"ఎలా తెలిస్తే ఏమిటి? ఆ టెండర్ లో ఎంతకు కోట్ చేసారో? నీకు, మీ చైర్మన్ కు తప్ప మరొకరికి తెలియదు. ఆ ఫిగర్ నాకు చెబితే... ప్రాఫిట్ లో ఫైవ్ పర్సెంట్... అంటే మినిమమ్ అయిదు లక్షలు మీకు యిస్తాను. అడ్వాన్స్ గా ఇప్పుడే ఒక లక్ష యిస్తాను. ఈ విషయం బయటకు వెళ్ళదు. మీరు మామూలుగా జాబ్ చేస్తూనే వుండొచ్చు. ఈ డబ్బు ఫ్యూచర్ లో మీ పెళ్ళికి పనికి వస్తాయి. ఏమంటారు?" అడిగాడు రామ్ బెనర్జీ.
కాదంబరి లేచింది.
"అదేమిటి! నా ప్రశ్నకు సమాధానం యివ్వకుండానే వెళ్తున్నారు?"
"మీరెవరు?" అడిగింది కాదంబరి.
"వాట్?! అయామ్ బెనర్జీ. రామ్ బెనర్జీ."
"ఐ.సీ.... సో వాట్.... యింత వరకూ ఒకప్పుడు నాకు హెల్ప్ చేశారనే కృతజ్ఞతతో మాట్లాడాను. ఇప్పుడు నాకు జీతం ఇచ్చి, నా జీవితాన్ని నిలబెట్టిన కంపెనీకే వెన్నుపోటు పొడవమన్న తర్వాత.... మీరెవరైనా ఐ డోంట్ కేర్... ఐ డోంట్ స్పేర్... దయచేసి ఇంకెప్పుడూ నన్ను కలవాలని ప్రయత్నించకండి" చెప్పి సీరియస్ గా బయటకు నడిచింది కాదంబరి.
కాదంబరి వెళ్ళిపోవడంతో ఆమెను అప్పటివరకు గమనిస్తున్న మరో వ్యక్తి కూడా అక్కడ్నుంచి కదిలింది.
ఆ వ్యక్తే విరజ.
కాదంబరి ఆఫీసు టైంలొ మరో వ్యక్తితో కలిసి రెస్టారెంట్ లోకి రావడం చూసి అనుమానంగా ఫాలో అయింది.
అక్కడ వాళ్ళమాటలు, కాదంబరి రియాక్షన్ చూసేక తృప్తిగా అక్కడ్నుంచి కదిలింది.
* * *
చాలా చిరాగ్గా వుంది కాదంబరికి. మరోపక్క ఇరిటేటింగ్ గా కూడా వుంది. రామ్ బెనర్జీ మాటలు తలుచుకుంటూ వుంటేనే ఆమెకు శరీరమ్మీద తేళ్ళు జెర్రెలూ పాకిన ఫీలింగ్ కలుగుతోంది.
ఈ మనుష్యులు ఎలా అవకాశవాదులుగా మారుతారు. చిన్న సాయం చేసి, పెద్ద ప్రతిఫలం ఆశిస్తారు. నిస్వార్ధమనే ముసుగుతో, స్వార్ధంగా బ్రతికేస్తారు.
ఆలోచిస్తూ వుంటే ఆమెకు మెల్లిమెల్లిగా అనుమానం అధికం కాసాగింది. తన డబ్బు దొంగ ఎత్తుకెళ్ళే ప్రయత్నం అంతా నాటకమా? అతను తన కంపెనీకి రైవల్ కావాలని పథకం ప్రకారం జరుగలేదు కదా?! ఆ ఆలోచనకే ఆమె వెన్నులో నుంచి చలి పుట్టించేలా చేసింది.
సడన్ గా చైర్మన్ మాటలు గుర్తొచ్చాయి. మన కంపెనీ రహస్యాలు లీక్ అవుతున్నాయి. తను బ్యాంకుకు వెళ్తున్నట్టు ఎవరికి తెలుసు? ఒక్క సెక్షన్ ఇన్ ఛార్జి శర్మకు తప్ప. మిగతా స్టాఫ్ ఎవరికీ తెలిసే అవకాశం లేదు. అంటే శర్మ... రామ్ జీ కలిసి.... మెల్లి మెల్లిగా మిస్టరీ అంతా విడిపోతున్న ఫీలింగ్...
* * *
అభినయ్ తన ఛాంబర్ లోకి రాగానే కాదంబరిని పిలిచాడు. కాదంబరి సూట్ కేస్ తో వచ్చింది.
"ఏమిటిది కాదంబరి?" అడిగాడు సూట్ కేస్ వైపు చూస్తూ.
"బ్యాంకు నుండి డ్రా చేసిన రెండు లక్షలు సార్... మీరు మండే వస్తారని రాలేదు కదా... తప్పనిసరి పరిస్థితిలో ఆఫీసు లాకర్ లో పెట్టాను. చాలా టెన్షన్ ఫీలయ్యాను".
"టెన్షన్ ఫీలయ్యావా? ఎందుకు?"
"ఎందుకేమిటి సార్... ఆ డబ్బు పోతే...?"
"ఎలా పోతుంది?"
"ఎలా అంటే ఎలా చెప్పను సార్. అంటూ శనివారం రోజు జరిగిన సంగతి అంతా చెప్పింది. చివరికి మార్నింగ్ రామ్ బెనర్జీ వచ్చిన విషయంతో సహా".
"వెరీ గుడ్.... నాకందుకే నువ్వు నచ్చుతావ్ కాదంబరీ.... నీ సిన్సియార్టీ నచ్చుతుంది. అన్నట్టు నీ అనుమానం నిజమే. శర్మ మధ్యాహ్నం రామ్ బెనర్జీతో మాట్లాడాడు. ఆ ఫోన్ ని ట్రేస్ చేశాను. అతని 'డిస్ మిస్' ఆర్డర్ త్వరగా పంపించి, అతని అకౌంట్ సెటిల్ చేయండి. నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదని చెప్పండి" చెప్పాడు అభినయ్.
"సార్.... మీరు చాలా షార్ప్ గా నిర్ణయాలు తీసుకోగలరు. నేనింకా డౌట్ చేసుకోకముందే మీరు శర్మను ఫైండవుట్ చేశారు" అంది అడ్మయిరింగ్ గా కాదంబరి.
అభినయ్ లేచి ఫ్రిజ్ లోని వాటర్ బాటిల్ తీసుకోవడానికి ముందుకు కదిలాడు.
"అయ్యో! నేను తెస్తానుండండి సార్" అంటూ తను ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేయడానికి వంగింది.
సేఫ్టీ పిన్ లేకపోవడంవల్ల చీరకొంగు కిందకు జారింది. చేతిలో వాటర్ బాటిల్. అనాలోచితంగా అభినయ్ వెళ్ళి చీరకొంగు తీసి సర్దబోయాడు.
సరిగ్గా అప్పుడే తలుపు తెరుచుకుంది. లోపలికి వచ్చిన విరజ ఆ దృశ్యాన్ని చూసింది.
అంతా స్ప్లిట్ సెకన్ లొ జరిగిపోయింది.
* * *
తప్పు చేసినట్టు తలొంచుకుని వుంది కాదంబరి.
"చాలా ఎంబర్రాసింగ్ సిట్యుయేషన్. మేడమ్ తనని తప్పకుండా అపార్ధం చేసుకునే వుంటుంది. ఆ ప్లేస్ లో, ఆ సమయంలో ఎవరున్నా అలానే అపార్ధం చేసుకుంటారు".
అభినయ్ ఏదో చెప్పబోయాడు.
"హల్లో... కాదంబరీ... ఏంటీ లిబర్టీ స్టాచ్యూలా నిలబడిపోయావు? యూ ఆర్ లుకింగ్ స్మార్ట్ కాదంబరీ.... ఈ చీరలో అందంగా వున్నావు" అంది విరజ నవ్వుతూ.
కాదంబరి కన్ ఫ్యూజన్ గా చూసింది. వ్యంగ్యంగా అనడం లేదు కదా!
"సారీ మేడమ్.. అది అదీ... సెప్టీపిన్...లే"
"అబ్బా... ఏమైంది కాదంబరీ..." అంటూ అభినయ్ వైపు తిరిగి.
"అభీ! వేడివేడిగా మిరపకాయ బజ్జీలు తినాలని వుంది" అంది.
అభినయ్ వెంటనే తేరుకున్నాడు.
తను కాదంబరి చీరకొంగు సరిచేయడం చూసి ఎక్కడ క్లాసు పీకుతుందో అనుకున్నాడు. అలాంటిది...
"అభీ... నిన్నే... అసలు మీ ఇద్దరికీ ఏమైంది? వ్యావ్..." కాదంబరి వైపు తిరిగి....
"కాదంబరీ నాకీ చిన్న హెల్ప్ చేయగలవా?"
"చెప్పండి మేడమ్?"
"నాకు మిరపకాయ బజ్జీలు చేయడం రాదు. నువ్వు బాగా చేస్తావుగా...అప్పట్లో చాలాసార్లు తెచ్చేదానివి. ఈ మధ్య నీచేతి బజ్జీలు తిననే లేదు. నీకు ఆఫ్ డే లీవ్ గ్రాంట్ చేస్తాను గానీ... ఈ వెదర్ లో వెళ్ళి మంచి బజ్జీలు చేసుకొని రా... నువ్వేమి అనుకోవు కదా...!" అంది ఆఖరి మాట నవ్వుతూ...
"అయ్యో! మేడమ్... ఎంతమాట?" అంది నొచ్చుకుంటున్నట్టు కాదంబరి.
"పర్సనల్ పని అనుకోకపోతే కారులో వెళ్ళు".
విరజ మాట ఇంకా పూర్తి కాకుండానే...
"అలాగే మేడమ్.... ఆఫెన్ అవర్ లో వచ్చేస్తా... ఈలోగా మా బామ్మకు పిండి కలిపి మిరపకాయలు చీలి పెట్టమని చెబుతా..." అంది ఉత్సాహంగా ఫోన్ దగ్గరకు నడుస్తూ.
"థాంక్యూ కాదంబరీ" అంది మనస్ఫూర్తిగా విరజ.
కాదంబరి బామ్మకు ఫోన్ చేసి చెప్పింది. తను వచ్చేలోగా అన్నీ సిద్దం చేసి వుంచమని.
"కారు తీసుకువెళ్ళు కాదంబరీ" అంది విరజ.
"ఓ.కె. మేడమ్... థాంక్యూ...." అంటూ వెళ్ళిపోయింది కాదంబరి.
* * *
కాదంబరి వెళ్ళిపోయాక అభినయ్ విరజ దగ్గరగా వచ్చి.
"అసలేం జరిగిందంటే విరజా..." అంటూ మొదలెట్టబోయాడు.
"ఏంటీ జరిగేది కంకర పీసు... అయినా ఏంటలా సిగ్గుపడతావు. నువ్వే అలా వుంటే కాదంబరి మరింత ఇబ్బంది ఫీలవ్వదా?"
"అదికాదు విరూ!"
"ఏది కాదు... ఇదేమైనా తెలుగు సినిమా అనుకున్నావా? చూడు అభీ! ఒకమ్మాయ్ కొంగు జారినంత మాత్రాన, అది నువ్వు సరిచేసినంత మాత్రాన నీకూ, తనకూ మధ్య ఏదో వుందని అనుకోవడమేనా? డోంట్ లైకిట్..."
"వీరూ... నువ్వెంత మంచిదానివి..." అన్నాడు. అభినయ్ ఛాంబర్ డోర్ బోల్ట్ పెట్టొచ్చి. విరజను దగ్గరకు తీసుకుంటూ...
