13

రుక్మిణితో మాట్లాడిన గంటలోనూ, తను ఓ విధంగా తృప్తిపడ్డా, ఎందుకో అది మనస్సును తేలిక పరచలేదు. సత్యం ఒప్పుకోవాలంటే రుక్మిణికి అన్యాయం జరిగింది. ఇంచు మించుగా తల్లి, తండ్రి, తన తండ్రి చిత్రవధ చేసేరు, వారి వారి స్వార్ధ తృప్తి, ఆశయంకోసం. ఇది తను ఒప్పుకోలేడు. అయినా చేసేది ఏమీ లేదు, బాధపడడంకన్న. గోడ అయ్యింది ఆకృతి.
ఏ విధంగానో రుక్మిణికి ఆనందం చేకూర్చాలనుకుని, డబ్బుతో కొనుక్కోమని తను సలహా ఇచ్చినా, అది చాలా అసందర్భంగా, ఔచిత్య రహితంగా ఉంది. తనే బరువు ఎక్కినట్లు భావన.
తన తండ్రి, దరిదాపు అరవై య్యో పడిలో పడి, శరీరం పట్టుతప్పిన స్థితిలో, అంత చిన్న వయస్సు పిల్లను భార్యగా చేసుకోవాలని, ఆవిడతో దప్పిక తీర్చుకోవాలని ఆయత్తపడడం ఆశ్చర్యం కలిగించింది.
పైగా చిన్నప్పటినుండి జరిగిన విశేషాలు కొట్టవచ్చినట్లున్నాయి. తను, రుక్మిణికూడా ప్రతి పండుగకూ కొత్త బట్టలు తొడుక్కుని, వాళ్ళకు నమస్కారం పెట్టేవారు. మనసారగా నవ్వుతూనే "రుక్మిణి పెద్ద భార్య అయితే సత్యభామ ఏదిరా?" అనేవారు. మీసాల మధ్యనుంచి నవ్వడం ఆయనలో ప్రత్యేకత.
అమ్మ అందుకుంటూనే "మా రుక్మిణి ఎప్పుడో తులసిదళం వేసేసి వాడిని కొనేసింది" అనేది.
విరగబడి నవ్వేవారు. అప్పుడు శరీరం పులకరించినట్లయ్యేది. ఆ భావనలో ఉన్న తండ్రే ఇప్పుడు మారిపోయేడు. మార్పు ఎల్లా జరిగింది? మామయ్యా అత్తయ్యలు ఎల్లా ఒప్పుకోగలిగేరు? తన ఆలోచన కందినంతవరకూ తర్జనభర్జన చేసుకున్నా, సుభద్రమ్మ అత్తయ్యమాత్రం దీనికి ససేమిరా ఒప్పుకోదు అన్న ధైర్యం ఉంది. అది కూడా జరిగిన విషయానికి టీక చెప్పలేకపోతూంది.
రుక్మిణిలో పేరుకున్న తనమీది అనురాగం ఏమైంది? ఆ ఆరాధన ఎక్కడ కరిగిపోయింది? ఇది తను యింటినుండి వెళ్ళిపోవడంతో నెమ్మది నెమ్మదిగా, అమ్మ నగలమీద, ఆస్తి మీద కేంద్రీకరించి మార్పు
తెచ్చిందా? లేక లక్ష్మి అత్తయ్యా, సీతారామయ్య మామయ్యా, బీదరికానికి కాష్టం పెట్టాలని మెడలు వంచేసేరా? దాన్ని ప్రతిఘటించలేక లోబడిపోయి తల వంచిందా?
ఇవన్నీ సమస్యలు అయినట్లే పుట్టగొడు గుల్లా ముసిరేయి. అవి చెవుల్లో రొద పెడుతున్నాడు - ఏమిటో తన కనవసరం అనుకున్నా, వదలం అన్న దృష్టిలో.
ఇన్నాళ్ళ సాహచర్యంలోనూ, వయస్సు వచ్చిన తర్వాత రుక్మిణిని చూస్తూనే ఉన్నాడు. వయస్సులో హోయలు లేకపోలేదు. శరీరంలో గరుపం ఉంది. అయినా తన్ను అని ఆకర్షించ లేదు. రుక్మిణి, రుక్మిణిలాగే తనలో ఉండిపోయింది. దీన్నే చాలాసార్లు తర్కించుకున్నాడు. తికమకపడ్డాడు. అమ్మా, నాన్నా కూడా పెట్టుకున్న దృష్టిలో తనకు దాన్ని ముడిపెడితే, అప్పుడు ఏమవుతుంది? ఈ భయం లోప ల్లోపల పెనవేసుకుంది. అప్పుడు అలజడిలో ఊరి చివరవరకూ పారిపోయేవాడు.కాని ఆ ప్రశాంతత, ప్రకృతికూడా తన్ను ఊరడించేవి కావు.
అవ్యక్తంగా తన జీవితం ఇంతేనా అన్న భావం క్రమ్మేది, బలవత్తరంగా తను రోజులు గడుపుతున్నాడన్న సంభూతి. ఏమిటో ఈ పరిస్థితులు, పరిసరాలుకూడా తన్ను పట్టవు. అవి నడుస్తూనే ఉంటాయి. కాని తను స్తబ్దత పొందినట్లుగా ఉంటాడు. ఏదో వైరుధ్యం, సంక్షోభం తనలో ఉన్నాయి. ఎప్పుడూ ప్రకృతిలో పడుకోవాలని, నక్షత్రాలను చూడాలని, చంద్రబింబంతో దోబూచులాడాలని ఉంటుంది. కాంక్ష, పిపాస, దానికిన్నీ జవాబు చెప్పుకోలేని తన నిర్జీవస్థితి నైమిశా రణ్యంలా ఉండేది.
కాని అప్పుడప్పుడు విచిత్రంగా భావనలు క్రమ్మేవి. అమ్మ చనిపోకపూర్వం కాబోలు; ఎందుకో తమ ముండనం చేసుకుని, శ్మశానంలో కూర్చుని, నెత్తిమీద జ్యోతి వెలుగుతుంటే, బూడిద వ్రాసుకుని ప్రణవోచ్చారణ చేస్తున్నట్లు, రుధిరం నైవేద్యం పెట్టినట్లు మైకం వచ్చేది. అప్పుడు తను లేడు. రాజు అనే వాడెవడు? ఇదే ప్రశ్న రేకెత్తేది. దానితో ఎవరికీ నైవేద్యం అన్న ఆశ్చర్యం కలిగేది.
చిన్నగా నవ్వుకునే 'అమ్మకు', తనకు తెలియని ఆవిడకు ఆ నైవేద్యం.
ఆవిడ ఎవ్వరు?
నీలం రంగుతో, ఎనిమిది చేతులతో, ఆయా ఆయుధాలతో, రౌద్రంగా నాలిక తెరిచి, బలి కోరుతున్నట్లు రూపం - సాదృశ్యంగా తెర మరుగు అయ్యేది. ఎవరూ? అనుకున్నా 'కాళీ స్వరూపం' అని గుర్తుకు వచ్చేది.
ఎప్పుడో, ఎక్కడో తను కాళీమాయిని పూజించేడు. అదే జ్ఞాపకంరానట్లు దుఃఖం వచ్చేది. ఏదో చదవాలన్న ఆయత్తత. ఏం చదవాలో తెలియని దిగ్భ్రమ. అవ్యక్తంగానే అప్పుడు ప్రణవం చిందేది.
ఇదెందుకు వచ్చిందో అనుకున్నా తను చెప్పుకోలేకపోయేడు. కాని కర్మ చేసిన తర్వాత శ్మశానంలో జ్ఞాపకం రేగింది.
తను నిర్ణయం చేసుకోలేని అనిశ్చలతలో ఊగడం అయ్యింది. తన కార్యక్రమం ఇటా, అటా అని తేల్చుకోలేని నిర్వీర్యత.
ఇక తనను కన్నతండ్రి ఇంటికి దూరం అయ్యేడు. ఆ పెళ్ళితో వీధిగుమ్మం మూసి వెయ్యబడింది. ఇక తన్ను గౌరవించి, ఆహ్వానించే వారు సత్య, మధు, రావు; అక్కడ శాంత. ప్రత్యేకంగా ఈమధ్య మాల జ్ఞాపకం వచ్చేది.
మాలను ఊహించినప్పుడల్లా తనలో తనకే విచిత్ర పరిభ్రమణం కలిగేది. లోకం అంతా పతిత అన్నా, ఎక్కడో నిబిడీకృత సౌందర్యం తన్ను ఆకర్షిస్తూంది. అది భౌతికపు కోర్కె కాదు; ఆధ్యాత్మిక ఆవృతి అన్నట్లు తట్టేది. ఏదో సంబంధం ఉంది తనకు, మాల జీవితానికి అన్న భావన.
ఇదేమిటి అంటే తను చెప్పుకోలేడు. ఆరాత్రి మాత్రం మాలను తను అందరూ చూచినట్లు చూడలేక పోయేడు. కుతూహలం ముందుకు తోస్తే తను మాట్లాడేడు. ఏమిటో, ఏదో తెలుసుకోవాలని; సత్యలో లేనిది మాలలో ఉందన్నట్లు; అది చాలా ఉత్ర్కుష్టంగా పొంగి పొరలినట్లు.
ఫక్కున నవ్వు వచ్చింది. సత్య ఆరాత్రి తన్ను బలిపెట్టి, భయపడి పారిపోయింది. తన్ను చూస్తే వాళ్ళకు ఆకర్షణ; కాని ముట్టుకుంటే భయం అన్నవతు. వీళ్ళంతా ఎందుకు ఇల్లా తనచుట్టూ తిరుగుతారు?
ఒక్క సత్యం కన్పించింది. ఆయీ వ్యక్తులతో తన అనుభూతి, ఆ ఒక్క శాంతతో ఉన్నక్షణాలు పోల్చి చూస్తే సహప్రాంతం తేడా కన్పిస్తుంది. ఆ క్షణికం తనలో తన ప్రక్కగా అర్ధనారీశ్వరే అయిన శాంతలా తనుజీవించేడు. శాంత తనలోనే ఉంది. మళ్ళీ వెతుక్కోవడం ఏమిటి?
'నా భర్తకు నేను నమస్కరించడంలో తప్పు లేదు.' శాంత అంది అప్పుడు.
ఆనందం వచ్చింది; కళ్ళు చెమర్చేయి అప్పుడు. వెంటనే వయస్సు, వర్గవిభేదాలు, పరిస్థితులు, విభిన్నత ఇవన్నీ గుర్తుకువచ్చి తచ్చాటన పడ్డాడు. అక్కడకూడా తను నిర్ణయం చేసుకోలేని శూన్యంలోనే ఉన్నాడు-నిర్ణయం అన్నదే ఏమిటో తనకు తెలియదన్నట్లు; అది చేసేది తను కాదన్నట్లు.
ఒప్పుకునేది ఒక్కటే. శాంత తన్ను కదల్చింది. తనలో ఎవరినో మేలుకొలుపు పాడినట్లు, తట్టి లేపినట్లు అయ్యింది. తన భౌతికం మాత్రం రేకొట్టబడి మళ్ళీ అక్కడినుండి నిలువ నీడ లేకుండా చేసింది; నీతండ్రి వాకిలి నీకు మూసివెయ్యబడిందని చెప్పడానికే అన్నట్లు.
తను తప్పించుకునే తిరుగుతున్నాడు; తన వాళ్ళందరికీ దూరం అవ్వాలని. సుభద్రమ్మ అత్తయ్య, దశరధం మావయ్య ఇంటికి వెళ్ళలేక కాదు. కాళ్ళాడలేదు అప్పుడు. బలవత్తరంగా ఎత్తి కుదేసినట్లుగా రైలెక్కాడు.
అనుకోకుండానే మళ్ళీ మాల పసికట్టేసింది తన్ను. జబ్బ ఊడిపోయేటట్లు లాక్కెళ్ళింది హోటలికి.
"నీకోసం వెతుక్కుంటున్నా" అంది గట్టిగా, స్టేషన్లో.
వెనకాల పైకి నవ్వలేని కళ్ళు ముసిముసి మన్నాయి హేళనలో.
"ఎందుకూ?"
"ఆరోజు పారిపొయినా మళ్ళీ పట్టుకోగలనన్న ధైర్యం నాది." మనుష్యులే లేనట్లు మాట్లాడింది.
టిక్కెట్టు డబ్బులు ఇవ్వలేని ప్రయాణికుడి పాతబాకీ కాబోలు అన్న వికవికలు, మాలను గుర్తించినవాళ్ళల్లో ప్రకటితం అయ్యాయి. అవేమీ లెక్కలోకి రాలేదు. తను నడిచేడు. మాల భుజాలు రిక్షాలో తగులుతూనే ఉన్నాయి. ఏదో ఏదో మాట్లాడుతూనే ఉంది. తనకు వినిపించటం లేదు.
గదిలో కూర్చోపెట్టినపుడే "ఎందుకింత కోపం నామీద?" అని అడిగింది.
"నామీద నీకీమమకరం ఏమిటి?" ఎదురు తిరిగి అడిగేడు.
"నాకు తెలియదు.నువ్వు నావాడివన్న నమ్మకం నాకు మైకం కలిగిస్తుంది. ఆప్రేరణకు నేను తట్టుకోలేకుండా వున్నా."
"నా శరీరం నీకు కావాలన్నమాట."
"ఏమో? నాకు శరీరాలమీద మోజు ఎప్పుడో పోయింది. ఉన్నది కడుపు. దాన్ని నింపాలన్న తప్పనిసరిలో ఈపని చేస్తున్నా."
"ఏహ్యంగా లేదూ?"
"మరి కడుపెల్లా నిండుతుంది?"
"డబ్బుకోసమా?"
"అయితే అయి వుండవచ్చు."
"నేనేం ఇవ్వగలనూ, నీకు?"
నాకేం ఇవ్వక్కరలేదు. నువ్వు నాదగ్గరే వుంటే చాలు-నాకు సర్వస్వం."
డిల్లపోయేడు. ఏమిటి మాల మాటలలోతు?
సూటిగా కళ్ళల్లోకి ఓసారిచూచి, బుగ్గలు తడుముతూనే "క్షణంలో వస్తా ఎక్కడికీ పారిపోకేం" అంటూనే వెళ్ళింది.
గదికంతా తను, వీధివాకిట్లో గుమ్మంవద్ద కాపలాగా వీరయ్య ఉండిపోయేరు. తను బందీ. వీరయ్య కాపలాదారు. ఎవరూ కాని మాలే తనమీద అధికారం చలాయించేది కావడం!
తను ఒప్పుకోలేడు. బయటపడాలి. పారిపోవాలి. బయలుదేరినప్పుడు ఎక్కడికైనా చాలాదూరంగా వెళ్ళిపోవాలన్న బలవత్తరమైన కోర్కెతోనే రైలు ఎక్కేడు. కాని దారిలో విధి బలీయం అన్నట్లుగా పట్టుబడిపోయేడు.
అనిశ్చయంగా ఉన్నా ఏ దైవక్షేత్రానికో వెళ్ళాలన్న ముసుగులాట దోబూచులాడుతూనే ఉంది. క్షేత్ర నిర్ణయంకాని తన ఊగులాట.
"వీరయ్యా!"
"ఏం, బాబూ?"
"ఈ కాపలాకి ఏమిస్తానంది?"
నవ్వేడు. "అదో పిచ్చిపిల్లండి" అన్నాడు ఆపేక్షలో. "వచ్చినప్పుడల్లా పావులావో, అర్ధో నాకు ఇవ్వకుండా వెళ్ళదు. నేనంటే గౌరవం అంటుంది అడిగితే."
మాల వ్యక్తిత్వ లక్షణం ద్యోతకమైతే, ఒక్కసారి శరీరం గగుర్పాటు చెందింది. ఏమూలో, ఎక్కడో, తన భౌతికంలో మాలమీద ఆకర్షణ పెంపొందించుకుని, తన కాళ్ళూ, చేతులూ కట్టేస్తూంది. శరీరం పెంపొందించుకొన్న కోర్కె అంటే, ఆ చైతన్యం తనలో కలగటం లేదు. అది లేదు కూడాను.
ఎక్కడకు వెళ్ళినా తను, మాల రాకపూర్వం మాయమైపోవాలి. ఈ బందీ తప్పించుకోవాలి.
"అవును, వీరయ్యా! దాన్ని చూస్తూనే ఉన్నా. ఎప్పుడూ అంతే అది."
"ఔను, బాబయ్యా! కాని గీత ఇల్లా వుందేం అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు."
"ఏం చెయ్యగలం మనం? కాస్త కాఫీ తెచ్చి పెడతావా?" మంచంమీద పడుకుంటూనే అన్నాడు.
వీరయ్యకు అపనమ్మకం కలగలేదు. వెళ్ళేడు.
అంతే!
స్టేషన్ కు వచ్చేసరికే రైలు ఉంది. కదులుతుందన్న గుమాస్తా అరువు; దూరంగా పచ్చ దీపం వెళ్ళు అన్నట్లు. ఎక్కేడు. 'అమ్మయ్య' అన్నట్లే నిట్టూర్పువిడిచి, కదులుతున్న చక్రాల చప్పుడులో ముఖం తుడుచుకున్నాడు.
మెరిసిపోతున్న సాయల్లా కృష్ణవేణి జడలు. ఆకాశాన్నంతా మ్రింగి నెమరేస్తున్నట్లు ప్రతి బింబం. దుర్గమ్మ దూరాన్నుంచి నవ్వుతూంది. వీచిన చల్లగాలి, చెవుల్లో రొదతో, ఎదలోని చల్లదనాన్ని రేకొడుతూంది. ఎన్నాళ్ళకు చూచేడు, తనూ రోజు కూర్చునే స్థలం మసగ్గా! నవ్వు వచ్చింది.
'ఎందుకమ్మా, అంత గంభీరంగా వుంటావు?' అని అడగాలన్న ఆయత్తత కలిగింది. గుండె గొంతులో కొట్లాడినట్లు ఉంది, ఎన్నో తరాలు గడిచేయి. ఆయా తరాల్లో కృష్ణమ్మ అల్లాగే ఉండిపోయింది. అందరూ అనుకున్నారు. ఇప్పుడు తనూ అనుకుంటున్నాడు. అయినా కృష్ణమ్మ ఉలుకూ పలుకూ లేనేలేదు.
