11

సూర్యం పెళ్ళి దగ్గర పడుతోంది. నీ దయ వల్ల అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. ఒక్క రమణ విషయంలోనే నీ పద్దతి నా కర్ధం కాలేదు. అతని కిప్పుడు చదువు కూడా అయిపోడం వల్ల, వేరే వ్యాపకం ఏమీ లేదు. రోజూ నా ప్రాణం తోడేస్తున్నాడు. సూర్యం కూడా యీ విషయం మీద నన్నడిగాడు. ఎప్పటికైనా రమణకు నీ దగ్గర నెలవు కల్పించు. మరీ ఆలస్యమైతే అతను పిచ్చివాడైయిపోయి, ఎవరికి వుపయోగం లేకునా పోవచ్చు--
వుత్తరం మడిచి డ్రాయరు లో దాచేశాను.
* * * *
ఆనాటి నుంచీ రామం ప్రవర్తన లో ఏదో మార్పు వచ్చినట్టనిపించింది. నన్ను చూసి అసహ్యించుకుంటున్నాడేమో ననిపించింది. కానీ నా నీడను చూసి నేనే భయపడుతూన్నానేమోనన్న అనుమానం వచ్చింది. కానీ, అది నీడ కాదు. నా పీడ.
ఒకనాటీ సాయంత్రం రామాన్నీ నా గది లోకి పిలిచి, "నీతో కలిసి పని చేయడానికి మరొక అతను కూడా వస్తున్నాడు. అతను నీ లాగే మొన్ననే పరీక్ష ప్యాసయ్యాడు. మీరిద్దరూ అన్నదమ్ముళ్ళల్లాగ వుండాలి తెలిసిందా" అన్నాను. రామం మృదువుగా తలవూపాడు.
భారంగా మరో రెండు రోజులు గడచాయి. ఆరోజు నిద్ర లేచేసరికి రామం ఒక టెలిగ్రాం పట్టుకుని వచ్చాడు. అది భాస్కరం వద్ద నుంచి.
రమణ, నేనూ వస్తున్నాం.
అని వుంది. నాకు ముచ్చెమటలూ పోశాయి. చెప్పాలి, చెప్పాలి అని ఒక జీవిత కాలం దాచిన విషయం , చెప్పి తీరాల్సిన విషయం -- చెప్పవలసిన సమయం వచ్చి, పీకల మీద కూర్చోబోతోంది. టెలిగ్రాం మీది తేదీ చూశాను. ఇరవయ్యోతారీఖున వస్తున్నట్టుంది. అంటే ఎల్లుండి తెల్లవారుతూనే వస్తారన్న మాట.
నాకు రెండు రోజులే వ్యవధి.
నా ముఖంలో మార్పు రామం గమనిస్తున్నట్టు అనుమానం వచ్చి , తిన్నగా నా గదికి వెళ్ళిపోయాను. పక్క గదిలోంచి రామం మాటలు వినిపిస్తున్నాయి. నేను యాంత్రికంగా గోదావారకు వెళ్ళి, చెవులు రిక్కించుకుని నిలబడ్డాను.
"తెలీదు బాబూ! మద్రాసులో ఎవరో భాస్కరం గారనే అయన అయ్యగారి స్నేహితులు. వాళ్ళ యింటికి వెళ్తారు."
అది మేనేజరు కంఠం.
"మరి యీ రమణ ఎవరు?" అంది రామం గొంతు. పిల్ల జమిందారు,హోదాలో అడుగుతున్నాడు. నేను వూపిరి బిగపట్టాను. ఇక జాగు చేస్తే అదే ప్రశ్న నిలబెట్టి నన్నూ వెయ్యచ్చుననిపించింది. ఆ గదిలోంచి వాళ్ళు మాట్లాడుకుంటున్న గదిలోకి వెళ్ళి అటు నుంచి మేడ మీది నా గదికి వెళ్ళిపోయాను. హృదయంలో ఏదో తీరని ఆరాటం కలిగింది.
బాగా ఆలస్యం అయ్యేలోగా రామానికి అసలు సంగతి చెప్పాలి. చెప్పి తీరాలి. ఇక నాకు కాలం కూడా అట్టే లేదు. పాతిక సంవత్సరాలు ఎదిగిన నా పిరికితనం నన్ను వదిలి పోడానికి నిరాకరిస్తోంది.
"నేనే జకిల్ని నేనే హైడ్ ని'అని చెప్పడానికి జకిల్ ఎంత మానసిక వ్యధకు గురి అయ్యేదో అనిపించింది.
ఆ సంగతి చెప్పలేక జకిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నా గతీ అంతేనా! నిజంగా అంత అదృష్టం నాకు పడ్తుందా!
ఆయాసంతో రొప్పుతూ అటూ యిటూ తిరిగాను. చన్నీళ్ళ స్నానం చేసి, ఐస్ వేసిన పానీయం తాగి, మేడ దిగి , తోటలోకి వచ్చాను. వో మందారపువ్వు కోసుకుని కారెక్కి కళింగం చేరాను. చేతులు వణుకు, గుండె దడ తగ్గలేదు. చేతిలో మందార పువ్వు క్రింద పడింది.
ఎంత మంది బాధలో చూశాను. ఈ నాడు నా బాధకి నేను సిద్దపడాల్సిన హేతువు వచ్చింది. మందార పువ్వు నాకేసి చూసి నవ్వింది. నవ్వినది మందారపువ్వు కాదు. సింహాచలం. నా పిరికితనానికి నవ్వింది. క్రింద పడ్డ మందార పువ్వు తీసి చేత్తో పట్టుకున్నాను. కళ్ళ వెంట నీరు చిల్లు పడ్డట్లు కారింది.
చైలేను. నే చై లేనే లేను. నాకా ధైర్యం లేదు. పాతిక సంవత్సరాల క్రితం పాతి పెట్టిన యీ రహస్యాన్ని తీయడానికి నా శక్తి చాలదు. నా అంత ఎదిగిన కొడుకుతో నా నైతిక పతనాన్ని గురించి, నా పాపానికి ఫలితంగా యీ లోకంలో జన్మించిన ఒక అమాయకుడి కధనూ చెప్పగలనా లేను..... కానీ చెప్పి తీరాలె!!
ఆత్మహత్య చేసుకుంటేనో!
సింహాచలం చేసుకుంది. వస్తానన్న నేను రాకపోయేసరికి తన జీవితాన్నే అంతం చేసుకుంది. అది కూడా ఒక పవిత్రమైన దినం.... నాగులచవితి నాడు నాగేంద్రుని చేత--
నా శరీరం మీద పాము పాకినట్టయ్యింది.
నాగులచవితి!
ఎల్లుండి-- రమణా భాస్కరం వచ్చేరోజు.
సింహాచలం ఆత్మహత్య చేసుకున్న రోజు.
వాళ్ళు వచ్చే ముందు, నేనూ ఆత్మహత్య చేసుకుంటే? అవును నేను చనిపోతే వాళ్ళిద్దరినీ భాస్కరం సమాధాన పరచ గలడు. నా సమాధి మీద వాళ్ళిద్దరి చేత కనీసం చెరో మందార పువ్వు వేయించగలడు.
నిజంగా నేను చనిపోతే!
నా శవం మీద అంతా పడి ఏడుస్తున్నారు. భాస్కరం సుమతి, రమణ, మోహన్, ప్రేమ, ప్రేమ కూతుళ్ళు అంతా ఏడుస్తున్నారు- ఒక్క రామం మాత్రం లేడు. దూరంగా నిలబడి వున్న రామం దగ్గరకు వెళ్ళి, "రామం మీ నాన్నగారు చనిపోయారు" అన్నాడు భాస్కరం. రామం భాస్కరాన్ని విదిలించి పారేసి , "హు - నాన్నట నాన్న. సిగ్గు లేదు.... పైగా ఏవతో ఓ పనిమనిషి కి పుట్టిన వాడా నా కన్న! ఛీ- చీచ్చీ" అంటున్నాడు.
కళ్ళు నులుపుకుని చీకటి లో దారి చూసుకుంటూ కారు దగ్గరకు వచ్చి తలుపు తీశాను. కాళ్ళ క్రింద నుంచి జరజర మని ఏదో పాకింది. ఏదో కాదు పాము. సింహాచలాన్ని చనిపోయేలా చేసినందుకూ పాము వంశం నా మీద కసి పట్టిందేమోననిపించింది. భయంతో ముచ్చేమటలూ పోశాయి. ఎగిరి కార్లో దుమికి, యిల్లు చేరాను.
భోజనం చై కుండా గ్లాసుడు పాలు తప్పని సరైనందు వల్ల తాగి, పక్క మీద చేరాను.
ఆ రాత్రి నా పాలిట కాళరాత్రి.
-రమణ ఎవడు? ఛీ , వో పనిమనిషికి పుట్టిన ఒక అనామకుడిని నేను అన్నయ్యా అని పిలవలెను. ఇంతవరకూ చదివించిన చదువు చాలు. ఆ రహస్యమేదో మీలోనే వుంచుకోండి. నన్నవమానం పాలు చెయ్యకండి. కావలిస్తే వస్తే వాడికో పదివేలో పదిహేను వేలో పారెయ్యండి. నా కభ్యంతరం లేదు." అంటున్నాడు రామం. నాకు కోపం వచ్చింది. కొడుకు తండ్రిని ఎదిరించడమా 'నోర్మూయ్" అనరిచాను.
నిద్ర మెలకువ వచ్చింది. గాభరా పడ్డాను. కలా! ! కల.... అవును. నిజం అవబోతున్న కల. గొంతు తడారిపోయింది. లేచి, లైటు వెలిగించి, మంచినీళ్ళు తాగాను. గది దాటి బయటికి వచ్చాను. మేఘాలు నల్లగా మృత్యువు లా వున్నాయి. దీపావళి ముసుర్లు భయంకర గర్జనలు నా పిరికి తనాన్ని మరింత రెచ్చకొడుతున్నాయి.... లోపల కొచ్చి, తలుపు వేసి ఇనప్పెట్టి తీసి అందులోంచి రూపాయి నోటు తీశాను. అది 'ఆనాడు" సింహాచలం యిచ్చింది. జార్జి రాజుగారి బొమ్మ వుండాల్సిన చోటులో సింహాచలం కనుపించింది. తడిమి చూశాను. తిరిగి జార్జి రాజు గారే వున్నారు.
నోటును భద్రం చేసి పక్క మీద పడుకున్నాను. తెల్లవారుతూనే రామానికి చెప్పేసి తీరాలని నిర్ణయించుకున్నాను.
బయట వురుములు వాన రూపం దాల్చాయి.
* * * *
తెల్లవారుతూనే వాతావరణం ప్రశాంతంగా వుంది. రాత్రి గాలికి రాలిన ముద్ద మందార పువ్వులన్నీ రాములు, సింహాచలం నా బల్ల మీద శుభ్రంగా పెట్టారు. కాఫీలయ్యాక మేనేజరు చేత రామాన్ని రమ్మని కబురు పెట్టాను. రామం వచ్చాడు.
"ఎడ్రసు చెప్తాను. వెంటనే రావలెను అని టెలిగ్రాం యివ్వు" అంటూ భాస్కరం ఎడ్రసు యిచ్చి, "నీతో ఓ విషయం చెప్పాలి. కూర్చో" అన్నాను. రామం భయం భయంగా కూర్చున్నాడు. నేను గొంతు సవరించుకుని ప్రారంభించాను.
"రమణ ఎవరో నీకు తెలుసుకోవాలని ఉంది కదూ' అన్నాను. రామం చిన్నగా తలవూపి "వూ" అన్నాడు.
"ఆ కోర్కె వుండడం లో తప్పేమీ లేదు కానీ, మేనేజర్ని పనివాళ్ళ నూ అడిగి కుటుంబానికి సంబంధించిన విషయాలు ఆరాలు తీయడం మంచి పని కాదు. విషయం నీకు సంబంధించినదయితే నేనే చెప్తాను. నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చెంత సాహసం నీకు పనికి రాదు. అంత ధైర్యం వుంటే అడిగేదేదో నన్నే అడగాలి. రాత్రి భోజనాలయ్యాక, పదింటికి మేడ మీదికిరా. జీవితంలో నువ్వూహించలేనిదీ, ఊహించనివీ వింత విషయాలు చెప్తాను. ఆ టెలిగ్రాం యివ్వడం మర్చిపోక, పెద్ద కారు యీ రాత్రి బెజవాడ పంపు రేపు భాస్కరం అనే అయన, రమణ అనేఅతనూ వస్తున్నారు అన్నట్టు టెలిగ్రాం లో మన కారు నెంబరివ్వు. ఇహ నువ్వేళ్ళచ్చు" అన్నాను. రామం తలవంచుకుని వెళ్ళిపోయాడు.
