Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 20


    "అవుతోంది గానీ... 'నా సేఫ్టీ పిన్స్' కనిపించడం లేదు. నువ్వుగానీ చూశావా?"
    "సేఫ్టీ పిన్సా? అంటే ఏమిటి?" బామ్మ దీర్ఘం తీస్తూ అడిగింది.
    "అవే పిన్నీసులు మరీ తెలియనట్టు నటించకు" కోపంగా అంది.
    "ఓహో... అవా....యిందాకే చెత్తబ్బాయ్ చెవిలో గుబిలి తీసుకుంటానంటే యిచ్చాను. అయినా అవెందుకే?"
    "ఆ! ఆఫీసులో లాకర్ కు తాళం వేద్దామని.... సేఫ్టీ పిన్స్ ఎందుకో తెలియదా? చీర కొంగు జారిపోకుండా పెట్టుకోవడానికి" అంది కాదంబరి.
    "నాకేం తెలుసే....మా కాలంలో ఈ పిన్నీసులు పెట్టుకోవడమెక్కడిదే. అయినా నీది ఛాదస్తం కాకపోతే.. నేనైతే ఏనాడూ పిన్నీసు పెట్టుకొని ఎరగను...." అంది బుగ్గలు నొక్కుకుంటూ బామ్మ.
    "ఛీ....నిన్ను కదిలించడం నాదే తప్పు" అంటూ బయటకు వచ్చింది. టైం టెన్ అవుతోంది.
    "ఏంటే ఆ కంగారు...? మీ బాస్ వచ్చేది యివ్వాళే కదూ" అడిగింది బామ్మ.
    "అవును"
    "కాస్త నీట్ గా సింగారించుకొని వెళ్ళు.... యిదేం చీరే.... కన్నాంబ కాలంనాటి చీరలా.... కళ్ళు చిట్లించి చూసినా ఏమీ కనిపించదు. సిల్క్ చీర కట్టుకెళ్ళవే... మీ బాస్ కళ్ళు చెదిరిపోవాలి....." చెప్పింది బామ్మ.
    "అబ్బ... నీ వెధవ సలహాలరావు... అసలే సేఫ్టీ పిన్ దొరక్క చస్తున్నాను. యింత ఉదయాన్నే షాపులు కూడా తెరిచి చావరు. ఎంత ఇబ్బందిగా వుంటుందో నీకేం తెలుసు. అస్తమానం కొంగు జారిపోతూ వుంటే సర్దుకుంటూ వుండాలి ఆ పనిలో..." అంది కాదంబరి ఇరిటేటింగ్ గా...
    "ఏం చేస్తామే తల్లీ... ఆ చెత్తబ్బాయి చెవిలో గుబిలి కోసం పిన్నీ నడుగుతాడని నేను మాత్రం కలగన్నానా ఏమిటి?" అంది బామ్మ అమాయకంగా ముఖం పెడుతూ.
    "అయినా అన్ని పిన్నీసులూ ఎందుకిచ్చావే?"
    "వాళ్ళింటిలో అందరికీ కావాలని అడిగాడే....!"
    మరింత అమాయకంగా చెప్పింది బామ్మ.
    "సర్లే... నేను వెళ్తాను..." అని బయటకు నడిచింది కాదంబరి.
    "కాదంబరి కాస్త మీ బాస్ ను లైన్ లో పెట్టవే.... నీ లైనులో మీ బాస్ పడితే... ఏడుకొండలూ బస్సులో వస్తానని మొక్కుకున్నానే.... పైగా నీ మొగుడి వెంట్రుకలు కూడా యిస్తానని మొక్కుకున్నాను" వెనక నుంచి కాదంబరికి వినిపించేలా అరిచి చెప్పింది బామ్మ.
    కాదంబరి ఆసరికే వెళ్ళిపోయింది.
    "పిచ్చి మనవరాలు... తనే కావాలని పిన్నీసులు దాచిన సంగతి చెప్పలేదు. ఈ వంకతో కొంగు జారినప్పుడల్లా ఆ బాస్ తన మనవరాలి వంక గుటకలు మింగుతూ చూస్తాడు. అలా అలా ఏదో ఓ క్షణం తన మనవరాలి ఒళ్ళో వాలుతాడు. మనసులో అనుకుంది బామ్మ బొడ్లో ఉన్న పిన్నీసుల గుత్తి తీసి....బీరువా అడుగున జాగ్రత్తగా పెడుతూ!
    ట్రెండ్ మారింది.
    బామ్మల ఆలోచనలు కూడా మారిపోతున్నాయి. రాన్రాను ఇలాంటి బామ్మలు తయారవుతున్నారు.
    
                                                              * * *
    
    రామ్ బెనర్జీ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అప్పుడే లోపలికి వచ్చాడు శర్మ. రామ్ బెనర్జీ వెంటనే ఫోన్ పెట్టి.
    "కమాన్ శర్మా.... ఏమిటి విశేషాలు? రా! కూర్చో!" అన్నాడు.
    "ఎంత కూల్ గా ఇన్వయిట్ చేసార్సార్.... ఆరోజు ఏమిటిసార్ అలా బార్ లో వదిలేసి వెళ్ళారు. బార్ వాడు నావైపు అదోలా చూశాడు...." ఏడుపు గొంతుతో అన్నాడు శర్మ.
    "హోప్.... అదా.... అర్జెంట్ గా మా బావ రమ్మని సెల్ చేశాడు." నోటికొచ్చిన అబద్దం ఠకీమని చెప్పడం అతని ప్రత్యేకత.
    "ఇప్పుడు మీకో మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను సార్!" అన్నాడు శర్మ.
    "నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ నేనా?" అడిగాడు అనుమానంగా రామ్ బెనర్జీ.
    "అదేమిటిసార్.... అంత మాటంటారు. మా చైర్మన్ యివ్వాళే వచ్చారు. గోల్డెన్ హిల్స్ లో కట్టే త్రీ బెడ్రూం అపార్ట్ మెంట్స్ కు కొటేషన్ పంపిస్తున్నారు. ఆ కొటేషన్ అమౌంట్ తెలుసుకొని, మీరు తక్కువ కోట్ చేయగలిగితే మినిమమ్ కోటి రూపాయలు మిగులుతుంది.
    బెనర్జీ.... మొహంలో రంగులు మారాయి.
    "ప్రామిస్.... సర్....నా మాట నమ్మడం లేదా? ఈ విషయం వెంటనే మహాపతి సార్ కు చెప్పండి. ఆయన ద్వారా నాకు మంచి బక్లీన్ ఇప్పించండి".
    "శర్మా! నువ్వు నాకు యిందుకు నచ్చుతావయ్యా... అన్నట్టు మొన్న డబ్బు కావాలని అడిగావు కదూ.... యిదిగో అయిదువేలూ ఉంచు..." అంటూ టేబుల్ సొరుగులో నుంచి యాభై రూపాయల కట్ట తీసిఇచ్చాడు.
    "అదేంటో సార్...మీకు నామీద ఎప్పుడూ దయ పొంగిపొర్లుతూ వుంటుంది. మీరు వెంటనే రంగంలోకి దిగాలి"
    "అది సరేనయ్యా.... ఆ టెండర్ లో ఎంత కోట్ చేసి వుందో తెలియాలి కదా!"
    "అవున్సార్.... ఈ మూడ్రోజూలూ కాదంబరి గారితో ఫ్రెండ్ షిప్ డెవలప్ చేసుకున్నారుగా.... ఏం చేస్తారో మీ యిష్టం..." చెప్పాడు శర్మ.
    "అది నాకు వదిలేయ్ శర్మా...అన్నట్టు కాదంబరి మేడమ్ ఇప్పుడెక్కడుంది?"
    "మా చైర్మన్ మధ్యాహ్నం ట్వల్ థర్టీకి వస్తారని తెలిసింది. మేడమ్ ఇప్పుడు ఒక్కరే వుంటారు. మా ఆఫీస్ పక్కనే రెస్టారెంట్ వుందిగా.... అక్కడికి పిలిపించి మాట్లాడండి. జాగ్రత్త సుమా... నా పేరు బయటకు రానీయకండి" చెప్పి వెళ్ళిపోయాడు శర్మ.
    రామ్ బెనర్జీ ఆలోచిస్తున్నాడు. ఈ టెంపర్ తను వేయాలి. డబ్బు మాత్రం అద్వైత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి అరేంజ్ చేయాలి. లాభం తనది.... పెట్టుబడి తన బావది. ముందుగా కాదంబరిని ట్రాప్ చేయాలి. ఎలా? డైరెక్ట్ గా డీల్ చేస్తే...
    కొన్ని విషయాల్లో రామ్ బెనర్జీ డైరెక్ట్ గా ఎప్రోచ్ అవుతాడు. ఇప్పుడు సరిగ్గా అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. వెంటనే కాదంబరికి ఫోన్ చేశాడు. రెస్టారెంట్ కు రమ్మని చెప్పాడు.
    
                                     * * *
    
    రెస్టారెంట్ లో ఇద్దరూ కలుసుకున్నారు.
    "చెప్పండి సార్... నన్ను అర్జెంటుగా రమ్మని ఎందుకు పిలిచారు? ఆక్చువల్ గా ఆఫీసు టైంలో రాను. కానీ మీరు ఒకప్పుడు రెండు లక్షల రూపాయలు దొంగల బారిన పడకుండా కాపాడారు. ఆరోజు మీరు ఆ హెల్ప్ చేయకపోతే నా ఉద్యోగం, పరువూ పోయేవి...."
    "వదిలేయండీ కాదంబరీ.... అదంతా ఫాస్ట్.... ఇప్పుడు మీకు ఓమంచి ఆఫర్ అప్రోచ్ చేయాలని అనుకుంటున్నాను" చెప్పాడు బెనర్జీ.
    "మంచి ఆఫరా? ఏమిటది?" ఆశ్చర్యంగా అడిగింది కాదంబరి.
    "మా అద్వైతి గ్రూప్ ఆఫ్ యిండస్ట్రీస్ లో మీకు పి.ఎ జాబ్ ఆఫర్ చేయాలని అనుకుంటున్నాను".
    "థాంక్స్ సర్! బట్ వెరీ వెరీ సారీ.... నేను ఆల్రెడీ విరజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పి.ఎ.గా చేస్తున్నాను".
    "అఫ్ కోర్స్....అక్కడి కన్నా రెండింతలు శాలరీ.... ప్లస్ కంపెనీ గెస్ట్ హౌస్....కారు ఫెసిలిటీస్...."
    "వన్స్ అగైన్ సారీ సర్.... నాకు మా కంపెనీలో బాగానే వుంది. ఇక జీతం, కారు, యిల్లు అంటారా? మనిషి బ్రతకడానికి ముఖ్యంగా నా కుటుంబం గడవడానికి సరిపడా జీతం వస్తోంది. అదీగాక, మా చైర్మన్ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు".
    "ఓహ్... బీ ప్రాక్టికల్ కాదంబరి గారూ...."
    "సారీసర్... నేనిక వెళ్తాను..." అంది లేవబోతూ కాదంబరి.
    "ఓ.కె.....ఓ.కె.....జాబ్ ప్రస్తావన వదిలేయండి. మీకు ఓ మంచి ప్రపోజల్....".
    "ఏమిటది?" అన్నట్టు చూసింది కాదంబరి.
    "మీరు గోల్డెన్ హిల్స్ అపార్ట్ మెంట్స్ కన్ స్ట్రక్షన్స్ కు టెండర్ వేస్తున్నారు కదా!"
    "అవును కానీ, మీకీ విషయం ఎలా తెలుసు?" అనుమానంగా అడిగింది కాదంబరి. "మన కంపెనీ విషయాలు బయటకు వెళ్తున్నాయి జాగ్రత్త..." అని చైర్మన్ హెచ్చరించిన విషయం గుర్తుకొచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS