ఆస్పత్రిలో అడుగుపెట్టగానే తల్లీ, చెల్లెలూ, తమ్ముడూ వచ్చి పట్టుకుని ఏడ్చేశారు.
"రాత్రంతా నీ కోసం దిగులుపడిచచ్చామే ఎక్కడికెళ్ళావూ? నవీన్ తొమ్మిది వరకూ చూసి వచ్చేశాడుట. అతనే లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళమో" అంటూ ఏడ్చేసింది సుభద్ర.
"పనిమీద బయటికి వెళ్ళానమ్మా!" అంటూ లోపల తండ్రి దగ్గరికి నడిచింది ధృతి.
సీతారామయ్య ఒక్కరోజుకే ఎంతో వార్ధక్యం మీదపడినవాడిలా అయిపోయాడు. కూతుర్ని చూడగానే చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.
"ఏం జరగలేదు. ధైర్యంగా వుండండి" అంటూ ఆమె సముదాయించింది.
నవీన్ తనని ఎక్కడికెళ్ళావూ? అని అడుగుతాడేమోనని చూసింది. అతనికి ఆ ధ్యాస లేనట్లు వున్నాడు "ఒక వారంరోజులు ఆస్పత్రిలో వుండవలసి వస్తుందేమో! వీలుకాకపోతే ఈరోజు వుండి రాత్రికి వెళ్ళిపో ఎలాగూ జనరల్ వార్డు కాబట్టి నేనుంటాను" అన్నాడు.
"నిన్న రాత్రంతా నువ్వు ఇక్కడే కూర్చున్నావా?"
"అవును."
అతని ఎర్రబడిన కళ్ళూ అలసిపోయినట్లున్న ముఖం చూస్తుంటే ఆమెకి మనసంతా పిండేసినట్లయింది. నిన్న నేను ప్రేమ్ తో వెళ్ళకపోయి వుండాల్సింది! నేను అక్కడ ఐస్ క్రీమ్ తింటూ కబుర్లు చెప్తుంటే, ఆ సమయంలో ఇతను ఇక్కడ నా తండ్రికోసం అవస్తపడుతూ....ఆమెకి చాలా తప్పుచేసిన భావం కలిగింది.
"నిన్న..... అసలూ.....నేనూ...." ఆమె చెప్పబోయింది.
"పోనీలే! అయిపోయిందిగా నీకు మాత్రం ఏం తెలుసు?"
"అదికాదు నవీన్! నేను చెప్పలేదూ ప్రేమ్ అనీ, ధర్మానందరావు గారి స్నేహితుడి కొడుకు...."
"అతనితో ఏదో షాపింగ్ కి వెళ్ళాననీ, ఎప్పుడొస్తావో తెలీదనీ ఇంటికి ఫోన్ చేస్తే చెప్పారులే" అతని ముఖంలో ఏ భావం లేకుండా చెప్పేశాడు.
"ఎవరు చెప్పారు?" అతని చెయ్యి పట్టుకుని వూపుతూ అడిగింది తొందరగా చెప్పమన్నట్లు.
"ఆయనే ధర్మానందరావుగారు చెప్పారు."
"మరి ఆయనకి ఈ ఏక్సిడెంట్ విషయం ఎందుకు చెప్పలేదూ?"
"ఎవరు మాట్లాడుతున్నారూ? అని అడిగారాయన ధృతి స్నేహితుడ్ని అనగానే ఈ ఒక్క వాక్యం చెప్పి, ఫోన్ పెట్టేశారు."
ఆమెకి కోపం, బాధ ఒకేసారి తన్నుకుంటూ వచ్చాయి. "కనీసం ఆఫీసుకి వచ్చేముందయినా, నువ్వు నాకు ఫోన్ చేసినట్లు సుబ్బరాజుచేత కబురు చేయచ్చుకదా! ఆయన చెప్పిన పనిమీద నేను వెళ్ళినప్పుడు, నావాళ్ళు ఫోన్ చేస్తే తెలియబరచాలన్న విషయం ఆయనికి తట్టలేదా?"
"పోనీలే! ఇప్పుడేమీ జరగలేదు కదా!"
"ఒకవేళ జరిగినా నాకు తెలిసుండేదికాదు" ఆమె గొంతులో ఎంతో కసితో కూడిన ఆవేదన పలికింది.
"ఇంక ఆ విషయం వదిలెయ్" అతను తేలిగ్గా అన్నాడు.
"నీ అంత స్థితప్రజ్ఞత నాకు లేదు" ఆమె ఇంకా కోపంగా అంది.
"అయితే ఇప్పుడేం చేస్తావూ? వెళ్ళి ఎందుకిలా చేశారని అడుగుతావా? టైమ్ కాని టైమ్ లో నాకు ఫోన్ చేస్తే నేనెందుకు జవాబివ్వాలని ఎదురుప్రశ్న వేసి తిడ్తే ఏం చేస్తావూ?"
"అసలు అంత రాత్రి ఎందుకుచేశారో తెలుసుకునే కనీస బాధ్యత ఆయనకు....."
"ధృతీ! నువ్వు ఆయనక్రింష పనిచేసే ఉద్యోగినివి మాత్రమే!" అతను కటువుగా అన్నాడు. "ఆ సంగతి నువ్వు మరిచిపోయినా, ఆయన మర్చిపోడు. నిన్ను ప్రేమ్ తో పంపించింది ఆ హక్కుతోటే నువ్వేదో ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తున్నానన్న ఫీలింగ్ తో వున్నా.....నిజానికి ఆయన భావం వేరు."
ఆమెకి అతని మాటలు చాలా నెమ్మదిగా జీర్ణమయ్యాయి. ఆవేశాన్ని అణుచుకుంటూ, అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఎలాగైనా నవీన్ కి వున్నా ఆలోచనాశక్తీ, పరిణతీ నాకు లేదు. ఎవరిని ఎక్కడుంచాలో ధర్మానంద రావుగారికి బాగా తెలుసు! తనే ఈమధ్య తరచూ ఆయన ఇంట్లోకెళ్ళి, అధికారపూర్వకంగా ఆయన చెప్పే పనులని 'చనువుగా' పొరపడింది. సుబ్బరాజుకి జ్వరమొస్తే ఒకరోజు వంటచేసింది. మరొకరోజు ఆయనకి ఒంట్లో బాగాలేకపోతే సూప్ చేసి స్వయంగా తాగించింది. ఇవన్నీ ఆయన జీతం ఇస్తున్నాను కాబట్టి చేస్తోంది అనే భావంతోటే చేయించుకుంటున్నారని అర్ధంచేసుకోలేకపోయింది. ఛీ ! ఛీ! ఆత్మాభిమానం చంపుకుని ఎందుకు చెయ్యాలీ? మానేస్తేనో! అనుకుంది. అంతలోనే ఆమెకి తన కుటుంబ ప్రస్తుత పరిస్థితి గుర్తొచ్చింది. తనకి ఆయన ఇచ్చినదాంతో బాకీ తీర్చేసింది. రవి నిశ్చింతగా కాలేజీకి వెళుతున్నాడు. కృతి తనని అక్క మెడిసన్ చదివిస్తుందన్న ధీమాతో రాత్రింబవళ్ళు చదువుతోంది. తల్లీ తండ్రీ మనశ్శాంతిగా వున్నారు. అందరూ ఫస్టుతారీఖు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తను ఉద్యోగం మానేస్తే కుప్పకూలిపోతారు! అంతగా తనవాళ్ళని బాధపెట్టగలదా? అయినవాళ్ళకోసం కొన్నిసార్లు ఇష్టంలేని పనులు చెయ్యాల్సొస్తుంది. మన ఆనందం కంటే ఎక్కువ విలువని అవతలివాళ్ళ సుఖానికీ, సంతోషానికీ ఇవ్వడమేనేమో ప్రేమంటే!
సీతారామయ్యకి కాలు ఆపరేషన్ చెయ్యాలన్నారు. నవీన్ బలవంతం చేసినా, ధృతి అ అమరునాడు కూడా ఆఫీసుకు వెళ్ళలేదు! కనీసం ఫోన్ చెయ్యలేదు. మరునాడు ప్రొద్దుటే తండ్రి దగ్గర తనుంటానని, నవీన్ ని ఇంటికి పంపించింది. అతను పీక్కుపోయిన కళ్ళతో, మాసినగెడ్డంతో ఇంటికి వెళుతుంటే ఆమె మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. సాయంత్రం రవి వచ్చాక ఇంటికి బయల్దేరింది.
ఇంటికి కాస్త దూరంలో ధర్మానందరావుగారి కారు ఆగి వుండడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. బహుశా నవీన్ ఫోన్ చేసి రేపు కూడా రాదని చెప్పుంటాడు. తీసుకురమ్మని డ్రైవర్ ని పంపాడులా వుంది. అనుకుంది. ఆమె ఇంట్లోకి అడుగుపెట్టి అక్కడ దృశ్యం చూసి చకితురాలైపోయింది.
ప్రేమ్ కాఫీ తాగుతూ సుభద్రతో కబుర్లు చెపుతున్నాడు. కృతి అక్కడికి కాస్త దూరంలో కూర్చుని గొప్ప శ్రద్దగా కళ్ళు విప్పార్చి వింటోంది.
ధృతిని చూడగానే సుభద్ర "రామ్మా! రా ఆయన పాపం, నీకోసం చాలా సేపట్నించీ ఎదురుచూస్తున్నారు" అంది. తల్లి ముఖంలో ఆపుకుందామన్నా ఆగని ఉద్వేగం, విపరీతమైన ఆనందం కొట్టవచ్చినట్లు కనబడ్డాయి ఆమెకి.
