Previous Page Next Page 
శంఖారావం పేజి 20

 

    "ఊ.." అన్నాడు వేదాంతం చెప్పమన్నట్లు.
    "వాడి కళ్ళల్లో పూర్వపు జీవకళ లేదు...."
    వేదాంతం ఉలిక్కిపడి -- "మరి నా కళ్ళల్లో ఉందా ?" అన్నాడు.
    సీతమ్మ అతడ్ని పరీక్షగా చూడలేదు. "నీకేమిరా -- నువ్వు నిక్షేపంగా ఉన్నావు. వాడికే ఏదో అయింది" అందామె దిగులుగా.
    'అమ్మా! నేనుండగా వాడికేమీ భయం లేదు. అనవసరంగా నువ్వు బెంగ పెట్టుకోకు....." అన్నాడు వేదాంతం.    
    సీతమ్మ ఏదో అనబోయింది.
    అంతలోనే అక్కడికి ఉదయ వచ్చింది.
    ఆమె ఏడుస్తోంది. బుగ్గలు కన్నీటి చారికలతో నిండిపోయాయి.
    "ఏమయింది?" అంది సీతమ్మ.
    'బావ నన్ను పోవే శనిముండా అని తిట్టాడు" అంది ఉదయ.
    సీతమ్మ తెల్లబోయి "నిజంగానా?" అంది.
    "నిజమే అయుంటుంది . ఇలా జరుగుతుందని నాకు తెలుసు. అందుకే ముందుగా హెచ్చరించాను ...."
    "నువ్వు ఏదో చెప్పావు బావకు -- నన్ను కావాలని తిట్టించావు...." అంది ఉదయ రోషంగా.
    "ఉదయా! తిట్టింది విశ్వనాద్. కాకపోతే ఈపాటికా మనిషిని ఖండ ఖండాలుగా చీల్చి ఉండేవాడిని -- ఊహలో కూడా నిన్నేవరైనా తిడితే భరించలేను. అమ్మ కూడా ఈ విషయం తెలుసు..." అన్నాడు వేదాంతం.
    'అయాం సారీ !" అంది ఉదయ.
    'అమ్మా -- నీ మేనకోడలికి జరిగింది చెప్పు ' అన్నాడు వేదాంతం.
    సీతమ్మ నెమ్మదిగా యాక్సిడెంటు గురించి చెప్పింది.
    'అయితే ఈ విషయం ఇన్నాళ్ళూ ఎందుకు చెప్పలేదు?"
    "మేమిండియాలో అడుగు పెట్టాక చాలా విచిత్రాలు జరిగాయి. ఉదాహరణకు నేను కొండమీంచి అగాధంలోకి తోయబడ్డాననుకో. అగాధంలోకి పడిపోకుండా గాలిలో మధ్యలో ఆగిపోయాననుకో -- అప్పుడేమానుకోవాలి ?" అన్నాడు వేదాంతం.
    "ఇంపాజిబుల్ !" అంది ఉదయ.
    "ఒకవేళ జరిగిందనుకో - ఏమనుకోవాలి ...."
    "నీ మేలు కోరే ఏ దెయ్యమో ఆ పని చేసే ఉండాలి " అని ఉదయ ఉలిక్కిపడి -- 'అయ్యా బాబోయ్ -- దేయ్యమంటే నాకు భయం . నువ్వు దెయ్యాన్నేప్పుడైనా చూశావా ?" అంది.
    "ఇప్పుడు దెయ్యాల గొడవెందుకు ?" అంది సీతమ్మ.
        "నాకూ ఇష్టం లేదు. కానీ అమ్మా! నేను, విశ్వనాద్ . ఇండియాలో అడుగు పెట్టాక చాలా విచిత్రాలు జరిగాయి. అవన్నీ చెబితే మీరు నమ్మరు. అందుకే ఎలా చెప్పాలో తెలియక ఇన్నాళ్ళూ ఆలోచనలో ఉండిపోయాను."
    "యాక్సిడెంటైతే అందులో విచిత్రమేముందిరా ?" అంది సీతమ్మ.
    "ఇప్పుడు విశ్వనాద్, నేను మీ ముందిలా మనుషుల్లా తిరుగుతుండడం చాలా పెద్ద విచిత్రం. వివరాలెక్కువ అడుగొద్దు కానీ నేనో ముఖ్య విశేషం మీ ఇద్దరికీ చెప్పాలి " అన్నాడు వేదాంతం.
    ఉదయ కుతూహలంతో తన దుఃఖాన్ని కూడా మరిచిపోయింది.
    "ఉదయకు;లాగే మన విశ్వనాద్ కూడా పునర్జీవితుడయ్యాడు. ఇప్పుడు వాడి లక్ష్యం వేరు. మామూలు మనుషుల కుండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు వాడిని భాధించవు. వాడికిప్పుడు భారతదేశపు ప్రగతి గురించిన బెంగ పట్టుకొంది. మన దేశాన్ని అగ్రదేశాల పక్కన సమాన స్థాయిలో నిలబెట్టాలని వాడి సంకల్పం. అందుకే తన జీవితాన్నంకితం చేశాడు. చెప్పాలంటే వాడు మానవాతీతుడు. తనవావరైనా లక్ష్యం నుంచి మళ్ళిస్తే వాడికి కోపం వస్తుంది. రోజూ వాడూ నేనూ రహస్యంగా చర్చించే విశేషాలివే! దేశం బాగు కోసం ఏం చేయాలో అని!"
     "వాడికి పిచ్చి గానీ పట్టలేదు గదా ?"
    "పిచ్చిపట్టిన వాడైతే నీ అంగీకారం కోసం ఆగడు కదా!"
    'అంటే!"
    "విశ్వనాద్ ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు. అందుకు రకరకాల పధకాలు వేస్తున్నాడు. అవి ఒక సక్రమమైన దారిలో ఉన్నాయని నమ్మకం కుదరగానే రంగంలోకి దిగుతాడు. దిగేముందు వాడికి నీ ఆశీర్వాదం కావాలి. ప్రస్తుతం వాడు నీ ఆశీర్వాదం పొందడమెలాగా అని పధకాలు ఆలోచిస్తున్నాడు...."
    "దేశం కోసం కృషి చేసిన వాళ్ళెవరూ సుఖపడలేదు. దేశామేమై పోయినా నాకు బాధ లేదు. నా కొడుకు అందరు మనుషుల్లాగే పిల్లాపాపలతో మాములుగా బ్రతకాలి. వాడ్ని నేను ఉద్యమాల్లో దిగానివ్వను" అంది సీతమ్మ.
    "నీ కొడుకు గాంధీ అంత పేరు తెచ్చుకుంటే నీకు సంతోషంగా ఉండదా?" అన్నాడు వేదాంతం.
    "ఉండదు" అంది సేతమ్మ.
    వేదాంతం ఆశ్చర్యంగా ఆమె వంక చూసి --"ఎందువల్ల ?" అన్నాడు.
    "మహాత్ముడనిపించుకునే ముందు గాంధీ లాఠీ దెబ్బలు తిన్నాడు. జైల్లో మ్రగ్గాడు. నిరాహారదీక్షలు పూనాడు. చివరకు తుపాకీ గుండుకు బలైపోయాడు. ఆయనకు నేను చేతులెత్తి మ్రొక్కుతాను. దేవుడిలా పూజిస్తాను. కానీ నా కొడుకు ఆయనలా ఉండాలని కోరుకోను" అంది సీతమ్మ.
    ఆమె మాటల్లోని ప్రతి అక్షరం లోనూ తల్లి మనసు ధ్వనిస్తుంది.
    "నువ్వు నిజాయితీ పరురాలివి కాబట్టి నిజం ఒప్పుకున్నావు. పదవుల నాశించి నేతలుగా మసలుతున్న వాళ్ళే అయన ఆదర్శాలను వల్లిస్తున్నారు తప్ప ఆచరించడం లేదు. మహాత్ములు అరుదుగా పుడతారు. అందరూ మహాత్ములు కాలేరు. కానీ దురదృష్టమో, అదృష్టమో -- మన విశ్వనాద్ మహాత్ముడు కావాలని నిశ్చయించు కున్నాడు....' అన్నాడు వేదాంతం.
    "ఏమిట్రా నువ్వనేది?" అంది సీతమ్మ కంగారుగా.
    "వాడిప్పుడు మాములు మనిషి కాదమ్మా -- వాడి శక్తి అపరిమితం. ఆ శక్తిని వాడు దేశ ప్రగతికి ఉపయోగించాలను కుంటున్నాడు. నేడో రేపో స్వార్ధ పరులకు, దేశ ద్రోహులకు హెచ్చరికగా ధనుష్టంకారం చేయనున్నాడు. నువ్వు వాడి నాశీర్వదించక తప్పదు."
    "వాడితో పాటు నీకూ పిచ్చి పట్టలేదు గదా ?" అంది సీతమ్మ.
    "పిచ్చి కాదమ్మా-- ముందే నీకు చెబుతున్నాను. ప్రాణానికే ప్రాణంగా భావించే ఉదయనీ రోజు పోవే శనిముండా అని తిట్టాడు వాడు. వాడి లక్ష్యం లోని బలం అలాంటిది. వాడ్ని ఆశీర్వదించడానికి నువ్వు సిద్దపడాలి."
    "మళ్ళీ జరిగింది గుర్తు చేశావు ' అంది ఉదయ. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    సీతమ్మ ఉద్రేకంగా లేచి "ఈ చేతులతో పెంచి పెద్ద చేశాను. వాడలా ఎందుకన్నాడో తెలుసుకుని కాస్త గడ్డి పెట్టి వస్తాను ' అంటూ అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
    వేదాంతం ఆమెను వారించలేదు. ఇంకా నిలబడే ఉన్న ఉదయను చూసి "నువ్విలా కూర్చో --- నీతో మాట్లాడాలి?" అన్నాడు.
    ఉదయ కళ్ళు తుడుచుకుని కూర్చుంది.
    "నువ్విక నీ విస్సీ బావను మర్చిపోవాలి!"
    "మర్చిపోయి ఏం చేయను ? అంది ఉదయ. ఆమె గొంతులో ఇంకా తడి ఉంది.
    "సూటిగా చెప్పనా?' అన్నాడు వేదాంతం.
    "ఊ..."
    "నన్ను ....ప్రేమించు ...."
    "నిన్నా?" అంది ఉదయ అదోలా.
    "ఏం.... నేను నీకు తగనా ?"
    ఉదయ మాట్లాడలేదు. వేదాంతమూ మాట్లాడలేదు.
    కాసేపిద్దరి మధ్యా నిశ్శబ్దం.
    "నేను నీకు తగనా ?" అన్నాడు వేదాంతం మళ్ళీ.
    "విస్సీ బావుండగా మరో మనిషి గురించి నేనాలోచించనని నీకు తెలియదా ?" నువ్విలా మాట్లాడతావని నేననుకోలేదు...."
    "నేనిలా మాట్లాడడానికి కారణముంది. నీ విస్సీ బావ నీకు సంబంధించినంతవరకూ లేనట్లే లెక్క !" అన్నాడు వేదాంతం.
    'అంటే?"
    "జరిగిన విచిత్రం నీకు నేను చెప్పదలచు కాలేదు. కానీ ఒకవిధంగా చెప్పాలంటే నీ విస్సీ బావ చచ్చిపోయాడు. అమ్మ కోసం వాడిలో ప్రాణ ప్రతిష్ట చేసి తీసుకుని రాగలిగాను " అన్నాడు వేదాంతం.
    "నువ్వు తిన్నగా మాట్లాడ్డం లేదు...."
    "ఎలా మాట్లాడినా నువ్వు తెలుసుకోవలసిందొక్కటే ! ఇప్పుడు నీ విస్సీ బావ మహాత్ముడు. దేశం తప్ప వాడికింకేమీ అక్కర్లేదు. పెళ్ళి పేరు చెబితేనే వాడు మండిపోతాడు" అన్నాడు వేదాంతం.
    "ఎందుకిలా జరిగింది?" అంది ఉదయ.
    'అంతా దైవెచ్చ. మనలో ఏమీ లేదు.'
    "కాదు నువ్వే ఏదో చేశావు ...."
    "నేనా ?"
    "అవును -- నువ్వే -' వేదాంతం నిట్టూర్చి "నా మీద గొప్ప అపవాదే వేశావు" అన్నాడు.
    "విస్సీ బావ కాదన్నంత మాత్రాన నేను నీ దాన్నైపోతాననుకున్నావా? నామీద  నీకాహక్కు ఎవరిచ్చారు?" అంది ఉదయ ఇంకా కోపంగానే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS