నవీన్ ముందు తను"హిపోక్రెటిక్" గా వుండనవసరంలేదు. నటించాల్సిన అవసరం, ఏమైనా అనుకుంటాడేమోనన్న భయం ఎన్నడూ కలగదు. ఇంతకంటే ఏం కావాలి? ఒక మనిషిని మనస్ఫూర్తిగా యిష్టపడడానికి, అతని సాహచర్యం ఆకాంక్షించడానికీ?
ప్రతిఫలాన్ని కోరకుండా మంచికి సాయపడే వ్యక్తి గొప్పవాడు. అతను నోరుతెరిచి అడగకపోయినా ఇవతలవారు అతని వశులైపోతారు. కృతజ్ఞులై పడివుంటారు. కృతజ్ఞత ఎప్పుడూ ఒకరిపట్ల చూపవలసిందేకాని ఆశిస్తే దొరకదు.
* * *
"ఈ రోజు సాయంత్రం నాలుగింటికి ప్రేమ్ ఆఫీస్ కి వస్తాడు. అతనికి కాస్త షాపింగ్ లో సహాయం చెయ్యి" చాలా మామూలుగా చెప్పేశాడు ధర్మానందరావు.
ధృతికి కుదరదానీ, వెళ్ళననీ చెప్పాలనిపించింది. కానీ ఏ కారణం చేత అనడిగితే ఏం చెప్పాలో తోచలేదు.
ఆమె మౌనాన్ని ఆయన అంగీకారంగా తీసేసుకున్నాడు.
ఆమె చాలా అన్యమనస్కంగా పనిచేస్తోంది. మధ్యలో లీల వచ్చి ఏవో జోక్స్ చెప్పినా ఎంజాయ్ చేయలేకపోయింది. ధర్మానందరావుగారి ప్రమేయం లేకుండా ప్రేమ్ డైరెక్ట్ గా అడిగుంటే ఆమె వొప్పుకునేది కాదు.
ఠంచన్ గా నాలుగింటికి అతను వచ్చేశాడు. "హాయ్! కమాన్ లెట్స్ గో!" అంటూ ఆమెని హడావుడి పెట్టేశాడు.
అతనితో కలిసి ఆమె నడుస్తుంటే అందరికళ్ళూ ఆమెని కుతూహలంగా గమనించడం ఆమెకి తెలుసు. నవీన్ తో కలిసి తలెత్తుకుని నిర్భయంగా నడిచె ఆమె ఎందుకో సంకోచంతో కొద్దిగా తల వంచుకుని నడవసాగింది.
"ధృతీ! ఫ్రీగా ఫీలవడం లేదు మీరు ఏదయినా మాట్లాడండీ" అన్నాడతను కార్లో.
"ఏ విషయం గురించి మాట్లాడను ప్రేమ్? మీకు తెలిసిన ప్రపంచం వేరు. నాకు తెలిసిన ప్రపంచం వేరు" అంది.
"మీకు తెలిసిన ప్రపంచం గురించి చెప్పండి" నవ్వుతూ అడిగాడు.
"మా ప్రపంచంలో బంధాలూ, బాధ్యతలూ, కష్టాలూ, కన్నీళ్ళూ ప్రేమలూ, స్పందనలూ అన్నీ కలిసి కలగాపులగంగా మనసుని అతలాకుతలం చేస్తుంటాయి. మీలాగా ఈ సమ్మర్ ఎక్కడ టూర్ చేద్దాం? వింటర్ లో ఏ దేశం బావుంటుంది? అని ఆలోచించేవాళ్ళనీ, పందేలలో లక్షలు ఓడేవాళ్ళనీ చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా వుంటుంది. మీతో ఏ విషయం గురించి నేను మాట్లాడగలను?" నిదానంగా అన్నా, ఆమె మాటలలో తీవ్రత ధ్వనించింది.
"థ్రిల్స్ అనేవి మీ జీవితాల్లో వుండవా ధృతీ?" సీరియస్ గానే అడిగాడు.
"జీవితాన్ని అనుభవించడానికి వ్యసనాలే అక్కర్లేదు. అలాగే థ్రిల్సన్నీ డబ్బుతో ముడిపడిలేవు. భగవంతుడు మనసుని సంతోషపెట్టడానికి చాలా చాలా యిచ్చాడు. సంగీతాన్ని, సాహిత్యాన్ని, పువ్వుల్ని, పిల్లల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని కూడా యిచ్చాడు" అని అతనేమీ మాట్లాడకుండా మౌనంగా వుండటం చూసి "సారీ! నేను ఏదేదో మాట్లాడేస్తున్నాను" అంది.
"నో.....నో.....క్వయిట్ ఇంట్రెస్టింగ్..... డబ్బు లేకపోయినా ఆనందకరంగా జీవించడం ఎలా? అన్న గ్రంధం రాసి క్యాష్ చేసుకోవచ్చు" అన్నాడు.
"మీకు నవ్వులాటగా వుందికదూ?" అడిగింది.
అతను నవ్వేసి "బిజినెస్ మేన్ ని కదా అందుకే అలా ఆలోచించాను. అయితే ధృథీ! మనిషికి ఆనందం కోసం డబ్బు ముఖ్యం కాదంటారా?" అని అడిగాడు.
"కనీస అవసరాలు తీరే డబ్బుంటే చాలంటాను...." అని స్థిరంగా చెప్పింది.
"నాకు ఫైవ్ స్టార్ హోటల్లో వారానికి రెండుసార్లు డిన్నర్ చేయడం కనీస అవసరమైతే?"
అతని గొంతులో కవ్వింతకి ఆమెకి ఒళ్ళు మండింది.
"అందుకే బ్రిటన్ రాణీగారు అన్నం దొరక్కపోతే కేకులు తినొచ్చుగా అన్నట్లుంది" అంది వ్యంగ్యంగా.
ఆ మాటకి ప్రేమ్ పకపకా నవ్వేసి "మీరు చెప్పే ఆ బంధాలు, బాధ్యతలూ అన్నీ వినడానికి చాలా బావున్నాయి. అనుభవిస్తే కూడా అంత థ్రిల్లింగ్ గా వుంటాయా?" అడిగాడు.
"ఏం, మీకు అయినవాళ్ళతో అవన్నీ లేవా?" విస్మయంగా అడిగింది.
"ఉన్నాయేమో చూపించడానికి అవకాశం ఎక్కడిది? అమ్మ చాలా బిజీ. నాన్నగారు ఎప్పుడూ విమానాల్లోనే వుంటారు. నేనిలా" అన్నాడు స్వగతంగా.
"సమస్యలు వచ్చినప్పుడే ప్రేమలు తెలుస్తాయి" అంది వాతావరణాన్ని తేలికపరుస్తూ ధృతి.
"దిగండి" అని అతను అనగానే ఆమె దిగి తెల్లబోయి చూసింది. అదొక పెద్ద అధునాతనమైన హోటల్. ఫుల్ డ్రెస్ లో వున్న గేటు కీపరే ఒక కింగ్ లా వున్నాడు. ఎర్రని తివాచీమీద మెత్తగా నడుస్తుంటే గుండెలలో గుబులుగా అనిపించింది. ఎదురుపడే ప్రతివాళ్ళూ తనని విచిత్రంగా చూస్తున్నట్లు అనిపించింది. ధృతి తను కట్టుకున్న హాఫ్ వాయిల్ చీరవైపూ రబ్బర్ స్లిప్పర్స్ వైపూ చూసుకుంది. ఇటువంటి చోట్లకి వచ్చే అర్హత నీకు లేదు అని పరిహసిస్తున్నట్లుగా అనిపించాయి. ప్రేమ్ మీద పీకలదాకా కోపం వచ్చింది. అతనితో కలిసి వేసే ప్రతి అడుగూ ముళ్ళమీద నడుస్తున్నట్లుగా వుంది. అదే నవీన్ తో కలిసి పల్లీలు తింటూ నడుస్తుంటే తానో మహారాణీలాగా, మిగతా ప్రపంచమంతా తన పాదాక్రాంతం అయినట్లూ అనిపిస్తుంటుంది. నవీన్ గుర్తుకురాగానే ఆమెకి చాలా ధైర్యంగా అనిపించింది. 'నా ధృతికి బెరుకా? భయమా? ఝాన్సీరాణి కదూ!' అని ఆట పట్టిస్తుంటాడు. అది గుర్తుకురాగానే ఆమె నిటారుగా, ధైర్యంగా నడవసాగింది. ఆ తర్వాత ఆమెకి ఏమీ కొత్తగా, భయంగా అనిపించలేదు.
"ఏం తీసుకుంటారూ?" మెనూ కార్డు ఆమె ముందుకు తోస్తూ అడిగాడు ప్రేమ్.
ధృతి నవ్వి "నాకేం తెలియదు ప్రేమ్! వీటి పేర్లు కూడా నేనెప్పుడూ వినలేదు. ఈ హోటల్ పేరు పేపర్లో చూశాను. హోటల్ని దగ్గర్నుంచి ఇవాళ చూశాను" అంది ఎటువంటి అభిజాత్యం లేకుండా.
అతను నవ్వేసి తనే ఆర్డర్ చేశాడు.
ఇద్దరూ ఐస్ క్రీమ్ తింటూ వుండగా ప్రేమ్ అన్నాడు "మనకి అందుబాటులో లేనివన్నీ చెడ్డవీ, మనకి విరుద్దంగా ప్రవర్తించేవారందరూ చెడ్డవాళ్ళూ అని అనుకోకూడదు."
