Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 20


                                           11

    సుజాతవచ్చి ఆర్నెల్లవుతూంది. రోజులు తొందరగా గడిచిపోతున్నాయి. ఆమెకి యితరత్రాయే ఆలోచనలు, ఏ దిగులూ, బాధ లేకుండా చాలా హాయిగా, కులాసాగా గడిచిపోతున్నాయి. ఆ యింట్లో యెవరికీ సుజాత జీతమెచ్చి పెట్టుకున్న  మనిషన్న సంగతి గుర్తులేదు. సుజాతని పై మనిషిగా యెవరూ అనుకోరు. కల్యాణికి అయితే సుజాత లేకపోతే ఏ విషయంలోనూ ఒక్కక్షణం గడవదు. పిల్లలు 'ఆంటీ, ఆంటీ' అంటూ ఒక్కక్షణం వదలకుండా వెనక వెనక తిరుగుతూంటారు. ఆఖరికి సరస్వతమ్మ కూడా 'నీవు వచ్చాక హాయిగా వుంది, నీవు లేకపోతే యీ ఇల్లు గడవదమ్మాయి అంటుంది. ఇప్పుడు కల్యాణిని సుజాత 'ఆంటీ' అంటుంది.
    ఆ యింటిలో తను చేస్తున్నపని సుజాతకి యేమాత్రం కష్టం కలిగించకపోగా చాలా ఆనందంగా, గర్వంగా వుండేది. ఈ ఆర్నెల్లలో సుజాతకి వళ్ళు వచ్చి, మంచి రంగు వచ్చి నునుపుదేలింది. ఆ వూరు వాతావరణం, శుభ్రమయిన తిండి, చీకు చింతలేని జీవనం-తన అదృష్టం అనిపించేది సుజాతకి అక్కడికి రావడం.
    సుజాత తండ్రి సూర్యనారాయణగారు, "ఆర్నెల్లయింది వెళ్ళి, ఓ వారం రోజులు శలవుపెట్టి రా, చూడాలని వుంది. అమ్మ మరీ మరీ కలవరిస్తూంది నిన్ను చూడాలని" అంటూ యీ మధ్య రెండు మూడు ఉత్తరాలు రాశారు. నిజం చెప్పాలంటే సుజాతకి అప్పటికీ యింటికి వెళ్ళాలని లేదు. తల్లి, తండ్రిని చూడాలనిపించినా యిక్కడ తను లేక పోతే యింట్లో యెంత యిబ్బంది అవుతుందో తెలిసే కల్యాణిని శలవు కావాలని అడగలేకపోయింది. ప్రస్తుతం రాలేనని, యింట్లో వంటవాడు కూడా లేడని రాసింది యింటికి.
    నాయరు వెళ్ళిపోయిందగ్గిరనించి వంటకూడా సుజాత చూస్తూందని ఆమె జీతం పెంచాలనుకుంది కల్యాణి. కానీ 'వంట చేస్తున్నావు, జీతం పెంచాను' అంటే సుజాత బాధపడుతుందేమో ననిపించింది. ఆ మధ్య సుజాత తండ్రికి వంట్లో బాగులేదు అంటే, సుజాతతో చెప్పకుండా ఓ ఐదువందలు ఆమె తండ్రిపేర పంపింది కల్యాణి. తండ్రి ఆ విషయం రాశాక సుజాత ఆశ్చర్యపోయి కల్యాణిని అడిగింది అనుమానంగా.
    "ఏం లేదు సుజాతా, నాయరు వెళ్ళిపోయిందగ్గిరనుంచి వంటపని కూడా నీ నెత్తిన పడింది. అంత చాకిరీ చేయించుకుంటూ రెండువందలీయడం నాకే సిగ్గనిపించింది."
    "వంట చేస్తున్నానని యిచ్చారా? నేను యెక్కువ డబ్బుకోసం వంటచేస్తా ననలేదు" అంది నొచ్చుకుంటూ సుజాత.
    "ఛా.....ఛా అదికాదు సుజాతా, నీవు నాకు చేస్తున్నదానికి ఎంత యిచ్చినా సరిపోదు. అందుకోసం కాదు, మీ నాన్నగారికి వంట్లో బాగులేదని" అంటూ సర్ది చెప్పింది. సుజాత మనసు కృతజ్ఞతతో నిండిపోయింది.
    తన జీతం అంతా యింటికే పంపేది సుజాత. ఓ యిరవై రూపాయలు యేదన్నా అవసరానికి వుంటుందని ఉంచుకునేది. కానీ ఆ యిరవై కూడా ఖర్చయ్యేదికాదు. ఇంటిలో మనిషిలా ఉన్న సుజాతకి వేరే ఖర్చు యేం ఉంటుంది? సబ్బులు, నూనెలు, చాకలి, సినిమాలు అన్నీ కాక, ఆఖరికి బట్టలుకూడా కల్యాణే కొంటూంది సుజాతకి యీ మధ్య. సూర్యనారాయణ గారికి కూతురు డబ్బు పంపడం ఆరంభించాక కాస్త కాలు, చెయ్యి కుదుటపడడానికి వీలయింది. కూతురు పంపిందంతా ఖర్చు చేసేయక సగం దాచి, రెండేళ్ళు పోయాక డబ్బు జతపడ్డాక, ఆ డబ్బుకి తను మరి కాస్త అప్పో సప్పో చేసి జోడించి కూతురి పెళ్ళి చెయ్యాలని ఆయన ఉద్దేశం.
    
                                            12
    
    ఆ రోజు ఉదయం ఆస్పత్రికి వెళ్ళిన కల్యాణి పదకొండుగంటలకే యింటికి వచ్చేసింది. ఆమె వెంట కారులో ఫ్రంటు సీటులోంచి పొడుగ్గా, తెల్లగా ఎయిర్ ఫోర్స్ దుస్తులతో వున్న యువకుడు దిగాడు. నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ లోపలికి వస్తున్న ఇద్దరిని వంటింటి గుమ్మంలో నిలబడి ఆశ్చర్యంగా చూసింది సుజాత.
    తను అక్కడికి వచ్చిన ఆరేడు నెలల్లో కల్యాణి ఆస్పత్రినించి అంతతొందరగా రావడం చూడలేదు. అంతేకాక ఆరోజు కల్యాణి మొహంలో వెల్లివిరుస్తున్న ఆనందోత్సాహాలని కూడా వింతగానే చూసింది. ఆ రోజున్నంత కళగా ఆమె మొహం యిదివరకెన్నడూ కనపడలేదు. జీవితంలో అన్నీ వున్నా యెప్పుడూ యెందుకో కల్యాణి మొహం అలసటగా, నీరసంగా, నిర్లిప్తత, నిస్పృహల ఛాయలు తొంగిచూసేవి. పనివల్ల విశ్రాంతి లేక అలా వుంటారుగాబోలు అని ముందు రోజుల్లో సుజాత అనుకునేది. తర్వాత తర్వాత యింటిలో భార్యభర్తల ప్రవర్తన చూసేక భర్త ప్రవర్తనవల్ల అలా వుంటుంది అనుకుంది. కానీ యీరోజు కల్యాణిని చూస్తుంటే ఓ పది సంవత్సరాలు చిన్నదానిలా చలాకీగా కన్పించింది.
    లోపలికి వస్తూ వంటింటి గుమ్మంలో నిల్చున్న సుజాతని చూస్తూ "రెండు కప్పుల మంచి కాఫీ కావాలి సుజా!" హుషారుగా అన్నది కల్యాణి. మేడ మెట్లవేపు వెడుతూ "పైకి తీసుకుర, ఏం!" అంది, సుజాత తల వూపింది.
    "ఆ అమ్మాయి యెవరు కల్యాణీ" అనడిగాడు ఆనంద్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS