"హవును తల్లి. హవును"
"అందుకనే ఇఅదివరకు మీరు డజను ఇడ్లీలు తినేవారు కాస్తా ఇప్పుడు పదకొండు ఇడ్లీలే తింటున్నారు. ఊర్కే అలా బెంగపెట్టుకోకపోతే పోనీ వాళ్ళని ఇంటికి రమ్మని అనొచ్చుకద మామయ్యా."
పరంధామయ్య తన లాల్చీన గుండెదగ్గర గట్టిగా పట్టుకుని బాధతో మెలికలు తిరిగిపోతూ భారంగా అన్నాడు. "వాడు రాడమ్మా రాడు. నేను పిలిచినా రాడు. ఎందుకంటే వాడు నా కొడుకమ్మా. వాడి వంట్లో ప్రవహించేది నా రక్తమేనమ్మా."
"గోపి మీ పెంపుడు కొడుకేమోకద మామయ్యా?" అయోమయంగా అడిగింది అన్నపూర్ణ.
పరంధామయ్య నాలుక కొరుక్కుని "అది నిజమేగానీ ఎందుకనో వాడి వంట్లో నా రక్తమే ప్రవహిస్తుందని నాకనిపిస్తుందమ్మా. అందుకని వాడికి నాలాగా అభిమానం ఎక్కువంమా. అందుకనే వాడు నేను పిలిచినా రాడమ్మా" అన్నాడు.
"గోపీకి అభిమానం ఎక్కువ. అందుకనేరాడని ఒక్కముక్కతో చెప్పితే పోయేదానికి అనవసరంగా ఎంత కష్టపడ్డారు మామయ్యా. ఇంతగా కష్టపడినందుకైనా మీరిప్పుడు టిఫిన్ తినాల్సిందే."
"వద్దు తల్లీ వద్దు."
"పోనీ గోపీని నేను పిలవనా ఇంటిరమ్మని?"
"కన్నతల్లికన్నా ఎక్కువగా ప్రేమ కురిపించిన నువ్వు పిలిచినా వాడు రాడమ్మా. వాడి ఒంట్లో ప్రవహించేది."
"చాలు మామయ్యా. మీరు చెప్పదలుచుకున్నదేంటో నాకు అర్థం అయిపోయింది. అయితే మీరు టిఫిన్ తింటానికి రానట్టేకదా?"
"వద్దులే తల్లీ"
అన్నపూర్ణ గది గుమ్మంవైపు అడుగులు వేసింది.
"అమ్మా!"
"ఏంలేదు. అలా పైకిఫో. పాడుసంత!" విసుక్కుంటూ అంది అన్నపూర్ణ.
"వీధిలోంచి బిచ్చగాడు పిలుస్తున్నాడని అనుకుంటున్నావా అమ్మా. నేనే తల్లి నీ వెనకనుండి పిలుస్తున్నాను." అన్నాడు పరంధామయ్య.
అన్నపూర్ణ వెనక్కి తిరిగింది.
"క్షమించండి మామయ్యా. అంతదీనంగా పిలిస్తే బిచ్చగాడు పిలిచాడేమోనని అనుకున్నా." నవ్వుతూ సర్దాగా అంది అన్నపూర్ణ. "ఇంతకీ ఎందుకు పిలిచారు మామయ్యా?"
"ఈవేళ ఏం టిఫిన్ చేశావమ్మా?"
"పెసరట్లు చేశా మామయ్యా. బాగా ఉల్లిపాయలూ, అల్లం ముక్కలూ, పచ్చిమిరప ముక్కలూ చల్లి నేతిలో ఎర్రగా వేయించాను మామయ్యా. నంజుకోడానికి అల్లం చట్నీ చేశా మామయ్యా."
పరంధామయ్య లేచి నిలబడ్డాడు.
"పదమ్మా నేనుకూడా టిఫిన్ చేయడానికి వస్తాను. ఈ బంధాలూ అనుబంధాలూ శాశ్వతమైనవమ్మా.
ఎప్పుడైనా ఒక్కొక్కపుడు వాటిని విధి అనే కారుమేఘం అలముకున్నా ఆ మబ్బులు తొలిగాక మళ్ళీ అందరు కలుస్తారమ్మా. అది తెలిసి తిండీ తిప్పలుమానివేసి ఈ శరీరాన్ని శిక్షించడం చాలా పాపమన్న విషయం నాకు తెలిసిందమ్మా."
"ఎప్పుడు మామయ్యా."
"ఇప్పుడేనమ్మా. నువ్వు చేసింది పెసరట్ల టిఫిన్ అని తెలిశాక తల్లి. పదమ్మా పద. ఆకలి దంచేస్తుంది"
* * *
"బాబాయ్... బాబాయ్"
ఉలిక్కిపడి నిద్రలేచింది అన్నపూర్ణ.
అప్పుడు సమయం రాత్రి రెండు గంటలయింది.
"ఏమిటమ్మా పిలిచావా" కూతురు దీపని అడిగింది అన్నపూర్ణ.
దీప ఆమె ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు కానీ తన మానాన తను కలవరించింది.
"బాబాయ్.... బా... బా.... బాబా."
గోపిని కలవరిస్తుంది దీప. ఎందుకనో అనుమానం వచ్చి అన్నపూర్ణ దీప నుదుటిమీద చెయ్యివేసి ఉలిక్కిపడి చేతిని వెనక్కు తీసేస్కుంది.
దీప ఒళ్ళు కాలిపోతూంది.
"హేవండీ." బావురుమంటూ గాఢంగా నిద్రపోతున్న శంకరం భుజాలుపట్టి కుదిపేసింది అన్నపూర్ణ.
శంకరం కంగారుగా లేచికూర్చున్నాడు.
"ఏమిటి? ఏమైంది??"
"దీప ఒళ్ళు కాలిపోతూందండీ"
"ఆ. ఏంటీ? ఫైర్ యాక్సిడెంటా...? ఏవి నీళ్ళు ... ఎక్కడ? ఎక్కడ??" కంగారుగా మెడకాయ్ అటూ ఇటూ తిప్పాడు శంకరం.
"మీ కంగారు మంటెట్టా. ఫైర్ యాక్సిడెంటేంటీ మీ బొందా... ఒళ్ళు కాల్తుందంటే దానికి జ్వరం వచ్చిందని అర్ధం."
"మంచి నిద్రపోతున్నవాడిని గుండె గాబరా ఎత్తిపోయేలా అలా గావుకేకలేసి లేపేస్తే కంగారుపుట్టదూ మరీ?"
"బాబాయ్... బా..." దీప కళ్ళు మూస్కుని పలవరించసాగింది.
శంకరం దీప నుదిటిమీద చెయ్యేసి "హబ్బో... ఒళ్ళు చాలా కాలిపోతూందే!..." అన్నాడు.
"మీరు త్వరగా వెళ్ళి డాక్టర్ ని తీసుకురండి...." బావురుమంది అన్నపూర్ణ.
"సర్లె.... సర్లె.... వెళ్తున్నాగానీ నువ్వలా కప్పలా నోరుతెరిచి ఏడవమాకు...."విసుక్కుంటూ అని బయటకు పరుగుతీశాడు శంకరం.
ఆ కాలనీలోని ఒక డాక్టరు ఇంటికివెళ్ళి ఆయన్ని నిద్రలేపి, చాలా అర్జంట్ కేసూ, సీరియస్ కేసూ అని బ్రతిమిలాడి ఇంటికి తీసుకొచ్చాడు శంకరం.
డాక్టర్ దీప నోట్లో ధర్మామీటర్ పెట్టి చూశాడు.
నూటైదు డిగ్రీల జ్వరం ఉంది.
తర్వాత స్టెతస్కోప్ ఛాతిమీద పెట్టి చూసి గాఢంగా ఓ నిట్టూర్పు విడిచాడు.
"మీతో ఓ విషయం మాట్లాడాలి... ఇలా పక్కకురండి..." దిగులుగా మొహంపెట్టి శంకరంతో అన్నాడు డాక్టర్.
డాక్టర్ మొహంలోని దిగులుచూసి అన్నపూర్ణ బెంబేలెత్తి పోయింది.
"హమ్మా దీపా..." దీపమీద పడి ఘోల్లుమంది.
"ఊర్కో అమ్మా ఊర్కో... కష్టాలనేవి మనుషులకి వస్తాయ్ గానీ మానులకి రావుగా?"
అన్నపూర్ణని పైకి లేవనెత్తి కౌగిట్లో బంధించాడు పరంధామయ్య.
"మాహోవయ్యా... బేర్ ర్..." పరంధామయ్యని లతలా చుట్టుకుపోయింది అన్నపూర్ణ.
గది బయట...
"బుస్ స్ స్- మని నిట్టూర్చాడు డాక్టర్.
"మా అమ్మాయికేమైందో త్వరగా చెప్పండి డాక్టర్-" కంగారుగా అడిగాడు శంకరం.
"మీ అమ్మాయిది మందులకు లొంగే రోగంకాదు శంకరం."
"ఆ!!..." నోరుతెరిచాడు శంకరం. "అంటే మా అమ్మాయికి కాన్సరా?"
"కాదు-"
"టి.బి.యా?"
"కాదు- టి.బి. అయితే మందులకు లొంగుతుందిగా!"
"మరేంటి డాక్టర్?" ఆందోళనగా అడిగాడు శంకరం.
"ఏంటో నువ్వే చెప్పుకోవాలి మరి-" చిలిపిగా శంకరంవంక చూస్తూ అన్నాడు డాక్టర్.
"హబ్బా!.... పాపకేమైందోనని మా మతులుపోయి మేం చస్తా ఉంటే మీ పరాచికాలేంటి డాక్టర్ గారూ. నేను చెప్పుకోలేను గానీ మీరు త్వరగా చెప్పండి.... పాపకేమైంది?" జుట్టు పీక్కుంటూ అన్నాడు శంకరం.
"మీ పాపకి ఏ రోగమూ లేదు.... ఆ పాపది మనోవ్యాధి!.... మనోవ్యాధికి మందులేదు.... ఆ అమ్మాయ్ బాబాయ్ బాబాయ్ అంటూ కలవరిస్తుంది కదా..... అతన్ని మీ పాప దగ్గరకు తీసుకొస్తే పాప జ్వరం అంతా తగ్గిపోయి మంచం మీదినుండి చక్కాలేచి తిరుగుతుంది"
"ఈ మాత్రం చెప్పడానికి రేపో ఎల్లుండో పోతుందని చెప్పేలా రహస్యంగా పక్కకి తీసుకొచ్చి లేనిపోని హంగామా చేశారు కదండీ బాబూ" అన్నాడు శంకరం.
"ఏంట్రా శంకరం?.... పాపకి ఏమైందట!!..." గదిలోంచి హడావిడిగా బయటకు వచ్చాడు పరంధామయ్య. ఆయన వెనకాల కేర్ ర్... బే ర్ ర్ మంటూ అన్నపూర్ణ కూడా బయటికి వచ్చింది.
డాక్టర్ శంకరానికి చెప్పిన విషయమే వాళ్ళిద్దరికి కూడా చెప్పాడు.
