"చస్ నోర్ముయ్.....నీయబ్బా ఛ....ఛ..... నాకూ మా నాన్నలా బూతులోస్తున్నాయ్.....చీ....చీ....రోడ్డు మీద పరుగెడుతుంటే పిచ్చి కుక్క ఒకటి వెంటపడింది" అన్నాడు ఎంబర్రాసింగ్ గా ఫీలవుతూ శ్రీచంద్ర.
"అవునా గురూ.....మరది కరవలేదా" ఆసక్తిగా అడిగాడు సత్తిపండు.
"ఎంత ఇంట్రెస్టురా నీకు" అంటూ మళ్ళీ సత్తిపండు తలవంచి వీపు మీద నాలుగు బాదుళ్ళు బాదాడు.
టాంక్ బండ్ మీద వెళ్ళే జనం వీళ్ళ వైపు ఆసక్తిగా చూసారు. కొందరైతే గుమిగూడారు.
శ్రీచంద్రకు తల తీసేసినట్టయింది. వెంటనే అక్కడుంచి సత్తిపండును లాక్కెళ్ళాడు. శ్రీచంద్ర ప్యాంటు, బనీను మీద వున్నాడు.
సత్తిపండు అయితే పొట్టి లాగులో మాత్రమే ఉన్నాడు.
"గురూ....మన గెటప్ లు భలే ఉన్నాయి. ఇప్పుడు గానీ వదిన మనల్ని చూసిందా....."
పైన తధాస్తు దేవతలు కసిగా తధాస్తు అన్నట్టున్నారు.
* * *
"ఏయ్....ఒరే చందూ" అన్న పిలుపు విని కంగారుగా చుట్టూ చూసాడు. ఆ గొంతు సమీరది.
తన శరీరం మీద చొక్కా లేదు. సత్తిపండు బాబూమోహన్ కజిన్ లా ఉన్నాడు.
"ఎవరూ .....ఎవరది? నేను కళ్ళు లేని కబోదినిబాబూ...." అంటూ శ్రీచంద్ర రెండు కళ్ళు మూసుకుని గుడ్డివాడి వలె నటిస్తూ సత్తిపండు చేయి పట్టుకుని ముందుకు లాక్కెళ్ళడు.
అదేంటి గురూ....సడెన్ గా క్యారెక్టర్ చేంజ్ చేశావు. అవతల వదిన....ప్రేమగా ఒరే చందూ అని పిలుస్తోంది" అన్నాడు సత్తిపండు.
అలా సత్తిపండును ముందుకు లాక్కేల్తునే "చంపేస్తా.....మాట్లాడకుండా నా వెంటరా" అన్నాడు.
"నిన్నేరా చందూ" సమీర రోడ్డుకు అటువైపు అటో దిగి రోడ్డు క్రాస్ చేస్తూ అరిచింది.
శ్రీచంద్ర కావాలనే ఆ పిలుపు వినిపించుకొనట్టు ముందుకు కదిలాడు. ఈ గెటప్ లో తనని చూస్తే కూపీలాగి చచ్చేవరకు సాధిస్తుంది.
"ఒరే పోట్టిలాగు! నువ్వయినా అగరా. నీకోసం నూడుల్స్ తెచ్చాను" అంది సమీర.
"వదినా....నా వదినా.... నా ప్రియమైన వదినా....నా కోసం నుదేల్స్ తెచ్చావా వదినా? నా వదినా" అంటూ ఒక్కసారిగా రివర్సయి వెనక్కి తిరిగి సమీర వైపు చేయుపి చేతులు చాపాడు.
'ఇక్కడ....ఇక్కడొదినా....నీకోసం నేనూ....అన్నయ్య చకోర పక్షుల్లా చూస్తున్నాం" అంటూ అరిచాడు.
అమాంతం సత్తిపండును లేపి టాంక్ బండ్ లోకి విసిరేయాలన్నంత కోపం వచ్చింది శ్రీచంద్రకు.
సమీర అప్పటికే శ్రీచంద్రను సమీపించింది. సత్తిపండు మొహాన్ని చాటంత చేసుకుని ఆమె చేతిలో వున్న క్యారీ బ్యాగ్ వంక చూస్తూ......
"రా ......వదినా....తుమ్ మేరా బాబి హై.....హం.... మై తేరా మరిది హై.....హూ" అన్నాడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ.
"ఇదేంటి పోట్టిలాగు.....ఒక్కసారిగా ఇంత ఎమోషన్ అయ్యావు" ఆశ్చర్యంగా అడిగింది సమీర.
"ఏం చస్తామొదినా....అంతా నూడుల్స్ మహత్యం" అన్నాడు.
"మరి మీ గురువేంటి? గుడిగంటల్లో ఎన్టిఆర్ లా.....?"
"అబ్బెబ్బే.....అన్నయ్య గుడ్డివాడి పాత్ర రిహార్సల్ చేస్తున్నాడు వదినా. పొద్దునే ప్యాట్ని సెంటర్ దగ్గర మణిరత్నం కారులో కనిపించి అన్నయ్య హీరోలా ఓ మంచి గుడ్డివాడి కధని సినిమా తిద్దామనుకున్నాడట" నోటికొచ్చిన అబద్దం చెప్పేశాడు.
సమీర పగలబడి నవ్వింది.
శ్రీచంద్ర గుర్రుగా చూస్తున్నాడు సత్తిపండు వైపు.
* * *
ట్యాంక్ బండ్ రెయిలింగ్ ని అనుకుని కడుపు చేత్తో పట్టుకుని పకపకా నవ్వసాగింది సమీర.
ప్యాట్ని సెంటర్ దగ్గర జరిగిన తతంగం....పారిపోయి రావడం అంతా విన్నాక.
"అయినా ఆ పొట్టి లాగుకు మెదడు మోకాలులో కూడా లేదు. నికేమైంది వాడు చెప్పగానే తగుదునమ్మా అంటూ చొక్కా విప్పి స్కూటర్లు తుడుస్తావా?
ఛ...ఛ....రేపు మన పెళ్ళయ్యాక ఏ గన్నాయ్ గాడైనా పిలిచి "మీ అయన ఓసారి ప్యాట్ని సెంటర్ లో నా స్కూటర్ తుడిచాడంటే నాకెంత నామర్దా" అంది సమీర.
శ్రీచంద్ర కోపంగా ఏదో అనబోయాడు.
అప్పటికే వాళ్ళని ఓ వ్యక్తీ ఆసక్తిగా గమనిస్తూ ఉండడంతో గతుక్కుమన్నాడు.
ఆ వ్యక్తీ మరెవరో కాదు. టాంక్ బండ్ దగ్గర మొక్కజొన్న పొత్తులు అమ్మే గెటప్ లో వున్న ఉహలజిస్ట్ త్రిలోకం.
"సమ్మీ....." ఒక్కసారిగా గావుకేక లెవల్లో బిల్డప్ ఇచ్చి అరిచాడు శ్రీచంద్ర.
"తూ.....తూ" అంటూ వీపు చరచుకుని "అదేంటి గురూ....అలా అరిచావ్....కొంపదీసి బాబాయ్ గానీ ఆంగ్లో- ఇండియన్ పిన్నితో టాంక్ బండ్ లో 'లాహిరి లాహిరి' అంటూ పాట పాడుకుంటున్నాడా" అడిగాడు సత్తిపండు.
"నువ్వు నోరు ముస్తావా?" అని సత్తిపండుని కసిరి సమీర వైపు తిరిగి-
"మీ నాన్న .....అటు చూడు...." అన్నాడు.
సమీర శ్రీచంద్ర పంచె, దాని మీద బనియన్...అవి పాతవి....వేసుకున్నాడు. నెత్తికి ఎర్రటి రుమాలు లాంటిది చుట్టుకున్నాడు.
మొక్కజొన్న పొత్తులు నిప్పుల మీద కాలుస్తున్నాడు. సమీరని, శ్రీచంద్రని, సత్తిపండును చూసి అతని కళ్ళు మెరిశాయి.
వెంటనే మూడు మొక్కజొన్న పొత్తులను ఆకులో చుట్టి, వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకువెళ్ళాడు.
"వదినా.....మీ నాన్న..... అదేంటి......టాంక్ బండ్ దగ్గర మొక్కజొన్నపొత్తులమ్ముతున్నాడు. పార్ట్ టైమ్ బిజినెస్సా? అసలు బిజినెస్సే ఇదా?" అనుమానంగా అడిగాడు సత్తిపండు.
"పో...ట్టి....లా....గూ......" ఆగి ఆమె సీరియస్ గా చూడ్డంతో షటప్ అయిపోయాడు.
త్రిలోకం మొక్కజొన్న పొత్తులు తీసుకువచ్చి సమీర వైపు చూస్తూ ......
"తీస్కోండి అమ్మాగోరూ....వేడి వేడి పొత్తులు.....చూస్తే చిలకాగోరింకల్లా వున్నారు.....ఈ లేతవి , వేడివి తింటే బోలెడు ఉసూలోస్తాయి...." అన్నాడు త్రిలోకం.
"అదేంటి చెప్మా....చిలక....ఇద్దరు గోరికల్లా వున్నామని ఈయన అర్ధమా? ఎందుకంటావ్ గురూ....." అన్నాడు సత్తిపండు శ్రీచంద్ర వైపు చూస్తూ.
"ఒరే....సత్తిపండు....యివాళ నువ్వయిపోయావ్రా....." కోపంగా పిడికిలి బిగించి శ్రీచంద్ర లోగొంతుకతో పళ్ళ బిగువునా అనడంతో "హమ్మో....గురుడు అన్నంత పని చేసేలా వున్నాడు" అని కామ్ అయిపోయాడు సత్తిపండు.
