సామ్రాజ్యం విస్పారితంగా చూసింది.
సుతిమెత్తని తూనీగ రెక్కల్ని చిదిమి అదో చద్విలాసంగా భావించే సంఘంలో ఒకడిగా ఇమడలేక, తను నిర్మించుకున్న ఏకాంత మందిరంలో నుంచి......
ఈసారి విమర్శలాకాదు, నచ్చచెప్పాలన్న ఆలోచనతో "మీ కోణంలో మీరు మాట్లాడుతున్నారే తప్ప, మరొకరి స్థానంలో నిలబడి ప్రపంచాన్ని చూడడం కూడా మీకు అవసరమని ఎందుకు ఆలోచించారు? ఏం మీరు తెలిసినవి మాత్రమే విలువలనుకుంటున్నారా.....? మికున్నవి స్వతంత్ర భావాలే అయితే ఫర్వాలేదు ధన్వి! కానీ మీలా ఆలోచించేది సామజిక భయాలతో కుంచించుకుపోయే వ్యక్తులు మాత్రమే అంటుంది మనోవైజ్ఞానిక శాస్త్రం!
తట్టుకోలేకనట్టు ఉద్విగ్నంగా లేచాడు ధన్వి.
"ఒక్కక్షణం మిస్టర్ ధన్వి....." మధూళీ గొంతులో యిందాకటి ఆవేశం లేదు. ఏ సత్యాన్నో అతడి మనసులోకి చొప్పించాలన్న ఆలోచనలతో అంది. "నేను మీకు పరిచయమయింది కొన్ని గంటల క్రితమే కావచ్చు. మనమధ్య చర్చలో ఆప్రయత్నంగా కానీ ప్రయత్నపూర్వకంగా కానీ నేను మిమ్మల్ని ఎక్కడయినా హార్ట్ చేసి వుండొచ్చు, అందుకు నన్ను క్షమించండి....."
క్షణం ఆగింది సాలోచనగా. "మీరంతా ఎందుకు ఆలోచిస్తున్నాగానీ మీరు అందరిలో ఒకరు కాదన్న నిజం గ్రహించిన నేను మీకు తెలిసిన శాస్త్రాల గురించో, మీరు చదివిన నీతి శతకాల సారాంశం గురించో, మీతో చర్చించదలచుకోలేదు. చెరిగిపోయిన నిన్నటి గురించి గానీ, రూపం ఏర్పడని రేపు గురించి గానీ మీతో మాట్లాడి మనమున్న 'నేడు' లోని అనందం గురించి ఏకరువు పెట్టడం కూడా నా అబిమతం కాదు.....మీరు సాధారణ మైన మేధావిగా అంగీకరిస్తూ మీ నుండి ఓ జవాబు తెలుసుకోవాలనుకుంటున్నాను."
నిర్లిప్తంగా చూశాడు ధన్వి....ఇంతసేపూ ఆమె వాగ్సివాడంలో ఆమె గురించి అతడేమనుకున్నా గానీ, ఇప్పుడు ఆమె 'అప్రోచ్' నచ్చింది . అలా అని పెంచటానికి కారణం యిదమిత్ధంగా అతడికి తెలీదు.
"సంఘం గురించి, నైతిక విలువల గురించి అనుక్షణం ఆలోచించే మీరు ఓ రోజు అడవికి వెళ్ళారు . అక్కడ మీకు అనుహ్యామయిన సంఘటన కంటపడింది.
ఏకాగ్రత వింటున్నాడు ధన్వి.
"పాము కాటు మూలంగా ప్రాణాలు
పోవటానికి సిద్దంగా వున్న ముగ్గురు వ్యక్తులు కనిపించారు. ఒకరు గర్భవతిగా వున్న ఓ యువతి, ఇంకొకరు మరోరోజు బ్రతికితే ప్రపంచంలో అసలు మరణాలే లేకుండా చేయగల గొప్ప శాస్రవేత్త. మరొకరు అనాధగా ఏ చెత్తకుండిలోనో మీ అమ్మగారికి దొరికి మీ ఇంటనే పెరిగిన, మీ అమ్మగారికి ప్రాణం లాంటి ఐదేళ్ళ పసికందు, ముగ్గురికి బ్రతకాలనుంది.....మీకేం చేయాలో పాలుపోలేదు....ఇంతలో దేవుడు మీ ముందు ప్రత్యక్షమై కేవలం ఒక్కర్ని మాత్రం నువ్వడిగితే బ్రతికిస్తాను.....చెప్పు నికేవరు కావాలి? అన్నాడు. మీకున్నది ఒక నిముషం గడువు. ఏ ఒక్కరు నిముషం మించి బ్రతకరు."
నిట్టుర్పుగా అంది.
"మీకున్న అవకాశం ఎవరో ఒకర్ని మాత్రమే కాపాడుకోవడం. మీకు అందరిమీద సానుభూతి వుండొచ్చు. కానీ బ్రతికించగలిగేది ఒక్కర్నే.....అది నిముషం గడువులో."
సామ్రాజ్యం విభ్రమంగా చూస్తోంది.
"మీరు ఎవర్ని కాపాడతారు....ఆలోచించి చెప్పండి....ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. రేపు సాయంకాలం ఐదు గంటలకి మనం ఇక్కడే కలుస్తున్నాం. హిపోక్రసీలేని వ్యక్తిగా మీరు జవాబు చెబుతారన్న నమ్మకంతో వెళుతున్నాను."
ఆ తర్వాత మధూళీ అక్కడ నిలబడలేదు. అవసరమయిన సంచలనం సృష్టించినట్లు సామ్రాజ్యం, ధన్వి చూస్తుండగానే వెళ్ళిపోయింది.
హటాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించుకుంది"
ఏం జరిగింది ఇంతసేపూ.....
సామ్రాజ్యం ఆలోచిస్తున్నది....
ఒక తుఫాను తర్వాతి ప్రశాంతత కాదది....మయసృష్టిలాంటి చిత్రమయిన భ్రాంతిలా.....ఇంకా రాయని ఏ గ్రందానికో ముందే రాసిన పిఠికలా.....స్వప్నాల పెటికలా....సరాగాల సంచికలా.....రసప్లావిత శిల్ప సంచికలా....అల్లరితో మొదలై అలజడిగా రూపాంతరం చెంది, అక్కడే ఆగిన జడిలా....బడిలా....గిడిలా అనిపించిన మధూళీ వెళ్ళినా గానీ, ఇంకా అక్కడే వున్నట్టుగా వుంది.
తేరుకున్న సామ్రాజ్యం అర నిముషం తర్వాత ధన్విని చూసింది.
ఇందాక మధూళీ అడిగిన ప్రశ్న గురించి ఆలోచిస్తున్నాడో లేక శూన్య హృదయంలో ఒలికిన ఒయాసిస్సు కార్యపు కోసమెరుపుని వుహించాలని ప్రయత్నిస్తున్నాడో సామ్రాజ్యానికి తెలీదు.
కానీ ధన్వి లో మార్పు కనిపించింది.
అది ఆమె ఇప్పటిదాకా చూడనిది, ఆమె వూహకందనిది.
అయితే ఎవరికి 'అందనివాడు' అన్పించిన ధన్వి 'స్పందన' కలవాడు అన్న నిర్ధారణకి వచ్చింది సామ్రాజ్యం ఆ క్షణంలోనే.
* * * *
"ఆయామ్ సారీ మిస్టర్ రాఘవరావ్!" ఖంగుమంది సెల్ ఫోన్ లో మాట్లాడుతున్న డాక్టర్ శరత్ చంద్ర కంఠం, "నేను నా నిర్ణయానికే కట్టుబడి వుంటాను."
తెరుచుకున్న పాలనేత్రంలా సూర్యుడి వేడి సెగలు నగరాన్ని వజ్రనేత్రాల్లా వేటాడి మండిస్తుంటే సెంట్రల్ ఏయిర్ కండిషన్ బిల్డింగ్ లో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు డాక్టర్ శరత్ చంద్ర.
డబ్బుకి లోటులేని వ్యక్తిగా, వ్యవస్థకి ఉపయోగపడాలనుకున్న విద్యావేత్తగా బాధ్యత తీసుకుని ఇప్పుడు అజ్ఞానుల అధీనంలోకి వెళ్ళడం సముచితంగా అనిపించక --"దయుంచి ఇక నన్ను కంటాక్ట్ చేయకండి" అన్నాడు ఫోన్ పెట్టేయబోతూ.
"ఇది చాలా చిన్న విషయం సర్! దీనికంత రాద్దాంతం చేయడం బాగులేదు" రాఘవరావు నచ్చచెబుతుంటే అసలు తట్టుకోలేకపోయాడాయన.
అవసరం లేకపోయినా ఆత్మవంచన చేసుకోవడం రాజకీయాల్లో సహజం కావచ్చు రాఘవరావ్!" మొన్నెప్పుడో ధన్వి అన్న మాటలు గుర్తుకొచ్చాయేమో....."కాని నేను నిన్న మొన్నటి దాకా విద్యార్ద్ఘుల్ని తీర్చిదిద్ది, నా వంతు కృషిగా ఈ దేశానికి ఎందరో ఇంజనీర్లని అందించిన అధ్యాపక వృత్తినుంచి వచ్చినవాడ్ని.....పొజిషన్ కోసం, పరపతి కోసం ఒక మేధావిని అసమర్దుడిగా నిర్ణయించి, మీ ప్రపోజల్ మీద సంతకం చేయలేను.....అందుకే కమిటీ నుంచి రాజీనామా చేశాను."
"మా మావయ్యగారూ మిమ్మల్ని ఓసారి మాట్లాడమన్నారు" మంత్రి గారి గురించి గుర్తుచేశాడు రాఘవరావు.
"ఈ విషయంలో ఇక నేను చర్చించేది ఏమి లేదు మిస్టర్ రాఘవరావ్!.....మీ ఇష్టం వచ్చినట్టు మీ నిర్ణయాలు తీసుకోటానికి అవకాశం ఇస్తూ పక్కకి జరిగిపోయిన నన్ను ఆ వుబిలోకి లాక్కండి."
"అది కాద్సర్! ఆరోజు ఇంటర్వ్యూ చేసిన యువకుల్లో చాలా మంది టేలెంటెడ్ పీపుల్స్ వున్నారుగా."
"సారీ....." మరోసారి ఖండితంగా అన్నాడు డాక్టర్ శరత్ చంద్ర......"మేధస్సుకి జడ్జి చెయ్యడంలో నేను మీకన్నా బలవంతుడ్ని, హి ఈజ్ యునిక్, అతడితో మరో కేండిడేట్ ని మీరు కంపేరు చేయలేరు. చాలా కాలం తర్వాత నన్ను అమితంగా ఇంప్రస్ చేసిన వ్యక్తీ మిస్టర్ ధన్వి."
అదిగో సరిగా అప్పుడు ఇంటిలో అడుగు పెట్టిన మధూళీ ఉలికిపాటుగా ఆగింది.
అప్పటికే ఫోన్ ఓ మూల వుంచిన తండ్రిని సమిపించింది.
ధన్వి అంటే....
అరుదయన పేరది.....మరో వ్యక్తీ అయ్యే అవకాశం లేదు.....అది కాదు.....ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే తండ్రి ముఖకవళీకల్లో అందోళన స్పష్టమవుతుంటే అడగకుండా వుండలేకపోయింది. "ఏమైంది డాడీ?"
కూతుర్ని స్నేహితురాలిగా భావించే డాక్టర్ శరత్ చంద్ర , ప్రొఫెసర్ గా పదవీవిరమణ చేసినప్పుడు తప్ప, ఆ తర్వాత సర్విస్ కమిషన్ మెంబర్ గా నామినేట్ చేయబడ్డాక తన ప్రోఫెషన్ కి సంబంధించి మాటాడలేదు ఏ రోజు కూడా.....
