిది ఇప్పుడు మాత్రం తీసుకుంటానా వాళ్ళ డబ్బు ? వెనక్కి తిప్పి పంపించేయ్యి" అంది దృడమైన కంఠంతో సునంద.
"అమ్మ చచ్చిపోయింది... నాన్న వెళ్ళి పోయాడు.... వాళ్ళే లేకపోయాక వాళ్ళ డబ్బు కావాలా నాకు?.... పంపించేయ్యి గోపాలం.... వెనక్కి పంపించేయ్యి అంటూ గుండె పగిలి పోయేలా ఏడవసాగింది సునంద. ఆ ఏడుపు తోనే "మీ అన్నయ్య ఎలా ఉన్నారు బాబూ. ఆపరేషన్ చేస్తారా?నన్ను అక్కడికి తీసుకెళ్ళవ్?' అంది ఇంతలో అఫీసు బంట్రోతు వచ్చి కేకేశాడు గోపాలాన్ని.
పక్క గదిలోకి వెళ్ళి గోపాలం అతనితో మాట్లాడుతున్నాడు వాళ్ళ మాటలు అమ్మని తలుచుకొని ఏడుస్తున్న సునంద చెవిలో పడుతున్నాయి.
"అయ్యా అంతా ఏకమై మీమీదికి తోసేశారు కేసు.
"అలాగా? గోపాలం గొంతు బొంగురు పోయింది.
"ఇందులో మీ కంటే పెద్దయ్య గారు తిన్నది ఎక్కువ అని నాకు తెలుసు బాబూ"
గోపాలం ఏం సమాధానం చెప్పలేదు.
"మీ మీద సాయంత్రం పోలీసు రిపోర్టు ఇస్తారట!"
సునంద అదిరి పడింది అ మాట విని.
"ఇస్తారు.... ఆ తర్వాత పోలీసులు వచ్చి నన్ను జైలుకి తీసి కేల్తారు." గోపాలం కంఠం భయంతో వణికింది.
"జై....లు" సునంద మ్రాన్పడి ఉండి పోయింది.
"కాని అన్యాయం బాబూ అన్నాడు బంట్రోతు బాధగా.
"ఏం చేస్తాం?" గోపాలం కంఠం లో నిస్పృహ..
"నేనొక దోవ ఆలోచించాను. ఆ రిపోర్టిచ్చ్జిన ఆసామి ని పట్టుకున్నా. తన పదివేలూ తనకిప్పుడిస్తే ఆ రిపోర్టు కాగితం తీసేసుకుంటా నన్నాడు అతను అదేవైనా ఆలోచించండి బాబు పని జరుగుతుంది తీసుకుని రమ్మంటే ఆ ఆసామిని ఇక్కడికి ఇప్పుడే నేను తీసుకు వస్తా.
"అదేం లాభం లేదయ్యా."
"ఏం బాబూ?"
"నా దగ్గర ఇప్పుడు పది వేలు ఏవి?"
"ఆలోచించండి బాబూ.. ఆ డబ్బు మనం ఇప్పుడు ఇస్తే ప్రస్తుతం జైలు తప్పుతుంది. కేసు సంగతి తర్వాత చూసుకోవచ్చు ."
"నిజమే.... నువ్వు సాయం చెయ్యాలని చూస్తున్నావు. కాని నాకు జైలు యోగం తప్పదయ్యా! నా దగ్గర పది వేల మాట అలా ఉంచు పది రూపాయలు లేవు-- విచారంగా అన్నాడు గోపాలం.
సునంద ఒక్క క్షణం అలోచించి 'గోపాలం' అని పిలిచింది. పిలిచి, "ఆ కవరు లో వచ్చిన ప్యాస్ బుక్ ఇలా తే " అంది. "ఇదిగో సంతకం చేసి ఇస్తున్నాను-- బ్యాంక్ కి వెళ్ళి ఆ డబ్బు తీసుకుని ఆ ఆసామి కి ఇచ్చేసి ప్రస్తుతం ఆ గొడవేదో సర్దుబాటు చేసుకోఅంది." హటాత్తుగా ఆ మాటలు విని, సంభ్రమాశ్చర్యాలతో గట్టిగా "వదినా! నా కోసం నీ పౌరుషం పట్టుదలా వదిలేసి ఆ డబ్బు తీసుకుంటున్నావా?' అన్నాడు గోపాలం.
"నా పౌరుషం నన్నూ, మా వాళ్ళ నీ ఈ స్థితికి తీసుకు వచ్చింది కదా?.... పట్టుదల పట్టి ఎవరిని సాధించాను చెప్పు-- అందరికీ అనర్ధాన్ని తీసుకు వచ్చిన ఈ పట్టుదల వదిలి పెడితే నీకైనా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ డబ్బు తీసుకో నాయనా -- తీసుకుని ఈ ప్రమాదం నుంచి బయట పడు" అంది సునంద.
కళ్ళ నిండా నీళ్ళు నిండి వదిన కాళ్ళకి నమస్కారం చెయ్యాలను కున్నాడు గోపాలం. కాని తన మాట పట్టుదలని మరిదికోసం త్యాగం చేసిన ఆవిడ ఔన్నత్యాన్ని కృతజ్ఞత ద్వారా వెల కట్టలేక ఊరుకున్నాడు.
బ్యాంక్ పుస్తకం తీసుకుని బంట్రోతు తో కలిసి వెళుతున్న గోపాలాన్ని చూసి "మా మూలాన్ని నీకు ఎన్నెన్ని చిక్కులు వచ్చాయి నాయనా? అనుకుంది సునంద కళ్ళు తుడుచుకుంటూ.
ఆ తర్వాత "అమ్మా, నాన్నా అలా అయిపోయారే తను కారణంగా" అని బాధపడి, అమ్మనీ, నాన్ననీ తలుచుకు తలుచుకు ఏడ్చి, "పిచ్చి పౌరుషంతో ఎంత హింసించాను వాళ్ళని." అని తల బాదుకుంది సునంద -- అంతలోనే ఆమెకి "శివరాం ఆపరేషన్ ఆరోజే" అనేది జ్ఞాపకం వచ్చింది.
"అయ్యో! నేనెంత దౌర్భాగ్యురాల్ని! ఆయనకి ఆపరేషన్ జరుగుతుంటే నేనిక్కడ ఉన్నాను... ఆపరేషన్ మొదలు పెట్టారో ఏమో?...గోపాలం హాస్పిటల్ కి వెళ్ళలేదు.... రత్నం వాళ్ళూ కూడా ఏమయ్యారో కనిపించడం లేదు.
అయన ఒక్కరూ అక్కడ హాస్పిటల్ లో దిక్కు లేకుండా...ఈ ఆపరేషన్ ఎలా ఉందొ.... తను వెళ్ళాలి.... హాస్పిటల్ కి వెళ్ళాలి.
లేని ఓపిక్ తెచ్చుకుని మంచం మీంచి లేచి నీరసంగా అడుగులు వేసుకుంటూ బయలు దేరింది సునంద.
గడప దాటడం తెలుసు.
కాని ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తు లేదు....
* * * *
'ఆపరేషన్ సక్సెస్ అయిందన్న సంతోషం లేదురా గోపాలం " అన్నాడు విషాదంగా శివరాం.
"బావగారూ మీరలా బాధపడకండి... అక్కయ్య తప్పకుండా కోలుకుంటుంది." అంది రత్నం. పొత్తిళ్ళ లో ఉన్న అమ్మాయిని దగ్గరగా పొదుపు కుంటూ .
'అక్కయ్య కి స్పృహ వచ్చిందాండీ! డాక్టరు గారు పరీక్షించి యేమని తేల్చారు?" అన్నాడు జగపతి శాంత ని తీసుకుని వార్డు లోకి ప్రవేశిస్తూ.
"వదిన కి స్పృహ రాగానే మొట్టమొదట నేను కాళ్ళ మీద పడి క్షమించమని ప్రార్ధించాలి"అంది శాంత.
ఇంక ఎటొచ్చి ఏం మాట్లాడకుండా ఉండి పోయింది ఒక్క గోపాలమే!
వదిన ఓర్పునీ, ఆమె పడిన కష్టాల్నీ అన్నయ్య కోసం తన ఆరోగ్యాన్ని హారతి కర్పూరం లా అర్పించడానికి సిద్దపడ్డ ఆమె త్యాగాన్ని ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ. ఆమె కోలుకోవడం గురించి డాక్టరు ఏం చెప్తారో అనే ఆదుర్దాతో అయన కేసే చూస్తూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు గోపాలం.
పరీక్ష పూర్తి చేసి, స్టేతో స్కోప్ మడిచి చేత్తో పట్టుకుని లేచాడు డాక్టరు.
అంతా అతని ముఖం లోకి ఆదుర్దాగా చూశారు.
"ఎందుకేనా మంచిది ఎక్స్ రే తీయించండి. నా అనుమానం టి.బి బాగా ముదిరిందని"అన్నాడు డాక్టర్.
"ఆ!" అని అరిచారు ఉద్వేగంగా అంతా ఒక్కసారి-
"సునందా!.....నా కోసం నీ ఆరోగ్యాన్ని బలి చేసేశావా ...డాక్టర్ ....నా సునందని ఈ భయంకర వ్యాధి నుంచి రక్షించండి డాక్టర్!" అంటూ శివరాం ఏడుస్తూ డాక్టర్ కాళ్ళు పట్టుకున్నాడు.
"నీ ఆదేశాన్ని పాటించి వచ్చాను అక్కయ్యా. నాకేసి చూడు. ఒక్కమాటు చూడు" అంటూ పసివాడి లాగా బావురుమన్నాడు జగపతి.
"విచ్చిన్నం కాబోయిన నా కాపురాన్ని నిలబెట్టిన ఈ దేవతా మూర్తి ని పూర్తి ఆరోగ్యవంతురాలుగా చెయ్యండి డాక్టర్! అందుకు ఎన్ని వేలు ఖర్చు అవుతాయన్న ఆలోచించకండి. అంతా నేను ఇచ్చుకుంటాను. ఈ దేవతను మాత్రం మాకు దక్కించండి." అంటూ కళ్ళు తుడుచుకుంటూ డాక్టర్ ముందు దోసిలి పట్టింది శాంత.
"మా అక్కయ్య పరమ సాద్వి అండీ?.... మాట పడడమే కాని ఎవరినీ అని ఎరగదు బ్రతుకంతా కష్టాలే అయిపొయింది-- మంచి మందిచ్చి మా అక్కయ్య ని బ్రతికించండి" అంటూ ఏడ్చింది రత్నం.
"దొడ్డమ్మా...లే...తెల్లారి పోయింది. అంతా ఆఫీసు లికి వెళ్ళి పోతున్నారు" అంటూ బాబిగాడు సునంద కాలి వేళ్ళు పట్టుకుని కడప సాగాడు.
డాక్టర్ హృదయం జాలిగా కరిగిపోయింది.
రాజమ్మ పైటతో కళ్ళు ఒత్తుకుంది.
గోపాలానికి గుండెల్లోంచి మహోజ్జ్వలమైన జ్వాలలా లేచింది ఆపుకోలేని ఆవేదన.
సునంద కేసి చూశాడు. రక్తం వంట్లో తగ్గి నీరసించి, తెల్లగా పాలిపోయిన సునంద ? తెల్లని పరుపు మీద బాధ్యత తీరి తీరిగ్గా విశ్రాంతి తీసుకుంటున్నట్లు కళ్ళు మూసుకుని నిశ్చలంగా ఉంది.
తన ఆరోగ్యాన్ని, సౌఖ్యాన్నీ, పట్టుదలనీ అన్నీ త్యాగం చేసేసి అందరి బ్రతుకుల్నీ పండించిన సునంద, తన నీలిమ పంపదని వర్షించి లోకాన్ని సస్యశ్యామలం చేసి తను మాత్రం వెండిలా మెరిసిపోతూ నవ్వుతూ తేలిపోయే శరన్మేఘం లాగ. తెల్లగా తేజోమూర్తి లా కనిపించింది గోపాలానికి-- ఆ దయనీయ మూర్తిని చూడలేక, "వదినా! అని వెఱ్రి బాధతో అతను అరిచిన అరుపు లో, "కొత్తగా మందులు మంచివి వస్తున్నాయి కనుక ఆలస్యం అయినా ప్రయత్నం చేసి ఈమెని బ్రతికించవచ్చు" అని నెమ్మదిగా ఆశా జ్యోతి లా, ఆ డాక్టరు పెదిమల మీద కదిలిన మాటలు తక్కిన వాళ్ళందరి కి ఎంతవరకు ఎంతవరకు వినిపించాయో -- ఏమో----
(సమాప్తం)
