ఆమె చెప్పే మాటలకి కౌసల్య గుండె తరుక్కుపోయింది . 'దేవుడి లాంటి అన్నయ్య దేవత లాంటి వొదిన! అసలు ఆ ఇల్లే ఒక దేవాలయం. ఆ పవిత్ర ఆలయంలోకి రాక్షసుడిలా చొరబడ్డాడు తన భర్త. అంతవరకు ఆ ఇంట్లో ఉండే అభిమానం, అనురాగం అంతా ఇతని పుణ్యమా అంటూ హరించుకుపోతుందేమో? వీల్లేదు! తన భర్త వల్ల కానీ, తన వల్ల కానీ ఆ దంపతుల జీవితాల్లో ఒక్క విషబిందువు కూడా రాలకూడదు. వారి మనస్సులో అశాంతి చెలరేగకూడదు' అనుకుంది రాదని పట్టుకుని "వొదినా! మీరెంత మంచివారోదినా! మీ ఋణం నేనెలా తీర్చుకోగలను" అంటూ పసిపిల్లలా ఆమెని కౌగలించుకుని ఏడ్చింది కౌసల్య. "ఊరుకో కౌసల్య, ఊరుకో! తల్లి బిడ్డలా మధ్య ఉండవలసిన ఆప్యాయతా , అనురాగమూ, తప్ప ఋణాలు , అప్పులూ, కావమ్మా" అంటూ కళ్ళు తుడిచి ఊరడిస్తున్న రాధ కేసి చూస్తూ "వొదినా! మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీ కడుపునే పుట్టాలని కోరుకుంటాను." అంది.
ఆ ఇరువురూ సంతోషాన్ని దుఖాన్నీ చేరి సగం పంచుకుని మనసులోని మాటలు తనివితీరా చెప్పుకుని తృప్తిగా నిట్టుర్చారు. ఇరువురి హృదయాలు తేలికపడ్డాయి.
ఆ సాయంత్రం స్మితని కూర్చోబెట్టుకుని ఎన్నో కధలు చెప్పింది . కబుర్లు చెప్పింది కౌసల్య. ఎంతో కాలానికి మళ్ళీ కౌసల్య అలా కూర్చుని సంతోషంతో తనతో మాట్లాడడం స్మితకి చందమామని గుప్పిట్లో పెట్టుకున్నంత ఆనందాన్ని కలగజేసింది. ఆ రాత్రి పానకాలు రాలేదు. స్మిత కౌసల్యని కరచుకుని పడుకుంది అట్ట ఒడిలో ఎనలేని సౌఖ్యాన్ని అనుభవిస్తూ!
మర్నాడు పొద్దుటే వొచ్చాడు పానకాలు - రాత్రి ఏదో పని మీద వాళ్ళ మామయ్య , మాజీ ఎమ్.ఎల్. ఏ జగన్నాధరావు గారింట్లోనే వున్నానని చెప్పి.
సుధాకర్, రాధలు సకల మర్యాదలతోటే ఉదయం రాగానే కాఫీ మొదలుకుని, ఫలహారాలు , భోజనాలు అన్నీ జాగ్రత్తగా దగ్గరుండి చూసుకున్నారు. ఆ రోజుకి అతణ్ణి కూడా అక్కడే వుండి మర్నాడు వెళ్ళమని బలవంతం చేశారు.
అవునంటే కాదనీ, కాదంటే అవుననే పానకాలు ఏ పేచీ పెట్టకుండా సరే నన్నాడు. సుధాకర్, రాధల మొహం చాటంతయింది. ఆ రాత్రి పిండి వంటలతో ఫలహరాలే కాదు అందరూ కలిసి సినిమా ప్రోగ్రాం కూడా వేసుకున్నారు. అందరూ కలిసి బయల్దేరే సమయానికి , కడుపులో నొప్పిగా వుందని పానకాలు తను రానన్నాడు. అతడు లేకుండా ఎవరు మాత్రం వెళతారు? ఎంతో సరదాగా అనుకున్న కార్యక్రమం క్షణంలో క్యాన్సిలయిపోయింది.
ఆ రాత్రి స్మిత కౌసల్య దగ్గరే పడుకుంటానని మారాం చేసింది. శ్వేత మాత్రం రాధ కొంగొదిలి పెట్టదు కాబట్టి గొడవే లేదు. డానికి వాళ్ళ నాన్న కూడా అక్కర్లేదు. అమ్ముంటే చాలు. నిజానికి కౌసల్యకి కూడా స్మిత దగ్గరే పడుకోవాలనుంది. ఎందుకనో ఎన్నడూ లేనిది స్మిత మారాం చేసి అర్ధరాత్రి దాటినా కౌసల్యని వదిలి పెట్టలేదు. పానకాలు మాత్రం కాస్సేపు చూసి ఇక నిద్ర భరించలేక గుర్రు పెడుతూ పడుకున్నాడు. అతడి గుర్రుకి మేలుకున్న శ్వేత "మమ్మీ బూచి" అంటూ భయపడింది ఆ చప్పుడికి! ప్రశాంతంగా ఆ రాత్రి గడిచిపోయినందుకు స్వేచ్చగా ఊపిరి పీల్చుకుంది కౌసల్య.
మర్నాడు పొద్దుటే ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే నిద్ర లేచిపోయి అన్ని గడుల్లోనూ లైట్లు తీసెయ్యడం. బయటికీ లోపలికి తిరుగుతూ ఏవో చప్పుళ్ళు చెయ్యడం, మొత్తానికి ఇంకా అందరూ నిద్రపోతున్నారనే జ్ఞానం మర్యాదా కూడా లేకుండా, అందర్నీ నిద్ర లేపేసిన పానకాలు ప్రవర్తన పైన పారామ అసహ్యం కలిగింది కౌసల్యకి. కిమ్మనకుండా ఇంటిల్లిపాదీ లేచిపోయారు - స్మితా, శ్వేతలతో సహా!
పొద్దున్నే వెళ్ళిపోవాలన్నాడు పానకాలు. ఎలాగో బలవంతం చేసి మధ్యాహ్నం భోజనాల దాకా ఆపారు సుధాకరూ, రాధా.
బయలుదేరుతుండగా బొట్టు పెట్టి పట్టు చీరా, రవికా, పానకలుకు బుష్ కోటు, బట్టా పాంటు, బట్టా కాక , ఇద్దరికీ చెరో నూట పదహార్లు చేతిలో పెట్టదు సుధాకర్.
'ఆడవాళ్ళ చేతిలో అర్ధం నిలవదు , ఇటివ్వు!" అంటూ పెద్ద జోక్ చేసిన ఫోజు పెట్టి కౌసల్య చేతిలో నుంచి డబ్బు తీసేసుకున్నాడు పానకాలు. అది చూసి చిరాగ్గా మొహం చిట్లించుకున్నారు సుధాకరూ, రాధా. కానీ ఏం చేస్తారు? గుండెల్లో అగ్ని గోళాలు తిరుగుతున్నా , పైకి ఏమి తెలియని వాళ్ళలా నవ్వుతూ 'టాటా చెప్పారు. మధ్య తరగతి బతుకులన్నీ ఇంతే!
గుండెలోని దుఃఖం గొంతు దాటి రాకుండా కళ్ళలోని నీరు కనుకొలకులు దాటకుండా జాగ్రత్త పడింది కౌసల్య.
