Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 19

 

    కళకు ఉత్తరం వ్రాయాలని అనేక సార్లు ప్రయత్నించాడు, కాని చేత కాలేదు... అసలు కళకు తనంటే ఇష్టమున్నదో లేదో? తీరా తన ఉత్తరం తీసుకెళ్ళి తండ్రికి చూపిస్తే ....? రామయ్య గారసలె చండ శాసనులు....మొదటికే మోసం వస్తుంది.
    తన బాధకు మందేమైనా ఉంటె అది మోహన్ కే తెలియాలి!
    అందుకే ఒకరోజు సుధాకర్ తన బాధనంతా వెళ్ళబోసుకుంటూ మోహన్ కో ఉత్తరం వ్రాశాడు.
    "డియర్ మోహన్!
    నీకు ఉత్తరం రాయాలని కూర్చున్నానే కాని ఏం రాయాలో తోచటం లేదు. ఎందుకంటావా అలోచించి పెట్టె మనసు లేదు. అది నన్ను వదిలేసి కళ వెంట వెళ్ళిపోయింది.....
    నాన్నగారు నా పెళ్ళి విషయం ఎత్తారు. ఏం చెప్పను? కళకు బావగాడున్న సంగతి తెలిస్తే మనస్సు ను అదుపులో పెట్టుకునే వాడిని.... ముక్కూ మొఖం తెలియని మనషి మీద కంటే చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన బావంటే నే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. ఏమంటావ్? ఇప్పుడింక దేవదాసులా ఏ తాగుబోతు వెధవనై పోతానో అని భయంగా ఉంది.
    నా ఆశ ఎలాగూ ఫలించేది కాదు... నువ్వైనా సుఖపదాలని ఆశిస్తున్నాను....గీతను తరచు కలుసు కుంతున్నావా? వాళ్ళ సంగతులు లేమిటి? జవాబు వ్రాస్తావు కదూ?"
                                                                                                     నీ
                                                                                                   సుధాకర్."
    ఉత్తరం పోస్టు బాక్సు లో వేసి వచ్చాక సుధాకర్ కు కొంత బరువు తగ్గినట్టు అనిపించింది. మోహన్ తనను ఆదుకోగలడనేనే ధైర్యం వచ్చింది. దాంతో అ రాత్రి సుధాకర్ కు ఇటివల ఎన్నడూ ఎరుగనంతటి సుఖంగా నిద్ర పట్టింది.
    'అమ్మా! తేలోచ్చిందే?" అంటూ శేఖర్ గట్టిగా అరిచాడు వీధి వరండా లో నుంచి లోపలి కోస్తూ. సావిట్లో కూర్చుని మాట్లాడు కుంటున్న అమ్మాయిలంతా 'అమ్మో!" అంటూ కంగారు పడి నిలబడి పోయారు భయంగా గదంతా చూస్తూ.
    శేఖర్ అమ్మాయిల వంక అదోలా చూసి నవ్వాడు.
    ఇంతట్లో జయమ్మ లోపలి నుంచి వచ్చి "ఎప్పుడొచ్చావే తేలూ? కులాసా?" అని పలకరించింది.
    మనిషి పేరు తేలేమిటని అమ్మాయి లంతా పకపక లాడారు ఇప్పటికి బెంగ తీరి.
    చింకి గంప లాంటి జుట్టు, మాసి తోలై కంపు కొడుతున్న చీర, జాకెట్టు , పొట్టిగా లావుగా ఉన్న పాతికేళ్ళ లోపు పడుచు నవ్వుతూ జవాబిచ్చింది. 'అంతా మీ దయమ్మా! బాగానే ఉండాను."
    అమ్మాయిల కేసి తలతిప్పి "ఇందులో కోడలమ్మ గారే రమ్మా?' అనడిగింది తేలు. కళ గుండెలు కలుక్కుమన్నాయి. గదిలో నుంచి బైటికి తప్పించుకుని వెళ్తున్న శేఖర్ ను చూసి నవ్వింది జయమ్మ. కళ దగ్గర కెళ్ళి చేత్తో పట్టుకుని "ఇది మా కోడలు! బాగుందా?' అన్నది. కళ మరోక్షణం అక్కడ నిలబడలేదు.
    "బంగారుబొమ్మలా ఉన్నారమ్మా!" అంది తేలు.
    "మీ వదినకు సాయం చేద్దామని వచ్చావటే? వూరి నుంచి ఎప్పుడొచ్చావ్?' అంటూ కుశల ప్రశ్నలు వేసింది జయమ్మ.
    "రెండు రోజులైనాదమ్మా.... అంట్లు పడేయండమ్మా తోమేసి పోతాను..." అంది పెరట్లోకి దారి తీస్తూ.
    వంకర టింకరగా వ్రేలాడుతున్న తేలు జడ చూస్తె చిత్రకు నవ్వాగలేదు. అందుకని పక్క గదిలోకి పరిగెత్తింది.
    చావడి తర్వాత మరో గది , ఎడమ వేపున మూడు గదులు, అవి గాక ప్రత్యేకంగా వంటిల్లు, బాత్ రూమ్ - ఇద్దరు మనుష్యులకు చాలా పెద్దదే అయినా జయమ్మ ఇల్లంతా తమ క్రిందే ఉంచుకున్నాది. అద్దె కిచ్చుకుంటేనే కాని గడవని పరిస్థితి కాదు.
    ఎడమ వేపు గదుల్లో మొదటిది శేఖర్ వాడుకునేది. పనిమనిషి పైడమ్మ గది తుడుస్తున్నది. పనివాళ్ళు ఎవరైనా దగ్గర లేకపోతె శుభ్రంగా తుడవరని , చేతి కందిన వాటిని మొలలో దోపుకు పోతారని కళ రోజూ పైడమ్మ గదులు తుడిచేటప్పుడు దగ్గరుండి మరీ తుడిపిస్తుంది. ఈరోజు కూడా అలాగే పైడమ్మ వెంట ఉండి తుడిపిస్తున్నది.
    తేలు పనిమనిషి పైడమ్మ ఆడపడుచు. పైడమ్మ తేలు మీద నేరాలు చెప్పటం ప్రారంభించింది.
    "కళమ్మ గోరూ! ఈ తేలు మా కానిదండి. దీనికి సోకులు మాలావు! ఆడు కొప్పెట్టుకో మంటే టట్ అనేసి మా నెత్తిని కూకోడని కొచ్చింది! ఏటమ్మా? పెళ్ళయ్యాక అడిష్ట పెకారం ఉండాలా , వద్దా?.... ఇదంటే మా యజమానికి మా లావు ముద్దు! దాని మాటే ఆడతాడు. అది ఏది కావాలంటే అది నిమిషాల్లో తెచ్చి పడేస్తాడు. నా మాటంటే కాతరే లేదు!...." అంటూ నిట్టూర్చి కాస్సేపు తుడవటం ఆపేసి "ఎటో లెండమ్మ!" అంది విరక్తి గా.
    కళ మాట్లాడకుండా తలూపుతూ సానుభూతి ప్రదర్శించింది.
    కొబ్బరి ఈ నెల చీపురు -- పైన కట్టు వదులై ఒకటి రెండుగా క్రింద పడుతున్న పుల్లలన్నీ లోపలకు దోసి పురికోసతో గట్టిగా కడుతూ అంది పైడమ్మ.
    "మా ఇంటికాడ ఎంకయ్య బాబు లేడూ? ఆ బాబు సేతులు సూసి మా బాగా పెస్తాడట మ్మాయిగోరూ! నా సెయ్యి సదివి "నీకే నోటు నేదు పైడమ్మా! సుకంగా రాజానాగా బతుకుతావు!  అని సెప్పిండమ్మా. ఈ జేన్మ కి సుకమేటి?" అంటూ నిట్టూరుస్తూ అరచేతుల వంక చూసుకున్నది.
    కళ ఉత్సాహంగా ముందుకు వంగి పైడమ్మ చేతి వంక తొంగి చూసింది. పైడమ్మ చేతిలో కత్తుల మాదిరిగా రెండు రేఖలు ఒకదాని నొకటి ఖండిస్తున్నాయి! కళ ఆశ్చర్యంగా పైడమ్మ చెయ్యి పట్టుకుని దగ్గరగా చూసింది.
    "పైడమ్మ చెయ్యి స్టడీ చెయ్యటం మొదలు సేట్టా ఏమిటి? నాన్నగారేలా నీకు జాతకాల పిచ్చి పట్టుకున్నది?"
    కళ తలెత్తి చూసి నవ్వింది.
    "అది కాదె చిత్రా! పైడమ్మ చేతిలో క్రాసుందే అంటే లవ్ మారేజ్ ని అయన చెప్పాడు కాదటే?"
    పైడమ్మ కేం అర్ధం కాలేదు. ఒక చేతిలో చీపురు కట్ట ఉంది కాబట్టి రెండు చేతులతో తల కొక్కోనటానికి వీలుగాక ఒక చేత్తో తలను గబగబా బరికింది. అసలే ఎకేసినట్టున్న తల మరి కాస్త గజిబిజిగా అరణ్యం లా తయారయింది. ఆ అరణ్యం లోని జంతువులూ -- వేలాది పేలు -- కంగారుగా పరుగులు తీస్తున్నాయి.
    "నాకు తెలీకుండా బాస లో ఏటమ్మా అంటున్నారు? సెప్పండమ్మా!" అంది పైడమ్మ దీనంగా చూస్తూ బతిమాలుకునే ధోరణి లో.
    కళకు పైడమ్మ కు అర్ధమయ్యే లా చెప్పటానికి భయమేసింది. ఒక వంక నిజంగా పైడమ్మది లవ్ మారేజీ అవునో కాదో తెలుసుకోవాలని కుతూహలంగాను ఉంది.
    అందుకని "పైడమ్మా! నేనొక మాట అడుగుతాను. కోప్పడకు.... నువ్వు నీ మొగుడ్ని ప్రేమించావటే?' అనడిగింది కళ.
    పైడమ్మ చేతిలోని చీపురు కట్ట పారేసి కింద చతికిల పడిపోయింది పొట్ట చేత్తో పట్టుకుంటూ.
    నవ్వి నవ్వి కళ్ళ వెంట కారిన నీళ్ళు తుడుచుకుంటూ "వల్లకొండమ్మా మీ పెస్నా మీరూను! వోరి మొగుడి మీద వోరికి పెముండదు? సిత్రంగా మాటాడతారేటమ్మా? మా యజమాని తాగి తందనాలాడతాడు. పట్టుకు తన్తాడు. అల్లందుకని పెమనేకుండా పోసుందేటమ్మాయిగోరూ? రేపొద్దున పెళ్ళయితే బావ గారి మీద మీకుండదేటమ్మా?" అంటూ కొంటెగా నవ్వింది పైడమ్మ.
    కళ తెల్లబోయి ఎమనలేక తడబడింది. చిత్ర కళను చూసి నవ్వింది.
    'అది కాదు పైడమ్మా! దీనికి ప్రశ్న అడగటమే తెలీదు. పెళ్ళి కాక ముందు నీకు నీ యజమాని తెలుసా?' అనడిగింది చిత్ర పైడమ్మ కు అర్ధమయ్యేట్టు మాట్లాడుతూ.
    పైడమ్మ మళ్ళా పొట్ట చేత్తో పట్టుకుంది. చిత్ర తెల్లబోయింది. మాట్లాడకుండా పైడమ్మను చూస్తూ నిలబడింది....
    పైడమ్మ కాస్సేపటికి నవ్వాపుకుని "ఈ కాలం పెళ్ళిళ్ళ నాగ అనుకున్నారేటమ్మా! నా పెళ్ళికి నేను జంగారుతున్నానటమ్మాయి గోరూ!" అంది చీపురు చేతిలోకి తీసుకుంటూ.
    "మా యజమాని 'ఇంత పిల్లోడట" అంటూ నేల మీదికి కాస్త ఎత్తున రెండో చేయి పెట్టి 'ఇంత' అంటే ఎంతో చూపించింది.
    చిత్ర దానిమ్మ గింజ ల్లాంటి పలువరుసను బైట పెడుతూ పకపక నవ్వింది. చెవి నున్న జుంకీలు చలాకీగా ఉయ్యాల లూగాయి. కళకు మనస్సు చిన్న బుచ్చుకున్నట్టయింది. చిత్ర కేసి చిరాగ్గా చూసి "ఎందుకా నవ్వు? నేను కల్పించానా ఏమిటి? సుధాకర్ గారు అలాగే చెప్పారుగా?' అంది మూతి ముడుచుకుంటూ.
    చిత్ర మళ్ళా నవ్వింది.
    'అతని పేరు సుధాకర్ కాదు ప్రభాకర్!"
    కళ తత్తర పడింది. సిగ్గు పడింది. బుగ్గలు ఎర్రబారాయి. చిత్ర తన మనస్సును పసికట్టేసిందేమోనని గాభరా పడింది. మనస్సు లోని సంభ్రమం కప్పి పుచ్చుకునే ప్రయత్నం లో కళ కంగారుగా మాట్లాడింది.
    "ప్రభాకర్ చెప్పింది పొల్లు పోదని నాన్నగారు అనలేదూ? పైడమ్మ చెయ్యిని ప్రభాకర్ చూసినా ఈ ముక్కే అంటారు...."

                            
    "అవునవును! అయన చెయ్యి చూసి చెప్తే నాన్నగారికి సరిపోయింది... ఏడాది నిండని పైడమ్మ కు, రెండు మూడేళ్ళున్న పైడమ్మ మొగుడుకి ప్రేమేవిటి?' అంది చిత్ర నవ్వుతూ.
    "ఏమో మరి! పైడమ్మ చేతిలో మటుకు లవ్ మారేజ్ ఉంది. కావాలంటే నీ మట్టుకు నువ్వే చూడొచ్చు--' అంది కళ సీరియస్ గా.
    పైడమ్మ తుడవటం ఆపి మళ్ళా అడిగింది.
    'ఆ మాటంటే మన బాసలో ఏటమ్మా?"
    చిత్ర నవ్వుతూ వెక్కిరిస్తున్నట్టుగా అన్నది "అంటే పైడమ్మా ఈ రోజుల్లో అందరూ చేసుకోడం లేదూ? అలాటి పెళ్లన్న మాట -- నీ చేతిలో కనపడుతున్నదట...."
    పైడమ్మ ముఖం మాడ్చుకుని కస్సుమంది.
    "అలాంటి మాటలాడకండమ్మా! ఈడి నోగ్గేసి మారు మనువు కేల్తే ఆడూ మాత్రం సుక పెడతాడే టమ్మా? ఒకడినే నమ్ముకోవాలి కాని....ఛీ! ఛీ! ఏం పనులమ్మా?"
    కళకు నవ్వు వచ్చింది. చిత్రకూ నవ్వొచ్చింది.పైడమ్మ చూస్తె మరీ భగ్గు మంటుందని ఇద్దరూ ఒకళ్ళ ను చూసి మరొకళ్ళు సన్నగా నవ్వుకున్నారు. లవ్ మారేజీ అంటే మారు మనువు అనుకుంటున్నది పైడమ్మ -- హతోస్మీ! అని ఇద్దరూ కళ్ళతో మాట్లాడుకున్నారు.

                          *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS