Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 19

    "మేం ప్రెస్ నుంచి వచ్చాం. నేను ఆంధ్ర దిబ్బ, ఈ ఆంధ్ర గబ్బు, ఈయనేమో డైలీ మంట, ఆయనేమో న్యూసెన్స్ న్యూస్ న్యూస్ పేపర్స్  నుండి వచ్చాం" అందులో ఒక వ్యక్తి పరిచయం చేస్కున్నాడు.

    రాంబాబు, చిన్నారావ్ లు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ  వాళ్ళకి నమస్కారం పెట్టారు.

    "గజదొంగ మంగుల్ని ఎదుర్కోడంలో మీరు ప్రదర్శించిన ధైర్య సాహసాలు  విని చాలా అద్భుతంగా  ఫీలయ్యాం. అంతేకాదు....పోలీస్ కమీషనర్ గారి పాప ప్రాణాలను  కూడా కాపాడారు. అందుకే మిమ్మల్ని ఇంటర్ వ్యూ  చెయ్యడానికొచ్చా" అన్నాడు రిపోర్టర్.

    "చాలా సంతోషం! చేస్కోండి!" అన్నాడు రాంబాబు భయపడుతూ. వాళ్ళేం ప్రశ్నలడుగుతారోనని చెడ్డ భయంగా వుంది ఇద్దరికీ.

    "మీరు మంగుల్ని ఏ ఆయుధం  లేకుండా  ఎదుర్కొన్నారటకదా! మీకేం భయం కలగలేదా?" ఒక రిపోర్టర్  ప్రశ్న.

    "లేదండీ! చిన్నప్పటి నుండీ మా ఇద్దరికీ చాలా ధైర్యం  ఎక్కువ! అదేంటోగానీ దాన్ని ఎంత తగ్గించుకోవాలని ప్రయత్నించినా అది తగ్గడం లేదండీ...." సిగ్గుపడుతూ అన్నాడు చిన్నారావ్.

    రాంబాబు "హిహిహి...." అని నవ్వాడు.

    "మంగులు చూడ్డానికి  ఎలా వున్నాడు....?" మరో  రిపోర్టర్  ప్రశ్న.

    "ఇంచుమించు  మీలాగే  వున్నాడు  సార్....!" చిన్నారావ్  సమాధానం.

    పాపం! ఆ రిపోర్టర్  ఇబ్బందిగా  మొహంపెట్టి  "హిహిహి...." అంటూ నవ్వాడు.

    "మంగుల్ని  ఎదుర్కున్న  సమయంలో మీరెలా  ఫీలయ్యారు-?" మరో రిపోర్టర్  ప్రశ్న.

    "చాలా ఆశ్చర్యంగా  ఫీలయ్యాను!" రాంబాబు చెప్పాడు.

    "ఆశ్చర్యంగానా....? వింతగా  వుందే....?! ఎందుకని....? అడిగాడు రిపోర్టర్.

    "ఎందుకంటే  మంగులు నా పర్స్ కొట్టేశాడు. దాంట్లో కేవలం ఆరు రూపాయలా డెబ్భై  అయిదు పైసలున్నాయ్!" అన్నాడు రాంబాబు.

    ప్రెస్  రిపోర్టర్లందరూ  ఆశ్చర్యంగా మొహమొహాలు  చూస్కున్నారు....!


                                 *    *    *    *


    దీపని గజదొంగ మంగులు కిడ్నాప్ చేసిన తర్వాత లోనైన షాక్ నుండి పోలీస్ కమీషనర్ లింగారావ్, శ్రీలక్ష్మి లు  ఇంకా తేరుకోలేదు. భయంతో దీపని వాళ్ళు స్కూలుకి పంపడంలేదు.

    కమీషనర్ లింగారావ్ గబగబా యూనిఫాం వేస్కుని, నడుంకి బెల్ట్ బిగించి షూస్ వేస్కున్నాడు.

    ఇంతలో శ్రీలక్ష్మి  అక్కడికి వచ్చింది.

    "అంత హడావిడిగా ఎక్కడికి పరుగులు తీస్తున్నారు?" అడిగింది భర్తని చికాకుగా.

    లింగారావ్ భార్యవంక ఆశ్చర్యంగా  చూశాడు.

    "ఎక్కడికంటా వేంటి....? ఆఫీసుకి!" అన్నాడు.

    "ఆహా....! అలాగా....?? నేనింకా మీ సెకండ్  సెటప్ దగ్గరికనుకున్నాలే" వ్యంగ్యంగా అంది శ్రీలక్ష్మి.

    కమీషనర్ లింగారావ్ చాలా కంగారు పడిపోయాడు.

    "రామ రామ....నాకేం పాపం తెలీదే బాబూ....నాకేంటీ....సెకండ్ సెటప్పేంటీ....? నీకెవరో నేనంటే గిట్టనివాళ్ళు  చెప్పారు...." అన్నాడు భయంగా శ్రీలక్ష్మి  వంక చూస్తూ.

    "నాకు తెల్సులెండి! మీరు ఫస్టు సెటప్ కే పనికిరారు....మీ మొహానికి సెకండ్ సెటప్ కూడానా?" అంది శ్రీలక్ష్మి  చికాకుగా.

    "ఆ....నువ్వట్టాగే అంటావ్....మన పాపకి అచ్చంగా నా పోలికలే వచ్చాయ్  తెల్సా?" బుంగమూతి  పెడ్తూ అన్నాడు  కమీషనర్ లింగారావ్.

    "ఎడ్చారులే....ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంనాటి మాటలు చెప్పకండి! ఏంటి అంత కంగారు కంగారుగా ఆఫీసుకి బయలుదేరారు....ఏం....ఈవేళ  శనివారం అని మర్చిపోయారా?"

    లింగారావ్ గతుక్కున్నాడు.

    శనివారం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామికి నిష్టగా  పూజచేస్తుంది. పూజయ్యాక  హారతీ తీర్ధ ప్రసాదాలూ తీసుకునిగాని  అతను  ఆఫీసుకెళ్ళడానికి  వీల్లేదు.

    "ఈ వేళ శనివారం అని మర్చిపోయినందుకు  చెంపలేస్కోండి...." అంది శ్రీలక్ష్మి భర్తతో.

    లింగారావ్ సందేహిస్తూ  క్షణం  ఆలస్యం  చేశాడు. అంతలోనే కంగారుపడి శ్రీలక్ష్మి అతని చెంపలు చెళ్ళు చెళ్ళు వాయించి  "నేను చెంప లేసేశానుగా....ఇంక మీరేస్కోనక్కర్లేదులెండి....! నేను పూజ చేస్కోడానికి  లోపలికెళుతున్నా....నేను  వచ్చేదాకా  వుండండి" అనేసి లోపలికెళ్ళింది.

    లింగారావ్ నెత్తిన  ఠపా ఠపా మొట్టుకుని సోఫాలో  కూలబడ్డాడు.

    ఓ అరగంట తర్వాత శ్రీలక్ష్మి  పూజ  ముగించి  లోపలనుండి బైటికొచ్చింది  హారతి  పళ్ళెంతో.

    కమీషనర్  లింగారావ్  హారతి కళ్ళు కద్దుకుని  తీర్ధం, ప్రసాదం తీస్కున్నాడు.

    సరిగ్గా అప్పుడే ఫోన్  మోగింది. లింగారావ్ ఫోన్ తీసి  "హలో!" అన్నాడు.

    "హలో....నేనే మంగుల్ని....!! హ....హ....హ...." గట్టిగా నవ్వుతూ తర్వాత దగ్గొచ్చేసి  దగ్గసాగాడు  గజదొంగ మంగులు.

    "నువ్వెంత గజదొంగ వైనా మరీ అంత దగ్గొచ్చేలా  నవ్వడం నాకేం నచ్చలేదు....నువ్వు చెప్పయినా దగ్గు....దగ్గయినా  చెప్పు...." చికాకుగా అన్నాడు కమీషనర్  లింగారావ్.

    "ఇంకా చెప్పేదేంటి....నీ కూతుర్ని రక్షించుకున్నావని అనుకున్నావేమో....? కానీ నా ప్రయత్నాల్ని  ఇంకా మానుకోలేదు....అది గుర్తుంచుకో!" అని ఫోన్ డిస్కనెక్ట్  చేశాడు  మంగులు.

    "ఎవరండీ  అది?" అడిగింది  శ్రీలక్ష్మి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS