Previous Page Next Page 
ముద్ద మందార పేజి 20

 

    భాస్కరం ఆశ్చర్యం ఆణచుకుని, గంబీరుడయ్యాడు. నా భుజం తడుతూ "ఛీ....ఏడవకలా. ధైర్యంగా వుండు. ఈ కర్తవ్యమ్ నేను తీసుకుంటాను. ఈ రహస్యం నీకూ నాకూ తప్ప, చివరికి సుమతికి కూడా తెలీదు. తెలీయనీయను" అన్నాడు.
    నా గుండె మీంచి బరువు దింపినట్టయ్యింది. నిబ్బరంగా గాలి పీల్చాను.

                                                    *    *    *    *
    గతం అంతా చర్వణం అయింది. ఇక మిగిలింది భవిష్యత్తు.
    రామం డాక్టరయ్యాడు. రమణా డాక్టరయ్యాడు. నా కర్తవ్యంలో  చాలా భాగం నెరవేరింది. ఇక.... నేను బయట పెట్టాల్సిన రహస్యం.......
    
                                                     *    *    *    *

    ఆరోజు పోస్ట్ లో మళ్ళీ రెండుత్తరాలయ్యాయి. భాస్కరం వుత్తరం పక్కకు పెట్టి, రామం ఉత్తరం చదివాను. పరీక్షలు బాగా రాసినట్టూ, రేపు బయల్దేరి వస్తున్నట్టూ రాశాడు. భాస్కరం ఉత్తరం విప్పుతుంటే చేతులు వణికాయి.
    సూర్యానికి వివాహం వేసంగు లలో స్థిర పరచినట్టు రాశాడు. తరవాత రమణ విషయం రాశాడు.
    రమణ బాధ చూసి జాలి వేస్తోంది. పిచ్చి పట్టిన వాడిలా తయారయ్యాడు. అవతల నువ్వు బాధపడ్తున్నావు. ఇంకెందుకీ నాన్చుడు. ఆలస్యమయిన కొద్దీ కీడే గాని మేలు జరగదు. ఏనాటి కైనా యీ నాటకానికి నాంది పాడాలి కదా" అని రాశాడు.
    అవును పాడాలి.
    ఎలా పాడాలో ఎప్పుడు పాడాలో మాత్రం నిర్ణయం కాలేదు. వుత్తరం మరోసారి చదువుకున్నాడు.
    
                           *    *    *    *
    వస్తాడనుకున్న రామం రానే వచ్చాడు.
    నూజివీడు లోనే రమణ చేత, రామం చేతా ఒక హాస్పిటల్ పెట్టించాలి. వాళ్ళిద్దరూ రామలక్ష్మణుల్లాగసఖ్యత గా వుండాలి. ఆడవాళ్ళ వార్డుకి సింహాచలం పేరు పెట్టాలి.
    ఇవి తీరని కోర్కెలేమో!!
    "పరీక్షలు బాగా రాశావా! బాగా చిక్కిపోయావేమిటి? డాక్టరు చదివినవడివి నువ్వే చిక్కిపోతే ఎలా? ఇతరుల ఆరోగ్యాలు చూసే డాక్టర్లు ఆరోగ్యంగా వుండద్దా" అన్నాను.
    రామం హుందాగా నవ్వాడు.
    రామం నవ్వుతో రాధ కనుపించింది. రామం ముమ్మూర్తులా రాధ పోలికే.....
    రమణ? ముమ్మూర్తులా నా పోలికే ... కళ్ళు మాత్రం సింహాచలానివి. ఎంతటి వాళ్ళయినా ఆకట్టుకునే ఆ కళ్ళు. రామం నా కొడుకే అయినా, మా యిద్దరి లోనూ కలవలేని అఘాతం వుంది. పరాయి చోట పెరగడం వల్లనేనంటే చనువు కన్నా భయమే ఎక్కువ.
    నాకు ఒక విధంగా అదే మంచిదనిపించింది. రామం నాకు సన్నిహితుడయితే .....తెలియకూడనివి తనంతట తనే తెలుసుకుంటే ....జరగకూడనివి జరిగినా జరగోచ్చు.
    నా పిరికితనం నాతొ పాటు ముదిరింది.
    పిరికివాడు వెయ్యి సార్లు చస్తాడు. అయినా చావడు. చస్తూనే వుంటాడు అని సామెత వుంది. కొన్ని కొన్ని సామెతలు కొందర్ని చూసి పుట్టిస్తారు. కొన్ని సామెతలు కొందరి కోసం పుడ్తాయి.
    
                           *    *    *    *
    రోజులు ఎవరి కోసమూ ఆగవు. కొన్ని రోజులు దొర్లాయి.
    రాధ కల్లోకి వచ్చి రామం బాగును గురించి అడిగినట్టు కల వచ్చింది. తెల్లవారుతూనే రామాన్ని పిలిచి, "నీతో ఒక విషయం మాట్లాడాలి. కూర్చో' అన్నాను. రామం సందేహిస్తూ కూర్చున్నాడు.
    "నువ్వు డాక్టరువయితే నీ చేత యీ ఊళ్ళో ఒక హాస్పిటల్ పెట్టించాలనుకున్నాను. ఈనాడు నువ్వు డాక్టరయ్యావు. ఈ వూళ్ళో హాస్పిటల్ పెట్టడం నీకు సమ్మతమైతే స్థలం ఎంచుకో అది కొని, అక్కడ కట్టిద్దాం. ఇష్టం లేకపోతె నీ అభిప్రాయం చెప్పు" అన్నాను. రామం నే చెప్పిందంతా విని, తలూపుతూ, "నాకేమీ అభ్యంతరం లేదండి" అన్నాడు. నా మనస్సు కుదుట పడింది. మళ్ళీ ప్రారంభించాను.
    "ఇక రెండో విషయం -- అది నీ పెళ్ళి గురించి.నీకు పెళ్ళి చెయ్యాల్సిన బాధ్యత వొకటి వుంది. ఎప్పుడు చేసుకుంటావో చెప్పాలి. ఒకటి రెండు రోజుల్లో నీ అభిప్రాయాన్ని చెప్పచ్చు. అంతే." అన్నాను కుర్చీలో వెనక్కు వాలుతూ . నేనా సంగతి మాట్లాడినప్పుడు రామం ఎందుకో ఖంగారు పడ్డాడు.
    'అలాగేనండి" అనేసి వెళ్ళిపోయాడు.  
    సిగరెట్టు ముట్టించాను. రామం కూడా ఒకవేళ సూర్యం లా ఎవరినైనా ప్రేమిస్తే! ఏమో ప్రేమించినా ప్రేమించి వుండచ్చు. రామం కనుక ఎవరినైనా ప్రేమిస్తే ఏమీ ఆలోచించకుండా నా అంగీకారాన్ని తెలియజేస్తాను. ఒకవేళ రామం నాలాగ తన ప్రేమ సంగతి నాకు తెలియజేయలేకపోతె!!
    నేనే రేపు అతన్ని పిలిచి అడుగుతాను, అనుకున్నాను. రామాన్ని నా జీవిత పంధా లో నడవ నీయకూడదు అని తీర్మానించుకున్నాను.
    ఆలోచిస్తూ పడుకునే సరికి కునుకు పట్టింది. లేచేసరికి టైము నాలుగయ్యింది. స్నానం చేసి, బట్టలు మార్చుకొని నా గదిలోకి వచ్చాను. టేబులు మీద ఏదో ఉత్తరం కనబడింది. తీసి చూశాను. అది రామం రాసినది.
    రామం నాకుత్తరం రాయడమేమిటి? విప్పి చదివాను.
    తనోకమ్మాయిని ప్రేమించినట్టు, రాశాడు. ఆ పిల్లని తప్ప ఎవర్నీ చేసుకోనని రాశాడు. నాకు నవ్వొచ్చింది. వెంటనే రామాన్ని పిలిపించాము. ఒదిగి ఒదిగి భయంతో రామం వచ్చాడు. కూర్చోమన్నాక కూర్చున్నాడు. నా చేతిలో వుత్తరం అతని చేతిలో పెట్టి, "నువ్వు చేసిన పని చాలా మంచిదే. నీ పెళ్ళి బాధ్యత నాకు తప్పించావు. కానీ దేనికైనా ధైర్యంగా వుండడం నేర్చుకోవాలి. చీటీ మీద రాయడం, ఫోనులో చెప్పడం, ఎవరితోనో చెప్పించడం వంటివి చేయకూడదు" అన్నాను. గంబీరంగా.
    రామం సిగ్గుపడ్డాడు.
    "ఎవరా అమ్మాయి? ఏం చదువుకుంది? వాళ్ళ వాళ్ళు ఎవరు? వాళ్ళ నాన్నగారి కేం పని? అన్నాను. రామం నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు.
    "ప్రొఫెసర్ మోహన్ కూతురా. వాళ్ళావిడ పేరు ప్రేమ కదూ. నాకు స్నేహితులే  వాళ్ళు. వెరీగుడ్. అయితే నేను వెళ్ళి నీ పెళ్ళి విషయం ఖాయం చేస్తాను. ఎన్నో అమ్మాయినీ నువ్వు ప్రేమించింది? సరేలే. ఇహ నువ్వు ఆసుపత్రి విషయం చూసుకో" అన్నాను. రామం పరమానందం పొంది కృతజ్ఞతాపూర్వకంగా నాకేసి చూసి వెళ్ళిపోయాడు.
    ఆసుపత్రి పని పూర్తయ్యేసరికి మూడు నెలలయ్యింది. కానీ రామం ఒక్కడి చేతా అందులో ప్రాక్టీసు పెట్టించడం నా కిష్టం లేదు. రమణ , రామం కలవాలి. అది ముందు జరగాలి.
    రామం పెళ్ళి విషయం ముందు చూసి, స్థిర పరచాలని పించింది. రామంతో ఆ సంగతి చెప్పి, వైజాగ్ వెళ్ళాను. మోహన్ , ప్రేమ నన్ను చూసి పరమానంద పడ్డారు. "దైవ నిర్ణయం చూడండి. మనకి చుట్టరికం కూడా కలవబోతోంది." అంటూ అసలు సంగతి చెప్పాను. దంపతులు బ్రహ్మానంద పడ్డారు.
    తను నలుగురు కూతుళ్ళనూ పరిచయం చేశారు. మొదటి యిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయట. రామం ప్రేమించినమ్మాయి మూడో అమ్మాయి. పేరు విజయ. రామం ఎన్నిక మంచిదే అనిపించింది.
    ఆ రాత్రంతా చిన్ననాటి ముచ్చటలతో కాలక్షేపం చేశాము. తెల్లారు ఝామున మూడింటికి కాస్త నిద్రపట్టింది. కాస్సేపటికి మెలకువ వచ్చింది.
    గోపాల్ పూర్ లో నేను ప్రేమను చూసినపుడు ఆమె నవ యౌవ్వని. ఇప్పుడు నవ యౌవ్వనవతులైన నలుగురు కూతుళ్ళకు తల్లి. రామం మోహన్, ప్రేమలను గురించి చెప్పగానే నా మనో ఫలకం మీద 'ఆనాటి ప్రేమా మోహనులే నిలిచారు. అదే వయస్సుతో. కానీ యీ వేళ నేను చూసినది కేవలం దానికి వ్యతిరేకం యౌవ్వనాన్ని కాలానికి బలిగా యిచ్చి, జీవితాశయాలను పిల్లల రూపేణా పెంచుకున్న వయస్సు.....
    సింహాచలాన్నీ, రాదనీ కూడా ముసలి రూపం లో ఊహించుకోబోయాను. కానీ కుదరలేదు.
    ఆలోచనలతో తెల్లవారింది. ఆరోజు వెళ్తానంటే మోహన్ వెళ్ళనివ్వలేదు. వాళ్ళ ఆఖరి కూతురు ఉషని చూసేసరికి నాలో ఒక వూహ తట్టింది. ఉషని రమణ కిచ్చి వివాహం చేస్తేనో-- బ్రహ్మాందంగా వుంటుందనిపించింది.
    "మరి ఒక సంగతి చెప్పాలి. ఒక చాకులాటి కుర్రాడున్నాడు. ఆస్తిలో ఏమీ తీసిపోదు. డాక్టరు చదివాడు. తల్లీ తండ్రి లేరు. నేనే తండ్రిని. అతనికి మన ఉషానిచ్చి చేయడానికి మీకేమైనా అభ్యంతరం వుంటుందా" అన్నాను.
    "ఏమీ లేదు. పైగా నిరభ్యంతరం కూడాను. అడక్కుండా ఆడపిల్లలకు సంబంధాలు తెస్తుంటే యీ రోజుల్లో అభ్యంతరం పెట్టేవాడేవరు" అన్నాడు మోహన్.
    విజయ ఫోటో ఒకటి, ఉష ఫోటో ఒకటి తీసుకుని నూజివీడు చేరుకునేసరికి కొంపలంటుకున్నాయి.
    నేను లేని సమయంలో భాస్కరం నాకు రాసిన ఉత్తరం రామం విప్పి చదివాడు. విప్పానని చెప్పాడు. చదివి వుంటాడని నమ్మాను. "ఏదైనా అర్జంటు వుత్తరామేమోనని విప్పాను" అన్నాడు వినమ్రుడై .
    'సరే నువ్వెళ్ళు" అని, రామం వెళ్ళి పోయాక ఉత్తరం చదవ నారంభించాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS