"అమ్మ తన బాధనీ, దుఃఖాన్నీ, లోలోన దిగమింగుకునేది. నన్ను చూచి ధైర్యం వహించేది కొన్నాళ్ళు ఇలా గడిచిన తర్వాత అయన ఒక రాత్రికి రాత్రి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. అమ్మకోసం ఒక చిన్న చీటీ రాశారు! 'న్యాయా న్యాయాలు నిర్ణయించే భగవంతుని సన్నిధానంలో నా తప్పుల్ని వప్పుకుని శిక్ష ఆమోదిస్తానేమోగాని, మా వాళ్ళకి దూరమై ఇక్కడ నరకం అనుభవించలేను పార్వతీ!' అని ఉందిట.
ఆమదాలవలసలో మావయ్య వాళ్ళున్నారు. వాళ్ళకీ ఖబురు తెలిసింది. వచ్చి అమ్మని తీసుకెళ్ళారు. ఆమె నోరార్చారు. కొందరు దెప్పి పొడిచారు, అమ్మ చేసిన 'పిచ్చి' పనిని గేలి చేశారు. ఎవరికీ సమాదానం చెప్పలేదు అమ్మ.
"మావయ్య వాళ్ళు అన్నారుట, నాన్నని వెతికించి మళ్ళా నీ కాపురం నిలబెట్టే పూచీ మాదని. అమ్మ వాళ్ళని వారించింది. ఆయనకీ సంసారంలో సుఖం లేదనీ, ఎక్కడైనా ఆయన హాయిగా ఉంటే చాలనీ వాళ్ళకి నచ్చచెప్పింది. వాళ్ళా ప్రయత్నం తప్పని సరిగా విరమించుకోవలసి వచ్చింది. చెప్పండి......అమ్మ దేవతగాదూ.....నాన్నని క్షమించగల సహృదయం అలాటి దేవతల్లోనే ఉంటుంది గదూ" అన్నది కుసుమ బాధగా.
శంకరం జాలి చెందాడు.
"ఇదీ అమ్మ కథ. ఆ అమ్మ దగ్గరనే పెరిగి పెద్దదా న్నయ్యాను. నాకు బాగా వయస్సు వచ్చేంత వరకూ ఆవిడ కథ తెలిసింది కాదు. అదీ చెప్పేది కాదేమోగానీ-నాకు వచ్చే ప్రతీ సంబంధం 'అమ్మ కథ' తెలిసీ, వెళ్ళిపోవడంతో ఆమె తన కథని చెప్పక తప్పలేదు.
"నాకీ జన్మలో పెళ్ళి కాదేమోనని అమ్మ బెంగపడి పోయింది. ఆ బెంగలోనే ఆవిడ మంచం పట్టింది. నేను టైప్ నేర్చుకున్నాను. ఆ ఊళ్ళోనే ఒక ఆయిల్ మిల్లులో టైపిస్ట్ గా కాలు పెట్టాను. అక్కడే నాకు రాజారావుతో పరిచయమయ్యింది.
ఈ పేరు వినగానే శంకరం ఉలిక్కిపడ్డాడు. అతనిలోని ఈ మార్పు గమనించి కుసుమ అడిగింది-
"మీ కాయన తెలుసా?"
"ఎక్కడో విన్నట్టు గుర్తు. పూర్తిగా చెప్పండి మీ కథ"
"రాజారావు గురించి అప్పటికీ ఇప్పటికీ నా ఉద్దేశ్యం ఒక్కటే. అతను నన్ను అమితంగా ప్రేమిస్తాడు. ఈ విషయం అమ్మతో చెప్పాను. అమ్మ నవ్వి అన్నది 'నా కథ నీకు తెలుసు. నా కూతురు గతీ అలాగే కావాలని ఏ తల్లీ కోరదు తర్వాత నీ ఇష్టం' అని.
కాని రాజారావు గుణంలో, అతని మాటల్లో అనుమానించదగ్గ అంశమేదీ కనిపించలేదు. రాజా రావుకీ, నాకూ పెళ్ళి అయింది. మా పెళ్ళయిన, మూడు నెలలకి అమ్మ పోయింది. పోతూ పోతూ 'జాగ్రత్త తల్లీ జీవితం పట్ల నిర్లక్ష్యం తఃగాదు' అని హెచ్చరించింది.
నే నెప్పుడూ జీవితాన్ని నిర్లక్ష్యం చెయ్యలేదు. రాజారావే నాకు సర్వస్వం, దేవుడూను. రాజారావు నా ఉద్యోగం మాన్పించాడు. ఇంటి పనులు చక్కపెట్టుకోడం నీ వంతు అన్నాడు. తలూపాను.
రాజారావు విపరీతమైన ఖర్చులకి అలవాటు పడ్డ ఆమనిషి. చివరికి అదే నా సంసారాన్ని నాశనం చేసింది. స్థితికి మించిన ఖర్చులకోసం మితిమీరిన అప్పులు చేసి, ఆఫీసులో డబ్బు దొంగిలించెడు. నాలుగు రోజులు అటు ఆఫీసులోనూ, ఇటు ఇంట్లోను ఈ దొంగతనం తెలీనివ్వలేదు. చివరికి తెలియక తప్పిందికాదు. మానేజరు రాజారావుని పోలీసుల కప్పగించటానికి చూసేడు. అతను పారిపోయాడు.
దొంగ భార్యని. నాకు ఆ ఊళ్ళో ఎవరుద్యోగం ఇస్తారు. ఆఫీసులో దొంగలించిన పైకం మమ్మల్ని కట్టమని మానేజరు వత్తిడి చేశారు. అత్తయ్యవీ, నావీ నగలు అమ్మి పైకం కట్టేశాం.
చివరికి అదృష్టవశాత్తూ ఇక్కడ ఉద్యోగం దొరికింది. వచ్చాను. నన్ను నేను పోషించుకునే ధైర్యం నాకుందిగాని, నా నిజాయితీని లోకానికి నచ్చచెప్పగల సహనం రోజు రోజుకీ తగ్గిపోతుంది.
ఇక్కడే మరొక మాట - రాజారావు మా నాన్న గారిలా మోసగాడు కాదు. ఇప్పటికీ అతనికి నా పైన అనురాగం తప్పకుండా ఉండి ఉంటుంది. రెండు రోజుల క్రితం మావయ్య వాళ్ళ దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. రాజారావు ఆమదాలవలస వచ్చాట్ట. నా గురించి అడుగుతే, నిజం చెప్పటానికి వాళ్ళ కిష్టం లేక మాకు తెలీదని బొంకారుట. రాజారావు వెళ్ళిపోయాడు. చెప్పండి శంకరం- రాజారావుకి నామీద ప్రేమ లేదంటారా? ప్రేమ లేకపోతే మళ్ళీ నన్ను వెతుక్కుంటూ ఆమదాల వలస వచ్చేవాడేనా?" అడిగింది కుసుమ.
"మీరు చెప్పేది వింటే నాకూ అలాగే అనిపిస్తుంది"
"ఒక్క నిమిషం ...... ఇప్పుడే వస్తాను" అంటూ లోపలికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొచ్చింది.
"చూడండి.......రాజారావు మోహంలో ఎక్కడైనా మోసం కనిపిస్తుందేమో" అన్నది ఆవేశంగా. శంకరం ఫోటో చూశాడు. అతని తల తిరిగి నంత పనయింది తిరిగి ఇచ్చేస్తూ.
"మళ్ళా మీ సంసారంలో సుఖ సంతులు కలగా లని ఆశిస్తాను. వస్తాను. సెలవు" అని చెప్పేసి గబ గబా బయటికి వచ్చేశాడు. అక్కడికి దగ్గర్లోవున్న హోటల్లో దూరాడు.
అప్పటిగ్గాని తన కలవరపాటు తగ్గిందికాదు.
"రాజారావు!"
పెంచి పెద్ద చేసిన నాన్నని బాధ పెట్టి ఇంట్లో డబ్బు దొంగిలించి పారిపోయిన రాజా రావు కుసుమతో చెలగాట మాడుతున్నాడు. అతని బుద్ది కించిత్తు గూడా మారలేదు. పాపం రాజారావుని కుసుమ ఇప్పటికీ నమ్ముతుందేవిటి?
శంకరానికి కుసుమపైన జాలీ, రాజారావుపైన విపరీతమైన కోపమూ కలిగాయి. అతని మనసు వికలమయ్యింది. ఇప్పుడేం చెయ్యాలో తోచకుండా ఉంది.
అందరిచేతా అనిపించుకుని, సాధించేది ఏమీ లేదని, తనమీద తనకి అప నమ్మకం కలిగిన రాజా రావు ఏ నాటికైనా నాన్న దగ్గరికీ వచ్చి క్షమించ మని ఆయన కాళ్ళమీద పడక తప్పదు. ఆ తరుణమూ అతి దగ్గరలోనే ఉంది. రాజారావు చేసిన పాపాన్ని అతని చేతనే వప్పించి, కుసుమాని అతని కప్పగించి, వాళ్ళ సంసారంలో మళ్ళీ వసంతం నింపడం తన ధర్మం.
శంకరం రూమ్ వైపు నడక సాగించాడు గాని, కొంత దూరం వచ్చిన తర్వాత ఆగిపోయాడు. అతనికింత త్వరగా రూమ్ కెళ్ళాలనిపించలేదు.
శారద పాట గుర్తు కొచ్చింది. ఆమె రూపం అతని ముందు లీలగా నిలచింది. అప్రయత్నంగా అతని కళ్ళు శారద ఇంటి వైపు దారి తీశాయి.
శారద ఇల్లు కనుక్కోడం ఏమంత కష్టమనిపించలేదు. చాలా చక్కగా ఉంది ఇల్లు అధునాతన పద్ధతిలో కట్టారు.
గేటు తెరుచుకుని ఆవరణలోకి అడుగు పెట్టాడు. లోపల హాల్లో సరదా, మృణాళినీ ఏదో మాటాడుకుంటున్నారు. శారద తనని చూడగానే మృణాళినితో మాటలాడి లేచి నిలబడుతూ,
"రండి రండి, చాలా రోజులకి దయ కలిగింది. లోపలికి రండి" అని ఆహ్వానించింది.
శంకరం లోపలికి వచ్చాడు. అతన్ని చూచి మృణాళిని శారద దగ్గర సెలవు తీసుకుని వెళ్ళి పోయింది.
"అయ్యో రామ. ఇంకా అలాగే నిలబడి ఉన్నారే. కూర్చోండి" అన్నది శారద. శంకరం కూర్చున్నాడు.
"ఒక్కక్షణం అమ్మని పిలుస్తా నుండండి" అని ఆమె లోపలి కెళ్ళింది.
10
మరో అయిదు నిమిషాల్లో శారద కామాక్షమ్మ గార్ని వెంటబెట్టుకొచ్చింది. ఆవిడను చూడగానే గౌరవంగా నిలబడి అందంగా నమస్కారం చేశాడు శంకరం. అతని వినయానికి కామాక్షమ్మగారు లోలోన మురిసిపోయేరు.
"కూర్చో బాబూ! ఈ ఊళ్ళో ఉంటూ గూడా యిక్కడికి రావడమే మానుకున్నావ్? మేము పరాయివాళ్ళ మనుకున్నావా ఏమిటి?"
"అబ్బే అదేం కాదండి. తీరుబడిలేక....."
"అదేమిటయ్యా-మరీ అంత తీరుబడిలేని పనులేమున్నాయి నీకు?"
"ఆయనగారికి మిత్రు లెక్కువమ్మా. వాళ్ళతోనే సరిపోతుంది యిరవై నాలుగ్గంటలూను. ఏ థియేటర్లో చూచినా వీళ్ళే." అన్నది శారద నవ్వుతో.
"ఇంకా ఎన్నాళ్ళులే సరదాలు. రేపు ఆ మూడు ముళ్ళూ పడితే యిక కాళ్ళకి బంధాలేగా మరి. ఏమంటావయ్యా?" అన్నారావిడ.
శంకరం సిగ్గుతో తల వంచుకున్నాడు.
"సరే మీ రిద్దరూ మాటాడుతూండండి. వంట గదిలో పని చక్కబెట్టుకొస్తాను" అని చెప్పి కామాక్షమ్మగారు వంట గదిలోకి వెళ్ళారు.
శారద తనముందు సోఫాలో కూర్చున్నది.
"ఏమిటండీ విశేషాలు" అడిగింది.
"ఏమీ తోచక యిలా వచ్చాను."
"అవుతే మీకిప్పుడు తోచెట్టు చెయ్యాలన్న మాట. మీ నవల చదువుతున్నాను. చక్కగా ఉంది."
"మీ పాటకంటేనా?"
"అహ ...... పోతే మీ గురించి అప్పుడే ప్రాపగాండా గూడా మొదలెట్టాను. ఆ నవల వ్రాస్తున్నది ఫలానా అని ......"
"మీ పాటలు వినాలని ఉంది" అన్నాడు మాట మధ్యలో.
"ఏమిటో విశేషం?"
"విని చాలారోజు లయ్యింది కదా!"
"అయితే పాడక తపపదంటారు."
"అనేగా......"
"ఏం పాడమంటారూ?"
"మీ యిష్టం?"
"శ్రోతలు మీరు కాబట్టి, ఏం పాడాలో మీరు అడగడం సబబు."
"మీరేం పాడినా అభ్యంతరం లేదు కాబట్టి, ఇక శ్రోతలు కోరిన పాటనేది మీకు వర్తించదు."
ఇద్దరూ నవ్వుకున్నారు. నవ్వులు ముగిసిన తర్వాత శారద ఒక అష్టపది పాడింది.
'రమతే యమునా పులిన పనే-'
పాట, పాటకు తగ్గ కమ్మటి గాత్రం, శ్రావ్య మైన రాగాలాపన, మధ్య మధ్య అందమైన చెణుకులూ-అతడ్ని ముగ్దుడ్ని చేశాయి. తన్మయత్వంలో పాట ముగిసిన మాట కూడా మరిచేడు.
సంగీతంలో ఉన్న చాతుర్యం అది. బాధలూ, వ్యధలూ అన్నింటినీ పరవసింపచేయగలది సంగీతం. శ్రోతని మధురూహలలో ముంచెత్తేదీ సంగీతమే. అందునా శారద పాటకి ఒక ప్రత్యేకత ఉంది. ఆమె సార్ధక నామధేయురాలు.
పాటైన తర్వాత శారద నవ్వుతూ అన్నది.
"ఇక మీరు యీ లోకానికి రావచ్చు."
"రాను నేను రాలేను. మరో అష్టపది.....ప్లీజ్ ....... నాకోసం మరొక్కటి" అన్నాడు శంకరం.
అతని కోరిక ప్రకారం మరొకటి పాడింది......
'రాధికా కృష్ణ తన విరహే కేశవ.'
ఆమె కంఠంలోని తీయదనం అతనికి హాయి కలిగించింది. అతను అన్నాడు.
"నిజం మీరు చక్కగా పాడగలరు."
"మీరు మంచి కథలు రాయగలరు."
"అబ్బ నన్ను చెప్పనివ్వండి."
"నన్ను చెప్పనివ్వండి."
ఇద్దరూ ఇలా మొహమాటం పడుతూండగా కామాక్షమ్మగారు కాఫీ తీసుకొచ్చారు.
"ఏమిటర్రా అసలు విషయం?"
"నువ్వే చెప్పమ్మా-శంకరంగారు మంచి కథలు రాయరూ?"
"మీరే చెప్పండి-శ్రద చక్కగా పాడగలదు కదూ?"
ఇద్దరి వాదనలూ విని ఆవిడా ముసిముసిగా నవ్వుతూ,
"ఇద్దరూ ఇద్దరే! ముందు యీ కాఫీలు తాగండి. తర్వాత తీరుబడిగా వాదించుకోవచ్చు." అన్నారు.
కాఫీలు తాగుతూండగా కామాక్షమ్మగారు మళ్ళీ వంటగదిలోకి వెళ్ళారు.
"ఒక నాలుగు రోజులపాటు ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది" అన్నాడు శంకరం కాఫీ కప్పు కింద పెడుతూ.
"ఎందుకనిట?"
"వాతావరణంలో మార్పు కావలసి వచ్చింది."
"ఇది వైద్యుల నిర్ణయమా?"
"కాదు-మనసు తొందర చేస్తోంది. నాలుగు రోజులపాటు ఎక్కడైనా నిశ్చింతగా గడుపుదాం పదా అని."
"మరి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు."
"ఇంకా నిర్ణయించుకోలేదు."
"అవుతే ఒకపని చెయ్యండి."
"చెప్పండి."
"అమ్మా, నాన్నా, నేనూ రేపు భద్రాచలం వెడుతున్నాం. మీకేమే అభ్యంతరం లేకపోతే మీరూ రావచ్చు."
"థాంక్స్ రక్షించారు. తప్పకుండా వస్తాను. నా విషయం మీ పేరంట్స్ తో రెకమెండు చేసి పుణ్యం కట్టుకోండి."
"ఇందులో నా రికమెండేషనేవి టండోయ్."
"మరేం లేదు-మీ కంపెనీలో నన్నూ చేర్చుకోడానికి. అన్నట్టు నా ఖర్చులు నేనే భరిస్తాలేండి."
"ముందే అన్నాగా, మీకు అభ్యంతరం లేకపోతే మాతో రావచ్చునని. పోతే, ఖర్చు విషయం మాత్రం ఆలోచించాలి."
"సెలవుపెట్టి ఉదయమే మీ యింటికి వస్తాను."
"తప్పకుండా."
కామాక్షమమగారు శారదని లోపలికి పిలిచి ఏదో మాటాడారు. తర్వాత శారద శంకరం దగ్గరకొచ్చి అన్నది.
"వొచ్చినవారు ఎలాగో వచ్చారు కాబట్టి ఈ పూట మా ఆథిత్యం స్వీకరించి వెళ్ళవలసిందిగా అమ్మగారు కోరారు. కాబట్టి తెలియజేయడమైనది."
