'శాంతీ!' ఆనందబాష్పాలు రాలుస్తూ అని శాంతను దగ్గరకు తీసుకుంది.
'శారూ!' అని శారదకు మరీ దగ్గరగా జరిగింది.
కాసేపైన తర్వాత శాంతను సినిమాకు వెళ్ళవలసిందిగా హెచ్చరించింది శారద.
'మనస్ఫూర్తిగా వెళ్ళమంటున్నావా శారూ?' శారద కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది శాంత.
'వెళ్ళు శాంతీ! అప్పుడప్పుడు కులాసాగా కాలక్షేపం చేయడం కూడా చాలా ముఖ్యం. మరీ స్తబ్దుగా ఉండకూడదు.'
'అవుతే యిద్దరమూ వెడదాం!' ఆశగా శారద ముఖంలోకి చూసింది శాంత.
'లేదు శాంతీ! నేను సినిమా చూడను. అలా పబ్లిక్ గార్డెన్స్ లో ఒకటి రెండుగంటలు గడిపివస్తాను. ఇద్దరమూ కోటీవరకూ ఒకే బస్సులో వెళ్ళాలికద! అక్కడినుంచి నెంబర్ సెవన్ నీది యైట్ నాది.'
ఇద్దరూ బయలుదేరారు. కోటీవద్ద శాంత వెళ్లిపోయింది. శారద నెంబర్ యైట్ కోసం ఎదురుచూస్తూ నిలుచుంది.
* * *
ఆరోజు ఆదివారం. అంతేకాక క్రిస్మస్ శలవులు కావడంవల్ల పబ్లిక్ గార్డెన్సు కిటకిటలాడుతున్నాయి. ఒంటరిగా ఒకదగ్గర కూర్చొని శ్రీపతిగారి కుటుంబం, ప్రభాకరం ప్రవర్తనగురించి ఆలోచిస్తూ ఉంది శారద. చివరిసారి శ్రీపతిగారివద్ద శలవు తీసుకోకుండా వచ్చినందుకు ఎంతో బాధ పడుతూ ఉంది శారద.
'అమ్మా శారదా..! నీవా?' అన్నమాటలు వినపడి ప్రక్కకు తిరిగి చూసింది శారద. శ్రీపతిగారు కనుపించారు.
'మీరా పెదబాబుగారూ! యిలావచ్చి కూర్చోండి!' అని ఆమెకు ఎదురుగా ఉన్న బెంచీని ఎంతో వినయంగా చూపించింది. శ్రీపతిగారు బెంచీమీద కూర్చోలేదు. శారదకు ఎదురుగా కొద్దిదూరంలో పచ్చికపై కూర్చున్నారు.
సాయంకాలపు నీ రెండ ఆకులపై పడి వింతకాంతులీనుతూ ఉంది. పిల్లలతో, యువకులతో, యువతులతో, జంటలతో, కుటుంబాలతో, వృద్దులతో కిటకిటలాడి పోతున్న ఆనాటి పబ్లిక్ గార్డెన్సు ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ ఫ్లాటు ఫారాన్ని గుర్తుకు తెస్తున్నాయి.

ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. అలా పదినిముషాలు గడిచిపోయాయి. శారదే మౌనభంగం చేస్తూ 'పెదబాబుగారూ...నేను దోషిని. చేసిన నేరానికి మీకు ముఖంచూపించడం యిష్టం లేక చెప్పకుండా యింటి నుంచి వెళ్ళి పోయాను. మళ్ళీ యిన్నాళ్ళకు అనుకోకుండా మీ దర్శన భాగ్యం లభించింది. నన్ను క్షమించండి.' కన్నీటి బిందువులు బుగ్గలపై ధారలు కట్టాయి.
'అమ్మా శారదా! నిజంగా నీలాంటివాళ్ళు వెయ్యికి ఎంతమంది ఉంటారు? ఒక్కరు కూడా ఉండరేమోనని అనిపిస్తూ ఉంది. మా పరువుప్రతిష్టలు కాపాడడానికి చేయని నేరాన్ని నెత్తిన వేసుకొని యింటి నుండి వెళ్ళిపోయావు. నీకెంత అన్యాయం జరిగింది తల్లీ! ప్రభాకరం అసలు విషయం చెప్పేంతవరకూ మేమూ నిన్ను దోషిగానే భావించామమ్మా' శ్రీపతిగారి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి.
'పెదబాబుగారూ! మీరు నిజం తెలుసుకున్నారు. అంతేచాలు. చినబాబుగారి ప్రవర్తన అలాగే ఉందా? ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడేం చదువుతున్నారు?' శ్రీపతిగారి ముఖంలోకి ఆదుర్దాగా చూస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది శారద.
'నీవెంత మంచి హృదయమమ్మా నీకు అన్యాయం చేసినవాడిని గురించి తెలుసుకోవాలనే ఆపేక్ష నీకెందుకు తల్లీ! వాడు నీ అభివృద్దికి వోర్వలేక నిన్ను ఆదుకుంటూన్న మా కళ్ళు కప్పి ఆ యింట్లో నీకు స్థానం లేకుండా చేశాడు.' శ్రీపతిగారి మాటలు జాలిగొలుపుతున్నాయి.
'అదంతా నా ఖర్మ వారు నిమిత్త మాత్రులు. నా అదృష్టం బాగులేక అలా జరిగింది. ముఖం బాగాలేదని అద్దాన్ని నిందించడం వల్ల ప్రయోజన మేముంటుంది? మీ ఆదరాభిమానాలకు దూరమయ్యానని ఎప్పుడూ బాధపడుతుంటాను.'
'ఆ యింట్లో నీకు అవమానం జరిగినట్లుగా మరెవ్వరికైనా జరిగినట్లయితే మా మీద దుమ్మెత్తి పోసేవారు. అప్పటి ఆ సంఘటనే కాక అంతకుముందుకూడా ఒకటి రెండుసార్లు నిన్ను అవమానపరచినట్లు చెప్పాడు. నిజమేనా అమ్మా' శారదను ఆప్యాయంగా చూస్తూ అడిగారు శ్రీపతిగారు.
'జరిగిపోయిన సంగతులన్నీ యిప్పుడెందుకండీ! మీ మాటలను బట్టి చూస్తే చినబాబుగారితో ఏదో మార్పువచ్చినట్లు తోస్తూ ఉంది నాకు. అదె నిజమౌతే అంతకన్న సంతోషించవలసిన విషయమేదీ ఉండదు.' అంది శారద.
'కొంతవరకు నయమే! చదువు విషయంలో శ్రద్ధ కలిగింది. మిగతా అలవాట్లన్నీ అలాగే ఉన్నాయి. ఆ కిరస్తానీ పిల్లతో పేచీ పడినట్లున్నాడు. అందువల్ల యిక్కడ ఉండి చదువుకోవడానికి కూడా యిష్టపడలేదు. బెనారస్ యూనివర్శిటీలో బి.ఏ. రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ప్రభాకరం తల్లి వాడు మాకు దూరమయాడని ఎంతో బాధపడుతూ ఉంది. వాడు క్రమంగా మారుతాడనే ధైర్యంతో యిలా జీవిస్తున్నాం. వచ్చే సంవత్సరంతో వాడి చదువు పూర్తవుతుంది. ఈ వచ్చిన మార్పుకు తగినట్టు మిగతా దురలవాట్లు కూడా మారితే ఎంతో బాగుంటుంది. ఆరునెలల పరీక్షలలో మార్కులు బాగా వచ్చినట్లు వ్రాశాడు, అంతా ఆ భగవంతుడి దయ. మన చేతిలో ఏముంది?' దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నారు శ్రీపతిగారు.
'బాధపడకండి పెదబాబుగారూ. మార్పంటూ ప్రారంభమయితే క్రమంగా అన్ని వాట్లలోనూ మార్పు రావడం జరుగుతుంది. ముఖ్యంగా అతనికి చదువుపై శ్రద్ధ కలిగింది. అంతేచాలు. అతనిలో మార్పు ప్రారంభమైనందుకు ఎంతో సంతోషిస్తూ అంది శారద.
'మరి నీ సంగతి చెప్పావు కాదేం తల్లీ! మా యింటి నుండి వెళ్ళిన తర్వాత నీ వెక్కడ ఉంటున్నావు? ఏం చేస్తున్నావు?' బరువుగా శ్వాస పీలుస్తూ అడిగారు శ్రీపతిగారు.
శారద తను యింటి నుంచి బయలు దేరిన మొదలు యిప్పటివరకు జరిగిన విషయాలన్నీ పూస గ్రుచ్చినట్లు శ్రీపతిగారికి చెప్పింది.
'మంచి మనసు గలవారినెప్పుడూ భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటూ ఉంటాడు. పోనీ యిప్పుడు వచ్చేయమ్మా! ఇంటికి వెడదాం. వాడు బెనారస్ కు వెళ్ళిపోయాక యిల్లంతా మరీ చిన్నబోతూ ఉంది. నీ సంగతి తెలిసిన తర్వాత నిన్ను తలవని రోజంటూ లేదు.' బాధపడుతూ అన్నారు శ్రీపతిగారు.
'అప్పుడప్పుడు వచ్చి చూసి వెడుతూంటాను. నేను హాస్టలులో ఉండి చదువుకోవడమే మంచిదనిపిస్తూ ఉంది. అయినా శాంత నేను వెళ్ళిపోతానంటే చిన్నబుచ్చుకుంటుందేమో?' వినయంగా శ్రీపతిగారి కోరికను నిరాకరించింది శారద.
'అవునమ్మా! నీ మాటలు సబబుగానే ఉన్నాయి. ఇంట్లో ఉండి చదువుకోవడం కన్న హాస్టలులో ఉండి చదువుకోవడమే మంచిది. కాని నీవు మాత్రం తరచూ వస్తూ ఉండాలి. మీ హాస్టలుకు కారు పంపిస్తాను కూడా.'
'కారెందుకు లేండి. నేను వస్తూ ఉంటాగా! అయినా నాకిది ఫైనలియరు. పరీక్షలైపోయాక వచ్చి వారం రోజులు ఉంటాను' చిరునవ్వుతో అంది శారద.
"అలాగే తల్లీ! ఇప్పుడు నేను ఇంటికే వెడుతున్నాను. ఒక్కసారి వచ్చి మీ అమ్మగార్ని పలకరించిపో తల్లీ' ఎంతో ఆప్యాయంగా అడిగారు శ్రీపతిగారు.
కాదనలేకపోయింది శారద. శ్రీపతిగారితో వారి ఇంటికి వెళ్ళి, అక్కడ అన్నపూర్ణమ్మ గారితో ఒక గంట మాట్లాడి హాస్టలుకు వెళ్ళింది.
* * *
శారద దగ్గర శలవుతీసుకొని బయలుదేరిన శాంత నెంబర్ సెవన్ లో ఎక్కి సికింద్రాబాద్ మినర్వా టాకీసువద్ధ దిగింది. అక్కడికి ప్లాజా టాకీసు ఫర్లాంగు ఉంటుంది.
ప్లాజా టాకీసులో ఆ రోజే పిక్చరు మారింది. క్రొత్త పిక్చరు కావడంవల్ల రద్దీ బాగా ఉంది. అందులో ట్విన్ సిటీస్ లో యింగ్లీషు పిక్చరుకు మంచి డిమాండు ఉంటుంది. శాంత హాలు దగ్గరకు చేరేసరికి అన్ని క్లాసుల బుకింగ్సూ క్లోసైపోయాయి. నిరాశతో వెనుకకు తిరిగివస్తున్న శాంతకు బయటిగేటులో నిలబడి ఎవరికోసరమో ఎదురు చూస్తున్న సుందరం కనుపించాడు.
'హల్లో సుందరం! ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లున్నావ్?' ప్రశ్నించింది శాంత.
అనుకోకుండా శాంతను చూసిన సుందరం సంతోషంతో పొంగిపోయాడు. 'హల్లో శాంతా! బహుకాల దర్శనం! అప్పుడెప్పుడో సుల్తాన్ బజారులో కనుపించావు. నా అడ్రసు కూడా యిచ్చాను. రావడానికి తీరిక చిక్కలే దనుకుంటా!' చిరునవ్వుతో శాంతను చూస్తూ అన్నాడు సుందరం.
'ఎక్కడ! అందులో యిది ఫైనలియరు కూడా.' వెళ్ళిపోబోతూ అంది శాంత.
'అదేమిటి? పిక్చరుకు రావడంలేదా? చాలా బాగుంటుంది.' ఆశ్చర్యపడుతూ అన్నాడు సుందరం.
'చూడాలనే వచ్చాను కాని హాలు హవుస్ ఫుల్ అయింది.' మంచిగా ఉంటుందని సుందరం అంటూన్న సినిమా చూడలేక పోతున్నానే అని బాధపడుతూ అంది శాంత.
'అలాగా! నా ఫ్రెండొకడు వస్తానంటే రెండు టిక్కట్లు తీసుకున్నాను. వాడింకా రాలేదు. అసలు వస్తాడో రాడో? న్యూస్ కూడా స్టార్టయింది.' అని ఒక్కక్షణం ఆలోచించి 'పద శాంతా! వాడు యిక వస్తాడన్న ఆశలేదు. త్వరగా వెళ్ళకపోతే సీట్లు కూడా ఒక్క దగ్గర దొరకవు.'
