Previous Page Next Page 
ఆరాధన పేజి 19


    'నాకు వ్యాపారం గురించి ఎంత చెప్పినా తల కేక్కదు. నా నుంచి ఏ అభ్యంతరమూ రాదు మీకు. మద్రాసు చూడండి! బొంబాయి వెళ్ళండి! నాకు....'
    'మేడమ్! ఈ నెలలో మీ డాన్సు ప్రోగ్రాం వుందా? ఎక్కడైనా ? చూడాలని ఎన్నాళ్ళ నుంచో తహతహ లాడిపోతున్నాను.'
    'లేదు! ముక్తసరిగా వచ్చింది జవాబు.
    అయినా అతడు రవ్వంత కూడా నిరాశ చెందలేదు. ఏదో హెచ్చరించబోయాడా పైన. అనూరాధ 'వస్తాను! వంట వేళ మించిపోయింది.' అంటూ వెళ్ళిపోయింది అక్కడ నుంచి.
    నౌకరుతో చెప్పి చంద్రం కోసమై వో గదిని కేటాయించింది.
    'అమ్మా బాబుగోరు మా పెద్ద తిక్క మడుసులనుకొండి. సీసాలు సీసాలు తాగేత్తాడు. ఇల్లంతా గొడవ సేసేవోరు. అయ్యగోరు కోపం వచ్చి వెళ్లి పొమ్మనే వోరు.' అన్నాడు జోగులు.
    విని ఊరుకుంది అనూరాధ మౌనంగా.
    భోజనం దగ్గర్నుంచి , వక్కపొడి వరకూ అతని గదిలోకే పంపించు తొందామే. అతడు లేచేసరికి ఆమె స్నాన పానాదులు ముగించుకుని ఏదో పుస్తకం లొకి వంగిపోయి వుంటుంది.
    చంద్రం వచ్చి పది రోజులైంది. అతడానాడు అనూరాధ ఏదో అల్లుకుంటుండగా వచ్చాడు.
    'క్షమించాలి! వో నాలుగు వందలు సర్ధగలరా?'
    "అంత గొప్పవాళ్ళం కాదు మేము!' సౌమ్యంగానే వున్నదామే స్వరం.
    'పోనీ వో వందవున్నా సరిపోతుంది. వో స్నేహితుడు మంచి ఆపదలో వున్నాడు. సాయం చేస్తానని మాట యిచ్చాను . కానీ.........'
    'మీ అవసరాలనీ గమనించడానికి నేనేమీ సి.ఐ.డి ని గాదు లెండి! అంత అవసరం అయితే శారదక్కయ్యను అడగండి వెళ్లి. తప్పకుండా యిస్తుంది.' అన్నదామె.

 

                                       
    'శారదగార్ని అడగమంటూన్నారా? అబ్బే! అంతదాకా ఎందుకు లెండి! నేనే చూసుకుంటానులే! వెళ్ళిపోయాడతడు.
    'అమ్మగోరూ! మీ దగ్గిర పాచిక పారడం లేదయ్యగోరికీ!' నౌకరు నవ్వాడు.
    ఆ రాత్రి పది గంటలైనా చంద్రం యిల్లు చేరనేలేదు.
    'జోగులూ! నువ్వు పడుకో పోయి! అతను వస్తే నేను తలుపు తీస్తానులే!' అన్నదామె అతనికి నిద్ర ముంచుకు రావడం గమనించి.
    శరత్ భాబు 'శేష ప్రశ్న,' చదువుతూ కూర్చుందామె. పదకొండు కొట్టింది గడియారం. పుస్తకం లోంచి తలెత్తిందామె. నిదుర వస్తోందనుకుంటూ లేచింది. అంతలో తలుపు దగ్గర బూట్ల ధ్వని విన్పించింది.
    వెళ్లి తలుపు తెరిచింది. బ్రాందీ వాసన ముక్కు పుటాల్నీ బద్దలు కొడుతోంది. అతని కళ్ళు జ్యోతుల్లా ఎర్రబడి వున్నాయి. మనిషి నిషాలో తూలి పోతున్నాడు. అనూరాధ ప్రక్కకు తప్పుకుంది. ఆమెను చూడగానే నవ్వాడు ఏదో వాగబోయాడు.
    "హుష్! మాట్లాడకండి! ఇక్కడ వినేవాళ్ళేవరూ లేరు! ఇదిగో ! తాళం! గేటు మూసిరండి! నౌకరు యింతవరకూ మేల్కొని ఎదురు చూడడానికి రాక్షసుడు కాదు.' తాళం బల్ల మీద వుంచి తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుందామె    అ యువకుని నిషా సగం పై వరకు దిగిపోయింది. గేటు వేసి రాక తప్పింది గాదతనికి.
    ఉదయాన లేచి ముఖం కడుక్కుంటుండగా అన్నది అనూరాధ --
    "ఈ యింట్లో నిషా చిందులు వేయడం ఎవరికీ నచ్చదు. అంతేగాదు. ఇది దివాణం గాదు అర్ధరాత్రి వరకూ వేచి వుండడానికి. డాక్టరు గారు లేకపోవచ్చు! కానీ యిది అయన యిల్లు. ఇలాంటి అభిరుచులు నచ్చవు వారికి"  నిప్పురవ్వ లా చురుక్కు మంది వ్యంగ్యం.
    అతని ముఖం నల్లగా మాడిపోయింది. అయినా వెంటనే నవ్వు పులుముకున్నాడు నేర్పుగా ----
    'వొహ్! రాత్రి సంగతి గదూ! మీరంటున్నది! నాకు చిన్నతనం లో జబ్బు చేసి నీరసంగా అయిపోయానట! వో ఫారిన్ రిటరనడ్ డాక్టర్ యీ బ్రాందీ గానీ మరోటీ గాని తీసుకోమని సలహా యిచ్చాడు. అప్పటి నుంచి అలవాటయ్యింది.-----దీని వలన......'
    'మీకు నష్టం కన్పించకపోవచ్చు కానీ యీ వాతావరణం లో వుండదలచుకున్న వాళ్ళు నిషా గురించి ఆలోచించ గూడదన్న నియమం వుంది. కధలు వినేంత సరదా లేదిక్కడ ఎవరికి" అన్నదామె.
    'మీరున్నారు గనుక తప్పకుండా మానడానికి ప్రయత్నించుతాను ' వినయంగా వచ్చింది సమాధానం.
    అనూరాధ విన్పించుకోనేలేదా మాటల్ని తన పనిలో లీనమై పోయిందేప్పుడో.
    మరునాడు చంద్రం వో వేయి రూపాయలు తెచ్చి ఆమె ముందుంచాడు ---
    'శ్రమ అనుకోక కాస్త దాచి వుంచండి. నాన్నగారు ఎవరికో యిమ్మని పంపించారు. అతనేమో లేడిక్కడ! నా దగ్గర వుంటే ఖర్చయి పోతాయి.' అన్నాడు.
    అనురాధ కనులెత్తి చూడకుండానే అన్నది--
    'క్షమించాలి! ఒకరి డబ్బు దాచెంత సమర్ధత లేదింకా నాలో.'
    'గుడ్! నిజంగా మీ అభిప్రాయాలన్నీ నాలాగే సింపుల్ గా వుంటున్నాయి .' పోల్చి మరీ ప్రశంసల్ని రువ్వుతున్నాడతడు.
    అతడు చిన్నబోకుండా తన అలవాటు కూడా అలాంటిదేనంటూ, ఆమెను తన వైపు ఆకర్షింపజేయాలని అనుకున్నాడు. కాని ఆమె శీల విగ్రహం లా కదలకుండా కూర్చుంది. ఎంత నేర్పును ప్రదర్శించినా ప్రయోజనం శూన్యమే అవుతోంది.
    అయినా నిరాశతో వెనుదిరిగి పొడలచుకోలేదా ప్రత్యర్ధి. ఆమెకన్నా మొండిగా, ధైర్యంగా నిలబడాలని నిశ్చయించు కున్నాడు.
    ఆ సాయంత్రం వో నలుగుర్ని వెంట బెట్టుకుని వచ్చాడు. అనూరాధ స్వెట్టరు అల్లుకుంటోంది.
    'క్షమించాలి! మా మిత్ర బృందం ఎప్పటి నుంచో మిమ్మల్ని చూడాలని తపించి పోతున్నారు. అంటూ ఒక్కొక్కరినీ పరిచయం చేశాడు.
    అందరికీ ప్రతి నమస్కారాలు చెల్లించిందామె అందుకో ఒకతను అన్నాడు----
    'హరికృష్ణ, నేనూ 'మెడిసిన్ ' లో క్లాస్ మేట్స్ మే! అతనూ నేనూ కలిసి ఎన్నో ఊళ్ళూ తిరిగేవాళ్ళం సరదాగా!'
    కనులెత్తి చూసిందామె. ఆ యువకుని వంక చూడగానే ఆ చెప్పినదానిలో యదార్ధం రవ్వంతైనా లేదని గ్రహించింది. హరికృష్ణ ఏనాడూ సరదాగా తిరిగినట్లు శారదకు కూడా గుర్తు లేదు. ఇదంతా 'చంద్రం' ఆడుతున్న నాటకంలో వో భాగం అని గుర్తించింది అనూరాధ.
    'పాపం! ఎంతో మృదు హృదయుడు! పిచ్చి ఎక్కిందని వినగానే మేమందరం చాలా బాధపడ్డాం! ఇంతకూ ఎక్కడైనా వున్నట్లు తెలిసిందాండి!' సానుభూతి ప్రదర్శించాడు.
    'తెలిసింది ! మీలాంటి మిత్రులెవరో ఆయనను తమ దగ్గరే వుంచుకుని మనిషిగా మార్చాలని చూస్తున్నట్లు తెలిసింది.'
    వ్యంగ్యం చెళ్ళు మన్పించింది ఆ జవాబు విన్న వెంటనే.
    'మీరు నృత్యం మానివేశారా?' మరో మిత్రుడు ప్రశ్నించాడు.
    'అని ఎవరన్నారు?'
    'చంద్రం అన్నాడు మొన్న!'
    'లేదు!క్ ఎందుకు మానతాను? ఆత్మీయులు మనసుపడి అడిగినపుడు తప్పకుండా అంగీకరించుతాను.'
    చంద్రం ముఖం వెలవెల బోయింది.
    ఈ మా చిన్న కానుకని కాదనకండి! మీరు అజంతా  మహాల్లో ప్రదర్శన యిచ్చినప్పుడే యివ్వాలను కున్నాను. కానీ పరిచయం లేక ఆగిపోయాను. ' అంటూ వో రిస్ట్ వాచ్ అమెకందించబోయాడా మిత్రుడు.
     అనూరాధ దానివంకైనా చూడకుండానే అన్నది.
    'క్షమించండి! ఇంత విలువైన కానుకలు అందుకునేంత అర్హత లేదిపుడు నాలో!' మృదువుగా తిరస్కరించింది.
    'నేను చెప్పలేదుట్రా! అనూరాధగారెంతో నిరాడంబరమైన మనుషులని బహుమానాలని అందుకోవడం యిష్టం వుండదామెకని నేను చెప్పాను కానీ... వీడే....'
    చంద్రం యింకా అల్లబోతున్నాడో అందమైన కధని.
    'దీనిలో ఆడంబర, నిరాడంబర ప్రసక్తి ఎందుకు? కానుకలు స్వీకరించుతాను. కానీ యిపుడు సమయం గాదన్నాను. హరికృష్ణ గారి స్నేహితులు గనుక నా అభిప్రాయాన్ని చెప్పాను.
    మరోసారి చంద్రం లోని అహం దెబ్బ తిన్నది. అయినా పడగ విప్పే వుంది ధైర్యంగా.
    వాచీని బహూకరించదలచిన మిత్రుడు చిన్నబోయాడామాటతో. ఆ వ్యంగ్యోక్తి అతనిలోని అబద్దాన్ని, హరికృష్ణ నాకు మిత్రుడు అన్న పచ్చి అబద్దాన్ని సవాలు చేసిందని గ్రహించాడు . అందుకే మళ్లీ నోరెత్తనే లేదా మానవుడు.
    చంద్రం ఏదో విధంగా ఆమెతో వో ప్రదర్శన యిప్పించాలన్న పట్టుదలతో ఒప్పించజూశాడు. మిత్రులతో అడిగించాడు.
    కానీ అనూరాధ! ఇప్పుడు వీలుపడదు? మీరంతా కళా హృదయులు. సంస్కారం మూర్తీ భవించిన మనుషులు! నాకు సోదరులు గనుక చెబుతున్నాను.
    మనస్సు విరిసిన మల్లియలా వున్నప్పుడే కళామయులుగా నాటించగలుగుతారు. అంతవరకూ వేచి వుండగలరనే నమ్ముతున్నాను.' అన్నది.
    చంద్రం వొడిపోయాననే ఒప్పుకోవలసి వచ్చిందా అస్త్ర ప్రయోగంతో.
    ఆ రాత్రికి అక్కడే భోజనం అని చెప్పడందరముందే అది అనూరాధతో అంతకుముందు చెప్పనే లేడతడు!'
    'అలాగే! ఒక్క మనవి! కొంచెం ఆలస్యమౌతుంది. హరికృష్ణ గారి దివాణం లో ఖజానా అజమాయిషీ యిపుడు నాది గాదు. అందుకని ఈ మీ చెల్లెలు స్వయంగా వంట చేసి వడ్డించెంత వరకూ వేచి వుండాల్సిందే! ఒక సంగతి గుర్తుంచుకోవాలి-- చంద్రం గారు జమీందారు పుత్రులు. కానీ అనూరాధ అంత లక్ష్మీ సంపన్ను రాలు గాదు. వంటలు కోరినవి గాక పోవచ్చు. కానీ చెల్లెలుగా ఆప్యాయతకు మాత్రం ఏ లోటూ రాదు.' అన్నది అనూరాధ మృదు మధుర స్వరంతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS