Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 22


    "అవున్రా... నేను కూడా అదే ఫీలవుతున్నాను" అంది విరజ.
    "ఏయ్... నన్ను....'రా' అంటావా?" అంటూ విరజ చెవి పట్టుకున్నాడు.
    "పెళ్ళికి ముందు ప్రియురాలి కుడిచెవి పట్టుకొని మెలిపెడితే కవల ఆడపిల్లలు పుడతారట. ఇది చైనావారి నమ్మకాల ప్రకారం...." అంది విరజ.
    అభినయ్ నవ్వుతూ ఏదో అనబోయాడు. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. విరజను వదిలేసి ఫోన్ లిఫ్ట్ చేసి 'హల్లో...!' అన్నాడు.
    
                                 * * *
    
    కాదంబరి కారులో వెళ్తున్నంతసేపూ అనీజీగానే వుంది. ఓ వైపు యిబ్బందిగానే వుంది. ఛీ....దానికంతటికీ కారణం బామ్మే.... ఉదయమే సేఫ్టీ పిన్స్ పనిమాలా చెత్తబ్బాయికి ఇవ్వడమేంటి? సేఫ్టీపిన్ వుండి వుంటే పైట జారేదా? విరజగారు చూసేవారా? ఎంత ఎంబర్రాసింగ్... సిట్యుయేషన్. ఆవిడ మిస్సండర్ స్టాండ్ చేసుకుని ఉంటే...
    బామ్మమీదకోపం పీకలదాకా వచ్చింది.
    ఆమె ఆలోచనల్లో వుండగానే యిల్లు వచ్చేసింది.
    డ్రైవర్ ని వెయిట్ చేయమని చెప్పి లోపలికి నడిచింది.
    అప్పటికే బామ్మ మిరపకాయ మధ్యలోకి చీరుతోంది.
    "బామ్మా... నేను చీరతాను... తొందరగా అవుతుంది" అంది తనూ కూచుంటూ...
    బామ్మ లోపలికి వెళ్ళి సేఫ్టీ పిన్నుల గుత్తి తీసుకువచ్చి కాదంబరికి ఇచ్చింది.
    కాదంబరి అందులో నుంచి ఓ సేఫ్టీ పిన్ తీసి, మిరపకాయలు మధ్యలోకి చీరి, అందులోని మిరప గింజల్ని తీయసాగింది.
    గ్యాస్ మీద మూకుట్లో నూనె కాగుతోంది. నాలుగో మిరపకాయ చీరుతుండగా అప్పుడు డౌటొచ్చింది కాదంబరికి. వెంటనే బామ్మవైపు చూసి...
    "ఒసే.. బామ్మా... ఈ పిన్నుల గుత్తి ఎక్కడిదే...?" అని అడిగింది అనుమానంగా.
    "ఎక్కడిదేమిటి.... నీదే..." అంది.
    "నాదా?! మరి పొద్దున చెత్తబ్బాయికి చెవిలి గుబిలి తీసుకోవడానికి ఇచ్చానన్నావు!"
    "అదా... అవును... అలా అన్నాను కదూ! మర్చేపోయాను. అయితే వాడా గుబిలి తీసుకొని తిరిగిచ్చినట్టున్నాడు"
    "ఛీ... ఛీ..." అని... 'నిజం చెప్పవే బామ్మా!" అంది.
    "నిజం చెప్పాక నువ్వు అరవనంటే చెబుతాను".
    "అరవన్లే... చెప్పి చావు"
    "నీ కెలాగైనా పెళ్ళి చేయాలని నేను కలలు కంటున్నాను. మీ బాస్ కు లైనేయమంటే వేయడం లేదు. నేనే ఆ ప్రయత్నం చేద్దామని నీ సేఫ్టీ పిన్నులు తీశాను. ఎప్పుడూ మీ బాస్ తో రాసుకు పూసుకు తిరిగే ఉద్యోగం నీదాయె....నీపైట జారడం, మీ బాస్ చూడ్డం... మెల్లి మెల్లిగా అలా నీకు దగ్గరవుతాడని".
    "ఛీ....ఛీ.... ఇలాంటి చెత్తఐడియాలు నీకెలా వస్తాయి? అవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి..." అంది కోపంగా కాదంబరి.
    "అదిగో... అలా అంటే మరిగే నూనెలో చేయి పెడతా... నీకిదే చెబుతున్నా.... నువ్వు మీ బాస్ ను పెళ్ళి చేసుకున్నావా సరేసరి... లేదంటే నువ్వు ఆఫీసుకు వెళ్ళాక గ్యాస్ విప్పి, పేల్చుకు చచ్చిపోతా..." అంది బామ్మ.
    కాదంబరి బామ్మ మొహంలోకి చూసింది. బామ్మ సీరియస్ గానే ఆ మాటలు అంటున్నదని అర్ధమైంది.
    "సర్లే!" అంది చికాగ్గా.
    "సర్లే కాదు... నాకు మాటివ్వు" అంది.
    ఆపద్ధర్మంగా అలానే అంది.
    "హమ్మయ్య... వుండు.... మీ బాస్ కు వేడివేడి బజ్జీలు కమ్మగా చేసి పెడతా... నువ్వే తినిపించాలి. ఒళ్ళో కూచోపెట్టుకుని తినిపించినా ఫర్లేదు. పెళ్ళి కాకముందు, మీ తాతయ్యకు నేనూ అలానే తినిపించేదాన్ని" చెప్పింది బామ్మ.
    
                                 * * *
    
    అరగంటలో ఆఫీసుకు వెళ్ళిపోయింది కాదంబరి.
    చిన్న టిఫిన్ బాక్స్ లొ వేడివేడి మిరపకాయ బజ్జీలు మరో బాక్స్ లొ తరిగిన  ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ చెక్క తీసుకువెళ్ళింది.
    "థాంక్యూ...కాదంబరీ.... మిరపకాయ బజ్జీలు చూస్తుంటేనే నోరూరి పోతోంది. ఇంతబాగా మిరపకాయ బజ్జీలు చేయడం ఎవరికీ  రాదు". అంది.
    "వెల్ కమ్ మేడమ్..." అంటూ ఓ ప్లేటులో మిరపకాయ బజ్జీలు నీట్ గా అమర్చింది. వాటిని కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు పెట్టి, నిమ్మరసం పిండింది.
    "కమాన్ కాదంబరీ.... నువ్వూ కూచో" అంది విరజ.
    "నేనా- మేడమ్ మీరు కానివ్వండి".
    "కూచో కాదంబరీ!" అంది విరజ.
    ఇంకా బావుండదని వచ్చింది.
    ముగ్గురూ కూచుని మిరపకాయ బజ్జీలు తింటున్నారు. కరం నషాళానికి అంటింది. అభినయ్ కి పొలమారింది. విరజ కంగారుగా...
    "కాదంబరీ! వాటర్..." అంది కాదంబరి గబగబా ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసింది. సేఫ్టీపిన్ లేకపోవడంతో మరోసారి పైట జారింది.
    కంగారు... వెంటనే సర్దుకుంది ఆమె మొహం ఎర్రబడింది.
    "కాదంబరీ.... నువ్వేమిటో నాకు తెలుసు. అభీ ఏమిటో అంతకన్నా తెలుసు. ఉయ్ ఆర్ ఫ్రెండ్స్.... అన్నట్టు నీ కోసం వైజాగ్ నుంచి తెచ్చాను "అంటూ టేబుల్ మీద ఉన్న ప్యాకెట్ యిచ్చింది".
    "మేడమ్..." కాదంబరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ప్రపంచంలొ ఆర్ధ్రతను మించిన కంటతడి ఇంకేముంటుంది?"
    "సే... అక్కయ్యా..." అంది విరజ.
    కాదంబరి ఇంకేమీ మాట్లాడలేకపోయింది.
    "ఏయ్... కాదంబరీ... ఏంటీ...?" అన్నాడు అభినయ్ ఆమె కళ్ళముందు చిటికెలు వేస్తూ.
    కళ్ళు తుడుచుకుంటూ అంది "సార్.... విరజగారి లాంటి వాళ్ళు చాలా అరుదు.... యూ ఆర్ లక్కీ సర్ అంది కాదంబరి".
    "ముస్తాఫా... ముస్తాఫా.... డోంట్ వర్రీ ముస్తాఫా" అంది విరజ నవ్వుతూ.
    విరజను, అభినయ్ ని చూస్తుంటే కాదంబరి మనసులో అద్భుతమైన ఫీలింగ్ ఒక్క క్షణం బామ్మ గుర్తుకు వచ్చింది.
    
                                 * * *
    
    అద్వైతీ విండో కర్టెన్స్ ని పక్కకు లాగింది. గ్లాస్ విండోస్ నుంచి సిటీ కనిపిస్తోంది అందంగా. అసుర సంధ్యవేళ.. లైట్ల వెలుతురులో నగరం శోభాయమానంగా కనిపిస్తోంది.
    రేపు తను వుంటుంది?
    ఎల్లుండి తనది అవుతుందా?
    తనకు నిన్నటి గురించి తప్ప, రేపటి గురించి ఎలా తెలుస్తుంది?
    రేపు తను వుండకపోయినా, ఈ ఇల్లు, ఈ  అసుర సంధ్య, ఈ లైట్ల వెలుతురులో నగరం వుంటుంది అన్నీ ఎప్పటిలా వుంటాయి.
    తను మాత్రం...
    తనులేని ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? ఆమె గుండె పొరల్లో ఏదో ప్రకంపనం.
    తన గదిలో ముసురుతున్న చీకట్లని పారద్రోలడానికి లైటు వేసుకోవాలన్న స్పృహ కూడా లేదు ఆమెకు. మనసు పొరల్లో చీకటి దాగుంది గనుక.
    
                                   * * *
    
    కూతురి గదిలోకి అడుగుపెట్టిన మహాపతి ఆ గది చీకటిగా వుండడం చూసి లైటు వేశాడు.
    "ఏమ్మా! లైటు వేసుకోలేదేమిటి?" అడిగాడు ఆర్తిగా కూతుర్ని.
    "గదిలో చీకటిని పారద్రోలడానికి లైటు వేసావు. వెలుతురు వస్తుంది. మరి నా మనసులోని చీకటి పారద్రోలడానికి...." అద్వైతి గొంతు వణికింది.
    ఆ తండ్రి మనసు కలుక్కుమంది.
    మహాపతికి డాక్టర్ అన్నమాటలు గుర్తుకొచ్చాయి.
    "ఈ ప్రపంచంలో కళ్ళు, కిడ్నీ ఏవి కావాలన్నా దొరుకుతాయి. అన్నీ రెండేసి వుంటాయి కాబట్టి... కానీ గుండె ఒక్కటే ఉంటుంది. బలహీనంగా వున్న నీ కూతురి గుండెను మార్చాలంటే ఆరోగ్యంగా వుండి, చావును ఆహ్వానిస్తూ 'గుండె'ను ధారాదత్తం చేయగల మనిషి కావాలి. లేకపోతే ఎప్పటికైనా అద్వైత ఆయుష్షు ప్రశ్నార్ధకమే..."
    మహావతి గుండె చెదిరింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS