"అదేంకాదు. నేను మాత్రం నా విద్యతో ఇంకా ఇంకా కొనసాగుతాను. అయితే... ఈ కొనసాగడం డబ్బు సంపాదించే లక్ష్యం కోసం కాదు- విజ్ఞానార్జన కోసం!" రేవంత్ పట్టిష్టంగా చెప్పాడు.
"నేను జీవితంలో అడ్జెస్ట్ అయిపోయి ఉద్యోగం చేసుకుంటాను. ఇంతకంటే నామీద పెట్టుబడి పెట్టే స్థితి మా ఇంట్లోవాళ్ళ పెట్టుబడి ఆశించడం! అందుకే మన ఆలోచనధోరణి జపాన్ లెవెల్ కు పెరగలేకపోతోంది. చదువుకోగా మిగిలిన టైమ్ పనిచేయడానికుపయోగిస్తే ఆ చదువు కొనసాగడానికి సరిపోయేంత సంపాదించుకోవచ్చు"కామిని సరిదిద్దింది.
"నేనూ, ఆనంద్ ఉద్యోగాల్లో చేరిపోయి సంసారం పెట్టేసుకుంటాం. మీలా సిద్దాంతాలూ, విజ్ఞాన సముపార్జనలూ వద్దు. కదూ.... ఆనంద్!" అంది రేవతి.
"అవుననుకో! కానీ, ఏదో అసంతృప్తి!" అన్నాడానంద్.... తనకే తెలీని భావన. చెప్పలేకపోతున్నట్టు!
స్ఫూర్తీ, ఈష్ ఒకరినొకరు చూసుకున్నారు కళ్ళతోనే! 'మనం ఏంచేద్దాం?' అనే ప్రశ్న ఇద్దరికీ కదలాడింది.
"మేం కూడా ఉద్యోగాలు చూసుకుంటూ చదువుకోవాల్సిందే! మాకు ఈ హాస్టల్ కాలేజ్ వదిలాక ఎదురయ్యే మొదటిసమస్య....భోజనం! అది తీరాక- ఇంక చదుకోవాలా, లేదా తేల్చుకోవాలి!"
ఈష్ మాటలకు స్ఫూర్తి తలూపింది.
"ఇంతగా ఉద్యోగాలూ, ఉద్యోగాలూ అంటున్నాం- అవేమయినా బేకరీ ఒవెన్ లోని కట్ లెట్లా.... తక్కున ఆర్డర్ వేసి తెప్పించుకోవడానికి!" కామినికి డౌటోచ్చింది.
"మన జాబ్ కాక ఇంకా నాలుగైదు జాబ్ ల వరకూ యమ్.సి. ఎ. స్టూడెంట్స్ కు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందిలే! ఆ తరువాత చెప్పలేంగానీ! అదేకదా మన దైర్యం.... ఈ కోర్సు ఎంచుకోవడనికి కారణం!" ఈష్ క్లియర్ చేశాడు.
"నేను చదూకుంటాను! లోతుగా, ఎంతో లోతుగా....జీవితాంతం చదూకుంటాను చదువే జీవితమైనా సరే!" జ్ఞాపిక తేల్చి చెప్పేసింది.
"అంటే.... పెళ్ళి చేసుకోవా!" రేవతికి అనుమానం వచ్చింది.
"చేసుకున్నా సరే! డాడీ సంపాదించింది ఉంది భోజనానికి ఇది నాకు జీవితం ఇచ్చిన ఒక అవకాశం! ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ పెళ్ళి, పిల్లలూ ఎలా జీవితంలో భాగంగా కొనసాగుతాయో చదువూ అలానే కొనసాగుతుంది. వాళ్ళు నన్ను విడిచిపోయినా చదువు మాత్రం నాతోనే ఉంటుంది... జీవితాంతం! చదువు నా తృష్ణ! ఇది తీరేందుకు జీవితమే చిన్నదనిపిస్తుంది నాకు!" గుండెలోతుల్లోంచి చెప్పింది.
"వాళ్ళు మాత్రం ఎందుకు విడుస్తారు? అదే నెగటివ్ థింకింగ్.... నాకు నచ్చదు!" సీరియస్ గా అన్నాడు రేవంత్ వేడి తగ్గించడానికని.
"రేవంత్... నువ్వు రేపట్నుంచీ కుకింగ్ సెంటర్ లో జాయినవడం బెటర్! నీకు పుడ్ వండదిది! ష్చ్! దీన్ని జీవితానికి నువ్వు బకరా అయిపోయావు!" రేవతి రేవంత్ పై జాలి చూపించింది.
"ఆనంద్.... కాడ్ బరీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకో! లేపోతే ఇది నిన్నూ తింటూంది!" జ్ఞాపిక అంది.
"షటప్! నాకంటే స్ఫూర్తి ఎక్కువ తింటుంది!" రేవతికి చివ్వున కోపమొచ్చింది.
"నీ వెయిటూ, నా వెయిటూ చూసుకుందాం. ఎవరెక్కువ తింటారో తెలుస్తుంది! అయినా.... మీ ఇద్దరూ గింజులాడుకుంటూ మధ్యలోకి నన్ను లాగడమెందుకు?" చిర్రెత్తింది స్ఫూర్తికి.
"వెయిటూ ,గియిటూ అంటున్నావ్? అంటే...నేను లావుగా ఉన్నాననా? అసలు నా లావు చూసే ఆనంద్ పడిపోయి గాఢంగా ప్రేమిస్తున్నాడు! అడుగు కావాలంటే! ఏం ఆనంద్...?" ఆనంద్ వైపు తిరిగింది.
"నీ మొహంఁ.... నీ వెయిట్ చూసి నిన్నెవడూ ఇష్టపడలా! ఆనంద్ నీ సోడాబుడ్డీ కళ్ళద్దాలు చూసి ముచ్చటపడ్డాడు.... తగిన జోడని! కదా ఆనంద్?!" స్ఫూర్తి చూపుడువేలు చూపిస్తూ అడిగింది.
'అవు' నంటే ఒకరికి కోపం- 'కాదం'టే ఇంకోకరికి చులకన! కప్ప, పాముకు మధ్యన మనిషిలా అయిపోయాడు. 'అవు'నని రెండుసార్లు నిలువుగా. 'కాదని' ని రెండుసార్లు అడ్డంగా ఊపాడు తలను.
"ఇంతకీ....అవునా, కాదా సరిగా చెప్పు! మన భవిష్యత్తు నిర్ణయమిది!" రేవతి పట్టుబట్టింది.
"ఏయ్ఁ.... ఆపండి! కాడ్ బరీస్ కోసం, కళ్ళద్దాల కోసం భవిష్యత్ నిర్ణయాలూ, మీరూనూ! అయినా- నువ్వూ, స్ఫూర్తీ తన్నుకోక మధ్యలో ఆనంద్ ఏంచేశాడు? పాపం.... అసలే మగపిల్లాడు- తగాదాలూ, గట్రా వాళ్ళకేం తెలుసు అమాయకులు?! మీతో గెలవగలడా!" మగజాతి చూపింది కామిని.
"అవునే పాపం! మన గొడవల్లోకి మగవాళ్ళను లాగకూడదు. వాళ్ళు నలిగిపోతారు. ప్రాక్టీస్ ఉండదు కదా.... తగాదా అడ్డం!" జ్ఞాపిక కూడా ఒప్పుకుంది.
ఇవన్నీ విని అబ్బాయిలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు....'మన పెళ్ళిళ్లయ్యాక ఇక మన గతేవిటీ...?!' అన్నట్టు. ఆనంద్ ఆపుకోలేక అడిగేశాడు కూడా-
"ఇప్పుడంటే తగాదా ఆడుకోవడానికి మీకు ఒకరికొకరు ఉన్నారు. మరి, పెళ్ళయ్యాక ఎవరుంటారు?" భయపడుతూనే అడిగారు.
"అప్పుడసలు తగాదా ఆడం!" అందరూ ఒకేసారి చెప్పారు.
"నిజంగా...?!" అబ్బాయిలందరూ ఒకేసారి అనందంగా అడిగారు.
"అవును.... కయ్యానికి సమవుజ్జీ ఉడాలిగా! మీరెలాగూ తగాదాలో మాకు సమవుజ్జీ కాలేరు. మేం చెప్పినవన్నీ చచ్చినట్టు ఒప్పుకుని తీరతారుగా! ఇక, తగాదా ఎవరితో ఆడతాం?!" కోరస్ గా అన్నారు.
"ఓఁ...మైగాడ్!" కోరస్ గా, రిథమటిక్ అని తలలు పట్టుకున్నారు అబ్బాయిలందరూ!
"ఇప్పుడే అంత కంగారుపడకండి! పెళ్ళిళ్లయ్యాక ఇక ప్రతిక్షణం కంగారేపడాలి. ఎనర్జీ దాచుకోవాలి మరి.... మమ్మల్ని భరించడానికి!" కామిని టీజింగ్ స్టార్ట్ చేసింది.
"బాంక్ బ్యాలెన్స్ కూడా పెంచుకోవాలి ఇప్పట్నుంచీ....కాడ్ బరీస్ లకు!" రేవతి టిజింగ్ ను పెంచింది.
"వంటా, వార్పూ లక్షణంగా చెయ్యాలి సుమా!" జ్ఞాపిక అచ్చం బామ్మలా అంది.
"నా మటుకు నేను బట్టలూ, ఇల్లూ, పిల్లలూ సరిగా చూసుకోకపోతే ఒప్పుకునేది లేదు!" స్ఫూర్తి పక్కా ఇల్లాలులాగా చెప్పింది.
అబ్బాయిలందరూ సడన్ లేచి నిలబడ్డారు!
"ఎవయిందీ...." కంగారుగా అడిగారు అమ్మాయిలు.
"మేం పెళ్ళిచేసుకోం! అమ్మాయిల్నసలు చేసుకోం!!" అని, "బై..." చెప్పేసి రిటర్స్ తిరక్కుండా ఫాస్ట్ గా పారిపోతున్న వాళ్ళను చూసి, "అమ్మాయిల్ని చేసుకోకపోయినా పర్లేదు! అబ్బాయిల్ని మాత్రం చేసుకోకండి! అంత బావుండదు. కేస్ కూడా అవుతుంది!" వెనకనుంచి ఇంకా అమ్మాయిలు టీజ్ చేస్తూనే ఉన్నారు..... పడిపడి నవ్వుకుంటూ.
15
జ్ఞాపిక, రేవంత్ నడుస్తున్నారు మెల్లగా... అడుగులో అడుగుగా, ఒకరికొకరు తోడుగా!
"జ్ఞాపీ..." అతనలా మెత్తగా పిలుస్తుంటే మునివేళ్లతో గుండెను తట్టినట్టుంట్టుంది! ఎంతాపుకుందామన్నా గుండె ఆగదు. వెంటనే బదులు పలుకుతుంది.
"ఊఁ.."
"నేను స్టేట్స్ కు వెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నావుగా! వీసా ఎగ్జామ్స్ అయ్యేలోపు వచ్చేస్తుంది! ఇంటర్వ్యూకూడా అయిందిగా!"
"తెలుసు...!"
"మరి..., నువ్విక్కడా, నేనక్కడా- ఎలా?"
"నేనూ టోఫెల్ కు ప్రిపేరవుదామనుకుంటున్నా!"
"ఎందుకు?"
"ఇద్దరం కలిసి వెళ్లిపోయి నేను కూడా అక్కడే చదూకుంటా!"
"మీ డాడీ ఒప్పుకుంటారా.... ఒక్కదాన్నీ పంపడానికి?"
"ఒక్కదాన్నీ ఎలా అవుతాను....నువ్వుంటావుగా తోడు?!"
"ఒక బాచిలర్ తో ఎలా పంపిస్తారు నిన్ను?"
"వెళ్లేసరికే మనం భార్యాభర్తలం అయిపోదాం!
"పెళ్ళి చేసుకుని వెళ్లిపోదామా?"
"నా అభిప్రాయం! మరి నీ ఇష్టం!!"
"నాక్కూడా ఇష్టమే! నీకు దూరంగా నేనుండలేను! ఉన్నా నా చదువు సాగదు."
"ఇంకేం... మరి, మీ మమ్మాకి కాకా కొట్టు!"
"నువ్వు మీ డాడీకి కొడతావా?"
"కాకా ఏవీ అక్కర్లా! మా డాడీ నేనడగ్గానే ఒప్పేసుకుంటారు!"
"ఎంత కాన్ఫిడెన్స్! మా మమ్మా నేనడక్కముందే ఒప్పేసుకుంది... 'నీ పెళ్ళి నీకిష్టమైన వాళ్ళతోనే అవుతుంది! నాకు చెప్పకపోయినా సరే... నా కోడల్ని ఎప్పుడింటికి తెచ్చినా మంగళహారతి రెడీ' అని!"
"మరి, నేనొస్తే మమ్మా మంగళహారతి పట్టలేదేమ్మా...?!" వెక్కిరించింది.
"నువ్వు మంగళవాయిద్యాలతో, పట్టుచీరతో, పూలదందతో, నా చిటికెన వేలు పట్టుకుని రాలేదుగామ్మా!" తిరిగి వెక్కిరించాడు.
చటుకున్న చిటికెన వేలు పట్టుకుని, "పద...! అంది.
"ఎక్కడికీ.... లేడికి లేచిందే పరుగని?!"
"మమ్మాను అడిగేద్దాం- 'నేను నీ కోడలుగా ఇష్టమేనా....' అని!"
"దానికి ముందో పని చెయ్యాలి మనం!"
"ఏంటో..?! పట్టుబట్టల కొనుక్కోవడమా? పూలదండలకు ఆర్దరివ్వడమా? బాండూ, మేళాలు అరేంజ్ చేసుకోవడమా?"
"జోకులెయ్యకు! మమ్మాను పెళ్ళికొప్పించాలి! మనం వెళ్లాక మమ్మా ఒంటరి దయిపోతుంది. ఉన్న ఆస్తి భక్షించడానికి గుంటనక్కలు చేరతాయి. కనుక మమ్మాకి ఒక తోడూ, ఒక స్నేహితుడూ, హితుడు కావాలి! అందుకే మమ్మాకి పెళ్ళి చెయ్యాలి."
"బావుంది! కానీ, ఇప్పుడెవరు పెళ్ళి చేసుకుంటారు?"
"ఎందుకు చేసుకోరు? మామ్మా వయ సెంతని? ఆ వయసుకు తగ్గవాళ్ళే, ఒంటరిగా ఉన్నవాళ్ళు కావాలని పేపర్ అడ్వటైజ్ మెంట్ చేద్దాం! ఇది 20వ శతాబ్దం....ఇది మామూలు విషయం! అయితే మమ్మాను ఒప్పించడమే కష్టం!" భారంగా అన్నాడు.
"నేనూ సాయం చేస్తా.... ఈ విషయంలో!" జ్ఞాపిక ఉత్సాహంగా అంది.
"నేను ఎంత ప్రయత్నించీ వేస్టయ్యాను. నీవల్ల కాదులే!"
"అదుగో.... అలా అనకు! ఆడవాళ్ళనెలా ఒప్పించాలో ఆడవాళ్ళకే తెలుస్తుంది."
"ఛాలెంజ్! నువ్వు అమ్మను ఒప్పించలేవు.
"ఛాలెంజ్! నేను ఒప్పిస్తా! ఏవిటి బెట్?"
"ఒప్పిస్తే నీలాంటి అమ్మాయినిస్తా! ఓడిపోతే నువ్వు నాకు నాలాంటి అబ్బాయినివ్వాలి!" అని ఏదోటి చేస్తుందని అందకుండా దూరం జరిగాడు.
"ఇదొక బెట్టా! ఉండు.... ఆ ఇచ్చే అమ్మాయినేదో నువ్వే మోసి, నువ్వే కనబోతున్నాట్టు! ఇచ్చినా, పుచ్చుకున్నా రెండూ నేనే చెయ్యాలి! పాపం- నీకేం.... హాయిగా కలలు కనొచ్చు! ఆగు చెప్తా! ఒక్కసారి ఆగు! ఆగమన్నానా.... పిరికిపిల్లాడా- ఆగు దైర్యం ఉంటే!"
ఠక్కున ఆగాడు!
ఆగాక ఏంచెయ్యాలో తెలీలా గ్నపికకు! చటుక్కున వచ్చిన ఐడియా చేసేద్దామని మునికాళ్ల మీద లేచి గరుకుగడ్డాన్ని పళ్లతో బిగించి నొక్కి వదిలింది.
ఏదో... కొట్టడమో, జుట్టు పట్టుకోవడమో, కాలర్ పట్టుకోవడమో చేస్తుంది అనుకున్నాడు. అనుకొని స్పర్శకు చలించి అలానే చూస్తుండిపోయాడు.
గడ్డంమీద పళ్లగాట్లు పడి నెప్పెడుతున్నా అతనలాగే నిశ్చలంగా చూస్తుంటే జ్ఞాపిక కెందుకో సిగ్గేసింది! తనూ అనుకోకుండా చేసింది. అతనలా, అలా చూస్తూంటే.... చేయకూడంది చేసినట్లనిపించింది.
"ప్లీజ్.... చూడకూ! ఆ పేయ్ఁ.... అలా చూడకూ! నేనోదిపోతాలే- చూడకూ అలా! నాకెలాగో ఉంది!" అని బ్రతిమాలింది.
కళ్ళలోంచి కళ్ళు మరల్చకుండానే చూపు మలిపాడు- ఈ లోకంలోకి వచ్చి.
"ష్చ్..." అంది జ్ఞాపిక.
"ఏంటి?" అన్నాడు బాధ అర్థంకాక.
"చూడకూ.... అంటే మాత్రం చూడ్డం ఆపేస్తారా ఎవరయినా?!" నిరాశాగా అంది.
"నిన్నూ...! వేలికేస్తే కాలికేస్తావ్, కాలికేస్తే వేలికేస్తావ్! బాబోయ్ఁ.... నీతో జన్మంతా వేగాలంటే మహా భయంగా ఉంది!" భయపడుతున్నట్టు యాక్షన్ చేశాడు.
"ఆఁ.... అప్పుడప్పుడు అబ్బాయిల్ని భయపెట్టడం అమ్మాయిల హాబీ! అప్పుడే వాళ్ళు మమ్మల్ని మరింత ప్రేమిస్తారని ప్రేమసూత్రంలో రాసుంది."
"అదేవరు రాశారు? నాకు తెలీదే!"
"మా నానమ్మకు నానమ్మ రాసింది. పబ్లిష్ చెయ్యలా- అందరికీ తెలిసిపోతాయి ట్రిక్స్ అని! మా వంశానికి మాత్రమే ఆ సూత్రాలు అందించబడుతాయి!" గర్వంగా చూస్తూ నుదుటిమీది జుట్టు అలా అలా వెనక్కి సర్థుకుంది....స్టైల్ కొడుతున్నట్టు.
"స్టైల్ కొట్టకూ! మా తాతయ్యకు తాతయ్య రాసిన 'కవ్వింత సూత్రం' ప్రదర్శించాల్సి ఉంటుంది!" అని మెత్తని నడుం మీదకు కొనవేళ్లు తాకించబోయాడు.
"ఏయ్ఁ...వద్దు! ఊరికే అన్నా!" కంగారుపడిపోయింది.
"వద్దంటే మానేస్తారా ఎవరయినా!'.... అంటావా మానేశాక!" ఇంకొంచెం ముందుకు జరిపాడు వేళ్లను.
"అనను! అనను! అననంటే అనను! ఐస్ క్రీమ్ మీద ఒట్టు. లిప్ స్టిక్ మీద ఒట్టు! కాడ్ బరీస్ మీద ఒట్టు! రబ్బరు బాండ్ మీద ఒట్టు!" టకటకా ఒట్లేసేసింది.
తగ్గాడు రేవంత్- "నాతో పెట్టుకోకు!" అని.
"నీతోనే పెట్టుకుంటా!" గొణిగింది.
"ఆఁ...?!" దబాయింపుగా అన్నాడు.
"ఏవీ లేదూఁ... సాయంత్రం ఎంత బావుందో కదా- అంటున్నా!" అని సర్దిచెప్పింది.
ఇంతలోకి గ్రూపంతా వచ్చి జాయినయింది లాన్లోకి! అందరూ కూర్చుని చక్కని మూడ్ లోకి వచ్చాక తమాషా గా-
"పెళ్ళికి తగిన వయసేది?" రేవంత్ అడిగాడు గ్రూపందరినీ కలిసి.
"పెళ్ళికి అర్థమేంటో తెలిస్తే పెళ్ళి వయసే దో నిర్ణఇంచొచ్చు!" ఈష్ తిరిగి ప్రశ్న వేశాడు.
"పెళ్ళంటే స్త్రీ పరుషులిద్దరి సహజీవనం! సహజీవనానికి విస్తృతార్థం ఉంది..... ఇద్దరూ ఇద్దరికీ సహకరించుకుంటూ గడిపే జీవనం! ఒకరి ఆధారిటీ, ఒకరి సర్దుబాటు ఉండదిండులో! ఒకరికొకరు సహకారంగా ఉండడం! అదే పెళ్ళంటే!" క్రాంత్ చెప్పాడు.
