Previous Page Next Page 
లోకం పోకడ పేజి 19


    ఆరోజు గడిచింది . మర్నాడు నవంబరు ఒకటి. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం. హైదరాబాదు నగరమంతా కోలాహలంగా ఉంది. టాంగాల వాళ్ళు, రిక్షాల వాళ్ళు, టాక్సీల వాళ్ళు  తెగ డబ్బు సంపాదిస్తున్నారు. బస్సులలో సందు దొరకటం లేదు. ఎట్లాగో వీలు చేసుకుని ఉత్సవాలకు వెళ్ళారు. వాళ్ళతో వసుంధర కూడా వెళ్ళింది. అంతమంది జనాన్ని, ఆ వేడుకలకు దేశ నాయకుల ఉపన్యాసాలను, నగర వాతావరణాన్ని చూస్తుంటే సురేంద్ర కు ఎంతో ఆశ్చర్యంగా ఉంది.
    సాయంత్రానికి సురేంద్ర కు తలనొప్పి వచ్చింది. బడలిక చేసింది.
    మర్నాడు ముగ్గురూ నగరం లో వింతలూ, విశేషాలు చూడటానికి బయలుదేరారు. వసుంధర ఆరోజున వంట మానేసింది. హోటల్లో సరదాగా మాట్లాడుకుంటూ కులాసాగా భోజనం చేద్దామను కున్నారు.
    అన్ని ప్రదేశాలూ చూశాక హోటల్లో భోజనం చేసి భాగాయాం (పబ్లిక్ గార్దేన్సు) లో పచ్చిక బయల్లో కూర్చున్నారు ముగ్గురూ.
    "ఏరా , రమేష్1 ఈ నగర వాతావరణం, నీళ్ళూ సరిపడ్డయ్యా మీకు?" అని అడిగాడు సురేంద్ర.
    "సరిపడ్డా, సరిపడక పోయినా జీవితమంతా పుట్టిన ఊళ్ళోనే గడిచి పోవాలంటే ఈ కాలంలో కుదరదురా, అది మా నాన్నగారి లాంటి వాళ్ళకే చెల్లింది. నీ విషయం ఆలోచించు . ఈ కాలపు వాడివయినా, ఈ కాలపు కుర్రాళ్ళ కున్న పటాటోపమూ, అహంభావమూ, గడుసు తనము తెలివి తేటలూ చాలా తక్కువ. గుంటూరు లోనే చదువు పూర్తీ చేయి. తరువాత విషయం ఆలోచించ వచ్చు." అన్నాడు రమేష్.
    "నువ్వు లేకపోతె నాకు ఏమీ తోచటం లేదురా. ఏదో వెలితిగానే ఉన్నట్లుంది. మళ్ళీ నాకు నీలాంటి స్నేహితుడు ఈ జన్మలో దొరకడు. నీకూ, నాకూ ఒక తేడా ఉంది. ఎక్కడున్నా నువ్వు అ వాతావరణానికి అనుగుణంగా సర్దుకు పోగలవు. నాకు అది చేతకాని పని" అన్నాడు సురేంద్ర దిగులుగా.
    "పోనీ, మీరూ ఇక్కడ చదువుకో కూడదూ?" అన్నది వసుంధర.
    "ఇప్పుడప్పుడే వీల్లేదు. అక్కడి పుస్తకాలూ, ఇక్కడి పుస్తకాలూ వేరు. ఇక్కడి పరిస్తితులు వేరు" అన్నాడు సురేంద్ర.
    'అన్నట్లు రాయుడు గారు అసెంబ్లీ మెంబరు కదూ? ఆయనా బహుశా వచ్చే ఉంటారు." అన్నాడు రమేష్.
    సురేంద్ర ఏమీ మాట్లాడలేదు. రాయుడి గారి పేరు వినేసరికి సురేంద్ర మనస్సులో ఏదో తెలియని భయం, ఆవేదన, ఆరాటం కలిగినాయి.
    సాయంత్రం వరకూ అక్కడే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని మెల్లిగా ఇంటికి బయల్దేరారు,. అరగంట కాచుక్కుర్చుంటేనే గాని బస్సులో సీట్లు దొరకలేదు. అబిడ్స్ రోడ్డు లో బస్సు దిగి అక్కడే ఉన్న పెద్ద హోటల్లో ముగ్గురూ భోజనం చేశారు. భోజనం చేసి వరండా లోకి వచ్చారు. ఒక టాక్సీ లో నుంచి రాయుడు గారూ, శ్యామసుందరి దిగటం సురేంద్ర చూశాడు. వాళ్ళు కూడా సురేంద్ర ను చూశారు. ఎవరు ముందుగా మాట్లాడాలో ఎవరికీ తెలీలేదు. సురేంద్ర ముందుగా రాయుడు గారిని పలకరించాడు.
    "నాలుగు రోజులయిందోయ్ , హైదరాబాదు వచ్చి. ఈ హోటల్లో నే ముప్పై రెండో నెంబరు  గదిలో ఉంటున్నాం. శ్యామసుందరి కూడా వస్తానని పట్టుబడితే ఇద్దరం వచ్చాం. నువ్వెప్పుడు వచ్చావ్? కులాసాగా ఉన్నావా, రమేష్? ఆ అమ్మాయి నీ భార్య?" అన్నాడు రాయుడు గారు.
    కుశల ప్రశ్నలయ్యాక "కులాసాగా ఉన్నావా, బావా?'అన్నది శ్యామ సుందరి.
    ఎట్లాగో గొంతు పెగుల్చుకుని ":కులాసానే" అన్నాడు సురేంద్ర.
    శ్యామసుందరి పరికిణి, జాకెట్టు , ఒణి వేసుకుంది. కొంచెం లావు తగ్గి , కొంచెం పొడుగు ఎదిగినట్లుగా కనిపించింది సురేంద్ర కు.
    "మీ పేరు శ్యామ సుందరి కదూ" అని పలకరించింది వసుంధర.
    "అవునండీ. మిమ్మల్ని ఎప్పుడూ చూడక పోయినా మీ పేరు విన్నాను. మీరంతా ఎక్కడున్నారు? ఎప్పుడు వచ్చారు?" అన్నది నవ్వుతూ శ్యామసుందరి.
    "వీరికి యిక్కడ ఉద్యోగం. అందుకని మేం హైదరాబాదు నగర వాసుల మయినాం. మీ బావ గారు నాలుగు రోజులు సెలవు పెట్టి మొన్ననే వచ్చారు. మా యింట్లో నే మకాం" అన్నది వసుంధర.
    "రండి. మా గదిలో కూర్చుందాం." అన్నది శ్యామసుందరి. అంతా మేడమీదికి వెళ్ళారు.
    సురేంద్ర ను చూడగానే శ్యామసుందరి కి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతను మాట్లాడక పోయినా తనే ఏదో కల్పించుకుని సురేంద్ర తో మాట్లాడేది. సురేంద్ర మనస్సు ఏదో తెలియని అసంతృప్తి, ఆవేదన, అభిమానంతో నిండి పోయింది. ఇదివరకు తను దబ్బిస కుక్కగా వర్ణించిన శ్యామ సుందరి యిప్పుడు అట్లా లేదు. శ్యామసుందర్నీ చూస్తున్నంత సేపూ మనస్సంతా ఏదో కేలికినట్లుగా అయి, ఏవో వింత భావాలు మనస్సులో మెదిలి అంతలోనే మాయమయినాయి.
    రాత్రి తొమ్మిదిదాటింది. ఇంక వెళతామని ముగ్గురూ లేచారు.
    "రేపు మా ఇంటికి రండి. మా యింట్లో కనీసం ఒక్క పూటయినా భోజనం చేసి వెళ్ళాలి." అన్నది వసుంధర, శ్యామసుందరి తో. రాయుడు గారు "ఈసారి వచ్చినప్పుడు తప్పక వస్తా." మన్నారు. ఏదో దిగులుగా, వెలితిగా , ఆవేదన పూరిత హృదయాలతో ఒకరి నొకరు చూసుకున్నారు సురేంద్ర , శ్యామసుందరి . వాళ్ళ మనస్సులోని భావాలు యిదమిత్తంగా వాళ్ళకే తెలీలేదు.
    ఆ రాత్రి యింటికి వచ్చిన తరవాత రమష్ అన్నాడు --" కనబడుతూ ఉండే ఆడవాళ్ళ బాహ్య సౌందర్యాన్నే చూసి అంచనా వేసుకోలేని వాడివి, ఆత్మ సౌందర్యాన్ని ఏం అర్ధం చేసుకుంటావురా? శ్యామసుందర్ని గురించి యిదివరకు చెప్పినవన్నీ నిజమే ననుకున్నాను. ఇప్పుడు నిన్ను నువ్వే మోసం చేసుకున్నావని తేలింది." అని.
    "శ్యామసుందరి లావుగా పొట్టిగా ఉంటుందని మీరు అనేవారట. నాకా పిల్ల అట్లా కనబడలేదు. నా అంత పొడుగూ అవుతుంది మీరా పిల్లని ఎట్లా అర్ధం చేసుకున్నారో నాకు అర్ధం కావటం లేదు. ఇంకో ఏడాది రెండేళ్ళ కు నా అంత పొడుగూ ఎదుగుతుంది. ఆడపిల్లలు ఇట్టే చువ్వల్లె ఎదుగుతారు" అన్నది వసుంధర.
    ఇంక మాట్లాడితే సురేంద్ర మనస్సు కు ఏం కష్టం కలుగుతుందో నని రమేష్ ఏమీ మాట్లాడలేదు.
    ఆ రోజు రాత్రే బయల్దేరాడు సురేంద్ర. స్టేషను కు రమేష్, వసుంధర వెళ్ళారు. రైలు గంట లేటుగా వస్తుంది సికిందరాబాదు స్టేషను కు. ప్లాట్ ఫారం మీద ముగ్గురూ కూర్చున్నారు.
    సురేంద్ర ఏమీ మాట్లాడలేక పోతున్నాడు. అనుక్షణం అతని కళ్ళ ఎదుట శ్యామసుందరి కనిపించినట్లే ఉంటున్నది.
    "సురేంద్రా!"
    "ఏమిట్రా?"
    "నువ్వు పిచ్చివాడివి."
    "నిజమే. నా కళ్ళ ఎదుట కనిపించే విషయాలు నాకే తెలీవు. మరి యిదీ ఒకరకం పిచ్చే కదూ?"
    "కాలేజీ లో చదువుతూ పట్టణ వాస ప్రజా జీవితానికి అలవాటు పడ్డవాడివి. నలుగురి లోనూ తిరుగుతున్న వాడివి . సంఘ నియమాలూ, కట్టుబాట్లూ తెలిసిన వాడివి. నీ జీవితాన్ని నువ్వే అర్ధం చేసుకోలేక సతమత మైపోతే ఇంక యితరులజీవితాన్ని ఎట్లా అర్ధం చేసుకో గలుగుతావో నాకే అర్ధం కావటం లేదు. లోకం తీరు తెలుసుకునే జ్ఞానం సంపాదించ లేకపోతె మగవాడు సంఘం లో చెలామణి కాలేడు రా , సురేంద్రా! అవకాశాలు వచ్చినప్పుడే అవి సద్వినియోగం చేసుకోవాలి గాని, వాటిని దూరం చేసుకుని తరువాత విచారపడితే లాభం లేదు. ఆలోచించు. ఇంక యింతకన్న నేను చెప్పెదెం లేదు" అన్నాడు రమేష్.
    అంత ఉద్వేగంగా మనస్సు విప్పి సురెంద్రతో  మాట్లాడటం చూస్తుంటే వసుంధర కు ఆశ్చర్యం కలిగింది. ఎరక వేరు. స్నేహం వేరు. ఎరిగున్న వారంతా స్నేహితులు కారు. స్నేహితులంతా మనస్సు విప్పి మాట్లాడరు. అంతర్యాలు కలిసిన స్నేహితులు మనస్సులు విప్పి మాట్లాడుకోవటం లో అర్ధాంగి తో సమానులు. మనస్సులు కలిసిన స్నేహం మమతలను చంపుకోలేదు. స్నేహం లోని మమతలు వేళ్ళు పాకిపోతుంటే , ఒకరి సుఖ దుఃఖాలు మరొకరు అనుభవించినట్లుగానే ఉంటుంది. అదే ప్రాణ స్నేహంలోని మాధుర్యం. అలాంటి స్నేహ సౌశీల్యాన్నీ పెంపొందించు కున్న వాళ్ళిద్దర్నీ చూస్తుంటే వసుంధర మనస్సు ఆనందంతో ఉప్పొంగి పోయింది. అలాంటి స్నేహితులు మనస్సులు విప్పి మాట్లాడుకుంటుంటే వినే భాగ్యం లభించింది కదా అనుకుంది వసుంధర.
    రైలు వచ్చింది. రమేష్ కు నమస్కరించి జేబు రుమాలుతో కళ్ళు వొత్తుకుంటూ రైలెక్కాడు సురేంద్ర. రైలు కదిలేవరకూ కిటికీని అనుకుని ఉన్న ఆ దంపతులను చూస్తుంటే సురేంద్ర కు వాళ్ళ మీద ఎనలేని గౌరవం ఏర్పడింది.
    "నా జీవితాన్ని తీర్చి దిద్దటానికి మీ యువ దంపతులే మార్గ దర్శకులుగా ఉండాలి" అన్నాడు సురేంద్ర. బరువెక్కిన హృదయంతో వాళ్ళ వైపు చూశాడు.
    రైలు కదిలింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS