తెల్లవారితే నయాపైసాలేదు. ఈ రోజు ఆయన్ని అడిగి తీసుకోవాలంటే యెంతోబాధ. సరే. వెళ్ళిపోయేప్పుడు చూద్దాం అనుకున్నాడే గాని మనస్సులో యేదో ఆవేదన. తెలియకుండా కాల్చేస్తోంది.
ఎందుకిలా వుంది? అని తనని తను యెన్నో సార్లు ప్రశ్నించుకున్నాడు. జవాబు రాలేదు చన్నీళ్ళతో ముఖం ఓసారి కడుక్కుని లాయర్ గారి భార్య అందించిన వెంకటేశ్వరుడి ప్రసాదం తిని తిరిగి టైపు మిషను దగ్గర కూర్చున్నాడు.
యెంత జాగ్రత్తగా టైపు చేసినా తప్పులు యెక్కువ పడుతున్నాయి ఆరోజు అర్జెంట్ వర్కు చాలానే వుంది. మనస్సులో ఈ అశాంతి లేకుండా వుంటే రెండు గంటల్లో పూర్తిచేస్తే దాదాపు పది రూపాయలు రావచ్చు. వదినకి బత్తాయిలు అయిపోయాయి. వెళ్ళేప్పుడు మరిచి పోకుండా తీసుకువెళ్ళాలి. అనుకుంటూ మరోసారి గుర్తు చేసుకున్నాడు.
అప్పటికి పదిహేను రోజుల క్రితం ఓ కంపెనీలో ఖాళీలు వచ్చినాయి అవి అప్లికేషన్ పెట్టించారు కృష్ణమూర్తిగారు. ఇంటర్వ్యూ వచ్చింది.
సంతృప్తిగానే జవాబులు ఇచ్చాడు.
"ఆ సంగతి ఏమయినా కనుక్కున్నారా" అంటూ అడిగాడు వాసు. "యెక్కడయ్యా. చూస్తూనే వున్నావుగా తీరుబడి దొరకందే. నాకు గుర్తువుందిలే"
ఆయన అలా అవటంతో ఉత్సాహం నీళ్ళు కారిపోయింది అప్పటికే యేవేవో వూహించిన వూహలు చెల్లాచెదరు అయిపోయాయి.
ఆయన లోపలికి వెళ్ళిపోయారు. కారు డ్రైవరు రంగయ్య సిగెరెట్ దమ్ము లాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుతూ అన్నాడు.
"వాసుబాబూ" అలాగైపోయారేంటి....మా అయ్యగారు మీ కోసం చాలా ప్రయత్నం చేస్తావుంటే....."అరడరు" వొచ్చిందాకా యెవరిక చెప్పటం ఆయనకి అలవాటే లేదు. అదీకథ" అంటూ గుబురు మీసాల్లోంచి నవ్వాడు.
రంగయ్య మాటతో వాసులో చెల్లాచెదరైన ఆశలు తిరిగి ఆకృతి దాల్చుకున్నాయి.
వీలైనంత త్వరగా ఇల్లుచేరాలి. మాల వంట రిగా యెదురుచూస్తూ వుంటుంది అనుకుంటూ వర్కులో లీనమైన వాసుకి ఫోను రింగవటం కూడా విన్పించలేదు.
"వాసూ నిన్నెవరో పిలుస్తున్నారు" అంటూ లాయరుగారు అందించారు.
"నాకా..... ఈ సమయంలో.... ఫోనా... ఎక్కడనించీ? వదినకి యేమీ కాలేదుగదా! మాల ఎలావుందో రిసీవర్ అందుకున్నాడు.
అవతలనించి వెంకటేశ్వర్లు గొంతు విన్పించింది.
"ఏమయింది. మాల క్షేమంగా వుందిగదూ.." అంటూ ఆదుర్దాగా అడిగాడు వాసు.
ఏమిటీ వీరభద్రానికి యేమయిందీ హాస్పిటల్ నించి మాట్లాడుతున్నావా! వూ.... వీరభద్రం ఫస్టు క్లాసులో పాసైనాడు టెలిగ్రాం వచ్చిందా నిజం" వూ.... అయితే...
అప్పటికే వాసు నుదురునిండా చెమట పట్టేసినా వీరభద్రంకి ఫస్టు క్లాసు అనేసరికి అతని ముఖంలో సంతృప్తితో నిండిన ఓ గర్వరేఖ క్షణం మెరిసి మాయమైంది.
అవతలనుంచి వెంకటేశ్వర్లు గొంతు విన్పిస్తోనే వుంది. అతను చెప్పేమాటలు వింటూ అయోమయంగా అయిపోయి టేబుల్ పట్టుకుని నిలబడ్డాడు "వీరభద్రానికి యాక్సిడెంటా" అతనికి తెలియకుండానే ఓ వెర్రి కేక బైటికి వచ్చేసింది.
లాయరుగారు కారు ఇచ్చి పంపారు హాస్పిటల్ కి.
కారు దిగి లోపలికి పరుగెత్తుతున్న వాసుని మాల అమాంతం వచ్చి కావులించుకుంది.
"వాసు బాబూ వీరభద్రం......వీరభద్రం మన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వాసు బాబూ..." అంటూ భోరుమంది.
వాసుకి తల తిరిగిపోతోందో, భూమే తిరిగి పోతోందో తెలియటం లేదు.
అతని స్థితి చెప్పటానికి భాష సరిపోదు.
సాయంకాలం కన్పించి "మాష్టారూ టెలిగ్రాం కోసం పోష్టాఫీసుకి వెడుతున్నా" అంటూ చలాకీగా పరుగెత్తాడు. అలాంటివాడు ఇంతలోనే...మాల వెక్కి వెక్కి యేడుస్తూనే వుంది.
* * *
వీరభద్రం తల్లిదండ్రులని వోదార్చలేక, దూరంగా వుండలేక నలిగిపోయాడు వాసు, ఆ ముసలి దంపతుల యేకైక పుత్రుడు అకాల మరణం చెంది విలపిస్తూంటే యెందరు వోదారిస్తే మాత్రం వారికి శాంతి కల్గుతుంది.
వాసు ఈ గొడవల్లో వుండి శ్రీలక్ష్మినీ, పిల్ల లనీ చూస్తూ ఉండమని మాలని వాళ్ళ దగ్గర వుంచాడు.
రెండు రోజులు మగతగా వుండి మూడవరోజు మాలని గుర్తుపట్టింది శ్రీలక్ష్మి. ఆ అమ్మాయి అంటే మొదలే చెప్పలేనంత అసహ్యం.
అలాంటిది ఆ అమ్మాయి చేతి మందూ. బార్లీ తాగటం భరించలేని విషయం. తన ఇంట్లో వుంచుకోవటం అసలే సహించలేదు అందుకే తన శక్తినంతా కూడగట్టుకుని వచ్చిన తిట్టల్లా తిట్టేసింది రొప్పుతూనే.
అన్నింటికీ మించి మాలకి బాధ కల్గించిన విషయం-
"ఏమంటూ నువ్వు వాసు జీవితంలో తగులాడ్డావో ఆనాటినుంచీ మా ఇంట్లో సుఖశాంతులు నాశనం కాబడ్డాయి. శనిని మామూలు "శని" వి కాదు. యేలినాటి శనివి. నువ్వు యేడేళ్ళకికాదు యేడు యుగాలైనా వదిలేటట్లు లేవు. దిక్కు మాలిన దానా. నిక్షేపంగా పెళ్ళి కావలసిన వాడి జీవితం యెడారి చేశావు. ఆ వాసు యేమంటూ ఈ ఇల్లు విడిచాడో ఆ నాటినించే నాకుకష్టాలు దాపురించాయి. వీరభద్రాన్ని పొట్టన పెట్టుకున్నావు. చాలలేదూ మరెందరు కావాలి నీకు. పోతావా లేదా.... మెడబెట్టి గెంటేస్తాను.....అంటూ తన అందుబాటులో వున్నవన్నీ విసిరి పారేసి ఇంక యేదీ అందక మందుసీసాకూడా గిరాటు కొట్టింది మాల ముఖాన.
శ్రీలక్ష్మి విసిరేమాటలు గునపాల్లా మాల గుండెల్లో దిగబడిపోతున్నాయి.
నిజమే....నేను వచ్చిం తర్వాతే వాసుబాబుకీ కష్టాలు. నేనే కారణం. వీరభద్రం చచ్చిపోవటానికీ నేనేనా కారణం. ఓ భగవంతుడా నువ్వే చెప్పు. నేనేనా కారణం?
ముఖం కప్పుకుని వెక్కి వెక్కి యేడ్చింది.
వీణకీ యేడుపు వచ్చింది. తల్లి అలా అన్నందుకు. మాల దగ్గరగా వచ్చింది. బాజీ మాల కళ్ళు తుడుస్తూ అన్నాడు.
"యేడవకక్కా చిన్నాన్న వచ్చిం తర్వాత చెప్తాలే. అమ్మ నిన్ను చాలా కోప్పడిందని అమ్మ జట్టు వుండం..."
అమాయకంగా మాట్లాడే ఆ ఇద్దరినీ దగ్గరగా లాక్కుని మరీ దుఃఖం వస్తున్నా దిగమింగుకుంటూ అడిగింది. "నేను చెడ్డదాన్ని కానూ" అని.
"కాదు కానే కాదు. యెంచక్కా కథలు చెప్తావు. నీవే మంచిదానివి. చిన్నాన్నకి కూడా చెప్తాంలే. మరి యేడవకూ."
అన్నా, చెల్లెలూ ఓదార్చారు. బాబ్జీ అచ్చంగా వాసు పోలిక. కళ్ళు తుడుచుకుని బాబ్జీని ముద్దు పెట్టుకుంటూ వంట ఇంట్లోకి తీసుకువెళ్ళి అన్నం పెట్టి నిద్ర పుచ్చిందే కాని మాల మనస్సుకి శాంతిలేదు. మాటి మాటికీ శ్రీలక్ష్మి మాటలే గుర్తు వస్తున్నాయి.
రాత్రి పది దాటినా వాసు ఇంటికి రాలేదు,
నా మూలకంగా యెంత కష్టపడుతున్నాడో. కళ్ళనీళ్ళు సంతతధారగా ప్రవహిస్తున్నాయి. మాల నిస్సహాయంగా ఆలోచిస్తూ కూర్చుంది.
పక్క వాటాలోనించి గుసగుసలు విన్పిస్తున్నాయి.
"ప్రియుడి కోసం యెదురు చూస్తోంది. ప్రేయసి..." అంటూ ఇంకా యేమేమో అనుకుంటున్నారు. అయినా ఇవి అన్నీ తనకి తెలుసు ఇవేనా? యెన్నో రకాల అనుకోవటం వింటూనే వుంది.
* * *
ఈ దొంగలరాణిని తను వుంచుకున్నది. కాక అన్నగారి దగ్గరికి సరాసరి తీసుకోచ్చేశాడు. ఆయనకి సిగ్గులేకపోతే దీనికైనా సిగ్గు వుండద్దూ సంసారుల మధ్య తనలాంటి వాళ్ళు వుండతగరనీ పెళ్ళి చేసుకుని యే మారుమూలో పడిచస్తే ఫర్వాలేదు గాని ఇలా పబ్లికుగా ఇంత తెగింపా" అంటూ.
ఇలాంటి మాటలు వినీ వినీ చెవులు చిల్లులు పడిపోతున్నాయి మాలతికి.
ఒక్కొక్కరోజు ఒక్కొక్క యుగంగా గడుపుతోంది. ఇంక నేను ఒక్కరోజైనా సరే వుండలేను భగవంతుడా వుండలేను. కాని అన్నివిధాలా బాధపడే వాసుబాబుకి ఈ విషయం యేమని చెప్పాలి? పాపం వీరభద్రం యెంత దురదృష్టవంతుడైనాడు. కాదు. నేనన్నా అలా అయినాను కాదు. ఈ దుఃఖంలో తను పాసైనా ననే సంతోషమే లేకుండాపోయింది.
వాసు పేపర్ చూసి నిర్లిప్తంగా అన్నాడు. "మాలా నువ్వు పాసైనావు" తల వూపింది కాని ఆ సమయంలో ఆ ఇద్దరి మనస్సుల్లోనూ వీరభద్రం జ్ఞాపకాలే.....అతనే వుంటే యెంత హడావుడి చేసి వుండేవాడో.
వీరభద్రం మరణం వాసుకి పెద్ద అఘాతం అయింది. ఇంత అశాశ్వతమయిన ఈ జీవితానికి యెందుకింత తాపత్రయం! ఈర్ష్యలూ, అసూయలూ కోపాలు, తాపాలూ, యెంతో వున్నత శిఖరాలని అందుకోవాలనే తపనా....తాపత్రయం. చివరికి మృత్యువుతో మరేదీ మిగలదు. యేమిటో ఈ భగవంతుడి సృష్టి.
వీరభద్రాన్ని పైకి తెచ్చి మాలని ఇచ్చి పెళ్ళిచేసి యేదేదో చెయ్యాలని ఆలోచనలు చేశాడు. కాని యే ఒక్కటీ జరుగలేదు.
వాసు ఈ ఆలోచనలతో మరీ నీరసించి పోయాడు. ఆకలీ నిద్రా మరిచినా ఈ ఆలోచనలు మాత్రం అతన్ని వదలటం లేదు.
వీరభద్రం తల్లిదండ్రులు వాళ్ళ స్వగ్రామం వెళ్ళిపోతాం అంటున్నారు. వాళ్ళకి ఓ వంద రూపాయలన్నా ఇచ్చి పంపిస్తే ఆ తర్వాత సంగతి ఆలోచించవచ్చు. కాని వంద రూపాయలు యెలా వస్తఃయి. యెక్కడ తేవాలి.
లాయరు కృష్ణమూర్తి గారు వూరిలో లేరు. వైదేహిని అడిగితే.... ఇప్పటికీ అవుసరం గడిచిపోతే మరో రెండు ట్యూషన్లు చెప్పి వైదేహి బాకీ తీర్చేయవచ్చు. శ్రీలక్ష్మి సుస్తీతో వాసుకి డబ్బుకి మరీ ఇబ్బంది అయిపోయింది. వైదేహి ఇంటికి వచ్చాడు.
"అమ్మగారు పైన వున్నారు" నౌకరు చెప్పాడు.
"నేను వచ్చానని చెప్పు. అంటూ అక్కడే కూర్చుని పేపర్ తీసుకుని చూస్తున్నాడు.
"నమస్తే......బహుకాల దర్శనం" వైదేహి గబగబా దిగిరావటంవల్ల కాబోలు ఆయాస పడుతూ కూర్చుంది. కాస్త వెనక్కి వాలి" బరువుగా శ్వాస పీలుస్తూ.
వైలెట్ కలర్ గద్వాల జరీ అంచు కార్పెట్టు మీదికి గమ్మత్తుగా పరుసుకుంది. సామాన్యంగా అందరూ కట్టుకున్నట్లు కాక మరీ కిందకి కట్టు కుంటుంది చీరె యెందుకో వైదేహి.
వాసుని పరీక్షగా చూస్తూ.
"కులాసానా" అంది.
"వూ..."
వైదేహి మాట్లాడుతోంది కాని పూర్వపు ఆత్మీయత కన్పించటం లేదు ఎందువల్ల... యేదో మార్పు అన్పిస్తోంది. "ఫలానిది అని చెప్పలేకపోతోంది వాసు మనస్సు. కాని ఏదో అసంతృప్తిగా అన్పించేస్తోంది వైదేహి వాసుతో మాట్లాడుతోంది కాని యేదో తెలియని కంగారు కన్పిస్తోంది ఆ కళ్ళల్లో.
"రోజులూ లేరు యెందుకనీ......సమయంగాని సమయంలో వచ్చినా" పరీక్షగా చూస్తూ అడిగాడు వాసు.
వైదేహి తడబడిపోయింది.
"అబ్బే..... అలా యేంలేదు. నేను సరిగ్గానే వున్నాను. పైకి వెడదాం రండీ" అంటూ లేచింది.
చూడండీ నేను కూర్చోటానికి రాలేదు. త్వరగా వెళ్ళిపోవాలి: మీతో కాస్త పనుండి వచ్చాను."
"వెళ్ళకపోతే ఇక్కడ నేను కట్టేసి వుంచుతానుకున్నారా? భలేవారు వస్తూనే వెళ్ళిపోతాను అంటేయెలా...." అంటూ పైకి వెళ్ళటానికి దారి తీసింది.
మెట్లెక్కుతున్న వాసు ఉలిక్కిపడ్డాడు. అమ్మయ్యో ఈమెకి యీమెకి "బోదకాలు" కూడానా అందుకా ఇంత కిందకి చీరె కట్టు కుంటుందీ......ఓయ్ భగవాన్....." అనుకున్నాడు.
"ఏమిటో ఆలోచిస్తున్నారు. కాస్త టిఫిన్ తీసుకోండి" అంటూ నౌకరు అందించిన ప్లేటు ముందుపెట్టి....."తీసుకోండి" అంది.
"వీరభద్రం అలా అయిపోయినప్పటినుంచీ మీ దగ్గరకు రావాలనే అనుకున్నాను కాని రాలేక పోయాను. ఇంతకీ యాక్సిడెంట్ ఎలా జరిగిందీ.
"ఫస్టు క్లాసు వచ్చిందన్న సంతోషంతో టెలిగ్రాం పట్టుకుని నాకోసం వస్తూ రోడ్డు దాటు తుండగా జరిగిందీ ప్రమాదం.
కళ్ళనీళ్ళని బలవంతంగా ఆపుకుంటూ దుఃఖాన్ని దిగమింగేస్తూన్న వాసుని చూస్తూంటే వైదేహి ఆర్ద్రతతో కదిలిపోయింది.

