భావుకత ఓ అంటురోగం అయినట్టు, అది తన దగ్గరకు రాకుండా జాగ్రత్త వహించాడతడు.
కాని, అతడు కఠిన హృదయుడు కాడు. రత్న-భర్తగా, ఆశ తండ్రిగా, రోగుల వైద్యుడుగా తన కర్తవ్యాన్ని సవ్యంగానే నిర్వహించేవాడు.
తినటానికి తిండి, కట్టుకోవటానికి గుడ్డ అన్నివిధాల స్వాతంత్ర్యమూ రత్నకుంది. సంపాదనలో సగం తన దగ్గరుంచుకుని మిగతాది రత్న చేతికిచ్చేవాడు. ఇంట్లో తనో అతిధిలాగానే మెలిగేవాడు.
భార్యను ఏ విషయన్ని గురించీ ప్రశ్నించే వాడే కాదు.
ఆశకు తండ్రిగా, తన కూతురి యోగక్షేమాలను చూసుకునేవాడు. ఒక తండ్రినుండి, ఓ కూతురు ఎన్ని సౌకర్యాలను పొందగలదో, అన్ని సౌకర్యాలను పొందేది ఆశా- ఒక్క ప్రేమను తప్ప. తండ్రిగా అతడు కూతురికి తెచ్చివ్వని వస్తువులేదు. కాని ఎపుడూ కూతుర్ని దగ్గరకు తీసుకుని లాలించేవాడు కాదు. ఆప్యాయంగా కబుర్లు చెప్పే అలవాటే లేదతనికి!
కాని తన రోగులు, తన వృత్తి అంటే మిగతా ప్రపంచాన్నే మరిచిపోయేవాడు. శేషగిరి ఆప్యాయతను పొందాలంటే అతడి దగ్గరకు రోగిగానే వెళ్ళాలి. అతడి సాంత్వన వచనాలు, భరోసా, వీటన్నిటివల్లనే అతడి రోగుల జబ్బు సగం నయమయిపోయేది.
దానికితోడు అతడి పెదవులపై సదా వెలిగేమాయని చిరునవ్వు రోగుల నిర్జీనమైన మొహాల్ల్లో కూడా ఆశను రేకెత్తించేది.
రత్న తల్లి కాబోతున్నపుడు, శేషగిరి ఆమె విషయంలో తీసుకున్న శ్రద్ధ, ఆసక్తి ఇంకెవరూ తీసుకోలేరు. ఒక్క నిమిషంకూడా ఆమె ఆమెను వదలి ఉండటానికి ఇష్టపడేవాడుకాదు.
భార్య ఆహార విహారాల నన్నిటినీ వైద్యుడి దృష్టిలోనే గమనించేవాడు.
ఆశ పుట్టేముందు ప్రసవవేదనతో బాధ పడుతున్న రత్నను వదలి వెళ్ళలేదు శేషగిరి. దగ్గరే కూర్చుని కర్చీఫ్ తో తను నుదుటిమీది చెమటను తుడుస్తూ, చేతిని నిమురుతూ కూర్చున్న భర్తను రత్న ఎప్పటికీ మరిచిపోలేకపోయింది.
అకస్మాత్తుగా తనమీద భర్త చూపిస్తున్న అగాధమైన ప్రేమనూ, అసక్తినీ చూసి చకితురాలయింది రత్న. భర్త ఇదేవిధంగా తన్ను ప్రేమించే టట్టయితే ఇంకా కొద్దికాలం ప్రసవవేదనను అనుభవించగలను అనుకుంది రత్న.
ఆశ పుట్టగానే, శేషగిరి మామూలుగా అందరికి లాగే, ఆమెకూ డాక్టర్ గా మిగిలాడు. బయట నుండి వచ్చేటప్పుడు నిశ్శబ్దంగా నడిచివచ్చి ఆమె చేతిని తీసుకుని వాడి చూసి, నుదుటిమీద చెయ్యివేసి పరీక్షించేవాడు.
"ఓ, ఆ చెయ్యి అలాగే నుదుటిమీదనుండి తల-వెంట్రుకల మీదికి వెడితే!" అని ఆశించేది రత్న-మనసు.
భార్యను పరీక్షించాక, కూతురివైపు మళ్లేదతని దృష్టి. ఉయ్యాలలో పడుకున్న కూతుర్ని అపుడపుడూ ఎత్తుకునే వాడు-బరువు చూడటానికి. మూడు నెలల ఆశా, మూడు నెలల బిడ్డ ఉండాల్సినంత బరువు లేకపోతే, ఆలోచనతో నుదురు చిట్లించేవాడు. బిడ్డపోషణలో ఏ విధమైన లోపమూ లేనపుడు, బరువు తక్కువగా ఉండటానికి కారణమేమిటి?
ఆ సమయంలో తండ్రిగా బిడ్డను చూసేవాడు కాడతను. డాక్టర్ శేషగిరి తక్కువ బరువున్న బిడ్డను చూసి ఆలోచించేవాడు. ఇహ అప్పటి నుండి కొత్తమందుల ప్రయోగం ప్రారంభమయేది.
పురుడుపోసుకుని మూడు నెలలు పూర్తికాగానే, శేషగిరి మళ్ళీ ఇంట్లో మామూలు మనిషయ్యాడు.
అతడు బుద్దిజీవి అయితే, రత్న భావజీవి. భర్త బుద్దికుశలత, అతడి వృత్తిపైన అతడి కున్న అభిమానం, వీటిని రత్న ఎంతో గౌరవించేది. కాని ఇంట్లో ఉన్నపుడైనా, తను డాక్టరన్న మాట మరిచిపోయి భర్తగా మెలిగితే ఎంత బావుంటుంది అని మధనపడేది రత్నహృదయం.
కాని శేషగిరి తన వాళ్ళకూ, బయటివాళ్ళకూ కూడా డాక్టర్ గానే మిగిలిపోయాడు. తన భార్యను చుట్టుదోవలో ఆమె స్నేహితురాలి ఇంట్లో దిగపెట్టడానికి వెనుదీసే శేషగిరి, పది-పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న హాస్పిటలుకు తన కారు లోనే తీసుకుని వెళ్ళేవాడు రోగిని.
రత్న పెళ్ళయిన కొత్తలో:
"నాకన్నా మీకు ఆ రోగే ఎక్కువ" అని విసుక్కుంటే, "నువ్వు మీ స్నేహితురాలింటికి బస్సు, ట్రాము, ట్రైను, టాక్సీ - ఎందులో నైనా
"మీ రోగి వెళ్ళలేడనా?"
"అలా కాదు. ఇప్పటి అతడి పరిస్థితిలో డాక్టర్ అతడి దగ్గర ఉండటం అవసరం. బస్సుకోసం కాచుక్కూర్చోవటం మంచిదికాదు."
రత్న మళ్ళీ మాట్లాడకుండా ఊరుకునేది. క్రమంగా, మాట్లాడి లాభంలేదన్న సంగతి తెలిసి వచ్చింది. భర్తను అనుసరించి జీవించటానికే అలవాటు-పడింది. కాని, ఒక్కొక్కపుడు 'ఇంట్లోనైనా డాక్టర్ గాకాక, భర్త సాహచర్యం కావా'లని తీవ్రంగా కాంక్షించే దామె హృదయం. కాని, అది ఆమెకు తీరని కోరికగానే మిగిలిపోయింది. డాక్టర్ భార్యగానే జీవితం సాగిపోతోంది.
ఈ విధమైన వాతావరణానికి అనుగుణంగా జీవితాన్ని దిద్దుకుని సాగిపోతున్న రత్న, అకస్మాత్తుగా లభించిన రమేశుడి స్నేహంతో అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవించింది,. కాని; క్రమేణా రమేశుడి ప్రేమవిశ్వాసాలు పెరిగినట్టల్లా గాబరా పడసాగింది.
తనను దేవలోకంనుండి దిగివచ్చిన దేవతలా రమేశ్ ఆరాధించటం గమనించి, రత్న మొదట పువ్వులా వికసించింది.
ఆ ఆరాధన ఎలాంటిది!
కేవలం గుడ్డి ఆరాధన; చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సౌందర్యాన్నీ విస్మరించి, కేవలం తనొక్కతెనే సజీవమూర్తిగా భావించి రమేశ్ ఆరాధించటం చూసి, రత్న పులకితురాలయింది. ఈ నూతనమైన అనుభవం ఆమె యౌవన, సౌందర్యాలను ద్విగుణీకరించి, వింతశోభనిచ్చింది. కాని, ఈ రకమైన ఆరాధనవల్ల ఆరాధకునికి మంచి కలుగకపోగా, చెడుకలుగుతుందన్న భావన జాగృత మవటంతోనే, రత్న అతడినుండి దూరంగా పారిపోవటానికి ప్రయత్నించింది.
రమేశుడి మీద ఆమెకు అంతులేని ప్రీతి విశ్వాసాలున్న మాట వాస్తవమే. జీవతంలో దెబ్బతగిలి దుఃఖిస్తున్న వ్యక్తి అని, స్త్రీ-సహజమైన అనుకంపం కలిగింది ఆమెకు. కాని, తన అనుకంపానికి బదులుగా అతడినుండి అపారమైన ప్రేమను నిరీక్షించలేదామె.
అతడి ప్రేమతో ఆమె సుఖి; దుఃఖి.
ఇంతకంటే ప్రేమను దూరం చేసుకోవడమా! ఆమెలోని స్వార్ధం, తనను ప్రాణంకన్నా మిన్నగా భావించి, ప్రేమింఛే రమేశుడి ప్రేమను స్వీకరించి అతడిని తనవాడిగా చేసుకోమని ప్రేరేపించేది.
కాని, ఆమె హృదయం? అతడి సుఖదుఃఖాలను గురించి ఆలోచించేది. తనను ప్రేమించటంవల్ల జీవితంలో అతడికి ఏ మాత్రం సుఖం లేదని తెలుసుకుని కృంగిపోయింది రత్న. రమేశుడి దృష్టిని అందాల రాశి నళినివైపు తిప్పటానికి ప్రయత్నించి విఫలురాలయింది.
తన ప్రేమ పథంలో వెనుతిరిగి రాలేనంత దూరం సాగిపోయాడు రమేశ్. ఇంక 'ముందేమిటి' అనే విషయం అతడికి ఆగమ్యగోచరంగానే ఉండిపోయింది.
ఈ మనో విప్లవంలో రత్న-హృదయం సతమతమయి కొట్టుకుపోతోంది.
పరధ్యానంగానే ఆశను అన్నం తినిపించి పడుకోబెట్టింది. చేతిలో ఓ పుస్తకం పట్టుకుని కూర్చుంది. కాని, ఆమె దృష్టి పుస్తకంమీద లేదు. ఇపుడు తనేం చెయ్యాలో అని ఆలోచిస్తూ కూర్చుంది.
రమేశుడిని తననుండి దూరంగా పంపేయాలి.
క్రమంగా అతడు తన్ను మరిచిపోగలడు. ఈ విరహాన్ని భరించటం తనకు చాలా బాధను కలిగిస్తుంది; నిజం. కాని, మందు చేదుగా ఉంటే మాత్రమేం, రోగికి నయం కావటమే ముఖ్యం.
రమేశుడిని పంపించేముందు కొన్ని విషయాలలో అతడి దగ్గర మాట తీసుకోవాలి. వీలయినంత త్వరలోనే ఆ మాట తీసుకోవాలి.
రమేశ్ తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు.
రత్న చేతిలో పుస్తకం పట్టుకుని కలగంటోంది. రమేశ్ చనువుతో ఆమె దగ్గరకు వచ్చి చేతిలోని పుస్తకాన్ని లాక్కుని:
"మీ ఆలోచనలకు ఒక్కఅణా ఇస్తాను" అన్నాడు.
రత్న చటుక్కున వెనక్కి జరిగి, నవ్వుతున్న అతడి కళ్ళను చూస్తూ.
"అణా! చాలా తక్కువ" అంది.
"అయితే.... అయితే...." రమేశ్ సందేహించాడు చెప్పటానికి.
"ఏమిటో చెప్పండి" ప్రోత్సహించింది రత్న.
"ఒక తియ్యటి ముద్దు" అన్నాడు ఇంగ్లీషులో.
రత్న ఎదను కనుబొమ కొంచెం పైకెత్తి "ఉహుఁ" అంది.
"మరేం కావాలి మీకు?"
"నేను చెప్పినట్టు చేస్తానని మాటివ్వండి."
"వీల్లేదు."
"దయచేసి...."
"క్షమించండి."
"అయితే సరే. నన్ను మాట్లాదించకండి. పుస్తకం ఇలా తెండి. నేను చదువుకోవాలి."
రమేశ్ ఇచ్చిన పుస్తకం తీసుకుని చదువుతూ కూర్చుంది రత్న. రమేశ, రత్న మొహం చూస్తూ కూర్చున్నాడు. రమేశ్ తనవైపే తదేకంగా చూడటం గమనించి అధీరురాలయింది రత్న.
"అలా చూడకండి రమేశ్!"
"ఏం?"
"నేను భరించలేను."
"రత్నా"- అన్నాడు రమేశ్ బ్రతిమాలుకుంటున్నట్టు.
"ఏమిటి?"
"నాకు మీరు కావాలి."
అతడి మాట ఎంతో సరళంగా ఉంది; అతడి ధ్వని ఎంతో మధురంగా ఉంది.
బడినుండి ఆకలితో ఇంటికి వచ్చిన ఆశా,
"అమ్మా ఆకలేస్తోంది. అన్నం పెట్టమ్మా" అన్నంత సరళంగానే ఉందతని కోర్కె.
రత్న తలెత్తి అతడివైపు చూసింది. మెరుస్తున్న అతడి కళ్ళలో పిపాస ప్రజ్వలించటం లేదు. దానికి మారుగా అతఃది కళ్ళు ప్రేమార్ధ్రతతో మెరుస్తూ ఆశతో రత్నవైపు చూస్తున్నాయి.
ఆమె సోఫాలో కూర్చున్నట్టుగానే ముందుకు వంగి, అతడి బుగ్గలను చేత్తో మృదువుగా నిమిరి, నుదిటి మీద పడ్డ జుట్టుని వెనక్కి తోసింది మాట్లాడకుండా.
రమేశ్ మళ్ళీ అన్నాడు: "నాకు మీరు కావాలంటే కావాలి."
రత్న తల అడ్డంగా తిప్పింది.
"నేనంటే ప్రేమలేదా మీకు?"
"ప్రేమ ఉందంటే, దాన్ని వ్యక్త పరచటానికి అదొక్కటే మార్గమా రమేశ్? మన ప్రేమ అంత హీనస్థితికి దిగజారక తప్పదా? మీ మీద నాకెంత ప్రేమ ఉందంటే, మిమ్మల్ని ఆ త్రోవలో నడిపించటానికి నా కేమాత్రం ఇష్టంలేదు. నేను తల్చుకున్నయితే ఎప్పుడో మిమ్మల్ని పాడుచేసే దాన్ని. కాని, మీరు జీవితంలో సుఖంగా ఉండాలన్న కోరుకుంది నాకు. అటు త్రోవలేకుండా మూసి వేయలేను. రమేశ్! నన్ను లోభరచకంది. ప్లీజ్!"
"కాని, నాకు మీరు కావాలి రత్నా! మీరు లేని జీవితం అపూర్ణం".
"ఇప్పుడలా అనిపించినా, మున్ముందు అన్నీ సరిపోతాయి. మీ జీవితాన్ని పంచుకునే భాగ్యశాలిని ఓ రోజున వస్తుంది. నేను సతీధర్మానికి కాని, పవిత్రత గురించి కాని, సంఘానికి కాని భయపడి మిమ్మల్ని నిరాకరించటంలేదు. నా దృష్టిలో వాటికి విలువే లేదు."
"అయితే....." అన్నాడు రమేశ్.
"కాని, అంతరంగానికే నేను భయపడుతున్నాను. నేను జీవించినంతకాలం నా అంతరాత్మ నన్ను వేలుపెట్టి చూపిస్తూ ఉంటే, నేను భరించలేను. మీ పవిత్రమైన జీవితాన్ని మలిన-పరచలేను."
రమేశ్ మాట్లాడలేదు. మెదలకుండా కూర్చున్నాడు. ఆఖరికి రత్నే పలకరించింది:
"నా మాటలతో విసుగు పుట్టిందా?"
"లేదు. మీ మనోదార్ధాన్ని, చిత్తస్థైర్యాన్ని మెచ్చుకుంటూన్నాను. మెప్పుతోనే మీ వీపుకు ఆకర్షింపబడుతున్నాను."
"అలా మాట్లాడకండి రమేశ్!"
"ఏం?"
"మీ మాటలు వినాలనే ఆశతోనే నేను మీతో వచ్చేయగలను."
రమేశ్ ఉత్సాహంతో: "వచ్చేయండి. వెళ్ళిపోదాం" అన్నాడు.
"ఎక్కడికీ?"
"ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం."
రత్న నవ్వుతూ అతడి గడ్డాన్ని వూపింది?
"పదండి; భోజనానికి" అంది.
"డాక్టర్ నీ రానివ్వండి."
"డాక్టర్ కోసం వేచిఉండి లాభంలేదని తెలియ లేదూ ఇన్నిరోజులైనా."
"ఫరవాలేదు. నాకింకా ఆకలిగాలేదు" అంటూ టేబుల్ మీది మెడికల్ జర్నల్ చేతికి తీసుకుని చదవసాగాడు. డయాబిటీన్ గురించి రాసిన కొత్తప్రయోగాన్ని గురించి వ్యాసాన్ని చదువుతూ అందులో లీనమైపోయాడు రమేశ్.
అది చూసి రత్న మనసులో ఆశ చిగురించింది.
శేషగిరి ఇంటికి వచ్చేసరికి పదకొండు దాటింది. మెడికల్ జర్నల్ లో మునిగిన రమేశుడికి గాని, నవలలో లీనమైపోయిన రత్నకు గాని పొద్దుపోయిందే తెలియలేదు,
రమేశ్, రత్న-ఇద్దరూ ఒక్కోమూలలో పుస్తకాలు పట్టుకుని కూర్చుని ఉండటం చూసి, నవ్వు వచ్చింది శేషగిరికి.
"భోంచేశావా?" రమేశుడివైపు చూసి అడిగాడు.
"లేదు" అంది రత్న.
భోజనాలపుడు శేషగిరి చెప్పిన విషయం రత్న నిరీక్షించనిది.
"ఎల్లుండి బరోడా వెడుతున్నాను."
"ఎందుకూ?"
"అక్కడ వైద్యుల సమ్మేళనం జరుగుతుంది. నా స్నేహితులంతా వెడుతున్నారు. నన్నూ రమ్మని బలవంతం చేశారు. నేను వెళ్ళి రావటానికి నాలుగయిదు రోజులు పట్టవచ్చు" అంటూ రమేశుడి వైపు తిరిగి:
