"ఓరి వెధవకానా! నాకు రేగిపళ్ళకు, గన్నేరు కాయలకు తేడా తెలియదంటావ్?"
"నేనెందుకంటానే? తాతయ్య అనేవాడు."
"అక్కడికి ఆ పెద్దమనిషికి అన్నీ తెలిసినట్టు నీ కలా చెప్పారా! నన్ను కట్టుకునే దాకా ఆ ముసలాయనకు మాత్రం శోభనానికి, సిమంతానికి తేడా తెలిసేదా?"
"అదేమిటే, సీమంతం తర్వాతనే మీకు శోభనమైందా?"
రాఘవ వాక్యం ఇంకా పూర్తికాక ముందే అతడి చెవి పట్టుకుని ఒడిలోకి లాక్కుంది. ఏ జ్ఞాపకాల తెరలో కళ్ళలో నీటి పొరలుగా మారుతుంటే, తిరుపతికి వెళ్ళి ఒకేసారి బస్సు ప్రయాణంలో చనిపోయిన కొడుకు, కోడలు, భర్తా గుర్తుకొచ్చి కల్లోత్తుకుంది.
రాఘవ నవ్వు, నడక, చిలిపితనం అంతా "ఆయన' పోలికే . ముసలాయన మాత్రం మంచం దిగేవాడా? ఏం కావాల్సినా పక్క మీద అమర్చమని ఆర్డర్లు జారీ చేస్తుండేవాడు.
తెలివిలో సైతం ఆయనకు దీటైనవాడు కాబట్టే, ఉన్న రెండెకరాల పొలం ఫలసాయం అంతంతమాత్రంగా వున్నా, స్కాలర్ షిప్పులతో రాఘవ అంతదాకా చదువుకున్నాడు.
"ఒరే రాఘవా!" ప్రాధేయపూర్వకంగా అడిగింది మంచంపై వెలికిలా పడుకున్న రాఘవ కళ్ళలోకి చూస్తూ. "నేను మాత్రం ఇంకెంత కాలం బతుకుతాన్రా పిచ్చి సన్నాసి! నీకు చెబుతూనే వున్నాగా -- నా జాతకరీత్యా యిక నేను మిగిలేది మూడు నాలుగు నెలలేగా!"
పెళ్ళికి ముందు నుంచీ మాణిక్యమ్మకు జ్యోతిష్యం పిచ్చి వుండేది. కాని, పెళ్ళయ్యాక అది మరింత ముదిరిపోయింది. దానిక్కారణం కూడా ఆమె భర్త అప్పన్నే . అయన చచ్చిపోయేదాకా ఎప్పుడేం జరిగేది ఖచ్చితంగా చెప్పగలిగే వారని యిప్పటికి రాఘవకు గర్వంగా చెబుతూ ఉంటుంది.
జాలేసిందేమో బామ్మను చూస్తుంటే - "చూడు బామ్మా! కొన్ని శిక్షలను తప్పించుకోవడం అంత సులభం కాదే. నేను వైజాగులో నీ జాతక చక్రం వేయిస్తే ఏమన్నారో తెలుసా? ఆషామాషి మనిషి కాదు. బ్రిటన్ లో మార్గరెట్ ఖచర్ కి జ్యోతిష్యం చెప్పిన పెద్ద మనిషాయన. నీకు యింకో ఎనభైఏళ్ళ దాకా ఇలా శిక్షలా బ్రతకడం తప్పదన్నాడు. బ్రతకడం శిక్షేలా అవుతుందిరా అనకు. నాకు సేవ చేయాలి, నా పెళ్ళయ్యాక ముందు నాకు కొడుకు పుడతాడులే. వాడికి నేను తాత పేరు పెట్టాక, వాడికి నువ్వు సేవ చేస్తూ ఇరవయ్యేళ్ళు బ్రతకాలి. అనక వాడికి ఓ కూతురు పుడుతుందిలే, దానికి నీ పేరు ఎలాగూ పెడతాను కాబట్టి దానికి పెళ్ళయ్యేదాకా నువ్వు సేవ చేయాలి. ఇలా సేవ చేయడమనే శిక్షను అనుభవిస్తూ బ్రతికి తీరాలని మరిమరి చెప్పాడు." పక్కకు ఒత్తిగిలి బామ్మ ఒడిలో తల పెట్టుకున్నాడు. "ఏమిటోనే నీకు అంత లాంగ్ డ్యురేషన్ శిక్షేమిటా అని ఆ రోజు నుంచీ బాధపడుతూనే వున్నాను. అయినా నువ్వు సేవ చేస్తున్నది పరాయి వాళ్ళేం కాదు కాబట్టి నువ్వు శిక్షలా అనుకోవనుకో?" టాపిక్ మార్చేశాడు తెలివిగా.
అంతే! ప్ల్హాష్ ఫార్వార్ద్ లా రాఘవ చెప్పిన సన్నివేశాల్ని పులకరింపుగా- ఉహించుకుంటూ కూర్చుంది మాణిక్యమ్మ.
* * * * * * * *
సరిగ్గా అదే సమయంలో వీర్రాజు లోగిట్లో తన పడక గదిలో నుంచి అసహనంగా కేక పెట్టి మంగను పిలిచింది కిన్నెర.
మంగ ఒక్క అంగలో దూసుకువచ్చింది గదిలోకి.
అసలు సాయంకాలం తిరిగి వచ్చిన దగ్గర నుంచీ అదోలా వున్న కిన్నెర తన కోపాన్ని వ్యక్తం చేస్తూ రెండు ప్లవర్ వాజుల్ని , మూడు పింగాణి ప్లేట్లను పగలగొట్టింది.
మంగ మాత్రమే కాదు, వీర్రాజు, ఉదయ్ కూడా ఇదంతా గమనిస్తున్నారు కాని, కారణం ఎవరూ అడగలేకపోయారు.
ఆవేశంలో చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా మాట్లాడే కిన్నేరంటే వీర్రాజుకూ కాస్త జంకుగానే వుంటుంది. అంత గారాబంగా పెంచాడాయన.
"ఎంటమ్మా?" కంపిస్తూ అడిగింది మంగ.
"అసలు ఏమనుకుంటున్నాడు?" అకస్మాత్తుగా చర్చ ప్రారంభించింది. "తనేం చేసినా ఉరుకోడానికి నేనేమన్నా మాములు కుటుంబానికి చెందిన అమ్మాయి ననుకుంటున్నాడా?"
ఇప్పటికి మంగ కొంత అర్ధం చేసుకుంది.
కిన్నెర వుపయోగించింది పుంలింగం కాబట్టి తప్పని సరిగా ఆ రాఘవ మీద కోపమే అని అర్ధమై, "ఏం చేశాడమ్మా?" అంది కంగారుగా.
"ఏదన్నా చేస్తే వూరుకుంటానా?"
మరేదో చేసినట్టుగా మీరే అంటున్నారుగా అమ్మాయిగారు?"
"ఇంకా ఏం చేయాలి? కవితలు రాసి నన్ను రెచ్చగొట్టాడు. పైగా అవి తను రాసినా, అవేం ప్రేమలేఖలు కావుగా అని దబాయిస్తున్నాడు. అది కాదే! అసలు నాకు పంపటానికి ఎన్ని గట్సుండాలి?"
"మీరు కలిశారా?"
"కలవకుండా యిదంతా ఎలా మాట్లాడతానే?"
"ఎక్కడ కలిశారు?"
"మధ్య నీ బోడి పరిశోధనేమిటి? ఎక్కడ కలిస్తే నేం?"
"అది కాదమ్మా, ఏదన్నా అమర్యాదగా ప్రవర్తించాడా?"
వెంటనే కిన్నేరకే జవాబు తోచలేదు. అసలు తానింతగా ఎందుకు స్పందిస్తుంది? కవితలు పంపినందుకా, ;లేక పెళ్ళయిన మగాడని తెలిసినందుకా?
"లాభం లేదు మంగా!" అంత దూరం అతడికోసం వెళ్ళాక కనీసం మర్యాదను పాటించకుండా నిర్లక్ష్యంగా స్కూటరేసుకుని చక్కా పోయిన రాఘవను గుర్తు చేసుకుంటూ అంది- "ఈరోజు కవితలు పంపినవాడు రేపు నిజంగా ప్రేమలేఖలు పంపటానికి వెనుకాడడు. ఇది మొత్తం ప్రత్యర్ధులు నవ్వుకునే దాకా వెళ్ళి, మన వంశ ప్రతిష్టకు భంగం కలిగించే అవకాశముంది. నాన్నగారెక్కడ?"
