Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 21

 

    అలాంటివి మాటాడడం ఇష్టపడడు కూడా.

 

    కానీ మనసు పంచుకోటానికి కూతురు తప్ప మరెవరూ లేని వ్యక్తిగా ఆలోచనల్ని దాచుకోలేకపోయాడు. "అడ్జస్ట్ కలేకపోయానమ్మా- ఏదన్నా వ్యాపకం వుంటే బాగుంటుందని ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఓకె అన్నాను గానీ అక్కడ, కాలుష్యం భరించలేకపోయాను.....అందుకే రాజీనామా చేసి ఇక నుంచీ రిలాక్స్ కావాలనుకుంటున్నాను."

 

    ధన్వి గురించి డైరెక్టుగా అడగలేకపోయింది.

 

    "అసలేం జరిగింది డాడీ?....."

 

    "ఓ సమర్దుడయిన యువకుడికి నా సమక్షంలోనే అన్యాయం జరిగిపోయింది....అతను తప్పు నిజాయితిగా మాటాడటం.....మనుషుల్లో పేరుకుపోయిన అవినీతిని తూర్పార బట్టడం.....అంతే....మిగతా మెంబర్స్ అతన్ని విప్లవకారుడిగా బావించి రిజక్ట్ చేశారు." బడలికగా కళ్ళు మూసుకున్నాడాయన....."బ్లడి హిపోక్రేట్స్ ......వాళ్ళతో నన్ను చేతులు కలపమంటారు....."

 

    మధూళీకి అర్ధమైపోయింది.....డాడీ మాటాడుతున్నది ఆ ధన్వి గురించే.....

 

    కొన్ని క్షణాల క్రితం తనను మాటలతో అందోళన పరిచి ఏమిటి మనిషి అనిపించుకున్న ఆ యువకుడే మరో చోట తనకు తోచిన రీతిలో ప్రవర్తించి ఒక గొప్ప అవకాశం చేజార్చుకున్నాడు....

 

    ఇంకా అతడి ఆరని స్మృతిలో అలవోకగా కదులుతున్న ధన్విచురుకయినా కళ్ళని, తూణిరాల్లా అతడు సంధించిన వాక్యాల్ని మననం చేసుకుంటూ "ఆ కేండిడేట్ అంత తెలివయినవాడా డాడీ?" అయన నోటినుంచి మరింత వివరంగా తెలుసుకోవాలన్నట్లుగా అడిగింది మధూళీ.

 

    ధన్వి ఎవరైతేనేం.....ఎక్కడివాడైతేనేం....కలం మేధస్సు నుంచి పెరిగిన ఖడ్గమై ఆసదృశమైన అర్గ్యుమెంట్ తో అందర్నీ కలవరపరిచాడు.

 

    "ధన్వి....." అందమైన ఒక అనుభుతిలా అన్నారాయన. ఏ రియల్ జీనియస్.....పుస్తక పరిజ్ఞానమే కాక ప్రపంచ జ్ఞానం కూడా సమపాళ్ళలో వున్న యువకుడు.....జ్ఞానం , విజ్ఞానం ఆలోచన, ఆవేశం అన్నీ ఒకే వ్యక్తిలో చూడగలగడం ఒక అరుదైన అనుభవం మధూళీ.....యస్....

 

    ధన్వి ఇప్పటి యువతరానికి అతీతుడు......


    
    ఆతడుదేశభక్తి గురించి మాటాడలేదమ్మా.....

 

    కానీ ఈ దేశం ఎలా వుండకూడదో తెలియ చెప్పాడు. విప్లవకారుడు కాదు- కానీ దిగజారిపోతున్న విలువల గురించి ఆవేశంగా మాటాడాడు.....తుఫానులా అనిపించాడు. కానీ దారి తప్పుతున్న జీవిత విలువల గురించి తపనతో స్పందించాడు."

    
    మధూళీ వింటుంది మౌనంగా.

 

    ఏరోజు ఏ విషయంలోనూ ఇంత ఆర్తిని ప్రదర్శించని డాడీని ధన్వి ఇంతగా ఆకట్టుకున్నడా.....

 

    మరి తన ముందు? ఆటపట్టించిన అల్లరి పిల్లాడిలా వెంటపడి వేధించినట్టు అనిపించాడే.....


    
    ఎందుకో.....

 

ధన్వి గురించి డాడీ మాటాడుతుంటే......ఎంతసేపయిన వినాలనిపిస్తుంది.

 

    "అది కాదు డాడీ.....ఇంటర్వ్యూ కమిటిలో వున్న అయిదుగురు మెంబర్లని ప్లీజ్ చేయలేని ధన్వి రేపు ఏ అసిస్టెంట్ కలేక్టరో అయితే లక్షల మంది సమస్యలని ఎలా పరిష్కరించగలడని?....."

 

    రుషిలా నవ్వాడాయన" మూడు పదుల వయసు దాటని వివేకానందుడు ఉత్తర అమెరికాలో ఏం సాధిస్తాడని అందరూ అనుకున్నారమ్మా! కానీ భారతదేశ సనాతన సంస్కృతిని మెరికల్లాంటి పదాలతో అమెరికన్ల  మెదళ్లలో ఇంజక్ట్ చేశాడు."

 

    "కానీ....విషయం చెప్పడంలో వివేకానందుడు అంత కాఠిన్యాన్ని ప్రదర్శించేవాడా డాడీ?"

 

    "వై నాట్....." ఉద్విగ్నంగా అన్నారాయన. "మీ దేశంలో మగాళ్ళ శారీరక వాంఛల్ని తీర్చడానికి వేశ్యలనే ఓ జాతి వుందట నిజమా అని కొందరు అమెరికన్లు ఎగతాళిగా అడిగితే ఏమని జవాబు చెప్పాడో తెలుసా మధూళీ!.....ఏ కంట్రీ వితౌట్ ప్రాస్టిట్యుట్స్ ఈజ్ కంట్రీ విత్ ప్రాస్టిట్యుట్స్ అన్నాడు. కాఠిన్యం అనే పదానికి అంతకు మించిన నిర్వచనం ఏముంటుంది."

 

    నిశ్శబ్దంగా వుండిపోయింది మధూళీ.

 

    అది కొంతసేపే......

 

    తండ్రికి తెలిసిన ధన్వి గురించి కాక తనకు పరిచయమైన ధన్వి విషయంలో మరేదో తెలుసుకోవాలనుకుంటు అంది "తన చుట్టూ వున్న మనుషుల్ని సంస్కరించాలనుకునే వివేకానందుడికి, మనుషుల మధ్య మనిషిగా బ్రతకాల్సిన ధన్వి కి తేడా వుంది డాడీ."

 

    "లేదమ్మా.....ఇద్దరి ఫిలాసఫీ ఒకటే....జీవిత విధానం వేరు కావచ్చు. కాస్టుమ్స్ వేరు కావచ్చు. కానీ కమిట్ మెంట్ ఒకటే..."

 

    ధన్విని ఆ స్థాయిలో ఆలోచిస్తున్న డాడిని ఎలా కన్విస్ చేయాలో ఆమెకు అర్ధం కాలేదు.

 

    డాడీ కానీ, తను కానీ పరిచయమైన చాలా స్వల్ప వ్యవధిలో ధన్వి మూలంగా ప్రభావితమైన వ్యక్తులే.....

 

    అంటే ఆలోచించగల ఇద్దరు వ్యక్తుల్ని ధన్వి ఆకట్టుకున్నట్టేగా .....

 

    డాడీని ఇంతగా ఆకట్టుకున్న ధన్వి గురించి హీనంగా మాటాడి మనో విశ్లేషణ పేరిట మాటల్తో అల్లరి పెట్టడమే కాక, అతడిలో ఏ లోపమో ఎత్తి చూపెట్టాలని ఓ ప్రశ్న ఇచ్చి అతడి జవాబు నుంచే అతడేమిటో తెలియచెప్పాలనుకున్నది....అనాలోచితంగా తనూ అతడి భాద్యతని తీసుకోవాలనుకుందా లేక అది అతడ్నింకా తెలుసుకోవాలన్నా ప్రయత్నమా....

 

    అది కానినాడు.....

 

    తన పరోక్షంలో కూడా తన గురించి ధన్వి ఆలోచిస్తూ వుండాలని చేసిన చిలిపి కోరికో ఆమెకి అర్ధం కాలేదు.

 

    ఏది ఏమైనా గానీ.....

 

    అసహనపు మండుటెండలో నిలబడినట్టు హడావుడి చేసిన ధన్వి ఇప్పుడు మనసు కాగితంపై ఒలికిన సిరాగా మారి తడారిపోనీ ఏ నీలిసిరానో, ఎడారిలో ఒయాసిస్సుగా అనిపిస్తుంటే అతడి రూపాన్ని గుర్తు చేసుకుంది.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS