Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 22

 

    కౌసల్యా! ఎటువంటి పరిస్థితులోనూ, ఏ అఘాయిత్యానికి తలపడని మటివ్వమ్మా!" అంటూ చెయ్యి చాపింది రాధ.
    ఆమెలో మాతృ హృదయం కనిపించింది కౌసల్యకి. ఆ మహనీయురాలికి మనసులోనే చేతులు జోడించి నమస్కరిస్తూ , పైకి మాత్రం తన చేతులని ఆమె చేతిలో వేసింది. ప్రమాణం చేస్తున్నట్టుగా.
    రెండు హృదయాలు మూగగా రోదించాయి.
    కనుమరుగయ్యే వరకూ చెయ్యి ఊపుతూ భర్త వెనకాలే నడుస్తూ వెళ్ళింది కౌసల్య.
    
                                                 *    *    *    *

    "కాలేజీకి వెళ్ళలేదట?" అడిగింది కౌసల్య.
    "ఎవరు చెప్పారు? సి.ఐ.డి పని చేస్తున్నావా?" వెటకారంగా అన్నాడు పానకాలు.
    "ఎవరో ఒకరు చెప్పారు. ఎవరు చెప్తే ఏం? చదువు ఎందుకు మానేశారో చెప్పండి."
    "నా ఇష్టం ! నీకెందుకు చెప్పాలి? మొగాణ్ణి! నా ఇష్టం వొచ్చినట్టు చేస్తాను. ఆడడానికి భయపడే వాణ్ణి కాను నేను. అందులోనూ పెళ్ళానికి భయపడే మొగాణ్ణి అసలే కాను. నోర్మూసుకుని లోపలికెళ్ళు.'
    "చూడండీ, నేనేలాగా మానేశాను చదువు. మీరైనా ఏం. ఏ పూర్తీ చేస్తే మంచి ఉద్యోగం వొస్తుంది. హాయిగా వుండొచ్చు. " అంది సౌమ్యంగా బుజ్జగిస్తున్నట్టుగా.
    "ఇప్పుడు హాయిగా లేవా? ఏం తక్కువయిందని? మూడు పూటలా తింటూ ఇంట్లో కుర్చుంటున్నావ్ ఏమయింది'ప్పుడు?"
    అతనలా మాట్లాడుతుంటే కౌసల్య ఆత్మాభిమానం దెబ్బతిని మనసు కుతకుతలాడిపోయింది . కానీ ఏమీ చేయలేని నిసహాయి స్థితికి ఆమె పైన ఆమెకే జాలి కలిగింది. మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. చిన్నగా నవ్వుకుంటూ నోటితో విజిల్ వేస్తూ ఈల పాటలో ఏదో కూని రాగం వేస్తూ పేపర్ తీసి చదువుతూ కూర్చున్నాడు.
    "టిఫిన్ పెట్టాలా?" అడిగింది కౌసల్య.
    "తే" అన్నాడు పేపరు చదువుకుంటూనే.
    ప్లేట్లో నాలుగు ఇడ్లీలు, కొబ్బరి పచ్చడి, కారప్పొడీ వేసి తీసుకెళ్ళి ఇచ్చింది.
    లటుక్కుమని నాలుగు గుటకల్లో నాలుగూ మింగేశాడు. మరో నాలుగు ...." ఇంకా ఎన్నున్నాయ్ లోపల?" అన్నాడు.
    "రెండు...." అంది కౌసల్య.
    "పట్రా.." అంటూ ఆమె తెచ్చే లోగా తనే వంటింట్లోకి కొచ్చేసి, అన్నీ గిన్నెల మీద మూతలు తీసి చూసి, మిగిలిన ఇడ్లీలు, పచ్చడీ అంతా వేసేసుకుని ' నువ్వు మళ్ళీ చేసుకో, ఇంకేం పనుంది ఇంట్లో కూర్చోవడమేగా?" అంటూ లటుక్కున అవి కూడా మింగేసి , బట్టలేసుకుని వెళ్ళిపోతున్నా భర్త కేసి చూసి నిట్టూర్చింది కౌసల్య.
    పక్కవాటాలో నుంచి అస్పష్టంగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి. వినడం తప్పు అని సంస్కారం హెచ్చరిస్తున్నా మనసును నిండుకున్న దుఃఖాన్ని దూరం చెయ్యడానికీ , ఒంటరితన్నాన్ని తరమడానికి వాళ్ళ సంభాషణలు వినసాగింది.
    "అమూల్యా! ఇవ్వలేం టిఫిన్ చేశావ్?" అనురాగం ఆప్యాయతా గొంతులోనే తొణికిసలాడుతూ వుంది. అతని స్వరం మందంగా జోలపాటలా వుంది. "ఇడ్లీలండీ! అందులోకి మీకిష్టమైన కారప్పొడీ నాకిష్టమైన కొబ్బరి పచ్చడి రెండూ చేశాను. ఇదుగో , ఇది మీ ప్లేటు ఇది నా ప్లేటు" అంది అమూల్య.
    "ఊహూ.....నేను తినను." గోముగా అన్నాడు అతను.
    "ఏమీ? ఎందుకని?' కంగారుపదిపోయింది ఆమె.
    "రెండు ప్లేట్లల్లో ఎందుకు పెట్టావ్? నీకూ నాకూ ఒక ప్లేటు చాలదూ?"
    "ఓ అదా?" అంది గలగలా నవ్వుతూ అమూల్య.
    'అంతేకాదు. నువ్వు తినిపించాలి నాకు."
    "ఆ." అంది సిగ్గు భయం అభినయిస్తూ ఆమె.
    "నేనూ నీకు తినిపిస్తాను. ఏదీ....ఆ....తిను...."
    "ఛీ...పొండీ....."
    "ఊహూ.......వన్.....టూ....త్రీ అనే లోపాల తినకపోతే......"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS