గులాబి ---అయన భార్య పేరు. అదామే అసలు పేరు కాదు. ఏడుకొండలు భార్యను ముద్దుగా ఆ పేరుతొ పిల్చుకునేవాడు.
గులాబి గులాబిలాగే త్వరగా వాడిపోయింది.
గులాబి గులబిలాగే తానంటూ అతడికి వారసులను మిగల్చలేదు.
గులాబి కలకాలం ఘుమఘుమలు వెదజల్లాలని ఏడుకొండలు అనుకున్నాడు. ఆమె పేరుతొ నర్సింగ్ హోం నెలకొల్పాడు.
"మన దేశంలో వైద్య సదుపాయాలు పెరగాలి. ఖరీదైన జబ్బులకు విదేశాలు పారిపోయే అగత్యం తప్పాలి" అంటాడు ఏడుకొండలు.
అయన నర్సింగ్ హోం పేదల కందుబాటులో లేని మాట నిజం!
ఏడుకొండలు ప్రజా సేవకుడు కాడు.
డబ్బున్న వాడికే దేవుడు త్వరగా దర్శనమిస్తాడు. అంతమాత్రాన అయన దేవుడు కాకుండా పోడు.
అలాగే ఏడుకొండలు డబ్బున్న వాళ్ళ జబ్బుల్ని చిత్తశుద్దితో నయం చేయించగలడు. ఖరీదైన జబ్బులకు ఖరీదైన మందులు, డాక్టర్లు అవసరం. ఏడుకొండలు ఆ సరఫరా చూసుకుంటాడు.
డబ్బుండి ప్రాణాలు కొనుక్కోలేని వారికి తన శక్తి వంచన లేకుండా సాయపడతాడు. వైద్యం గులాబీ నర్సింగ్ హోం లో డబ్బు కోసం కాక జబ్బు కోసం జరుగుతుంది. అందుకే ధనవంతులు గులాబీ నర్సింగ్ హోం లో చేరడానికే ఇష్టపడతారు.
కులభూషణ్ కి ఏడుకొండలు కధ మాములుగా తెలుసు. అతడి కాయనంటే చాలా గౌరవం.
డబ్బు పై కాక వైద్ద్య వృత్తి పై మోజుపడే కులభూషణ్ అంటే ఏడు కొండలకి ప్రత్యేకాభిమానం.
ఉదయ గులాబీలో కలిగించిన సంచలనానికి ఏడుకొండలు కులభూషణ్ కి కబురు పెట్టాడు. అతడు రాగానే ---
"ఏం చేశావు నువ్వు?' అనడిగాడు.
కులభూషణ్ కు అర్ధం కాలేదు. "ఏం చేశాను?" అన్నాడు.
"ఏదో చేశావు -- ఉదయకు జీవం పోశావు?"
కులభూషణ్ నవ్వి ఊరుకున్నాడు.
"అదే చేసి మరికొందర్ని బ్రతికించు...."
'అంటే?"
"మన నర్సింగ్ హోం లో నజీర్ ఖాన్, రాబర్ట్ సన్ ఇప్పుడు నీమీదేన్నో ఆశలు పెంచుకుంటున్నారు" అన్నాడు ఏడుకొండలు.
కులభూషణ్ మాట్లాడలేదు.
"ఒక హిందువుని రక్షించావు. ముస్లీం నీ, క్రైస్తవుడ్నీ కూడా రక్షించి నీ విశాల హృదయాన్ని నిరూపించుకో" అన్నాడు ఏడుకొండలు.
"తప్పకుండా ప్రయత్నిస్తాను. కానీ అందుకు అల్లా, యోహోవాలు నాకు సాయపడాలి" అని కులభూషణ్ ఎడుకొండలి మాటలు సీరియస్ గా తీసుకున్నాడు.
బ్లడ్ క్యాన్సర్ - ఏ మందులకూ లొంగని భయంకర వ్యాధి- అది ఉదయను వదిలిపెట్టి ఎలా పారిపోయిందో తెలియదు. మెడికల్ హిస్టరీలో అద్భుతమది!
ఉదయ జబ్బు తగ్గదన్నాధతడు. మందులు, శాస్త్ర విజ్ఞానం సాధించిన విజయంగా భావించ లేకపోయాడు.
వేదాంతం ఏదో మాయ చేశాడు.
కులభూషణ్ సైన్స్ గురించి దానినీ ఒక అయోమయావస్థలో ఉండిపోయాడు. ఏడుకొండలు తో మాట్లాదేక అతడికీ విషయంలోని సైన్సు ను పరిశోధించాలనిపించింది. అతడు తిరిగి మామూలు మనిషయ్యాడు.
నర్సింగ్ హోం నుంచి ఇంటికి వెడుతుండగా అతడికి దారిలో జలజ కారేదురైంది. ఆమె కారాపిఅతడ్ని పలకరించి "ఆ రాత్రి నన్ను చాలా డిజప్పాయింట్ చేశావు. మళ్ళీ కనబడలేదు కూడా !' అంది.
"కొన్ని వింతలు జరిగాయిలే -- నేను మామూలు మనిషిని కావడాని కింత కాలం పట్టింది" అన్నాడు కులభూషణ్.
'అయితే స్కూటర్ వెనక్కు తిప్పు. మా ఇంటికి వెడదాం" అంది జలజ.
"ఎందుకు ?" అన్నాడతడు.
"మావారూళ్లో లేరు "
"సారీ జలజా! నాకు వేరే పనులున్నాయి " అన్నాడతడు.
జలజ నిట్టూరల్చి 'అబ్బే -- నువ్వింకా మామూలు మనిషిని కాలేదు" అన్నది.
కారు స్టార్తయింది. స్కూటరు కారుకు వ్యతిరేక దిశలో వెళ్ళింది.
ఒకే గదిలో కూర్చుని వున్నారు విశ్వనాద్ , వేదాంతం.
విశ్వనాద్ తీవ్రంగా ఏమో ఆలోచిస్తున్నాడు.
వేదాంతం ఓ పుస్తకంలో ఏదో రాస్తున్నాడు.
అప్పుడెవరో తలుపు తట్టారు.
విశ్వనాద్ చలించలేదు.
వేదాంతం తనే వెళ్ళి తలుపు తీశాడు. అతడి కళ్ళు మెరిశాయి.
ఎదురుగా ఉదయ.
తెల్ల చీర, ఆ చీరకు ఆకుపచ్చ అంచు. చీర మీద ఆకక్దక్కడా ఆకుపచ్చటి ఆకుల డిజైన్ అంచు రంగు రవిక.
బంగారు బొమ్మకు వెండి చీర కట్టి ఆకులతో పూజ చేసినట్లుందామె.
ఆమె ముఖంలో దివ్యత్వం.
"ఉదయా!" అన్నాడు వేదాంతం.
"బావేం చేస్తున్నాడు?" అందామె.
తీవ్రాలోచనలో ఉన్నాడు " అన్నాడు వేదాంతం.
"కాసేపు నేను బావతో మాట్లాడాలి...."
ఇప్పుడు మాట్లాడడు బావ..."
"నేను వెడితే మాట్లాడతాడు...."
"ఉదయా! నా మాట విను. బావ నిన్నిప్పుడు కసిరి కఠినంగా మాట్లాడతాడు. సున్నితామైన నీ హృదయాన్ని బాధ పెడతాడు. అందుకే వాడితో మాట్లాడోద్డంటున్నాను...." అన్నాడు వేదాంతం.
ఉదయ ముఖం అదిలా గైపోయింది.
"నువ్వు నన్నూ బావనూ కలుసుకోనివ్వడం లేదు ' అందామె.
"నీ యిష్టం....నువ్వోసారి వెళ్ళి వాడితో మాట్లాడిరా. ఆ తర్వాతనే నీతో మాట్లాడతాను" అన్నాడు వేదాంతం.
"నాతో ఏం మాట్లాడుతావు?"
"నేను నీతో చాలా ముఖ్య విశేషం మాట్లాడాలి. చాలాకాలంగా ఎదురు చూస్తున్నాను" అన్నాడు వేదాంతం.
ఉదయ లోపలకు వెళ్ళింది.
వేదాంతం బయటకు వచ్చాడు.
అప్పుడే అలా వచ్చిన సీతమ్మ "గది తలుపు లేసుకుని మీరిద్దరూ ఏం చేస్తున్నార్రా" అంది.
"రా అమ్మా! నేను నీతోటి మాట్లాడాలి" అన్నాడు వేదాంతం.
"ఉదయేది ?"
"లోపలకు వెళ్ళింది ...." అంటూ గదిలోనికి చూపించాడు వేదాంతం.
సీతమ్మ తనలో తను నవ్వుకుంది.
ఇద్దరూ హాల్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు.
"ఉదయ చెబితే వినకుండా వాడితో మాట్లాడతానని వెళ్ళింది...." అన్నాడు వేదాంతం ఫిర్యాదు చేస్త్రున్నట్లు.
"వాళ్ళ ప్రేమ అలాంటిది ."
"కానీ మన విశ్వనాధం పరిస్థితి మీకర్ధం కావడం లేదు...."
'అర్ధం కావడం సంగతెలా ఉన్నా వాడి సంగతి నాకు తృప్తి లేదు. ఏదో పోగొట్టు కున్న వాడిలా అదోలా గుంటున్నాడు. సరిగ్గా ఎవరితోనూ మాట్లాడడు. ఏమయింది వాడికి?" అంది సీతమ్మ.
"యాక్సిడెంట్ ...."
"ఎప్పుడు? ఎక్కడ?" ఆత్రుతగా అడిగింది సీతమ్మ.
"మేము ఇండియాలో అడుగు పెట్టగానే కారు యాక్సిడెంట్ అయింది. నేను చాలా అదృష్ట వంతుడ్ని , ఎవడో చూచి పరుపులు వరుసగా పేర్చి రోడ్డు పక్కన పెడితే నేను ఎగిరి వాటి మీద పడ్డాను. మనవాడి తలకు బాగా దెబ్బ తగిలింది. ముందు వాడు గతం మర్చిపోయాడనుకున్నాం. కానీ వాడికి నువ్వు బాగా గుర్తున్నావు. నన్ను కొంత గుర్తు పట్టాడు. మిగతా వాళ్ళూ, విశేషాలూ సరిగా గుర్తులేవు. ఈ విషయం వెంటనే చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు. వాడికేమీ ప్రమాదం లేదు. బ్రతకడమే పెద్ద అదృష్టం. నా మాట విని కొంతకాలం పాటు ఉదయనూ, కులభూషణ్ నీ కూడా నువ్వే విసిగించవద్దను. పాత జ్ఞాపకాలను వాడి మనసు తట్టుకోలేదు...."
సీతమ్మ కంగారుగా ...."ఎప్పుడూ ఇలాగే ఉండిపోతాడా?" అంది.
"ఉండడు. కొంత టైం కావాలి. అయినా నేచేబితే తప్ప వాడిలోని మార్పు మరీ ప్రత్యేకంగా తెలుస్తోందా?" అనడిగాడు వేదాంతం.
'నిజమే....ప్రవర్తనలో కాస్త తేడా ఉన్నా మరీ నువ్వు చెప్పినంత అనిపించడం లేదు. కానీ....' అని ఆగింది సీతమ్మ.
