రామం వెళ్ళాక, తిన్నగా అట్టే రూముకి వెళ్ళాను. గదిలో గోడ మీద సింహాచలం పటం వ్రేల్లాడుతోంది.
ఆల్బం వొళ్ళో పెట్టుకుని, కుర్చీలో కూలబడ్డాను. రాధ ఫోటో వున్న పేజీ తీశాను.
రాధ నాకేసి జాలిగా చూసింది.
'రాధా! మన రామాన్ని డాక్టరు చదివించాను. వాడు కోరుకున్న పిల్లనే పెళ్ళి చేయడానికి నిశ్చయించాను. నువ్వు నన్ను క్షమించలేక పోయావు. వాడు ముమ్మూర్తులా నీ కొడుకు. ఈనాడు నా చరిత్రని విని వాడు క్షమిస్తాడా అనే భయం నన్ను వేధిస్తోంది. వాడు నన్ను క్షమించేలా దీవించు రాధా" అని గొణుక్కున్నాను. నా కంటి నీరు రాలి, రాధ కళ్ళ మీద పడింది. తుడిచేశాను.
మరో పేజీ తిప్పాను.
సుశీల!!
పాపం! నా పాపానికి ఎర అయిన అమాయక ప్రాణి. నా పాపాన్ని నిండు మనస్సు తో క్షమించిన పవిత్రమూర్తి.
నా ప్రాణం వుస్సురుమంది.
ఆల్బం మూసేసి, పటం దగ్గరకు వెళ్ళిచేతులు కట్టుకుని నిలబడ్డాను. సింహాచలాన్ని ఒక వరం కోరాలి.
"సింహాచలం ! నీకు చేసిన బాస ప్రకారం మన రమణను డాక్టరు చదివించాను. నేను రావడం ఆలస్యం అయ్యిందని నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు. నన్ను శపించకు. సింహాచలం , నేను పాపినే. అయినా యింత శాపానికి తట్టుకోలేను. తెల్లారితే రమణ వస్తాడు. లోకానికి రమణ నా కొడుకని చాటుతాను. నా పెద్ద కొడుకని చాటుతాను." అని గొణిగాను.
బల్ల మీద నిలబడి, బొమ్మకి పట్టిన దుమ్ము దులిపాను. పాత దండ తీసి పారేసి, కొత్త దండ కుట్టించి వేశాను. సింహాచలం నన్ను క్షమించినట్టనిపించింది. అలానే కుర్చీలో భవిష్యత్తు ఆలోచిస్తూ కూర్చున్నాను.
రామం, రమణా 'రామలక్ష్మణుల్లాగ అన్యోన్యంగా వుంటే యిక నేను జీవితంలో పొందాల్సిన ఆనందం ఏమీ లేదు. నిశ్చింతగా కన్ను మూయచ్చు. అలా కాకపొతే.... ఆలోచిస్తే భయం వేసింది. కుర్చీలోంచి లేచి సింహాచలం పటం ముందు నిలబడ్డాను.
"నీ హృదయవేదన శాపంగా మారి
నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఇది నిజం... ఇక నీ శాపాన్నీ నేను భరించలేను. భరించలేను. సింహాచలం...."
హృదయవేదన దుఃఖంగా రూపొందింది. వెక్కి వెక్కి ఏడ్చాను.
చాలాకాలం తరువాత వేంకటేశ్వరుని పటం ముందు నిలబడి, చేతులు జోడించాను.
"--ఆపద మొక్కులవాడన్నారు నిన్ను. నన్నే ఆపద నుంచి కాపాడావో నీకే తెలియాలి." నేను నిన్ను అడగని వరం లేదు. నువ్వు నాకిచ్చిన వరమూ లేదు. నా మీద యింత కసి పూనడానికి నేనేం నేరం చేశాను? ఇకనైనా నన్ను కరుణించు తండ్రీ" అంటూ ఏడ్చాను. కంఠమంతా వెలుగు రాసుకు పోయింది.
పక్క మీద పడి నిద్ర పోయాను.
తెలివి వచ్చేసరికి అరయ్యింది. ఆదరా బదరా స్నానం చేసి చెరువు వొడ్డుకు చేరుకున్నాను. నాలో నవచైతన్యం వచ్చింది. రామంలో రాత్రికి ఎలాగ చెప్పాలో నిర్ణయించుకున్నాను. ఓ గంట సేపు అక్కడ గడిపి, యింటికి వచ్చేశాను. ఆకలి వేయనందు వల్ల పాలూ, రొట్టె రూముకే తెప్పించుకుని తిని, మనస్సు పటిష్టంగానూ, నిర్మలంగా నూ వుంచడానికి భగవద్గీత చదువుతూ కూర్చున్నాను.
ఎనిమిది, తొమ్మిది, పది గడియారం వరసగా గంటలు కొట్టింది. లేచి నిలబడ్డాను. వాన ఎప్పుడు ప్రారంభమయ్యిందో చాలా ఎక్కువగా వుంది. వాచీ చూశాను. పది పావయ్యింది. రామం యింకా రాలేదేమిటని నౌకర్ని పిలిచి అడిగాను.
"లేదు బాబూ" అన్నాడు వాడు.
"అంటే" అన్నాను.
రామయ్య నసిగాడు, "మరేంటేనం- మీరు నిద్రపోతున్నప్పుడు అబ్బాయి గారు కారేసుకుని వెళ్ళారు బాబూ. ఇంకా రాలేదు. బెజవాడ గాని వెళ్ళారేమో " అన్నాడు.
బెజవాడ లో ప్రేమ అత్తగారు న్నారు, రామం ప్రేమించినమ్మాయి బెజవాడ వస్తే చూడటానికి వేళ్ళాడేమో! ఛీ-- ఈ రాత్రి చెప్దామనుకుంటే వాడేమై పోయాడు? తెల్లవారి అటు భాస్కరం, రమణా వచ్చేస్తారు.ఈలోగా చెప్పాలనుకున్నది యిలా అయ్యిందేమిటి అని. ఆలోచిస్తూ కుర్చీలో కూర్చున్నాను.
వాళ్ళేదురుగా చెప్తే రామం ఎదురు తిరిగితే నానా రభస అయితే!!
వీల్లేదు . మెడ బుచ్చుకుని గెంటుతాను. ఆస్థిపాస్తులు కోర్టు ద్వారా చూసుకుంటాడు.
బయట గాలివాన ఎక్కువయ్యింది.
లోపలకు వచ్చి, పక్క మీద చేరాను.
తెల్లావారుజామున అయిందింటికి మెలకువ వచ్చింది. గమ్మున లేచి ముఖం కడుక్కుని స్థానం చేసి పూజ మందిరంలోకి వెళ్లాను. చేతులు జోడించి వెంటక రమణు ని పటం ముందు నిలబడ్డాను.
కోర్కె కోరుకోడానికి సిగ్గు వేసింది.
దొంగ తన దొంగతనం పట్టుబడకుండా వుండాలని కోరుకుంటాడు. హంతకుడు తన హత్యాకాండ బయల్పడకూడదని ప్రార్ధిస్తాడు. ఇవన్నీ దేముడేందుకు తీర్చాలి?
అవును ఎందుకు తీర్చాలి?
నాకు సమాధానం తోచలేదు.
"భగవంతుడా జరిగినదంతా నీకూ తెలుసు. నాకు తెలుసు. జరగబోయేది నీ ఒక్కడికే తెలుసు ఈపాటికే న్యాయ నిర్ణయం అయిపోయుంటుంది. నీ యిష్టం వచ్చినట్టూ యీ నాటకాన్ని ముగించు. నేను కేవలం నీచేతిలో కీలుబోమ్మని. నేనే కాదు. ఈ ప్రాణి కోటి అంతా అంతే ....అవును అంతే" అన్నాను.
నా ముక్కలు దేముడికి సవాలు లా ఉన్నట్టు అనుపించింది. అయినా పాపం చేసి, దేముడి ఎదుట నిలచి, నేనే పాపం చేయలేదు అనే సాహసం నాలో లేకపోయింది.
అగరువత్తులు వెలిగించి, వెండి ఏనుగు తొండంలో గుచ్చాను. మరోసారి నమస్కరించి, బట్టలు మార్చుకుని గబగబ మూడో అంతసు ఎక్కాను. బెజవాడ నుంచి వచ్చే కారు రోడ్డు మార్గం వంకర టింకరలు గా కనుపిస్తోంది. వో పావుగంటయ్యేసరికి దూరాన్న కారు కనుపించింది. అవి రమణ, భాస్కరాలను తీసుకు వస్తున్నా కారు, నా గుండె వేగంగా కొట్టుకుంది.
ముందు రమణా భాస్కరం వస్తే!!
రమణతో నా జీవితం, అతని జీవిత రహస్యం చెప్పేసి, "నువ్వు నా కొడుకువి." అని చెప్పేస్తే!! ఆ తరువాత రామానికి కూడా చెప్పవచ్చు.
అవును అప్పుడు రామం వినక తప్పదు. విని తీరాలి. ఈ వూహ బాగుందని పించింది. నా ఆలోచనలకూ క్రింద నుంచి వో కేక అంతరాయం కలిగించింది.
"బాబూ' అన్న ఆర్తనాదం భయంకరంగా వినిపించింది. అది రామయ్య గొంతు.
నా శరీరం కంపించి పోయింది. అదే కేక మళ్ళీ మరింత భయంకరంగా వినిపించింది. రామయ్య అలాటి ఆర్తనాదం ఎందుకు చేశాడో అర్ధం కాలేదు. గమ్మున మెట్ల మీదుగా పరిగెట్టబోయి , కాలు మెలిక పడి కూర్చోబడి పోయి, లేచి క్రిందకు పరిగెత్తాను. కింద ఎవ్వరూ లేరు. బయట ఏదో గోల వినిపిస్తోంది. హాలు దాటి బయటకు వచ్చాను.
నా కాళ్ళు స్తంభించిపోయాయి.
"పొద్దునే పొలానికి వెళ్ళాం బాబూ! మీ కారక్కడ కనబడింది. తీరా చూస్తె సినబాబుగారు ఆ పక్కన పడి వున్నారు. మేం దగ్గిర వెళ్ళి చూశాం. రాత్రి కురిసిన వానలో బట్టలు తడిసున్నాయి.....
...రాత్రి పాము కాటేసుంటుంది బాబూ! ప్రాణం రాత్రి పోయినట్టు కనిపిస్తుంది....
నా హృదయం చిన్నా బిన్నమయి పోయింది.
బయట కారాగింది. భాస్కరం, రమణ దిగి, పరుగున వచ్చారు. నా కళ్ళు వాళ్ళ వైపు తిరిగాయి. "ఏవయ్యింది? ఏవిటిది?" అనరిచాడు భాస్కరం నా భుజం కుదుపుతూ.
నా కళ్ళు రామం మీంచి , రమణ మీదకు మళ్ళాయి.
రమణ-- నా పాపానికి ప్రతిఫలం.... నాకు దక్కిన కొడుకు......
రమణని ఆపాద మస్తకం చూసిన నా కళ్ళు అతని పాదాల వద్ద ఆగిపోయాయి.
నా చూపు స్తంభించింది.
రమణ ఎడమకాలి బూటు క్రింద..... మందార....ముద్దమందార పువు నలిగి, గిల గిల్లాడుతోంది.
రాత్రి వానకు రాలిన పువ్వది.
రమణ కాలి క్రింద నలిగినది ముద్ద మందార పువ్వు కాదు.
నా పాపం.
నలిగి పోయింది.
నాశనమయి పోయింది.
నా పాపం తీరిపోయింది.
కళ్ళలో నీరేనాడో కరువయ్యింది.
"ఏం జరిగింది" అంటూ భాస్కరం నన్ను కదుపుతూ అడిగాడు. నా దృష్టిని మరల్చలేక పోయాడు.
అతనికి చెప్పవలసిన పనే లేదు.
(అయిపోయింది)
