Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 20

 

    దినకురుని ఉదయ చిరుకిరణం లేతగా వెచ్చగా హృదయాన్నీ తాకి, బతుకుల మీది మమకారాన్ని బంధాన్ని పెంచింది! ఒక నిర్ణయం తీసుకున్న దానిలా కౌసల్య తలపంకించింది. పెదవుల మీద పూసిన ఆశల పువ్వుని ఆనందంతో స్వీకరిస్తూ!
    వెంటనే పానకాలు మొహం కళ్ళ ముందు కదిలింది. కడుపు బిగపట్టి నట్టయింది. పదవుల మీద సంతోషం మాయమై భయం చొటు చేసుకుంది. పెదవులు వణకడం మొదలెట్టాయి. కొంపదీసి కడుపులో బిడ్డ అతనిలా పుడితే ? మరో కురూపినీ క్రురున్ని తను ఈ ప్రపంచాని కందిస్తోందన్నమాట! వాడు పెరిగి పెద్దవాడయ్యాక నాలాగా మరో ఆడపిల్ల వాడి చేతిలో బలైపోయి నరకయాతన అనుభవిస్తుంది. ఆ తరువాత వాడి కడుపునా మరొకడు, వాడికి మరో ఆడపిల్ల, ఇలా చరిత్ర పునరావృత మౌతూనే ఉంటుంది. అలా జరగడానికి వీల్లేదు. ఈ బిడ్డ పుట్టకూడదు........నో! నో! అంటూ ఉన్మాదిలా తనలో తనే మాట్లాడుకుంటూ మంచం మీద కుప్పలా కూలిపోయింది. వొళ్ళంతా చెమట పట్టి నట్టనిపించింది. చుట్టూ చూసింది. అన్నయ్యా, వదిన ఎవ్వరూ దరిదాపుల్లో కనిపించలేదు. పిలవాలంటే నోట మాట రాలేదు. నాలుక పిడచగట్టుకుని పోయింది. అతి కష్టం మీద లేచి నుంచుని ప్యాన్ స్విచ్ వేసోచ్చింది. ప్యాన్ గాలి కాస్త చల్లగా ఒంటికి తాకేసరికి ప్రాణం లేచొచ్చినట్టయి మెల్లగా పడుకుంది కళ్ళు మూసుకుని మంచం మీద!

                                                       *    *    *    *

    "కౌసల్యా! కౌసల్యా! అంటూ వదినగారోచ్చి పిలిచేదాకా వొళ్ళు మరచి పడుకుంది కౌసల్య. "భోం చేద్దాం పద! ఒంటిగంటవుతోంది. బాగా నిద్దరపోతున్నావని లేపలేదు." అంది రాధ. "ఒంటిగంటవుతోందా?" పది గంటలకి పడుకుంది తను. అంటే దాదాపు మూడు గంటలు నిద్రపోయింది. బద్దకంగా వొళ్ళు విరుచుకుని లేచి వొదిన గారి వెనకే నడిచింది.
    మౌనంగా ఇద్దరూ భోజనం ముగించారు. "కౌసల్యా! నాకు తెలుసు నువ్వు ఎంతో బాధపడుతున్నావని, కానీ అన్నయ్య చెప్పిన దాంట్లో అక్షరం తప్పు లేదమ్మా! అంతా మన మంచి కోసమే చెప్పారు. నువ్విప్పుడు వొట్టి మనిషివి కూడా కాదు. విడాకులూ గిడాకులూ అంటూ వీధిన పడితే నవ్వులపాలై పోయి నలిగిపోవడం తప్ప లాభమేమీ లేదు. తోడు లేని ఆడది అందరికీ చులకనే! భర్త దుర్మార్గుడైనా దుష్టుడైనా ఆడడానికి ఇటువంటి సమయంలో అతడు పక్కన ఉంటేనే తృప్తిగా ఉంటుంది కౌసల్యా! నువ్వెంతో మంచిపిల్లవి! నిన్నూ ఇన్నాళ్ళూ ఒక కన్నా బిడ్డగానే చూశాను తప్ప అడబిడ్డగా చూళ్ళేదు. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకు! మెల్లగా అతని మనసు అదే మారుతుంది. అంతగా మారకపోతే అప్పుడే చూద్దాం." కౌసల్య మౌనంగా వింటూ కూచుంది.
    "తరతరాలుగా ఆడపిల్లకి పెద్ద వాళ్ళు నూరిపోసే మాటలే ఇవి, పెద్ద బాలశిక్ష దగ్గరినుంచి మూల కూర్చున్న ముసలమ్మదాకా , నీతి పాఠాలన్నీ ఆడదానికే బోధిస్తాయి. భర్త తాగుబోతైనా, తిరుగుభోతైన కిక్కురు మనకూడదు! తిట్టినా, కొట్టినా "మీ పాదదాసిని! మీ పాదాల చెంత తలదాచుకోవడానికి కాస్తంత స్థలమివ్వండి చాలు! పోనీ మీ ఇంట్లో ఒక పనిమనిషిగా అనుకుని నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి!' అంటూ బతిమాలి, కాళ్ళు పట్టుకుని ఏడుస్తూనో మొత్తుకుంటూనో పడుండాలే తప్ప నేనూ మనిషినే! నాకూ మనసుంది! వ్యక్తిత్వముంది! మీ చెప్పు కింద పడుండే బదులు, నా బతుకు నేను బతగ్గలను' అని చెప్పే పాఠాలు ఎవ్వరూ చెప్పలేదు ఆ పరిస్థితి ఎవ్వరూ కల్పించలేదు. అయినా ఒకరు చెప్పేదేమిటి? నేనే ఆ స్తితిని కల్పించుకుంటాను. ఏ బిడ్డా పుట్టగానే దుష్టుడుగానూ, దుర్మార్గుడుగానూ పుట్టడు. పెరిగిన వాతావరణాన్ని బట్టి అలా తయారవుతారు. నా బిడ్డని తీర్చి దిద్దే బాధ్యత నేనే వహిస్తాను" అనుకుంటూ ఊహ లోకాల్లో తేలిపోతోంది కౌసల్య.
    తన మాటలు కౌసల్య వినడం లేదని గ్ర్తహించింది రాధ. అందుకే కౌసల్య భుజం పట్టి కుదుపుతూ , "నేను చెప్పే మాటలు నీకు నచ్చడం లేదు కదూ?" అంది.
    కౌసల్య చిన్నగా నవ్వి ఊరుకుంది.
    "కౌసల్యా! అన్నయ్య సంగతి నీకు తెలుసు. పరువు కోసం ప్రాణాన్నయినా తీసుకుంటారు. నేనూ అతని ధర్మ పత్నిగా ఆ అడుగు జాడల్లోనే నడుస్తున్నాను. పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న నిన్ను నా పోత్తిట్లో పెట్టుకుని పెంచాను కౌసల్యా! అప్పుడన్నయ్య ఏమన్నాడో తెలుసా? రాదా! మనకంటూ ఒక బిడ్డ పుడితే కౌసల్య మీద మనకి ప్రేమ తగ్గిపోతుందేమో! అందుకని మనం పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడితే!" అన్నారు.
    ఆ మాటలు నా గుండెల్లో శులాల్లా గుచ్చుకున్నాయి! ఏ స్త్రీ అయినా పెళ్ళి అయినా చేసుకోకుండా ఉండిపోగలదు. కానీ పెళ్ళి చేసుకున్నాక బిడ్డల్ని కనకుండా గోడ్రాలిగా ఉండలేదండీ! అయినా ఒకే తల్లికి నలుగురు బిడ్డలు పుడితే , ఒక బిడ్డ పుట్టాక మొదటి బిడ్డ మీద ప్రేమ తగ్గిపోతుందా? అలాగే పెంచిన ఈ బిడ్డ మీద మమకారం మన కెప్పుడూ పోదు" అన్నాను. ఆ తరువాతే నమ్మా మాకు స్మిత పుట్టింది! మాకు ఒక కన్ను నువ్వయితే మరో కన్ను స్మిత! దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టి మీరిద్దరూ కలకలాడుతూ కాపురాలూ చేసుకుంటూ ఉంటేనే మేమూ హాయిగా ఉంటాం. లేకపోతే మేము కళ్ళు లేని కబోదుల్లా ఉంటామమ్మా" రాధ పమిట కొంగుతో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS