"అంటే" త్రాచులా లేచింది రమ్యశ్రీ.
"సింపుల్ మేడమ్! సన్నివేశాన్ని బట్టి పాత్రల మాట్లాడాలి. అది రూలు డైలాగు బాగుంది కాబట్టి ఓ పతిత పతివ్రత చెప్పే మాటలు పలక్కూడదు."
అతడి వ్యంగ్యం అర్ధమైనట్టు ఆవేశంగా డైరెక్టరు వైపు దూసుకుపోయింది రమ్యశ్రీ. "మీ అసిస్టెంటు ఎంతకి తెగించాడో విన్నారా?"
"ఇది దారుణం" రామన్ కూడా ఆమెను సమర్ధించాడు. "అంటే అక్కడికి మీరు ఓ పతితని ఎగతాళి చేయడమేగా?"
కాల్ షీట్స్ కోసం వచ్చిన రామన్ ఇలా స్కోర్ చేసేసరికి రెచ్చి పోయిన రమ్యశ్రీ అంది మొండిగా.
"లాభం లేదు. ఆ అసిస్టెంటు డైరెక్టరు సెట్ లో వుంటే నేను షూటింగ్ కి రాను.....అంతే."
అనడమే కాదు..... వెళ్ళిపోవటానికి సిద్దపడింది.
"ఆగు రమ్యా" అప్పుడు జోక్యం చేసుకున్నాడు సుదర్శనరావు "నువ్వు వెళ్ళనవసరం లేదు. శివనే పంపేస్తున్నాను."
"సర్...."
"ఎస్! ఈ రోజు నుంచీ నువ్వు నాతో పనిచేయడం లేదు. నిన్న శాశ్వతంగా బయటికి పంపుతున్నాను."
"సర్! అసలు నేను...."
"ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపో."
హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
ఒక నిజాయితీ పరుడైన అసిస్టెంటును కేవలం "ఇగో" మూలంగా సాగనంపుతున్నారని అక్కడ అందరికీ తెలుసు. కానీ ఏ ఒక్కడూ అతడ్ని సమర్ధించలేదు.
శివ వెళ్ళిపోతుంటే సుకృతి మనసు ద్రవించింది.
చాలా స్వల్ప పరిచయమే అయినా ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
అందరి అవకాశవాదుల్లో తనూ ఒకడై రమ్యశ్రీకి తాళం కొట్టిన తండ్రి
మీద ఎంత కోపం వచ్చిందీ అంటే "ఆగు" అంది సుకృతి.
కాలెక్కబోయిన రామన్ వెనక్కి చూశాడు.
జుగుప్సగా చూస్తుంది సుకృతి.
"ఏం కావాలి" కేజువల్ గా అడిగాడు రామన్.
నిజానికి సుకృతి నిలదీయాలనుకున్నది శివకి వ్యతిరేకంగా ఇందాక రామన్ ప్రవర్తించిన తీరు గురించి.
"అమ్మ విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను."
"అది నాకేమీ కాదని నీకు నేను ముందే చెప్పాను."
"కానీ ఇప్పుడు మీరు అనుభవించే ప్రతి పైసా నా తల్లిది."
"కావచ్చు. కానీ ఇప్పుడు నీ తల్లి ఆస్తికి చట్టపరంగా నేను అధిపతిని."
ఉక్రోషంగా నవ్వింది సుకృతి. "చట్టపరంగా నువ్వు ఓ కుటుంబాన్ని మోసం చేయగలిగినా ఇప్పుడున్న నీ స్థానం నీకూ శాశ్వతం కాదు రామన్."
"బెదిరిస్తున్నావా?"
"లేదు..... నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నాను. నిన్ను నమ్మి తన సర్వస్వమూ అర్పించిన ఓ ఆడదాని విషయంలో కనీసం పాటించాల్సిన నైతిక విలువలు గురించి మరిచిపోవద్దని గుర్తుచేస్తున్నాను."
"నీ తల్లి కోసం నువ్వూ బజార్లో అడుగు పెట్టావుగా?"
"అలా నన్ను బజార్లోకి నెట్టిందీ నువ్వేగా?"
"బజారు ఆడదానికి పుట్టింది బజార్లో వుండక భవంతుల్లో వుంటుందా?"
"మిస్టర్ రామన్....."
"గో టూ హెల్"
"ఐ జెస్ట్ కాంట్ గో ఎలోన్ మిస్టర్ రామన్..... ఐ విల్ సీజ్ యువర్ ఫేట్ బై హోల్డింగ్ ది త్రోట్ అండ్ మేక్ యు టెస్ట్ ది హెల్.....యా....."
"నువ్వు....." సర్కాస్టిక్ గా నవ్వాడు. "నన్ను నరకడానికి నెడతావా....ఆఫ్టరాల్ అవసరంకోసం మగదికింద నలిగి డబ్బులు సంపాదించే నువ్వు నన్ను నరకానికి పంపుతావా?"
"నీకూ నాకూ తేడా ఏముంది రామన్...... నువ్వు సంపాదించిందీ మేల్ ప్రాస్టిట్యూషన్ లోనేగా."
"యూ బిడ్" కోపాన్ని నిభాయించుకోలేని రామన్ చేయి బలంగా సుకృతి చెంపని తాకింది.... "నన్ను మేల్ ప్రాస్టిట్యూట్ అంటావా....."
మరోసారి అతడి చేయి పైకి లేచేదే"
ముందుకు వచ్చింది రమ్యశ్రీ ఉత్సాహంగా. "అరే పోయింది వదిలేయండి రామన్ గారూ!"
సుకృతి కళ్ళనుంచి నీళ్ళు రాలడం లేదు. చుట్టూ చేరిన జనాన్ని ఓ మారు కలియచూసింది. తననూ తన కుటుంబాన్ని రోడ్డుపై కీడ్చిన ఓ మగాడి ద్వేషాన్ని, దుర్మార్గాన్ని వినోదంగా చూస్తున్నారంతా.
రేపు ప్రపంచాన్ని మండించే సూర్యుడు దెబ్బ తగిలిన సుకృతి చెంపపై అప్పుడే ఉదయించిన సాక్ష్యంగా ఆమె చెంప ఎరుపెక్కింది.
"గుర్తుంచుకుంటాను మిస్టర్ రామన్ నిన్నంత బలవంతుడ్ని చేసిన ఈ క్షణాల్ని, ఇప్పుడు నాకు జరిగిన పరాభవాన్ని పదిలంగా మనసులో దాచుకుంటాను."
"దాచుకుని ఏం చేస్తావే?"