భోజనాలు, పాలు, పళ్ళు అన్నీ పిల్లల మారాముల్లో , ఏడుపుల్లో , తల్లి గద్దింపుల మధ్య , తండ్రి కోపం మధ్య తినేసి, ఆదమరచి తల్లిదండ్రుల భుజాల మీద వాలి నిద్రపోయేరు పిల్లలు.
ఐతే కల్యాణి కి , కాంతారావు కి మాత్రం విశ్రమించేందుకు చోటు, సమయం రెండూ లేవు. మధ్యాహ్నం మూడున్నర కి కంచి కి వెళ్ళే బస్సు కాళహస్తి లో బయలుదేరుతుంది. అందుకని టిక్కెట్లు కొనుక్కుని బస్సు స్టాపు దగ్గర కూలబడి , పిల్లలను వళ్ళో పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేరు.
ఆ బస్సు స్టాపు దగ్గర నీడ లేదు. దుకాణాల ముందు ఉన్న చిన్న నీడలోనే కంచికి పోయే యాత్రికులందరూ కూర్చున్నారు. ఎప్పుడు మూడున్నర అవుతుందా , ఎప్పుడు బస్సు వస్తుందా అని ఎదురు చూస్తూ.
"వళ్ళంతా నొప్పులుగా ఉందండీ! కంచి వెళ్ళేటప్పటికి ఎంతవుతుందో!' అన్నది కళ్యాణి.
'అప్పుడే మొదలు పెట్టావ్ గారాలు! ఏడు- మహా అయితే ఎనిమిది కంటే ఎక్కువ అవదు కంచికి వెళ్ళేసరికి ' అన్నాడు కాంతారావు భార్య కళ్ళలోకి ప్రేమగా చూస్తూ.
'అతని కళ్ళల్లో ఆర్ద్రంగా మెరుస్తున్నప్రేమను చూసేసరికి హటాత్తుగా యే యింద్రజాల మహిమ వల్లనో యిక్కడున్న మనుషులు, పరిసరాలు అన్నీ మాయమయ్యి తామిద్దరే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ కూర్చుంటే ఎంత బాగుండును!' అనుకుంది కళ్యాణి.
'నాకు మీ ఒళ్ళో తలపెట్టి పడుకోవాలనుంది. కూర్చోలేక పోతున్నాను.' అంది పక్క వాళ్ళేవరికీ వినపడనంత మెల్లగా.
'నాకూ అలాగే అనిపిస్తోంది....' పరధ్యానంగా అటూ యిటూ చూసి కళ్యాణి చెయ్యిని తన చేతుల్లోకి చాటుగా తీసుకుని మెత్తగా వత్తేడు కాంతారావు.
ఇంతలో వో పది పన్నెండేళ్ళ కుర్రవాడు అక్కడకు వచ్చేడు. 'కంచికి వెళ్తున్నారా సార్?' అనడిగేడు కాంతారావును చూస్తూ.
'ఔను' అని ముక్తసరిగా సమాధాన మిచ్చేడు కాంతారావు.
"మీదే వూరండీ? విజయవాడ, హైదరాబాదా?' అనడిగేడు.
కళ్యాణి, కాంతారావు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. 'ఏమిటి ఆ ఊరి పేర్లు మన మొహాల మీద వ్రాసి ఉన్నట్లు అలా అడుగుతాడేమిటి ? అన్నట్టు.
పైకి మాత్రం నవ్వేసి 'ఖచ్చితంగా కనుక్కున్నావోయ్! మా అసలు ఊరు విజయవాడ. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాను. ఇంతకీ మనదే ఊరేమిటి?' అన్నాడు. హుషారుగా కాంతారావు.
"మాది చిత్తూరండి!" అన్నాడు గర్వంగా . 'చిత్తూరు కంతటికీ అధికారిని నేనే' నన్నంత ఠీవి కనపడిందా తని మొహంలో.
'ఇంతకీ మా అచూకీలు కనుక్కునెందుకు నీకేం అవసరం వచ్చిందేమిటి?" అనడిగేడు కాంతారావు.
'అది కాదండీ! మిమ్మల్ని చూస్తుంటే చదువుకుని ఉద్యోగం చేస్తున్న వారిలా ఉన్నారు. ఇద్దరు పసి పిల్లలు కూడా ఉన్నారాయే! మీకు పనిపిల్లవాడి అవసరం ఉండక పోతుందా అనిపించింది. అమ్మగారు చూస్తుంటే నాజూకు మనిషిలా ఉన్నారు. పన్లవీ చేసుకోగాలరో లేరో. నన్ను మీ యెంట తీసుకెళ్ళండి బాబూ! పిల్లల్నాడిస్తాను . పచ్చడి నూరుతాను. పప్పు రుబ్బుతాను. కూరలు కొనుక్కోస్తాను. - మీరే పని చెప్తే ఆపని చేస్తాను బాబూ! ఎక్కడా పని దొరక్క కూటికి లేక చస్తున్నాను బాబూ!' అన్నాడు దీనంగా.
'ఇలా ఉన్నపాటున మాతో వస్తానంటున్నావు. మీ అమ్మా నాన్నా వాళ్ళ కేవరికీ చెప్పనక్కర్లేదా?" అనడిగేడు కాంతారావు.
"మా అమ్మా నాన్నా నా పిన్న తనంలోనే సచ్చి పోయేరండీ!' అంటూ చటుక్కున చొక్కా అంచుతో కళ్ళు వత్తుకున్నాడా కుర్రవాడు.
కళ్యాణి గుండె విలవిల లాడిపోయింది.
'అయ్యో పాపం, అలాగా! మరి యెప్పుడు నువ్వెవరి దగ్గర ఉంటున్నా వేమిటి?" అనడిగింది కళ్ళ నీళ్ళను బలవంతాన ఆపుకుని, పాపను మరింత దగ్గరగా గుండెకు హత్తుకుంటూ.
'మా చిన్నాన్నా వాళ్ళిక్కడుంటూన్నారండి. వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. మా పిన్ని రోజూ నన్ను తిడ్తుంది. కొడ్తుంది. అన్నం సరీగ్గా పెట్టదు. రోజూ అర్ధాకలితో నే పడుకోవాలి. అందుకే మీలాటి వాళ్ళేవారయినా కనిపిస్తే వచ్చేసి మీ దగ్గిర పని చేసుకుంటూ పడుందామనుకుంటున్నాను.' అన్నాడు.
కళ్యాణి హృదయం జావలాగా అయోపోయింది అతని మాటలు వింటుంటే.
'పాపం కుర్రవాడు ఎన్ని అవస్థలు పడుతున్నాడో! ఈ పిల్లలతో నాకూ అవస్థ గా ఉంది. పన్లు చేసుకోవాలంటే . ఎటుపడీ ఒక పనివాడిని పెట్టుకోవాలని అనుకుంటున్నాం కదా మనం. వస్తానని వెంట పడి వచ్చే ఈ కుర్రవాడిని తీసుకు వెళ్తే మంచిది కాదూ? పరాయి ఊరి వాడయితే చెప్పినట్టు యింట్లో పడి ఉంటాడు కూడా' అని యింగ్లీషు లో అన్నది భర్తతో, కుర్రవాడికి తనన్న మాటలు అర్ధం కాకూడదనే దృష్టి తో.
'పనిపిల్లవాడి అవసరం మనకున్న మాట నిజమే ననుకో? కాని మనం యిప్పుడు వెళ్తున్నది హైదరాబాద్ కాదు కదా. యాత్రలో ఉన్నాం. ఇంటికి చేరుకునేసరికి మరో పది పదిహేను రోజులు పడుతుంది. ఇన్నాళ్ళూ వీడికి కూడా చార్జీలు పెట్టి వెంట ఎక్కడ తీసుకు పోతాం?" అన్నాడు.
"అదీ నిజమే ననుకోండి. మన అడ్రస్ యిస్తే సరి. పదిహేను రోజుల తరువాత హైదరాబాద్ రమ్మని చెప్పండి. కుర్రవాడు చూస్తుంటే ఘటికుళ్ళానే ఉన్నాడు. హైదరాబాదు వచ్చేడంటే మనింటి అడ్రసు బాగానే కనుక్కోగలడు.' అంది కళ్యాణి.
వాళ్ళ సంభాషణ అంతా ఇంగ్లీషు లోనే సాగుతున్నప్పటి కీ కళ్యాణి అన్న 'అడ్రస్' అన్న మాట విని వాళ్ళెం మాట్లాడుకుంటున్నదీ తెలిసి చటుక్కున 'ఔను బాబూ! మీరు కనుక హైదరాబాద్ లో ఎక్కడుండేదీ యింటి నంబరు తో సహా వ్రాసి చ్చేరంటే మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను .' అన్నాడు ఉత్సాహంగా ఆ కుర్రవాడు.
కాంతారావు వో కాగితం మీద తమ అడ్రసు వ్రాసి 'పదిహేను రోజుల తరువాత యీ అడ్రసు తీసుకుని రా' అంటూ ఆ కాగితం చేతిలో పెట్టాడు.
కాగితాన్ని జేబులో పెట్టుకుని రెండు చేతులూ కట్టుకుని నిలబడి ' మరి రావటానికి చార్జీ లేలాగండీ!' అన్నాడు దీనంగా.
"అరి పిడుగా!' అనుకున్నాడు కాంతారావు.
'అదీ నిజమే ననుకోండి. చార్జీజి డబ్బు లోవ్వందే వాడు మాత్రం ఎలా వస్తాడండీ?' అంది కళ్యాణి.
'చూస్తూ చూస్తూ ముక్కూ మొహం తెలియని కుర్రాడికి ముప్పై లు, నలభై లు మనమెక్కడివ్వగలం?' అన్నాడుకాంతారావు.
'మీరు చెప్పింది నిజమే. ఆ సంగతి వాడితోనే చెప్పండి.' అంది కళ్యాణి.
'చూడు బాబూ! నువ్వు మా యింటికి రావటం మాకూ యిష్టమే కానీ, అంత పెద్ద మొత్తం నిన్ను నమ్మి ఎలా యివ్వను చెప్పు?' అన్నాడు కాంతారావు.
"పోనీ , మీ కంత విశ్వాసం లేకపోతె వో పది రూపాయలిప్పించండి బాబూ! మిగతా డబ్బులు నేనే ఎలాగోలా కూడ బెట్టుకుని వస్తాను.' అన్నాడా కుర్రవాడు.
ఈ సూచన భార్యాభర్తలిద్దరికీ కూడా నచ్చటం వల్ల కాంతారావు జేబులో నుండి పది రూపాయల నోటు తీసి కుర్రవాడి చేతిలో పెట్టాడు. 'అడ్రసు మాత్రం జాగ్రత్త సుమా. పారవేసుకునేవ్!' అంటూ హెచ్చరించేడు.
'అలాగే బాబూ! ధర్మాత్ములు మీరు. నేనివ్వాళ లేచిన వేళ మంచిదయింది.' అని ఆ పదిరూపాయల నోటును కళ్ళ కద్దుకుని వెళ్ళిపోయేడు కళ్యాణి అప్పుడే ఆ కుర్రవాడు తమ యింట్లో పనికి కుదిరినట్లు , వాడి సాయంతో వంట పని గంటలో ముగించేసి , తను, భర్తా యిద్దరూ కలిసి వాడు వడ్డిస్తుంటే భోజనం చేసి, భర్త కాలేజీ కి పోయేక పిల్లలను వాడి కప్పగించేసి తాను సోమరిగా కాసేపు పడుకుని కలలు కాని ఆ కలలను కాగితం మీద పెట్టేసి, పత్రికలకు పంపి, తను రచనా చాతుర్యంతో తెలుగు పాఠకలోకాన్నంతటినీ ఆకట్టుకుని ఆనతి కాలంలోనే ప్రఖ్యాత రచయిత్రిగా కీర్తి గడించినట్లు.... ఊహించుకుని తీయని కలల్లో తెలిపోసాగింది.
ఆ కుర్రవాడు వెళ్ళిపోయిన ఐదు నిమిషాలకు వాళ్ళ పక్కనే కూర్చున్న వో బాన బొజ్జ అయ్యం గారు వచ్చీ రాని యింగ్లీషు లో కాంతారావు ని 'అబ్బాయి కి పది రూపాయలు ఎందుకండి మీరిచ్చింది?" అనడిగేడు.
కాంతారావు అంతా వివరంగా చెప్పేసరికి అయన బొజ్జ అటూ యిటూ ఉయ్యాలలా ఊగేట్టూ పెద్ద పెట్టున నవ్వి 'అయ్యో! మీరెంత అమాయకులండీ!' అన్నాడు.
కాంతారావు బిత్తరపోయేడు.
కళ్యాణి గతుక్కుమంది.
