Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 21


    "నిజమే ఆమె ఒప్పుకుంది. "అలాగే మనకి అనుభవంలోకి రానివన్నీ అర్ధరహితంగా అని కూడా అనుకోకూడదు" అంది.
    
    ప్రేమ్ ఆ తర్వాత తన బట్టలూ, ఫ్యాన్సీ సామాన్లూ కొన్నాడు. బంగారం, వెండి, ముత్యాలూ అమ్మే షాప్ కి తీసుకెళ్ళి "ఇవి చూడు బావున్నాయా?" అంటూ అడగబోయాడు.
    
    "నాకు వీటి గురించేమీ తెలియదు. సారీ" అంది కాస్త విసుగ్గా.
    
    "అమ్మకి ఎన్ని వున్నా సరిపోవు. ఇంకా ఏవో కొత్త రకాలంటూ ప్రాణం తీస్తుంది. ఆవిడ్ని చూస్తుంటే పెళ్ళి అంటేనే దడ పుడుతుంది" అన్నాడు ప్రేమ్.
    
    "అందరూ అలాగే వుండరు" అంది ధృతి.
    
    "ఆ విషయం ఇప్పుడేగా తెలిసింది" అతను నవ్వాడు.
    
    అలా అనకుండా వుండాల్సింది అని తనని తాను తిట్టుకుంది ధృతి. ఆమెకి తన తల్లి గుర్తొచ్చింది. స్తోమత లేక కానీ ఆమెకి కూడా వెండి, బంగారమంటే అపరిమితమైన మోజు వాటి గురించి మాట్లాడడంలో కూడా అపరిమితమైన సంతోషాన్ని పొందుతుంటుంది. పాపం! ఒంట్లో ఎలా వుందో ఏమో! అనుకోగానే వెంటనే తల్లిని చూడాలనిపించింది.
    
    ప్రేమ్ ఏదేదో చెప్తూ అవీ, ఇవీ కొంటున్నాడు. ధృతి మనసు మాత్రం అక్కడలేదు. అతని మాటలు ఆమె చెవులకి సోకటంలేదు. మధ్యతరగతి మనసులు చెప్పిన మాటలు వినవు. దేంట్లోనూ సంపూర్ణమైన ఆనందం లభించదు. అంతా మిధ్య అన్న వైరాగ్యం చాలా త్వరగా వచ్చేస్తుంది. అందుకు బహుశా పుట్టి పెరిగిన వాతావరణం కారణం కావచ్చు. సర్కస్ కి వెళ్ళినప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తుంటే ధృతి మనసు ఆ ఫీట్స్ చేసేవారిపట్ల జాలితో నిండిపోయేది. పొట్టకోసం కదా ఈ పాట్లు అన్న ఫీలింగ్ ఆ ఆనందాన్ని అనుభవించకుండా చేసేసేది. రోడ్డుమీద బొమ్మలేసేఆవడి చిత్రకళలోని అందం, వాడి కళ వ్యర్ధంగా రోడ్డుపాలైపోతోందే అనే బాధని నింపేది. వీధుల్లో ఏక్ తారా అమ్మేవాడి నైపుణ్యం చూసి ఇంత కళాకారుడు కడుపు నింపుకోలేకపోతున్నాడే అనీ, గుడి అరుగులమీద చిరుగుల గావంచాలో కూర్చుని వేద పారాయణం చేయించే పండితుల్ని చూసినప్పుడు పాండిత్యానికి ఆదరణ లేదే అనీ ఆమె మనసు బాధతో సుళ్ళు తిరుగుతోంది. దేన్నీ పరిపూర్ణంగా అనుభవించ లేకపోవడం ప్రతిదానికీ అతిగా స్పందించడంవల్లా లేక స్పందించలేకపోవడం వల్లా అని ఆమెకి సందేహం కలిగింది. ఖరీదైన రెస్టారెంట్ లో ఐస్ క్రీమ్ కొనుక్కుని చీకట్లో ఓ మూల కూర్చుని తినడంకంటే, బండి దగ్గర ఐస్ క్రీం కొనుక్కుని నడుస్తూ తినడం ఆమెకెంతో బావుంటుంది. బహుశా చిన్నప్పటి నుంచీ ఈ రెండోది అందుబాటులో వుండడంవల్ల ఇదే బావుందని మనసు గట్టిగా నమ్ముతోందేమో! ఇష్టాలూ, నమ్మకాలూ, అభిరుచులూ పరిస్థితులని బట్టి మారుతుంటాయేమో!
    
    కార్లో ప్రేమ్ ఏదో వెస్ట్రన్ మ్యూజిక్ పెట్టాడు. చాలా మంద్రంగా హాయిగా వినిపిస్తోంది. ధృతి అలాగే కళ్ళు మూసుకుని వెనక్కి వాలికూర్చుంది. ఆమెకి తోడి రాగంలో 'మేఘమా.....మేఘమా..... ఉరమకే ఈ క్షణం' అన్న పాట పెదవులమీద కదుల్తోంది.
    
    తన భుజాన్ని ఎవరో గట్టిగా గుచ్చిపట్టి కదపడంతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది. "ధృతి! ఏ లోకాల్లోకి షికారు వెళ్ళారు?" ప్రేమ్ అడుగుతున్నాడు.
    
    ఆమె సిగ్గుగా "లేదు కాస్త నిద్ర వచ్చింది" అంది.
    
    అతను అలాగే ఆమె భుజాన్ని గుచ్చిపట్టుకుని తన దగ్గరికి తీసుకుంటూ "ముద్దు పెట్టుకోవచ్చా?" అని ఇంగ్లీషులో అడిగాడు.
    
    ఆమె ఛర్నాకోలా దెబ్బతిన్నదానిలా ఉలిక్కిపడి చూసింది.
    
    అతను మామూలుగానే డ్రైవ్ చేస్తున్నాడు.
    
    "యూ డోంట్ లైకిట్ ఐ బిలీవ్" అన్నాడు మళ్ళీ.
    
    ఆమె మాటలురాని శిలలా చూసింది. ఆ పరిస్థితిని ఎలా జీర్ణం చేసుకోవాలో ఆమెకి అర్ధంకాలేదు. ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుందని కూడా తను వూహించలేదు. తనతో ఎంతో సరదాగా, స్నేహంగా కబుర్లు చెప్పే ప్రేమ్ యిలా అడగడం! రేపట్నించీ ఇతనితో తను ఫ్రీగా ఎలా వుండగలదూ? ఇతను ఇంత మామూలుగా ఎలా వుండగలుగుతున్నాడూ? ఆమె నెమ్మదిగా తన భుజంమీదున్న అతని చేతిని తొలగించింది.
    
    అతను సన్నగా విజిల్ వేస్తూ డ్రైవ్ చేయసాగాడు.
    
    ధృతి మొహం అంతా ఎర్రగా చేసుకుని కూర్చోవడం చూసి "అమెరికాలో ఆడపిల్లలు ఇంతసేపు కలిసున్నా కనీసం ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోకపోతే శంకిస్తారు తెలుసా?" అన్నాడు నవ్వుతూ.
    
    "ఇది అమెరికా కాదు" ఆమె వాడిగా అంది.
    
    "ఔను! అక్కడికీ, ఇక్కడికీ తేడా ఫుడ్ లోనే కాదు బెడ్ లో కూడా వుంటుందని తెలిసింది" అన్నాడు సీరియస్ గా.
    
    ఆమె ఇంకా మాట్లాడలేదు. అతను తన కాలేజ్ లైఫ్ గురించీ, ఫ్రెండ్స్ గురించీ ఏదో చెపుతూనే వున్నాడు. ఆమె వింటోందో లేదో పట్టించుకోవడంలేదు.
    
    వారు ఇంటికి చేరేటప్పటికి చాలా ఆలస్యం అయింది.
    
                                                                  * * *
    
    ధృతి మరునాడు ఆఫీసుకి చేరేటప్పటికి అక్కడ ఆమెకోసం నవీన్ ఎదురుచూస్తూ కనపడ్డాడు.
    
    "హలో!" అంటూ ఆనందంగా దగ్గరికి వెళ్ళింది.
    
    అతను ఆతృతగా "నిన్న సాయంత్రం మీ ఆఫీసుకి ఫోను చేశాను లేవన్నారు. ఇంటికెళ్ళాను - అక్కడాలేవు. మళ్ళీ రాత్రి తొమ్మిదింటికి కూడా ధర్మానందరావుగారింటికి ఫోను చేశాను. లేవన్నారు" అన్నాడు.
    
    "ఏమైందీ?" ఆమె కంగారుగా అడిగింది.
    
    "మీ నాన్నగారికి ఏక్సిడెంటయ్యింది. చాలా చిన్నదే అనుకో! పద, లోపలికి వెళ్ళి లీవ్ పెట్టిరా" అతను చాలా నిదానంగా అన్నా కళ్ళలో అదోలాంటి కంగారు కనిపిస్తోంది.
    
    ఆటోలో వెళుతున్నంతసేపూ ధృతి అడుగుతూనే వుంది "అసలు ఎలా అయిందీ? ప్రమాదమేమైనా జరిగిందా?" అని.
    
    "సైకిల్ మీద వెళుతూ వుంటే ఎవరిదో కారు డాష్ యిచ్చి వెళ్ళిపోయిందట. పెద్దగా భయపడవలసిందేమీ లేదు కానీ కాలు ఫ్రాక్చర్ అయితే కష్టం. ఓల్డ్ ఏజ్ కదా! కార్లలో గర్ల్ ఫ్రెండ్స్ తో షికార్లు కొట్టే వాళ్ళకి కళ్ళు కనపడవులే" అన్నాడు కోపంగా.
    
    ఆ చివరిమాట ఎందుకో ధృతికి తగిలినట్లు అనిపించింది. కాలు లేకుండా, చెక్క కాలుతో నడుస్తున్నట్లు తండ్రిని వూహించుకాగానే దుఃఖం ముంచుకొచ్చేసింది. 'ఛీ! అలా కాకూడదు' అని భగవంతుడ్ని ప్రార్దించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS