ధన్వి పేరుగల ఓ యువకుడు గుండెగోడలపై చేస్తున్న ద్వనికి అర్ధం ఏమిటో తెలిక అతడి గురించి ఆలోచనల్లో మినిగిపోయింది చాలా సేపటిదాకా.
రచయిత్రిగా ఎదుగుతున్నా గానీ ఆమె కూడా ఆడపిల్లే....
ఆమె జీవితంలో ఓ మగాడి గురించి ఇలా ఆలోచించటం తొలిసారి. ఆమె ఆ ఒక్కటి తెలుసుకోగలిగింది.
సరిగ్గా ఇదే సమయానికి.....
ధన్వి యింటికి వచ్చిన అతడి తండ్రి నీలకంఠానికి సుపరిచితుడైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్రావు తండ్రి ముందే ధన్విని సుతిమెత్తగా మందలిస్తున్నాడు.
కేవలం నీ తొందరపాటుతో ఒక గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నావ్" స్టేట్ సర్విస్ కమిషన్ బోర్డులో మెంబరైనా రాఘవరావు ద్వారా అయన ధన్వి గురించి తెలుసుకున్నాడు. అది కావాలని కాదు, నిన్న రాత్రి ఓ క్లబ్ లో జరిగిన చర్చలో.....
ఆ క్షణం దాకా ధన్వి గ్రూప్ వన్ సర్వీస్ పరిక్షకి వెళ్ళినట్టు గానీ, రిటన్ లో ఉత్తీర్ణుడై ఇంటర్వ్యూకి వెళ్ళడం గురించి గానీ సుధాకర్రావుకి తెలీదు.
రాఘవరావుతో జరిగిన చర్చలో మొత్తం వివరాలు తెలుసుకున్న సుధాకర్రావు నీలకంఠానికి చెప్పాడు..... అయన ప్రోద్బలంతోనే ఇంటికి వచ్చాడు.
"అసలు ఈ తతంగం గురించి నాకు ఒక్క మాట ఎందుకు చెప్పలేదు?" నీలకంఠం మండిపడుతుంటే.....
"చెప్పటానికి ఏముంది నాన్నా" అన్నాడు ధన్వి కేజువల్ గా.
"విన్నారుగా సర్" సుధాకర్రావుతో కంప్లయింట్ లా అన్నాడు నీలకంఠం....."ఇది విడి వరస....తనంతట తానుగా ఉద్యోగం సంపాదించుకోలేడు.....మరొకరి సహాయం తిసుకోమంటే పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటాడు....వీడు ఇక జన్మలో బాగుపడడు.....వీడి బ్రతుకంతే."
జవాబు చెప్పాలనుంది ధన్వికి.
కానీ పరాయి వ్యక్తుల ముందు తండ్రితో వాదించడం ఇష్టం లేదు అతడికి.....
అసలు తనలో వున్న ఏ లోపం గురించి తండ్రి అలా తూలనాడుతున్నాడో కూడా బోధపడటంలేదు.
"ఇక ఆ జాబ్ పోయినట్టేనా సర్" నీలకంఠం ఆర్తిగా అడిగాడు సుధాకర్రావుగారిని చూస్తూ.
ధన్వికిది నచ్చడం లేదు.....
"మీ వాడికి జాబ్ రాకపోవడ మొక్కటే కాదు నీలకంఠంగారూ....ఇంటర్వ్యూ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ శరత్ చంద్ర కమిటీకి రాజీనామా చేసేదాకా వెళ్ళాడు. కేవలం మీవాడి విషయంలో సమర్ధించబోయి ఓడిపోయి ఆ అవమానం జిర్ణించుకోలేక అయన రిజైన్ చేశాడని రాఘవరావు చెప్పాడు" విభ్రమంగా చూశాడు ధన్వి.
ఇది ధన్వికి ఇప్పుడే తెలిసిన ఓ కొత్త విషయం.....అది కాదు ధన్వి ఆ క్షణంలో ఆలోచిస్తున్నది. రాజీ పడటాన్ని జీవిత ధ్యేయంగా మార్చుకుని దేనికైనా అమ్ముడుపోయే వ్యక్తులున్న సమాజంలో ఇంకా ఒకరిద్దరూ శరత్ చంద్రలు వున్నారన్నమాట.....
చాలా సంతృప్తిగా అనిపించింది......
ఇక అక్కడే నిలబడితే తన మూలంగా నీతికి నిలబడే శరత్ చంద్రలు అన్యాయమైపోవడం గురించి నాన్న మరో చిన్న సైజు ఉపన్యాసం మొదలు పెట్టి అతడిని అప్రయోజకుడైనా వ్యక్తంటు తూలనాడటం మొదలుపెడతాడు.
అందుకే ఇక ఆ చర్చలో తన ప్రమేయం అవసరం లేనట్టు గదిలోకి నడిచాడు.
తల్లి నిలబడి వుంది నీళ్ళు నిండిన కళ్ళతో....
"ఏమైందిరా నీకు....? ఇక నేవ్వేప్పుడు మారుతావ్?"
అమ్మకి అసలు ఏం జరిగింది అన్న విషయంతో పనిలేదు.
ఆమె జీవితంలో చాలా భాగం నాన్న గొంతుక్కి మైక్ లా వ్యవహరించడంతోనే గడిచిపోయింది.
"మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా.....? అది చాలా మంచి ఉద్యోగమటగా?' తనకు తెలిసిన విషయం ఏకరవు పెట్టింది....."పది నిముషాలు కోపాన్ని దిగమింగుకుంటే ఆ వుద్యోగం నికొచ్చేదటగా?"
తల్లి వేపు చూశాడు.....జాలేసిందేమో లాలనగా దగ్గరకు తీసుకున్నాడు. "నేను వుద్యోగం రాకూడదని అక్కడ కోరి రాద్దాంతం చేయ్యలేదమ్మా......లక్షలకి ఆశపడి ఉద్యోగాల్ని నడిబజార్లో అమ్మకానికి పెట్టిన కొందరు వ్యక్తుల ఆలోచనల్ని తూర్పారపట్టాను.....మేధస్సుకి పట్టం కట్టరని తెలిసే వాళ్ళని నిలదిసాను....."
"ఎందుకలా అనిపించింది?" అలా నిలదీసింది అమ్మ కాదు.....ఎప్పుడొచ్చిందో సామ్రాజ్యం నిలబడి వుంది అమ్మకి చేరువగా. "నిన్నేమన్నా డబ్బు అడిగారా?"
ధన్వి జవాబు చెప్పలేదు.....
"అందరూ డబ్బుతోనే ఉద్యోగాలు కొనుక్కుంటారని ఎందుకనుకుంటావ్ ధన్వి? ఒకరిద్దరు తెలివైన వాళ్ళని సెలక్ట్ చేసుకునే అవకాశం వుందిగా?'
"అలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఇంటర్వ్యూలో ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలుసు..... అర్ధం పర్ధం లేని ప్రశ్నలతో కేండిడేట్ ని ఉక్కిరి బిక్కిరి చేయాలని ప్రయత్నించారు...."
"అలా నిన్ను ఇబ్బంది పెట్టారా?" అడిగింది సామ్రాజ్యం.
"యస్" స్థిరంగా అన్నాడు ధన్వి. ఆరోజు ఇంటర్వ్యూ లో జరిగిన ప్రశ్నల్ని మననం చేసుకుంటూ " ఆ విషయం నాకు అర్ధమయ్యేట్టుగా ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు సామ్రాజ్యం. నాకున్న విద్యార్హతల గురించి పట్టించుకోలేదు....నేను చేయాల్సిన జాబ్ గురించి మాటాడలేదు.....నన్ను ఫెయిల్ చేయడం మాత్రమే ధ్యేయంగా పెట్టుకుని నాతో వాగ్యుద్దానికి దిగారు.....నేనేదో శత్రువునన్నట్టుగా హడావుడి చేశారు....." అన్నాడు బడలికగా కిటికీ దగ్గరికి నడిచి.
