"ఈ వూళ్ళో బంగారం తాలూకు దొంగతనాలన్నిటికీ - రామాచారికి సంబంధం వుంది. బంగారం కరిగించటం, రాళ్ళు విడగొట్టటం, అమ్మటం, బ్రోకరేజి అన్నీ అతను చేస్తూ వుంటాడు."
"ఈ విషయం మీకెలా తెలిసింది?" అన్నాడు రాణా.
"కొంతకాలం పోలీసులు నన్ను లాకప్ లో పెట్టారు కదా. ఒక దొంగ పరిచయమయ్యాడు. అతడు నన్ను కూడా ఒక దొంగే అనుకున్నాడు. ఒకే వృత్తిలో వున్న వాళ్ళమధ్య సాధారణంగా రహస్యాలు వుండవు. మొన్న బజార్లో కలిశాడు. 'కొత్తగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా- పార్టనర్ షిప్ కలుద్దామా' అని అడిగాడు. అతడిని మాటల్లో పెట్టాను. అతడు చెప్పింది నిజమైతే-"
"ఊ- నిజమైతే".
"సంవత్సరం క్రితమే దేవాలయం నగలు దొంగిలించబడ్డాయి. ప్రస్తుతం దొంగిలించబడినవి గిల్టు నగలు."
గాఢమైన నిశ్శబ్దం వాళ్ళమధ్య చోటు చేసుకుంది. రాణా ఆలోచన్ల నుంచి తేరుకుని లేచి నిలబడుతూ, "థాంక్యూ మిగతా విషయాలు నేను చూసుకుంటాను" అన్నాడు.
అతడి మనసులో అప్పటికే ఒక ఆలోచన రూపుదిద్దుకుంది.
* * *
రాణా కిప్పుడు విషయం పూర్తిగా అర్ధమైంది.
సంవత్సరం క్రితం నగలు కొట్టేసి, దేవుడికి గిల్టు నగలు అలంకరించారు. దొంగతనం జరిగి బయటకు వస్తూండగా గార్డులు చూశారు. వారిని కాల్చి చంపి తన తండ్రిని ఆ హత్య కేసులో ఇరికించారు. దేవుడికి (గిల్టు) నగలు యధాతథంగా వుండటంతో ఎవరి దృష్టీ ఆ దొంగతనం మీదకు వెళ్ళలేదు. ఒకసారి దొంగతనం చేసి, వాళ్ళు గప్ చిప్ గా వుండిపోయారు. సంవత్సరం తరువాత.... ఇప్పుడు..... మళ్ళీ ఇంకొకరి దృష్టి ఆ నగలమీద పడింది. అవి గిల్టువి అని తెలియక వాటిని దొంగిలించారు.
ఎవరు?
తెలుసుకోవటం కోసం అతడు రామాచారి ఇంటి కెళ్ళాడు. ఇన్ స్పెక్టర్ డ్రస్ లో కాదు - గొంగళి కప్పుకుని.
రాత్రి పదింటికి వచ్చిన ఆగంతకుడిని చూసి రామాచారి ఆశ్చర్యపోలేదు. అతడి వ్యాపారం మొదలయ్యేదే అప్పుడు.
"ఎవరు నువ్వు?"
"మాది స్టూవర్ట్ పురం బాబూ."
"ఇంతకుముందు నిన్నెక్కడా చూసినట్టు లేదే."
"రామస్వామి కొడుకుని మొన్నే మా నాయన్ని ఉరి తీశారు."
"ఏమిటి విషయం?"
"ఒక ఉంగరం కొనాలె. దొంగిలించి రెండ్రోజులైంది. డబ్బు అవసరం చాలా వుంది" అంటూ అందించాడు.
"ఎక్కడనుంచి కొట్టేశావురా దీన్ని?" అందుకుంటూ అడిగాడు.
"మొన్న గుళ్ళో దొంగతనం చేసింది నేనే సామీ."
రామాచారి మొహంలో రంగులు మారాయి. "ఆ దొంగతనం చేసింది నువ్వా? ఎవరు చేశారా అని చస్తున్నాను."
"ఉంగరం తీసుకుని డబ్బియ్యి సామీ."
"ఇది గిల్టు ఉంగరం రా అబ్బీ నీకు పైసా రాదు."
"రాయి మీద పెట్టకుండా ఎలా తెలిసింది?"
చారి నాలుక్కర్చుకుని, "చూడగానే తెలుస్తుందిలే పో. తీసుకు పో" అంటూ ముందుకు తోశాడు. అది బల్ల సందుల్లో పడింది. రాణా వంగి దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు.
అతడు వెళ్ళగానే చారి తలుపు వేసుకున్నాడు. తను తెలుసుకున్న విషయం తనవాళ్ళకి చెప్పాలన్న తపన కాలు నిలువనీయలేదు. ఫోన్ చేశాడు.
"ఎమ్మెల్యే నాయుడూ హియర్."
"నేనూ రామాచార్ని మాట్లాడుతున్నాను సార్. పాపం ఆ గిల్టు నగల్ని ఎవడో స్టూవర్ట్ పురం దొంగ కొట్టేశాడు. అవి నిజమైనవే అనుకుని నా దగ్గిరకు తీసుకొచ్చాడు. ఇంతకాలం వాటిని కొట్టేసిన మూర్ఖుడెవరా అనుకున్నాం."
"ఇంకా అక్కడ వాడున్నాడా?"
"లేడు సార్. గిల్టువని చెప్పి పంపేశాను."
"వాడు ఎం.పి. తాలూకు మనిషి అయివుంటాడు."
"అదేమిటి సార్-?"
"అవును మొన్న నగల్ని కొట్టేసింది ఎం.పి. అట. అది చెప్పుకునే నవ్వుకుంటున్నాం. తాను స్వయంగా అమ్మితే బాగోదని బహుశ తన మనిషిని పంపి వుంటాడు. పాపం, ఆ నగలన్నీ గిల్టువని తెలుస్తే వాడి మొహం ఎలా వుంటుందో ఇప్పుడు నాకు స్వయంగా చూడాలని వుంది."
"ఎవరో మళ్ళీ తలుపు కొడుతున్నారు. ఉంటాను సార్" ఫోన్ పెట్టేసి వెళ్ళి తలుపు తీశాడు రామాచారి.
ఎదురుగా రాణా వున్నాడు.
చారిని పక్కకు తోసి బల్ల దగ్గిరకు వచ్చాడు. అతడు అమర్చిన టేప్ రికార్డరు ఇంకా 'ఆన్'లోనే వుంది.
రామాచారి మొహంలో కత్తివేటుకి రక్తం చుక్కలేదు. మనిషి వణికిపోతున్నాడు. రాణా మొత్తం సంభాషణ అంతా విన్నాడు.
అంతా విని రాణా "సో..." అన్నాడు...." సంవత్సరం క్రితం ఒరిజినల్ నగలు ఎమ్మెల్యే కొట్టేసాడు. ఇప్పుడు గిల్టు నగలు ఎం.పి. కొట్టేసాడు."
రామాచారి మాట్లాడలేదు.
'దేవుడా! రక్షించు నా దేశాన్ని' అనుకున్నాడు రాణా మనసులో రామాచార్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళాడు.
* * *
"వాడ్ని చంపెయ్యాలి" వీరదాస్ క్లుప్తంగా అన్నాడు. ఎమ్మెల్యే నాయుడు దాదాపు వణుకుతున్నాడు. మామూలు పరిస్థితుల్లో అయితే అంత భయపడేవాడు కాదు. కానీ తొందర్లోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. కేసు నిలుస్తుందా లేదా అన్నది వేరే సంగతి పేపర్లవాళ్ళు వదిలిపెట్టరు. సంవత్సరం క్రితం దొంగతనం- గిల్టునగలు- హత్యలు - అన్నీ ఇప్పుడు బయటపడ్డాయంటే కష్టం. ప్రజలకు భక్తి ఎక్కువ. 'నగల దొంగ' అన్న పేరొస్తే చాలు- కోర్టు అవసరం లేదు- డిపాజిట్లు కూడా దక్కదు.
ఎం.పి. పులిరాజు కూడా వూరుకోడు. ఆ గిల్టు నగల్ని ఏ పెంటదిబ్బమీదో పడేస్తాడు. దాంతో రామాచారి సాక్ష్యానికి మరింత బలం దొరుకుతుంది. అందుకే విషయం తెలియగానే అర్ధరాత్రి వీరదాసు దగ్గిరకి పరుగెత్తుకు వచ్చాడు.
"వాడ్ని చంపేయ్యాలి" వీరదాసు లేచాడు. "ఈ రాత్రికే.... వెంటనే."
నాయుడు వీరదాసుతోపాటు నడిచాడు, ఎదురు చెప్పలేదు. విషయం ఎంత తీవ్రమైనదో తెలుసు. అప్పటికి రామాచారి అరెస్టు కాబడి రెండు గంటలైంది. ఊరంతా నిద్రలో మునిగి వుంది.
వీరదాసు జీపు పోలీసు స్టేషన్ కి ఫర్లాంగు దూరంలో ఆగింది. నలుగురు మనుష్యులు పెట్రోలు డబ్బాలు మోసుకొచ్చారు. పోలీసు స్టేషన్ కి కుడివైపు వసారాలో వుంది లాకప్ రూమ్ వసారా ముందు వరండాలో సెంట్రీ కునికిపాట్లు పడుతున్నాడు.
ఒకడు వెళ్ళి సెంట్రీతో "నిన్ను ఎం.పీ. గారు పిలుస్తున్నారు" అన్నాడు వాడు భయపడి "ఎక్కడ?" అన్నాడు. అంత అర్ధరాత్రి ఎం.పీ.గారు ఎందుకొచ్చారో తెలియలేదు.
"అక్కడ జీపులో వున్నారు."
సెంట్రీ పరుగెత్తుకు వెళ్ళాడు. అతడలా వెళ్ళగానే వీరదాసు చీకట్లోంచి ముందుకొచ్చాడు. నలుగురూ పెట్రోలు పోయటం, వీరదాసు అగ్గిపుల్ల వెలిగించటం ఒకేసారి జరిగాయి. వరద పారినట్టు లాకప్ రూమ్ లోకి పెట్రోలు పారింది. దానితో పాటే మంట కూడా పాకింది. పెద్దగా ఆర్తనాదం చేస్తూ రామాచారి వూచలు వూపేస్తున్నాడు.
లాకప్ రూంలో నుంచి బయట పడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. స్టేషన్ లో నుంచి ఇద్దరు పోలీసులు బయటకొచ్చారు. లాకప్ లో మండుతున్న శరీరం అటూ ఇటూ పరిగెడుతూంది. పోలీసులు కంగారుగా తాళం తీయడానికి ప్రయత్నిస్తున్నారు. అది రావడంలేదు. అక్కడంతా గందరగోళంగా వుంది. చివరి కెలాగైతేనేం-తాళం తీశారు. అప్పటికే లోపల్నుంచి వాసన వస్తోంది. ఒక పోలీస్ సైకిల్ వేసుకుని రాణా ఇంటికి వెళ్ళాడు. రాణా వచ్చేసరికి చారి కొస ప్రాణంతో కొట్టుమిట్టులాడుతున్నాడు. డాక్టరు అక్కడికే వచ్చాడు. ఇంకో అయిదూ, పది నిముషాలకన్నా ఎక్కువసేపు బ్రతకడం కష్టం అని చెప్పాడు.
"చూడూ" అన్నాడు రాణా. మోకాళ్ళమీద కూర్చుని, "చేసినంతకాలం పాపాలు చేశావు. చచ్చేముందైనా నిజం చెప్పడం మంచిది నీ వల్ల ఈ రాష్ట్రానికి కొందరి పీడ తప్పుతుంది. లాకప్ రూమ్ లోకి పెట్రోలు పోసింది ఎవరో చూశావా?"
"వీరదాసు."
రాణా వ్రాసుకున్నాడు.
"సంవత్సరం క్రితం వాళ్ళు నగలు దొంగతనం చేశారు. ఆ విషయంలో నువ్వు అప్రూవర్ గా మారుతున్నావని తెలిసి నిన్ను చంపేశారు. అవునా?"
"అవును."
"సంవత్సరం క్రితం మీరు చేసిన దొంగతనంలో గార్డుల్ని ఎవరు చంపేసేరు?"
"వీరదాసు."
"ఆ నేరం ఎవరిమీద వేశారు?"
"రామస్వామి మీద."
"దీని వెనుక ఇంకెవరయినా వున్నారా?"
"ఎమ్మెల్యే నాయుడుగారు."
"ఇదంతా నువ్వు స్పృహలో వుండే చెపుతున్నావా?"
"నేనిదంతా స్పృహలో వుండే చెపుతున్నాను."
రామాచారి డెత్ స్టేట్ మెంట్ మీద రాణా సంతకం తీసుకున్నాడు. ఆ తరువాత అరగంటకి చారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
దాదాపు రెండు అవుతూండగా వీరదాసు అడ్డాకి బయల్దేరి వెళ్ళాడు రాణా. అక్కడ అందరూ అప్పుడే నిద్రకి ఉపక్రమిస్తున్నారు. పోలీస్ వ్యాన్ చప్పుడికి కలకలం బయల్దేరింది. వీరదాస్ అనుచరులు అడ్డు చెపుతూంటే పక్కకి తోసి లోపలికి వెళ్ళాడు.
కళ్ళు నులుముకుంటూ తలుపు తీసిన వీరదాసు ఎదురుగా రాణాని చూసి ఆశ్చర్యపోయాడు కానీ క్షణంసేపే అది. విశాలంగా నవ్వుతూ, "రండి సార్! ఏమిటి అర్ధరాత్రి దాటాక వచ్చారు" అన్నాడు.
"రామాచారి హత్యకేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాను."
వీరదాసు ఆశ్చర్యం ప్రకటిస్తూ "రామాచారి చచ్చిపోయాడా? ఎక్కడా? ఎప్పుడు?" అన్నాడు.
రాణా అతడివైపు కన్నార్పకుండా కొంచెం సేపు చూసి, నాటకానికి ఆఖరి తెర వేస్తున్నట్టు "మరణ వాంగ్మూలం ఇచ్చాడు. అన్నీ చెప్పి సంతకం పెట్టాడు" అన్నాడు.
వీరదాసు మొహంలో నవ్వు మాయమైంది.
ఇద్దరిమధ్యా భయంకరమైన నిశ్శబ్దం.
"ఎంతకావాలి? చెప్పు! ఇరవైవేలు...."
రాణా అతడినే చూస్తున్నాడు.
"ఆ స్టేట్ మెంట్ చింపెయ్యి విషయం ఇప్పుడే సెటిల్ చేస్తాను."
"విషయం సెటిల్ చెయ్యడానికే వచ్చాను పద!"
వీరదాసు కదల్లేదు. "చాలా కష్టాల్లో పడతావ్ రాణా ఇప్పుడే ఉద్యోగంలో చేరావు. స్నేహంగా వుండు."
