Previous Page Next Page 
మనిషి పేజి 19


    
                                      17
    "మరునాడు రాజు గారింటికి వచ్చాడా సారధి?' అని అడిగాను.
    "వచ్చాడు కాని..." అంటూ ఆగింది హెలెన్.
    "ఊ, కాని...."
    "విధి లేక, మోసం చేయలేక , అయిష్టం తో వచ్చినట్టు కనిపించాడు. ఇద్దరు మనుష్యుల మధ్య పరస్పరాకర్షణా , ప్రేమాభి మానాలూ ఉంటె, సంభాషణ దానంతట అదే దొర్లుతుంది. ఆయాసం లేకుండా, ప్రయత్నం లేకుండా మాటలు పరిగెత్తుతాయి. కాని, ఇద్దర్లో ఒకరికి రెండో వ్యక్తీ మీద ఇష్టం లేకపోతె, కుంటుతూ, నట్టుతూ మాటలు నడవలేక నడుస్తాయి. అలానే మేం మాట్లాడు కున్నాం. "మాట్లాడుకున్నాం" అనటం కంటే "మాట్లాడాను" అనటం న్యాయమేమో. నేనే వస పోసిన పిట్టలాగా వాగేను. జీవితంలో ప్రాణ సమానమైన బిడ్డను పోగొట్టు కున్నాక , ఇంక దొరకదని నిరాశ చేసుకున్నాక, ఆ బిడ్డ దొరికినప్పుడు తల్లి ఎంత ఆనందం అనుభవిస్తుందో అంత ఆనందంతో, మతి చలించిన దానిలా మాట్లాడాను. ఆ తరువాత రాజుగారు నాతొ అన్నాడు గూడా, "ఆ సారధి ని ప్రేమించిన దాంట్లో మారో వంతు నన్ను ప్రేమించినా, నా జన్మ ధన్యమయ్యేది" అని. కాని నిజం -- సారధి పై నాకున్న మక్కువ లో మరో వంతు కూడా మరో ప్రాణి పై లేదు. టిఫిన్ పెట్టాను. వద్దన్నాడు. కాఫీ ఇచ్చాను . తాగాడు.
    "సారదీ, ఎంతసేపూ నేనే మాట్లాడటం కనిపిస్తుంది. నువ్వు మాట్లాడదలుచుకోలేదా?"
    "ఏముంటాయి మాట్లాడటానికి విశేషాలు?' అంటూ సంభాషణ విరిచేవాడు.
    అవతల వ్యక్తికీ రవ్వంత గూడా ఇష్టం లేదని తెలిసి కూడా ఏమని మాట్లాడాలి? ఎంతని మాట్లాడాలి? విసుగు వచ్చింది. ఆ నిశ్శబ్దం తలనొప్పి అనిపించింది. అలాగే కాసేపు కూర్చొని , "వస్తాను, హేల్లీ" అంటూ లేచాడు.
    "ఎప్పుడు వస్తావు?"
    "వస్తానంటే వెళుతున్నాను అని అర్ధం."
    "మళ్ళీ రావా?"
    "ఎందుకు?"
    "నేను నీకోసం మద్రాసు పని గట్టుకొని వచ్చాను సారదీ. రైలు పరిగెత్తుకు వస్తుంటే, అడుగడుగునా నీకు దగ్గిరోతున్నాననే ఆనందం నన్ను ఉరకలు వేయించింది. వచ్చిన నాటి నుంచీ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని నీకోసం వెతికాను. చివరకు కనిపించావు. కాని, ఇదేనా నాపై నువ్వు చూపించే ఆదరణ? ఇదేనా  నువ్వు నాకిచ్చే ప్రతిఫలం? నేను  పొరపాటు చేశానని స్పష్టంగా చెప్పలేక, నాకు బుద్ది చెబుతున్నావా, సారదీ?"
    "హేల్లీ నిన్ను బాధ్జపెట్టే అధికారం నాకెలా లేదో, అలాగే నన్ను బాధ పెట్టె అధికారం కూడా నీకు లేదు. నాకు తెలుసు , నీకు నేను చాలా ఋణపడి ఉన్నాను. అది తీర్చుకునే శక్తి నాకు లేదు. నిజమే. నువ్వు పొరపాటే చేశావు. నేనేం చెయ్యను? నీవు కోరింది నాకసాధ్య మై, అందకుండా పోయింది ఈ జీవితానికి. నీకేమిచ్చేది? ఎందుకు నాకోసం బాధపడతావు?"
    సారధి వెళ్ళిపోయాడు. ప్రపంచ మంతా శూన్యంలా కనిపించింది నాకు. రాజుగారు పక్క గదిలోంచి మా సంభాషణంతా విన్నట్టున్నాడు. మెల్లిగా వచ్చి, నన్ను దగ్గిరికి తీసుకొని, "చేతికి దొరికిన వైకుంఠన్ని అనుభవించటం చేతకాని వాజమ్మ ను పట్టుకొని దేవుళ్ళాడి ఏం లాభం , బుల్లీ" అంటూ సారధిని తిట్టటం మొదలు పెట్టాడు. ఈ జీవితం ఎంత చిత్రమైందో చూడు! నేను ఎవర్ని కావాలను కుంటున్నానో వాళ్ళు నాకు దూరమై పోతున్నారు. ఎవర్ని చీదరించు కుంటున్నానో వాళ్ళు నావెంట పడి, నా కటాక్ష వీక్షణం కోసం తపించి పోతున్నారు. లోకపు తీరే ఇంతేనేమో! ఏ ఇద్దరూ ఒకర్నొకరు ఒకే విధమైన ఉద్వేగంతో ప్రేమించు కోవటం జరగదేమో! ఇంతకూ మించిన విషాద మేముంది సృష్టి లో?
    నేను నిరశ చేసుకున్నాను. సారధికి ఒక ఉత్తరం రాసి, కనిపిస్తే ఇమ్మని రాజు కిచ్చి వచ్చేశాను. ఇంక మద్రాసు లో ఉండాలని పించలేదు.
    "ఏమని వ్రాశావు?"
    "ఏముంది వ్రాయటానికి? ఏం వ్రాసి ఏం ప్రయోజనం? ఏనాడు దయకలిగి నీవు నా దగ్గిరికి రావాలనుకున్నా ఇదే అనురాగం తో ఆహ్వానిస్తాను. ఆయువు తీరేదాకా నీకోసం నిరీక్షిస్తాను,సారదీ అని వ్రాశాను."
    అంతలో"మీ కబుర్లు ఓ పట్టాన తెగేటట్లు లేవే?'అంటూ మా శ్రీమతి వచ్చింది.
    మా ఆవిడ కీ గొడవ పట్టినట్లు లేదు.
    "ఇంతమంచి ఇల్లాలుంటే మీరు ఎన్నైనా శ్రీకృష్ణ లీలలు చేయవచ్చే! ఏమో! మగవాళ్ళ ని ఎవరు నమ్మారు? సారధి ని పీక్కు తింటున్నట్టు మిమ్మల్ని కూడా పాతివ్రత్యం పీక్కు తింటుందేమిటి?' అంటూ నాటకం లో పాత్ర ధరించి తెర వెనక్కి వచ్చిన నటి నవ్వినట్లు కిలకిలా నవ్వింది. మా శ్రీమతి కూడా అర్ధం కాకపోయినా నవ్వేసింది.
    ఆనాడే హెలెన్ వెళ్ళిపోయింది గుంటూరు. నాలుగైదు రోజులు పోయాక లింగరాజు తిరిగి వచ్చాడు మద్రాసు నుంచి.
    "సారధి కనిపించాడా?' అని అడిగాను.
    "కనిపించలేదు. కాని రఘుపతి కనిపించి సారధి సంగతి చెప్పాడు."
    "ఏం చెప్పాడు?"
    "సినిమాల్లో ఎక్స్ ట్రా వేషం వేసే ఓ పిల్లతో ఉంటున్నాడట."
    "రఘుపతి మద్రాసు ఎందుకు వచ్చాడు?'
    "పెళ్ళానికి చాలా జబ్బు చేసిందట. ఆపరేషన్ చేయించాలని తీసు కొచ్చాదుట."
    "ఇంకా ఏం చెప్పాడు సారధిని గురించి?"
    "సారధి చాలా పాడై పోయాడనీ, ఇంక వాడీ జీవితంలో బాగుపడటం జరగదనీ, మాంబళం సందుల్లో ఓ పాడుబడ్డ మేడలో ఉంటున్నాడనీ, నానా పాడై కనిపించాడనీ చెప్పాడు."
    "నువ్వెళ్ళి చూడలేక పోయావా?"
    "వెళ్దామనే గదా అనుకున్నది. రఘుపతి ఇచ్చిన అడ్రసు కాగితం పారేసుకున్నాను. వీలుపడలేదు."
    ఆ తరువాత నాలుగైదు నెలలు గడిచి పోయాయి. సారధి దగ్గిర నుంచి ఎటువంటి సమాచారం నా కందలేదు. ఆ ఏడు బెంగుళూరు లో ఇంగ్లీషు సెమినార్ ఒకటి జరిగింది. డానికి మా కాలేజీ నించి నన్ను పంపించారు. సెమినార్ ఆరు రోజులు జరిగింది. అది అయాక టూరిస్టు బస్సులో మైసూరు బయలుదేరాను. అంతదూరం వచ్చి మైసూరు చూడకుండా రావటానికి మనసొప్పదు గదా?
    బృందావనం లో హెలెన్ కనిపించింది రాజుగారితో కలిసి, నన్ను చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి.
    "సౌఖ్యానికి అంతమేమిటో కనుక్కుందామని రాజూ నేనూ దేశమంతా తిరుగుతున్నాం. నువ్వూ రారాదూ మాతో. రాజుగారూ, కంగారు పడకండి అప్పుడే. పెళ్ళయ్యాక మగవాళ్ళు కొందరు కీర్తి శేషుల్లో లెక్క" అంటూ మళ్ళీ కిలకిలా నవ్వింది హెలెన్.
    బెంగుళూరు హోటళ్ళన్నింటి లోకి శ్యాం మహల్ ఖరీదైన హోటలు. గదికి రోజుకి యాభై రూపాయలుంటుంది అద్దె. అక్కడ సామాన్యులు దిగరు. ,లెక్క పెట్టలేనంత డబ్బు వరదలా కొట్టుకొస్తున్న కోటీశ్వరులు , దేశ ప్రజల సౌజన్యంతో స్వర్గానికి నిచ్చెనలు వేసుకొనే రాజకీయ నాయకులు, శరీరాన్ని పెట్టు బదిగా లక్ష లార్జించే మదవతులు, దొంగనోట్లు అచ్చు వేసే పెద్ద మనుషులు, పేకాట ని జీవిత వ్యాసంగంగా స్వీకరించిన లక్కీ హండ్లు, సినిమా తారలు, కొత్తగా పెళ్ళయిన డబ్బున్న జంటలు, ఇతర దేశాలకు ఏజంట్లు గా పనిచేసే దేశ భక్తులు అక్కడ దిగుతారు. భువి నుంచి దివికి దిగిన వైకుంఠ లాగా ఉంది ఆ హోటలు.
    బలవంత పెట్టి ఆ హోటలు కు తీసుకు పోయింది హెలెన్. పాపం, రాజుగారు కూడా అభ్యంతరం పెట్టలేదు.
    "ఇలాటి హోటల్లో ఎప్పుడన్నా దిగావా నువ్వు?" అంది హెలెన్ హేళనగా.
    "నా నెల జీతం వారం రోజుల అద్దెకు సరిపోదే" అన్నాను. 'టై' సవరించు కుంటూ. ఆ క్షణం లో నామీద నాకే చిన్నచూపు పడింది. ఒకోసారి నేను చేస్తున్నది పెద్ద ఉద్యోగం లాగా కనిపించేది. కాని, ఆ క్షణం అనిపించింది, మన మూడు వందల జీతపు విలవ అతి స్వల్పం అని. రాజుగారు పోర్టు నిన్ త్రాగాడు.
    "ఈ బుడ్డి ఎంతో తెలుసా?' అంది.
    "ఎంత?"
    "ఎనభై రూపాయలు. మన దేశంది కాదులే. రొజుకొ బుడ్డి కావాలి మా బుల్లి బాబుకి" అంది.
    రాజుగారు బుడ్డి తాగి, మత్తుగా మంచం మీద దొర్లుతున్నాడు.
    'ఇతని వెంట తిరుగుతున్నావెం?' అన్నాను మెల్లిగా.
    "సరే! ఏం చెయ్యమంటావ్? ఎంతకాలం ఆ సారధి కోసం కనిపెట్టుకు కూర్చో మంటావు? అదీకాక నాకోసం ఈ రోజు పడే బాధ అంతు లేకుండా ఉంది. చూడలేక పోయాను. సరే, అయిందేదో అయిపొయింది. జీవితంలో మిగిలిన కాస్త సుఖాన్నీ పార బోసుకున్నా, సారధి మీద పగ తీరుతుంది గనకనా? రాజును పిలిచి చెప్పాను, 'నన్ను నీ ఇష్ట మోచ్చినట్టు చేసుకో. నలిపి నాశనం చెయ్యి. పీక నులిమి చంపేసుకో. నమిలి మింగేయి అని.' పాపం, రాజుని చూస్తె జాలి వేస్తుంది. అలా కళ్ళజోడు పెట్టుకు డాబుగా కనిపిస్తాడు గాని, వట్టి పసివాడనుకో....నాకోసం అందరినీ వదిలి పెట్టాడు. నేను నిప్పుల్లో దూకమంటే రెడీ, అలాటి వాణ్ణి చూస్తె ఎంత రాక్షసి కైనా జాలి వెయ్యదూ , చెప్పు?
    "ఇప్పుడైనా సారధి వచ్చి పిలిస్తే నన్ను వదిలి వెళ్లి పోతావా అంటుంటాడు."
    "నువ్వేమంటావ్?"
    "నా సమాధి దగ్గిరికి వచ్చి సారధి పిలిస్తే చాలు, బ్రతికి వచ్చి అతని పాదాల దగ్గిర వాలి పోతాను, రాజూ! అలాటిది బ్రతికుండగా పోకుండా ఉంటానా? అన్నాను."
    "పాపం."
    "పాపమే ముందిలే . సారధి వచ్చేదీ లేదు, నేను రాజుని వదిలి పోయేది లేదు."
    "ఇలా తిరిగి తిరిగి ఎక్కడికి చేరుతారు?"
    "ఎక్కడన్నా ఉత్తర హిందూ దేశంలో ఓ సిటీలో ఉండి పోవాలని పిస్తుంది. తెనుగు దేశం లోనే ఉండాలనే మమకారం నాకు లేదు. పైగా, ఎందుకనో తెలుసున్న మనుషుల నుంచి పారిపోవాలని పిస్తుంది."
    ఆపూట అక్కడే భోజనం చేయమంది హెలెన్. సర్వర్ కారేజ్ లో భోజనం పెట్టి తీసుకు వచ్చాడు. రాజు మా మాటలు పట్టించుకోకుండా మరో బుడ్డి పట్టించి పడుకుండి పోయాడు. హెలెన్ నాకు స్వయంగా వడ్డించింది భోజనం.
    "ఇలా నువ్వు వడ్డించ గా ఇవాళ భోజనం చేయగలనని కలలో గూడా అనుకోలేదు, హెలెన్" అన్నాను పప్పు కలుపుతూ.
    "మనం అనుకున్నవన్నీ ఎలా జరగవో , అనుకోనివి కూడా కొన్ని అలాగే జరుగుతాయి."
    "ఇలా నాలాటి వాళ్ళని పిలిస్తే, మీ రాజు గారికి ఆగ్రహం రాదూ?"
    "చెప్పానుగా. నన్ను అదిరించే ధైర్యం రవ్వంత కూడా అతనికి లేదు. అతని కున్నవి పంచ ప్రాణాలు కావు. రెండే రెండు. ఒకటి, ఆ బుడ్డి, రెండు, నేను. అతని జోకొట్టి నిద్త్రపోయాక , నేనేం చేసినా అతనికి పట్టదు. కాని ఇప్పుడు అతన్ని గురించి కూడా నేను బెంగ పెట్టు కోవలసి వస్తుంది."
    "ఎందుకని?"
    "అతనింక ఎక్కువకాలం బ్రతకడు. పైకి అలా మెరుస్తున్నాడు గాని, లోపలంతా రోగాల పుట్ట. ఎవరికైనా సుఖం కోసం అంత దేబిరింపు పనికి రాదనుకో. అలా బ్రతికి ఇంకా ఇంతకాలం ఎలా బ్రతికున్నాడా అనిపిస్తుందసలు . నిజానికి ఇలా పూర్తిగా పతనమై పోయిన వాళ్ళల్లో నే దేముడు కాపరం చేస్తాడేమో!"
    భోజనం పూర్తీ అయింది. ఉప్పూ, కారం లేదు కూరల్లో. సాంబారు కూడా చప్పగా ఉంది. హోటలు ఎంత అందంగా ఉందొ, భోజనం అంత అధ్వాన్నంగా ఉంది.
    హెలెన్ దగ్గిర సెలవు పుచ్చుకొన్నాను. "బెజవాడ కు తిరిగి పోయే ముందు మద్రాసు వెళ్లి సారధి ని చూసి పోగూడదూ?' అంది.
    "అతని అడ్రసు నీ దగ్గిర ఉందా?"
    "సంపాదించాను -- మాంబళం-- అంబి చెట్టి వీధి. ఇంటి నెంబరు 236బి" అంది పాఠం అప్ప చెబుతున్నట్లు.
    "నువ్వు సారధిని చూడకుండా వచ్చేశావే?"
    "మద్రాసు వెళ్లి మళ్ళీ అతని కాళ్ళ మీద పడి తల బద్దలు కొట్టికోవాలనుకున్నా. కాని ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. మళ్ళీ వెర్రి బాధ కొని తెచ్చుకోవట మెందుకని సరాసరి ఇటే వచ్చేశాను" అంది హెలెన్.
    "ఇంకా బెంగుళూరు లో ఎన్నాళ్ళు ఉంటావు?' అన్నాను.
    "నువ్వు సారధిని చూసి, ఉత్తరం వ్రాస్తావని వాగ్దానం చేస్తే, నువ్వు ఉండమన్నాన్నాళ్ళు ఉంటాను. ఎన్నాళ్ళయినా సరే, ఎన్నేళ్ళయినా సరే !"
    "తప్పకుండా వ్రాస్తాను , హెలెన్ . మద్రాసు లో తప్పకుండా దిగుతాను . సారధిని కలుసుకుంటాను."
    "ఎప్పటి కైనా అతనికి దయ కలిగితే, ఒక్క కార్డు వ్రాస్తే చాలు, రెక్కలు కట్టుకొని, అతని ముందు వాలతానని చెప్పు. ఆ పిలుపు కోసం అంతిమా విశ్వాసం విడిచే దాకా ఈ హృదయం నిరీక్షిస్తూనే ఉంటుందని చెప్పు" అంది.
    పోర్టు వైను తో స్వర్గానికి ఎగుమతి అయిన రాజుగారు ఈ సుఖ దుఃఖాలకు తాను అతీతుడై నట్లు నిర్మలంగా నిద్ర పోతున్నాడు. హోటలు దిగి, రోడ్డు మీదికి వచ్చి అటో రిక్షా కుదుర్చుకొని, నా బసకు బయలుదేరాను.రోడ్డు చివర నించి వెనక్కి తిరిగి చూశాను. హెలెన్ బాల్కనీ లోకి వచ్చి , తదేకంగా నా రిక్షానే చూస్తూ నిలబడి పోయింది. ఆమె మూర్తి మసకమసకగా కనిపించింది. కాని ఆమె మనస్సు అతి స్పష్టంగా చూశాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS