పల్లెటూరిలో ఒకవారం గడిచేసరికి, విసుగు పుట్టి పెరిగి, జుగుప్సగా మారిపోయిందామెకు. ఆమె చురుకుదనం, ధైర్యం, అసాధారణమయిన తెలివి పల్లెటూరి నీరస వాతావరణాన్ని అలవరచుకోలేకపోయాయి. ఆకలిగొన్న ఏనుగు, చెరుకు గడలను చీల్చటానికి ఆతురత పడినట్టు మీర ఆకలిగొన్న నిరుద్యోగి బుద్ధి తగినంత పని లేక కలవరించింది. "నాకేదైనా పని చెప్పు" అని ఆమె మనసు ఆమెను వేధించసాగింది, తామంటూన్న సన్నివేశానికి విరుద్ధంగా తిరగబడుతున్న మనస్సునూ బుద్దినీ తన అధీనంలో ఉంచుకోవటానికి విశ్వ ప్రయత్నం చేసింది మీర.
పనిలేక హాయిగా మంచంమీద పడుకొన్నప్పుడు విచార ప్రవాహంలో కొట్టుకుపోయే దామె మనస్సు
"నాకేం తక్కువయింది? ప్రేమించే భర్త, కావాలనుకున్న వస్తువును పొందగల స్తోమత అన్నీ ఉన్నాయి. కానీ మనసుకు శాంతిలేదే? ఎంచేతా?" అని తనని తానే ప్రశ్నించుకునేది. కాని దానికి సమాధానం దొరికేదికాదు.
ఉదయంలేచి కాఫీ టిఫిను తీసుకొని స్నానం చేసి డ్రస్సు చేసుకుని కూర్చొనేది. శాము పొలాల వేపు వెళ్ళి తిరిగి రావటానికి ఒంటిగంటయ్యేది. మీర ఒక్కోరోజు వెంకమ్మగారితో కబుర్లు చెపుతూ కూర్చొనేది. రోజూ ఆమెతో ఏం కబుర్లు చెప్పగలదు? శాము ఎప్పటికి వస్తాడా అని అరగంట ముందునుండి తలుపు దగ్గర నుంచొని, ఎదురు తెన్నులు చూసేది. అసలే ఎర్రగాఉన్న శాము మొహం ఎండకి కందిపోగా, దూరంనుండే మీరను చూసి, నడక వేగం హెచ్చించి, గబ గబా నడచి వచ్చేవాడు. "నా రాణికి ఏం తోచటంలేదు కదూ?" అనడిగేవాడు ఆప్యాయంగా.
ఇక గదిలో కూర్చొని కబుర్లలో పడ్డారంటే వెంకమ్మగారు హెచ్చరించేదాకా లేచేవారు కారు.
"శామన్నా పొద్దుపోయింది లే నాయనా. వంటంతా చల్లారిపోతోంది."
శాము లేచి మీరతో కలిసి భోంచేసి తమలపాకులో మోదు పట్టించి, బలవంతంగా మీరకూ రెండాకులు తినిపించి, పడుకునేవాడు. మీరకు మధ్యాహ్నం నిద్ర అలవాటులేదు. శాము చేతిమీద తల పెట్టి పడుకొని, శూన్య దృష్టితో పై కప్పుకేసి చూస్తూ ఉండేది. రక రకాల ఆలోచనలు ఆమె మెదడును అల్లకల్లోలపరచేవి. బంధిత పక్షిలాగా ఆమె మనసు విలవిలలాడిపోయేది. 'నా కిది అక్కర్లేదు. నాకు కావలసినది వేరు. నాకు కావలసినది దొరకలేదు. దొరికింది నా కక్కర్లేదు' అని ఆమె మనసు మొండికేసేది. ఈ పోరాటంలో అలసిపోయేది మీర.
మళ్ళీ అయిదింటికి లేచేవాడు శాము. మొహం కడుక్కుని కాఫీ టిఫిన్ తీసుకుని బయటికి వెళ్ళే వాడు. మొదటి కొద్ధిరోజులు బలవంతాన మీరను కూడ లాక్కు వెళ్ళేవాడు. కొత్తలో పల్లెను చూడాలన్న కుతూహలంతో మీర అతనివెంట వెళ్ళినా, రాను రాను ఆ ఆసక్తి తగ్గిపోయింది. బయటికి వెడితే తననే వెంబడించే చూపులకు తట్టుకోలేక ఇంట్లోనే ఉండిపోయేది. సాయంత్రం ఆరింటికి నౌకరు లాంతర్లు వెలిగించేవాడు. రాత్రి శాము వచ్చే సరికి ఎనిమిదయ్యేది. ఇది రోజువారి కార్యక్రమం.
ఆమె రోజూ చేస్తున్న పెద్ద పనల్లా తోటంతా తిరిగి పూలుకోయటం, రక రకాలుగా మాలలు కట్టి మార్చి మార్చి పెట్టుకోవటం.
ఎప్పుడూ పని చేస్తున్న "పిశాచి" ఒక్క పనవగానే యజమాని దగ్గరకు వచ్చి, "ఇంకేం చేయనూ?" అంటున్నట్టు ఆమె మనస్సు అస్తమానం "తరువాత?" "ఇంకేమిటి?" అని ప్రశ్నిస్తూ ఉండేది. పిశాచికి కుక్కతోక వంకరను సరిదిద్దే పని అప్పజెప్పినట్టు మీర తన మహత్వకాంక్షను గురించి పగటి కలలు కనే పని అప్పజెప్పింది. కాని కల నుండి మేలుకొన్న ఆమె మనస్సు, నిరాశతో కృంగిపోయేది. హృదయం బరువెక్కేది. ఈ మనోవిప్లవంలో నలిగిపోతోంది మీర.
తీరం వదలిన నావ తన గమ్యస్థానాన్ని చేరుకుంటే దాని లక్ష్యం సిద్దించినట్టే. కాని తుఫానుకు చిక్కి, తను వెళ్ళాల్సిన చోటుకుకాక ఏదో అపరిచితమయిన ప్రదేశంలో వచ్చి పడిన ఏకాకి బెదిరిన మనసులా మీర మనసు కలవరం చెందింది.
'నా కింకా ఏం కావాలి?' 'ఈ సంసారాన్ని దిద్డుకుంటూ గడపటమే నా కర్తవ్యం' అని మనసుకు నచ్చచెప్పటానికి ప్రయత్నించేది.
"ఉహూ నా చోటిదికాదు. నా కర్తవ్యం వేరు. నే నుండాల్సిన చోటు వేరు' అని ఆమె మనసు మొండి కేసేది. ప్రతిరోజు మనసుతో యుద్ధం చేయక తప్పేదికాదు.
తన అంతరంగంలో జరిగే పోరాటాన్ని గురించి భర్తకు చెప్పటంలో ఉపయోగం లేదని మీరకు తెలుసు. అతనితో చెప్తే "నీ కింకా ఏం కావాలి, పిచ్చి పిల్లా? ఇదొక్కటే నీకు కావలసినది" అంటూ ప్రేమగా ముద్దు పెట్టుకుని మాట మార్చేస్తాడని మీరకు బాగా తెలుసు.
తన మనస్సు తీరును భర్త అర్ధం చేసుకోక పోవటంలో మీరకు ఆశ్చర్యమేమీకలుగలేదు, స్త్రీకి ఇంతకన్నా కావలసి దేమున్నది? తనను దేవిలా ఆరాధించే భర్త, కావలసినంత ధనం రూపం అన్ని ఉండి కూడా, అశాంతితో బాధ పడే తన మనస్తత్వానికి మీరకు తనమీదే విసుగు పుట్టేది.
ఎప్పుడూ చురుగ్గా ఉండే మనసుకు కావలసినంత పని లేకపోవటంవల్ల ఇలా ఉందేమో అనుకుని ఏదో పని కల్పించుకుని చేయసాగింది.
ఉదయం లేవగానే పూలుకోసి మాల కట్టేది. తీరికగా ఓ గంట దేవుని పూజ చేసి, తరువాత వెంకమ్మగారికి టిఫిన్ చేయటంలో సాయపడేది. ఒక్కోరోజు కాఫీ, టిఫిన్ తనే చేసుకొని వంట పని మాత్రం వెంకమ్మగారికి అప్పజెప్పేది.
ఇక పుస్తకాలు చదవటం ఉండనే ఉంది.
సాయంత్రం భర్త బయటకి వెళ్ళగానే పూల చెట్లకు పాదులు చేసేది. గోపాలకృష్ణ దేవాలయానికి వెళ్ళి వచ్చేది. ఇదేదీ వద్దనిపించిన రోజున అవధానిగారి కూతురు వెంకుతో కబుర్లు చెపుతూ గడిపేది. కాని ఆ పదేళ్ళ పిల్లతో ఎంతసేపని మాట్లాడగలదు?
ఓరోజు శాము ఇంటికి రాగానే కొన్ని పుస్తకాల పేర్లు రాసిన కాగితం అతని చేతి కిచ్చి "మైసూరునుండి ఈ పుస్తకాలను తెప్పించిపెట్టండి" అంది.
"అబ్బా! ఇన్ని పుస్తకాలే! మొన్న తెప్పించిన నన్ని చదివేశావా అప్పుడే?"
మీర అభిమానం దెబ్బతింది.
"మొన్న నెప్పుడు తెప్పించుకున్నా నేమిటి పుస్తకాలు?"
"ఎలా చదువుతున్నావబ్బా ఇన్ని పుస్తకాలు? జీవం లేని ఆ పుస్తకాలు నిన్నెలా ఆకర్షిస్తున్నాయో తెలియటంలేదు"
మీర సహనం కోల్పోయింది.
"అస్తమానం పొలం పుట్రా అని తిరగటానికి మీకు విసుగనిపించటం లేదూ?"
శాము కనుబొమ్మలు ముడివేసి,
"అదేంమాట? రోజూ చూస్తా కదా అని సూర్యుడంటే విసుగొస్తుందా? భూమాత పవిత్ర స్నేహం లోనా మనసు ఐక్యమైంది. తల్లి అంటే విసుగు చెందే పిలల్లుంటారా? ఆమె సౌందర్యం నిత్యనూతనం. ఆమె స్నేహం అమరమూను. ఆమె సేవలోనున్న తృప్తి, ఆనందాలు నీ పుస్తకాలవల్ల కలుగగలవా?" అన్నాడు.
"మీకు భూమాత సహవాసం ఎలా నిత్య నూతనమో నాకు పుస్తకాలవల్ల కలిగే శాంతి కూడ అపరిమితం. మీరు సాహిత్యంలో ఎలా సౌందర్యాన్ని చూడలేరో, అలాగే భూదేవిలో అందం కనిపించదు నాకు, నిద్రాహారాలకన్నా, పుస్తకాల ఆవశ్యకత ఎక్కువ నాకు. ఆకలి తీరడానికి, అన్నం కావలసి వచ్చినట్టే హృదయపు టాకలి తీరడానికి పుస్తకాలు కావాలి నాకు."
"మేము భూదేవి సేవ చేస్తున్నాము గనుకనే ప్రజలందరూ హాయిగా తిని తిరుగుతున్నారు. రైతు కూడా నాగలి వదిలేసి పుస్తకం చేబడితేప్రపంచం గతేమిటి? నీ సాహిత్యం ఏం సాధిస్తుంది?"
"సాహిత్యంవల్ల బుద్ధి వికసిస్తుంది. జ్ఞానార్జన కలుగుతుంది."
"నువ్వు జ్ఞానాన్ని ఆర్జించి, ఏ రాజ్యాన్ని ఏలాలో చెప్పు? నా హృదయ రాజ్యాన్ని ఏలుకోవటానికి ఈ జీవంలేని పుస్తకాలు అనవసరం. మరులు గొలిపే నీ కళ్ళు, బంధించే చేతులూ అన్ని అడ్డంకులనూ ఒక్క ముద్దుతో దూరంచేసే నీ పెదవులు ఇవి చాలు ఈ రాజ్యానికి."
