Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 19

   
    "నీకు పెద్ద పెద్ద ఊహలుంటే ఉండొచ్చుగాని ఊహలు నిజాలు చేసుకొనే స్థోమత చూచుకోవద్దా? నీకు ఇంతకంటె మంచి సంబంధం వస్తుందనుకొంటే మా సింహాన్ని ఏం చేసుకోవద్దు. బాగా ఆలోచించుకోవే. నీకు ఇష్టమైతేనే చేసుకో. నేను ఎక్కువగా బలవంతపెట్టను. నీకంటూ ఓ ఇల్లు సంసారం ఏర్పడే మార్గం చెప్పానేగాని పూర్తిగా నా స్వార్థమే చూడకు నువ్వు. నాకు సింహం ఎంత కావలసినవాడో నువ్వూ అంతేకావాలి" బలవంతం చేసినట్టుకాకుండా మెత్తటి మాటలతోనే సంధ్యని ఒప్పించాలనుకొంది నర్సమ్మగారు.

    సింహాన్ని భర్తగా ఊహించుకోడానికే అసహ్యం వేస్తూంది సంధ్యకు. అతడి ఊబశరీరం, వికారంగా ఉండే ముఖం క్రొత్తవాళ్ళు చూస్తే ఫక్కున నవ్వుతుంటారు, ఏదో హస్యచిత్రాన్ని చూసినట్టుగా. పిల్లలయితే అతనిని ఆట పట్టిస్తుంటారు. ఒక్కోసారి రాళ్ళుతీసుకొని వెంటపడుతుంటారు నర్సమ్మగారు చూసి,  "మీ ముఖం మండా! వాడు మిమ్మల్నేం చేశాడని వాడిని సతాయిస్తారురా?" అని పిల్లల్ని తరిమేస్తుంటుంది. చిన్నప్పుడు తనూ అరుణ్ కూడా సింహాన్ని ఆటపట్టించి నర్సమ్మగారితో తిట్లు తిన్నవాళ్ళే.

    అలాంటివాడితో తన జీవితం పంచుకోవడమా? బాబోయ్!

                       *        *        *

    ఇంటిముందు పారుతున్న పంటకాలువదగ్గిర గిన్నెలు వేసుకొని తోముతూంది సంధ్య.

    ఎక్కడినుండో ఒక కాగితంవడవ నీళ్ళలో కొట్టుకువస్తూంది. ఆ పడవని చూస్తుంటే సంధ్యకి తన చిన్నతనం జ్ఞాపకం వస్తూంది. తనూ, అరుణ్ ఇలాంటి కాగితం పడవలు చేసి ఈ కాలవలో వదిలి ఆడుకొనేవాళ్ళు. పడవలు నీళ్ళలో ప్రయాణం చేస్తుంటే, ఎంతదూరం వెళ్ళి మునుగుతాయోనని కాలువ పొడుగునా పరిగెత్తేవాళ్ళు! ఈకాలువ అప్పుడున్నట్టే ఇప్పుడూ ఉంది. సంధ్య కూడా ఉంది! ఏ చీకూ చింతా లేకుండా ఆడుకోడానికి ఆ బాల్యం, అరుణ్ మాత్రం లేరు.

    అరుణ్!

    ఎంత పెద్దయిపోయాడో! ఎంత అందంగా తయారయ్యాడో? ఒక్కసారి చూడాలని మనసులో తహతహ! కాని, ఎలా చూస్తుంది?

    అతడు చాలా పెద్దవాడైపోయి, గొప్పవాడైపోయి ఒకరోజు హఠాత్తుగా వచ్చి తన కళ్ళు మూసినట్టుగా ఎన్నిసార్లు కలలుకందో! కలలు కలలుగానే మిగిలిపోయాయి.

    సంధ్యకి కొంచెం దూరంగా బట్టలుతుక్కొనే బందమీద కూర్చొని నీళ్ళలో కాళ్ళాడిస్తున్నాడు సింహం.

    నర్సమ్మత్త మళ్ళీ పెళ్ళి ప్రస్తావన తన దగ్గర తీసుకురాకపోయినా, ఇంటికి వచ్చినవాళ్ళతో అంటూనే ఉంటుంది. "తనకు మాత్రం ఇంతకంటే మంచి సంబంధం చూసి చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పు." అని.

    "నిజమే! తల్లిపోయినప్పటినుండి నువ్వే తల్లివైనావు. నీ కష్టంలో పాలు పంచుకోవడం ఆ పిల్లకి కూడా ధర్మమే. తనకి ఓ ఇల్లు, సంసారం అంటూ ఏర్పడతాయికదా?" అని నర్సమ్మగారిని సమర్థించడమేకాదు, సంధ్యకి హితవుకూడా చెప్పిపోతున్నారు. "సింహం కాస్త వెర్రివెంగళప్ప అయితేనేం? సంసారానికి నిక్షేపంగా పనికివస్తాడు. నీ కడుపునో కాయ కాస్తే ఆడజన్నకి అంతకంటే సార్ధకమేముంది? కోరిన నగ, కోరిన చీరా కట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు! ఇంకేం కావాలి చెప్పు?"

    కోరిన చీరా, కోరిన నగా కట్టుకోవడం, పెట్టుకోవడం, కడుపునో కాయ కాయడం ఇంతకంటె కోరవలసింది లేదా ఆడపిల్లకు? అందరాడపిల్లలకు కాదు! తనలాంటి దిక్కు మొక్కులేని నిస్సహాయురాలైన ఆడపిల్ల కోరకూడదన్నమాట!

    సింహం ఎప్పుడు లేనివచ్చాడో, సంధ్య దగ్గరికి వచ్చాడు. నడుంమీద రెండు చేతులువేసి చిన్న పాపని లేపినట్టుగా లేపాడు సంధ్యని.

    సంధ్య కెవ్వున కేక పెట్టింది! గింజుకొని, అతడి చేతులనుండి తప్పించుకొని, "అత్తమ్మా"  అంటూ పరుగుపెట్టింది.

    నర్సమ్మగారు కంగారుగా బయటికి వచ్చింది. "ఏమిటే? ఏమైంది?"

    "సింహానికి మొన్నటిలా ఏదో వచ్చింది మీదికి! నన్ను పట్టుకొన్నాడు.

    "వాడి అవస్థచూస్తూ కూడా నీ మనసు కరగడంలేదు." ఆవిడ సంధ్యవంక నిష్ఠూరంగా చూసింది. సింహాన్ని చేతులుపట్టి లాక్కువెళ్ళి గదిలోకినెట్టి తలుపులు ఇవతల గడియపెట్టింది.

    రోజులు గడిచిపోతున్నకొద్దీ బయటినుండి ఒత్తిడి ఎక్కువగా వచ్చింది సంధ్యమీద.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS