Previous Page Next Page 
శంఖారావం పేజి 21

 

    "ఉదయా-- నేను నిన్ను బ్రతికించుకున్నాను , ఎవరి కోసం ?"
    ఉదయ ఓ క్షణం ఏమీ మాట్లాడలేదు! తర్వాత నెమ్మదిగా -- "నన్ను మన్నించు, ఆవేశంలో ఏదో అన్నాను" అంది.
    "ఇట్సాల్ రైట్ " అన్నాడు వేదాంతం నెమ్మదిగా.
    'అయితే నా ప్రశ్నకు నువ్వు బదులివ్వాలి " అంది ఉదయ.
    'అడుగు - నువ్వేమడిగినా చెబుతాను "
    "డాక్టర్లందరూ నామీద ఆశలు వదులుకున్నారు. ఒకే ఒక్క డోసుతో నాకు పునర్జన్మనిచ్చావు. అది అమృతమని నాతొ చెప్పావు. అంటే నీ దగ్గర శక్తివంతమైన మందులున్నాయి. ఆ మందులతో విస్సీ బావ నెందుకు రక్షించవు?"
    "రక్షించాను కాబట్టే వాడు మీ ఎదుట ఉన్నాడు."
    "నన్ను చేసినట్లే బావనూ మాములూ మనిషిని చేయలేవా?"
    "వాడు మనిషి కంటే గొప్పవాడు -- నేను మనుషుల స్థాయి పెంచగలను -- కాని దించలేను ."
    'అంటే?"
    "మామూలు మనిషి తనదంటూ ఒక పరిధి ఏర్పరచుకుని అందులో జీవిస్తాడు. అలాంటి వాడికి అయినవాళ్ళు మాత్రమే తనవాళ్ళు . మన విశ్వనాద్ ఈ మానవులంతా తన వాళ్ళు . ఉన్న బంధాలనెలా వదుల్చుకోవాలా అని చూస్తున్నాడు వాడు. లేని బంధాలు తగల్చాలని చూస్తున్న నిన్ను వాడు దూరంగా వుంచితే ఆశ్చర్యమే ముంది?" అన్నాడు వేదాంతం.
    ఉదయ మళ్ళీ కాసేపు మౌనం వహించి "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు . కాని ఇంతకాలం ఆ ప్రేమను నీ మనసులో దాచుకున్నావు. మొదటిసారిగా పైకి చెప్పావు. నీకీ ధైర్యం ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు నాకు టైము కావాలి" అంది.
    'ఉదయా! నేను మిత్ర ద్రోహం చేస్తున్నానని అనుకోకు. విశ్వనాద్ కే అన్యాయం జరిగినా అది దేవుడి వల్ల జరిగింది. నావల్ల కాదు. విశ్వనాద్ నిన్ను పెళ్ళాడే అవకాశం లేదని తెలిసే నేను నా ప్రేమను నీ ముందు వ్యక్తం చేశాను..." అన్నాడు వేదాంతం.
    ఉదయ ఏదో అనబోతుండగా అక్కడికి సీతమ్మ వచ్చింది. విశ్వనాద్ ఆమె వెనుకనే వున్నాడు.
    "వెధవ్వేషాలు నా దగ్గర కాదు. ఉదయా! నువ్విలా ముందుకు'రా' అంది సీతమ్మ.
    ఉదయ ముందుకు వచ్చింది.
    "చెప్పరా చెప్పు" అంది సీతమ్మ.
    విశ్వనాద్ తనూ ఉదయ ముందుకు వెళ్ళాడు.
    "ఊ! నన్ను మన్నించు " అన్నాడు విశ్వనాద్.
    "క్షమార్పణ అడగడం కాదు -- చేసిన తప్పు ఒప్పుకో" అంది సీతమ్మ తీవ్ర స్వరంతో.
    "ఎంతో ప్రేమతో నువ్వు నా దగ్గరకు వచ్చావు. ప్రేమగా మాట్లాడ్డానికి బదులు పరుషమైన మాటలతో తిట్టి గసిరి పంపించేశాను...."
    'అంతేకాదు -- ఇంకెప్పుడూ ఇలా చేయానని కూడా చెప్పు ...."
    "ఇంకెప్పుడూ ఇలా చేయను " అన్నాడు విశ్వనాద్.
    వేదాంతం ఆశ్చర్యంగా చూస్తున్నాడు . తల్లి మాటలను మర బొమ్మలా శిరసావహిస్తున్నాడు విశ్వనాద్.
    ఇది అతడూహించని విశేషం.
    'అది సరదాగా నీతో కబుర్లు చెప్పాలని వస్తే నువ్వేమో దాన్ని కసిరి కొట్టి పంపించావు. ఇద్దరూ వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకోండి" అంది సీతమ్మ మళ్ళీ.
    విశ్వనాద్ ఉదయ చేయి పట్టుకుని "పద!' అన్నాడు.
    ఉదయ ముఖం ఉదయ భానుడిలా వెలిగింది.
    వేదాంతం ముఖంలో నిరుత్సాహం దాగలేదు.
    వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక -- "ఏం మంత్రం వేశావమ్మా వాడికి!' అన్నాడు వేదాంతం.
    "ఏ మంత్రం వేసి మిమ్మల్నింత వాళ్ళను చేశానో ఆ మంత్రమే ఇప్పుడూ వేశాను. నేను మీకు తల్లిని " అంది సీతమ్మ.
    వేదాంతం వంగి ఆమెకు నమస్కరించి 'అమ్మా సైన్సు అంటే దేవుడి కంటే గొప్పది -" అన్నాడు.
    సీతమ్మ గర్వంగా నవ్వింది. కానీ అతడలా ఎందుకన్నాడో ఆమెకు తెలియదు .

                                       -----
    గదిలో మంచం మీద ఒక్కడూ పడుకుని తీవ్రలోచనలో ఉన్నాడు వేదాంతం.
    కబుర్లు చెప్పుకుంటామని వేరే గదిలోకి వెళ్ళిన ఉదయ, విశ్వనాద్ ఎప్పటికీ బయటకు రావడం లేదు. ఉండుండీ కిలకిల నవ్వులు వినపడుతున్నాయి. తలుపులు తీసే ఉన్నా లోపలకు వెళ్ళడానికతడికి మనస్కరించడం లేదు.
    అతడికి చాలా అసహనంగా ఉంది.
    "ఏదో చేయాలి ?" అనుకొన్నాడు.
    ఏం చేయాలో తోచకే -- తీవ్రలోచన.
    సీతమ్మ హల్లో కూర్చుని భగద్గీత చదువుకుంటోంది.
    వేదాంతం ఆలోచనలకు అంతం కనబడడం లేదు.
    "మే ఐ కమిన్ !"
    తలుపు మీద టకటక చప్పుడు.
    వేదాంతం ఉలిక్కిపడి గుమ్మం వైపు చూసి -- "అరె భూషణ్ నువ్వా? నీ కేప్పుడైనా నా అనుమతి అవసరమైందా?" అనడిగాడు.
    కులభూషణ్ నవ్వుతూ వచ్చి కూర్చుని -- "ఎప్పుడూ జరుగానివి చాలా జరిగాయి నీ విషయంలో --' అన్నాడు.
    'అంటే ?"
    "ఉదయేలా మామూలు మనషయిందో నాకు చెప్పాలి --"
    "ఎందుకు ?"
    "ఒక డాక్టరు గా ఈ ప్రశ్న వేస్తున్నాను...."
    'అంటే ?"
    "ఒక భయంకర వ్యాధిని నిర్మూలించే పద్దతి తెలిసినప్పుడది ఉదయతో ఆగకూడదు. మరెందరుకో ఉపయోగ పడాలి -"
    "యూ ఆర్ రైట్ !"
    'ఈసరికే నువ్వది నాకు చెప్పాల్సింది " వేదాంతం నవ్వి --"నేనొక విచిత్రావస్థ లో ఉన్నాను. పోనీ నువ్వెందుకు నన్నింత వరకూ అడగలేదు --' అన్నాడు.
    "నేను నీకు లాగే విచిత్ర స్థితిలో వున్నాను"
    "సరే - ఇద్దరిదీ ఒకటే పరిస్థితి పద చూపిస్తాను --' అన్నాడు వేదాంతం అక్కణ్ణించి కదుల్తూ. కులభూషణ్ అతణ్ణి అనుసరించాడు.
    ఇద్దరూ వంటింట్లో ఫ్రిజ్ దగ్గరకు వెళ్ళారు.
    వేదాంతం ఫ్రిజ్ తలుపు తీసి ఐస్ చాంబర్లో నుంచి ఓ పాలిథిన్ సంచి తీసి మిత్రుడి కిచ్చి -- "ఇందులో ఇంకా కొన్ని ఆకులున్నాయి ....' అన్నాడు.
    'అకులేమిటి ?" అన్నాడు కులభూషణ్.
    "ఈ ఆకులే ఉదయను మామూలు మనిషిని చేశాయి -"
    'అంటే ?"
    "కేవలం అయిదంటే అయిదే ఆకులు తింది ఉదయ. మామూలు మనిషై పోయింది. ఇందులో ఇంకా పది పదిహేను అకులుంటాయి...."
    "ఎక్కడివి నీకివి ?"
    "పద చూపిస్తాను ....'
    ఇద్దరూ పెరట్లోకి వెళ్ళారు. అక్కడ రెండు గులాబీలకు మధ్యగా పాతబడిన ఓ మొక్క ముందాగి --"ఈ ,మొక్కవే ఆ ఆకులు -" అన్నాడు వేదాంతం.
    కులభూషణ్ ఆశ్చర్యంగా చూశాడు. ఆ మొక్క గతంలో అక్కడ లేదు. కొత్తగా పాత బడింది.
    "ఎక్కడిది నీకీ మొక్క ?"
    "ఇది మన దేశంలోదే -- ఇంకా చెప్పాలంటే మనూరిలోదే!"
    "ఇంకా చెప్పు .."
    "నీకు నేను అకులిచ్చాను. మొక్క చూపించాను. ఇంకేం చెప్పాలి ?"
    "ఈ వైద్యం నీకెలా తెలిసింది ?"
    వేదాంతం నావ్వి - "Emo 2 అనే అయిస్టీన్ కు ఎవరూ చెప్పారు?" అన్నాడు .
    కులభూషణ్ ఏమడిగినా అతడింకేం చెప్పలేదు.
    ఇద్దరూ హాల్లోకి వచ్చారు.
    'అమ్మా! నేను గులాబికి వెడుతున్నాను --' అన్నాడు కులభూషణ్.
    "భోం చేసి వెళ్ళు. నీ కోసమే అంతా ఎదురు చూస్తున్నాం -' అంది సీతమ్మ మాములుగా.
    "నాకు అర్జంటు పనుంది. భోజనం అక్కడే చేస్తాను ....'
    'ఆ అర్జంటు పని మరో అరగంట వాయిదా వెయ్యి ....'
    "లేదమ్మా .....నేను వెళ్ళాలి ....'
    "అయితే నాతొ చెప్పాడమెందుకు వెళ్ళు -- " అంది సీతమ్మ.
    అప్పుడామె గొంతులో ధ్వని మారింది.
    "వేదా-- నువ్వెళ్ళి టేబిలు మీద కంచాలు , మంచి నీళ్ళు పెట్టు -- "అంది సీతమ్మ.
    "మంచినీళ్ళు నా పని కదా - " అన్నాడు కులభూషణ్ ఆ ప్రయత్నంగా.
    సీతమ్మ మాట్లాడకుండా అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.
    'అమ్మ మాట కాదనడం కష్టం -- "అంటూ కులభూషణ్ తనూ లోపలకు వెళ్ళాడు.
    వేదాంతం మాట్లాడకుండా తనూ సీతమ్మ వెళ్ళిన దిశగా వెళ్ళాడు.
    భోజనానికి ముందు డైనింగ్ టేబిల్ మీద కంచాలు, చెంచాలు, గ్లాసులు, వగైరాలు పెట్టె డ్యూటీ వేదాంతానిది. మంచినీళ్ళు, పెట్టె డ్యూటీ భూషణ్ ది'.
    భోజనాలయ్యాక విశ్వనాద్ కాళీ అయినప్పుడు జార్స్ లో మంచి నీళ్ళు నింపి ఫ్రిజ్ లో ఉంచుతాడు.
    వడ్డన లూ, ఎంగిలి కంచాలు-- ఆ డ్యూటీ సీతమ్మది. ఉన్నప్పుడందులో బాధ్యత ఉదయది.
    సీతమ్మ తిన్నగా వెళ్ళి ఓ గది ముందాగి --"ఉదయా!' అంది.
    గదిలో నవ్వులాగి పోయాయి.
    ముందు ఉదయ, ఆ వెనుకే విశ్వనాద్ బయటకు వచ్చారు.

                                        ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS