"అదేమిటి, నాన్నా ఒకరోజు మన కళ్ళముందు ఆయన ఒక ప్రాణిని రక్షించారు. ఆయన చెప్పే కారణాలు నిజమైనవయితే ఆ రోజు ఆ అమ్మాయిని ఎలా రక్షించారు?"
"అది కేవలం అనుకోకుండా జరిగిఉండవచ్చు. కాని అనూ, అతనిమీద ఎందుకీ ప్రత్యేక శ్రద్ద? అతనికి, నీకు సంబంధం ఏమిటి స్నేహం తప్ప?"
"ఆ స్నేహమే బంధుత్వంగా మార్చదలుచుకున్నాం మీ అనుమతితో" అంది మెల్లిగా అధోవదనురాలై.
అది అంతగా ఆశ్చర్యపరిచేటంతటి కొత్త వార్తగా గోచరించకపోయినా, ఈ నిర్ణయం ఎప్పుడు జరిగిందా? అని కొంచెం ఆశ్చర్యం పొడచూపింది. కొద్ది క్షణాలు ఆయన మాట్లాడలేదు.
"ఎప్పుడు జరిగిందీ నిర్ణయం?"
"ఇవాళే."
"అనూ, ఈ సమయంలో ఒక్క విషయం చెప్పక తప్పదు. శ్రీనివాస్ ను పెళ్ళిచేసుకోవాలనుకుంటే అది నీ స్వంతవిషయం. అందుకు మా కెటువంటి అభ్యంతరమూ ఉండదు. కాని ఈ పెళ్ళికి, అతను మెడిసిన్ లోకి వెళ్ళడానికి సంబంధంమాత్రం ఉండనియ్యకు."
"నాన్నా..."
"ఉండు నన్ను పూర్తిగా చెప్పనియ్యి. శ్రీనివాస్ అన్నివిధాలాయోగ్యుడు. బుద్దిమంతుడు, ఆస్తిపరుడు. ఉన్నత భావాలు కలవాడు. అంతకంటే అధికున్ని నేను తేగలనని చెప్పను. కాని, అతనిలో ఏమూలో మరుగుపడిపోయినదాన్ని పైకితీయాలన్న కాంక్షతోమాత్రం పెళ్ళి చేసుకోవద్దు. అతని లోపాలను లోపాలుగా చూడగలిగితేనే, మంచిని, చెడును ఉన్నది ఉన్నట్లు స్వీకరించగలిగితేనే ఈ వివాహం చేసుకో! నిశ్చయించుకో! ఎప్పుడో, ఏదో ప్రయోజనాన్ని స్వీకరించడానికి మాత్రం వద్దు. అది నెరవేరనినాడు మిగిలేది నిరుత్సాహమే. దానితో గతిలేక సర్దుకునే టట్లున్న జీవితాన్ని మాత్రం నేనెన్నడూ నీకు కలిగించడానికి ఇష్టపడను."
"మీరు ఇంతగా చెబుతున్నందుకు సంతోషంగా ఉంది. కాని అతను చేసుకునే నిర్ణయాలకు నేను ఏ విధంగానూ బాధ్యురాలిని అవాలనుకోవడంలేదు. ఇది సమయం, ఈ విషయాలకు ప్రోత్సాహం ఇవ్వడానికి. నిజానికి ఆయనతో పరిచయంనాటికి, మాలో ఈ ఉద్దేశాలు కలిగేనాటికి ఈ విషయాలు తెలియను కూడా తెలియవు. అయినా నేను ఆయన్ని ప్రోత్సహించడానికి కారణం ఒక విధంగా కృష్ణమూర్తిగారు. ఆయన శ్రీనివాస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అతను సరాసరి ప్రాక్టీస్ పెట్టడంకంటే ఇంకో సంవత్సరం హౌస్ సర్జను పని చెయ్యమని, మంచిదని సలహా ఇచ్చింది కృష్ణమూర్తిగారే. అందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆయనతోపాటు మరో వ్యక్తి ప్రోత్సాహం ఉండటం కోసమే నా ప్రయత్నం."
ఈ విషయం విన్నదే అవడంవల్ల పెద్ద ఆశ్చర్యం కలగలేదు. "శ్రీనివాస్ ఈ ఇంటి అల్లుడుగా రావడంకంటే సంతోషించతగ్గది మరొకటి లేదు. కాని నేను చెప్పిన విషయాలు మరిచిపోకు. ఈ విషయం అమ్మతో చెప్పాలి? అంటూ లేచారు. పరిగెడుతున్న భావాలు కట్టిపడేస్తూ చదువులో నిమగ్నమవ్వాలన్న ప్రయత్నంలో పడింది.
* * *
ఆ రాత్రికి రాత్రే కలుసుకో నిశ్చయించుకున్నారు కృష్ణమూర్తిగారిని. 'ఏమిటి ఇతను చేస్తున్న పని? ఒక డాక్టరుగా, పురుషుడుగా చేస్తున్న పని మంచిదో కాదో తెలుసుకునేటంత విచక్షణ నశించిందా కృష్ణమూర్తిలో? వెళ్ళి కనుక్కోవాలి. తప్పటడుగు వేస్తున్న శ్రీనివాస్, అనూరాధలను వెనక్కి పిలిచి బుద్ధి చెప్పవలసినదిపోయి, ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో?'
అడగదలుచుకున్నవన్నీ అడిగేశారు, ఎటువంటి దాపరికమూ లేకుండా. వారిద్దరి మధ్య నిలిచిన స్నేహానికి ఆమాత్రం చనువు ఉంది.
"నువ్వింతగా శ్రీనివాస్ ను ఎందుకు ప్రోత్సహిస్తున్నావో అర్ధం కాలేదు. నీతో సమంగా అనూరాధ భాగం స్వీకరిస్తూంది. మీరిద్దరూ కలిసి ఒక వ్యక్తిని, అతనికి ఇష్టంలేని పని చేయిస్తున్నారు. ఇప్పటికే దెబ్బలుతిన్న సున్నిత హృదయానికి మళ్ళీ ఏదైనా ఎదురయితే, తిరిగి ఎవ్వరిని లక్ష్యపెట్టకుండేటట్లు తయారయినా ఆశ్చర్యం లేదు. కీడెంచి మేలెంచమన్నారు."
"శేఖరం, ఏమిటి నీ ఉద్దేశం? ఆమాత్రం నేనాలోచించలేననుకున్నావా? అతనిలో నా కా నమ్మకం కలగబట్టే నేనీ పనికి నిశ్చయించుకున్నాను. నా మనస్సుకు నచ్చని పని నే నెన్నడూ చెయ్యను."
"నీకు సంపూర్ణంగా నమ్మకం ఉంటే అంతేచాలు. కాని, నీకు ఏ విధంగాను సంబంధంలేని వ్యక్తికి, ఏదో సమస్య ఉందని, నువ్వెందుకు తాపత్రయపడుతున్నావా అన్నదే ఆశ్చర్యం!"
"అందులో తప్పేముంది? ఎదటి వ్యక్తికి అవసరమయిన సహాయం చెయ్యడంలో ఆశ్చర్యమేముంది?"
"మనకు తారసపడే ప్రతివారికి ఏదో ఒక సహాయం చెయ్యాలనుకోవడం హర్షనీయమే. మనకు చేతనయిన సహాయం చేస్తాముగాని, మన ఆదర్శాలను కూడా లెక్కచెయ్యకుండా సహాయం చేసేందుకు తగిన పరిచయం, అవసరం ఈ విషయంలో ఉందనుకోను."
"అంటే నీ ఉద్దేశం?" కంఠం కొంచం తీవ్రంగా ఉంది.
"నా మాటల్లో నా ఉద్దేశం అంతగా బోధపడటం లేదా? నువ్వింతవరకు ఒకడికోసం, నీ పరపతి ఉపయోగించదలిచినట్లుగాని, ఒకడికోసం నీ అంతట నువ్వు వెళ్ళి ఒకరిని అడిగినట్లు గాని నే వినలేదు. స్వప్రయోజనంకోసం నీ ప్రోత్సాహం ఉపయోగించే మనస్తత్వం నీకుందని నే ననుకోవలిసిన అవసరం ఇన్నేళ్ళుగా మన పరిచయంలో నా కెన్నడు కలగలేదు. అటువంటిది అతనికి, నీకు ఏం సంబంధం ఉందని కె. జి. లాంటి చోట్ల అతనికి హౌస్ సర్జనుకు సీటు రావడానికి ప్రయత్నిస్తున్నావు? ఇన్నేళ్ళుగా లేని ఈ బాధ్యత అవసరం ఈ రోజు నీ కెందుకు కలగాలి?"
ఆ రోజు రాజశేఖరం గారు అనుకున్నదానికంటే ఎక్కువే అడిగేశారు. ఇంక ఆ రాత్రి ఎటువంటి అనుమానాలతోను ఇంటికి వెళ్ళదలుచుకోలేదు.
అంత సూటిగా, ఖచ్చితంగా అడిగేసిన శేఖరంగారి మాటలకు జవాబుకూడా చెప్పకుండా కుర్చీలో వెనక్కి వాలారు కృష్ణమూర్తిగారు. నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ, వివర్ణమయిన ఆయన పచ్చని ముఖంలోని భావాలు చూచి ఆశ్చర్యపోయారు శేఖరంగారు. కొంతసేపు వారిద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది.
"నిజమే! నువ్వన్నట్లు ఇంతవరకు స్వప్రయోజనంకోసం నా పరపతిని వాడుకోవలిసిన అవసరం నా కెన్నడు కలగలేదు. స్వజనం లేరు. స్వప్రయోజనం లేదు. అందుకే ఇంతకాలం ఇంత ఆదర్శంగా బ్రతకగలిగానేమో! ఈనాడు స్వజనం కనుపించారు. ప్రయోజనం కలిగింది. అందుకే ఇన్నాళ్ళుగా ఉన్న అభిప్రాయాలు మార్చుకున్నాను. నా జీవితమంతా ఎవరైతే ఉండాలని వాంచించానో, అది ఈ రోజు నెరవేరింది. పెద్ద వయస్సులో-ఒంటరితనంలో ఎవరయితే ఏది అవసరం అని ప్రతివారు భావించుకుంటారో, అది ఈ రోజు సంభవించింది. ఆ ఆశ నెరవేరింది. నాలో పిల్లలపై ఇంత మమత ఉందన్న విషయం నాకే తెలియదు మొన్నమొన్నటి వరకు. ఈనాడు శ్రీనివాస్ నా స్వంతకొడుకు. చిన్నతనంలో ఒక్కసారి పొరపాటువల్ల నాకు, మా మరదలికి పుట్టిన బిడ్డ శ్రీనివాస్. ఈ విషయం మొన్నమొన్నటివరకు తెలియదు. ఆపైన అతనికి ఒక మార్గదర్శి అవసరం అని తెలిసి, అందుకు నేను తగుదునని తెలిసి దూరంగా ఉండలేకపోతున్నాను. అతనికి దగ్గిరయ్యే విధానం ఇదితప్ప మరొకటి లేదు. అందుకే ఈ ప్రయత్నం, నా ఈ కృషి ఫలిస్తుందన్న నా ఆశ, ఇది జరుగుతుందని నా నమ్మకం ...."
"మనసు ఏది ప్రగాఢంగా నమ్మాలనిపిస్తుందో దాన్ని నమ్మాలని కోరుకుంటాం. కాని ....కాని ఇన్నేళ్ళకు, దాదాపు ముఫ్ఫయి ఏళ్లకు నీకెలా తెలిసింది? నమ్మలేకున్నాను" అన్నారు శేఖరంగారు కొంతసేపు ఆశ్చర్యంతో మూగవారై తేరుకుని.
"నాకే అలా అనిపించింది. కాని శ్రీనివాస్ తల్లి నా స్వంత మేనత్త కూతురు. ఇంతకాలానికి ఆమె అంతట ఆమె వచ్చి ఈ విషయం చెప్పి సహాయం చెయ్యమని కోరింది. ఆ రోజు మొదటిసారి మీ ఇంట్లో సుపరిచితంగా నా పోలికలు కనిపిస్తూంటే చెప్పలేని వాత్సల్యం కలిగింది. 'శ్రీనివాస్ వంటి ఒక్క కొడుకే ఉంటే-' అనిపించింది ఆ క్షణంలో. అటువంటిది, ఈ రోజు ఆనాటి భావనే నిజమై నిలువునా కళ్ళ ఎదట నుంచుంటే, ఎలా నమ్మకుండా ఉండగలను? అతనికి చెయ్యగలిగిన సహాయం చెయ్యకుండా ఎలా ఉండను? నా కొడుక్కి నేను దగ్గిర కావాలంటే ఇదొక్కటే మార్గం. అతని అభివృద్ధికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను."
