Previous Page Next Page 
బ్రతుకు బాట పేజి 19


                                  10
    'చాలా చిన్నపిల్ల -- పాపం-- ఈ వయస్సులో ఈబాధ! హాయిగా చదువుతూ ఆడుతూ పాడుతూ తిరుగే ఈడు--' ప్రిస్కిప్షన్లు వ్రాస్తూ జాలిగా అన్నది డాక్టర్.
    'కాన్పు చాలా కష్టం అవుతుందంటారా డాక్టర్!' ఆత్రుతగా అడిగింది ఇందుమతి.
    సుమిత్ర టెలిగ్రాం అందుకుని ఆమె ఇంతకూ ముందే వచ్చింది.
    'అవునమ్మా-- నాచురల్ గా కాకపోవచ్చు. అల్లా జరిగితే ఆపరేషన్ చేసి తీస్తాం -- అమ్మాయి చాలా నీరసంగా వుంది. ఎన్ని మందులు వాడినా ఆమె కోలుకొనే లేదు-- ఈ బాధకు తట్టుకోలేక పోతోంది. ఏం చేస్తాం ఉయ్ కాంట్ హెల్ప్' విరక్తిగా నవ్వింది ఆవిడ.
    'మీరిచ్చిన మందులన్నీ పెట్టెల్లో నూ అలమర ల్లోనూ పదేసిందే కానీ వేసుకొనే లేదు -- బ్రతుకు మీద రోతతో , విధి లేక బ్రతికిందది -- చావుకి సిద్దపడి హాస్పిటల్ కి వచ్చింది --' కళ్ళు తుడుచుకుంటూ అన్నది సుమిత్ర. అవతల గదిలో సావిత్రి గట్టిగా అరుస్తున్నది. అంతులేని వేదనతో మూలుగుతున్నది. సుమిత్రకి చెమటలు పోసుకోచ్చాయి.
    'ఎల్లా అయినా సావిత్రిని బ్రతికించండి డాక్టర్ -- ' అన్నది చివరికి -- ఆరోజంతా అరచి అరచి డాక్టర్లూ, కత్తెర లూ, ఆయుధాల సాయంతో ప్రసవించింది సావిత్రి. తెలివి తప్పి పడి వున్న సావిత్రి కోసం ఆందోళన పడేవారే కానీ, పాప ఎలా వున్నది? అనీ ఎవరూ చూడలేదు. ఆ పిల్ల భూమి మీద పడ్డ సూచనగా ఏడవనైనా లేదు-- మూడో నాటి ఉదయమే తనను విపరీతంగా అసహ్యించు కుంటున్న సంఘాన్ని వదిలి వెళ్ళిపోయింది. పచ్చని రంగు, ఎవరిదో మొక్కు మొహం ఎరగని పోలికతో నొక్కుల జుట్టుతో వున్న ఆ పాపని చూస్తె జాలేసింది ఇందుమతి కి. ఆ పిల్ల తన మనుమరాలు. ఇదే సక్రమ సంతానం అయితే ఎంత ముద్దులాడి వుండేదో! పెద్ద వాళ్ళ పాపాలూ, పుణ్యాలూ ఏమీ ఎరగని ఆ పసికందునా తను ద్వేషిస్తున్నది! ఆ బిడ్డను గుడ్డల్లో చుట్టి తీసుకేడుతూ వుంటే హృదయం చీలి రక్తం స్రవించి నట్లు కన్నీళ్ళు ధారాపాతంగా కారాయి.
    'ఇదేనా మానవత్వం !' అని ఘోషించింది హృదయం.
    'ఏదీ నా పాప! చూడనివ్వండి ఎవరి పోలికో! ఆ కళ్ళు నావేనా? ఆనునులేత బుగ్గలో సొట్ట లున్నాయా?' అని అడగలేదు కన్నతల్లి. అడిగే స్పృహ వచ్చే వేళకి భయంకరమైన నిజం నల్ల వేషంతో ప్రత్యక్షమై జడిపించింది. జడుసుకుని కేకవేయ బోతూ వుండగా 'నీకేం భయం లేదు-- నేను వెళ్ళిపోతున్నాను. ఇక నీకు స్వేచ్చ -- హాయిగా బ్రతుకు' అని వెక్కిరించేసి వెళ్ళిపోయింది పాప!
    'అందరూ పిల్లలు పుట్టినందుకు సంతోషిస్తారు. మనకు పోయినందుకు సంతోషించాల్సిన గతి పట్టింది-- ' అనుకుని లోలోపలే ఏడ్చింది సావిత్రి. పదిహేను రోజుల తరువాత హాస్పిటల్ నుంచీ డిశ్చార్జి అయి వచ్చింది.
    'వెడదాం -- రా సావిత్రీ' అని పిలిచింది ఇందుమతి --
    'వద్దమ్మా -- నేనింక అక్కడికి రాలేను-- కష్టమో, సుఖమో ఇక్కడే వుండి పోతాను -- వొళ్ళు కుదుట పడ్డాక ఎక్కడైనా ఉద్యోగం చూసుకుంటాను --'
    నువ్వప్పుడే ఉద్యోగం చెయ్యలేవు సావిత్రీ! వచ్చే ఏడు మళ్ళీ కాలేజీ లో చేరి చదువు కుందువు గానీ! నా మాట విని వచ్చేయ్! ఇంతకాలం అత్తకి బరువుగా వున్నది చాలక ఇంకా ఎందుకు?' కూతుర్ని కౌగలించుకుని కన్నీరు పెట్టుకుంది ఇందుమతి.
    'అత్తకి మనమంతా అంటే ఎంతో ప్రేమ-- నేను బరువని ఆమె ఎప్పుడూ అనుకోదు -- త్వరలో వొళ్ళు బాగుపడితే ఏదైనా ధ్యాసలో పడిపోతాను-- నాకా వూరు రావాలని లేదమ్మా-- నన్ను బ్రతిమి లాడకు ప్లీజ్-- నువ్వెళ్ళు --' అని గట్టిగా చెప్పేసింది సావిత్రి.
    'తెలియక ఒకసారి తప్పు చేస్తాం-- తప్పని తెలిశాక ఇక చెయ్యం-- ఆ పిల్ల దేవుడి లాంటిది-- నాకు మళ్ళీ సంఘంలో బ్రతికే అవకాశం కలుగ జేసింది -- ఇక నాకు చదువూ వొద్దూ- పెళ్ళీ వద్దు-- ఇక్కడే ఉద్యోగం చూసుకుని వుండిపోతాను-- నువ్వు కాదనకు చిన్నత్తా -- నిన్ను విడిచిపెట్టి నాకు వెళ్లాలని లేదు--' అని సుమిత్రని చుట్టుకుని తనివితీరా ఏడ్చింది సావిత్రి.
    'నువ్వు మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తావనే అనుమానం నాకెప్పుడూ లేదు సావిత్రీ -- నేను మనుష్యుల్లో విశ్వాసం వున్నదాన్ని -- మానవత్వాన్ని నమ్మేదాన్ని-- నువ్వు ఇక్కడ వుండడానికే నాకే అభ్యంతరమూ లేదు-- తప్పకుండా ఉండమ్మా!' అన్నది సుమిత్ర.
    'కుముదక్క నాన్నగారితో చెప్పి నాకేదైనా ఉద్యోగం చూసి పెట్టు అత్తా!' అన్నది సావిత్రి కళ్ళు తుడుచుకుని.
    'అల్లాగే చూద్దాం లే-- కొంచెం ఓపిక రానీ! ఈలోగా నేనూ పరీక్ష లకి వెళ్లొస్తాను. నేనొచ్చేవరకూ వాళ్ళ యింట్లో వుంటే నీకు భయం వుండదు -- ' అని సావిత్రి చెంపలు నిమిరింది సుమిత్ర.
    ఆ స్పర్శతో ఉత్సాహం కలిగినట్లు,
    'నాకు చచ్చిపోవాలనిపించేది . కాని ధైర్యం చాలేది కాదు-- ఎన్నో ప్రయత్నాలు చేశాను-- భయం వేసింది. నేనొట్టి పిరికిదాన్ని చిన్నత్తా! కానీ ఇప్పుడెందు కో చావడం దేనికీ, బ్రతికే వుంటే మాత్రం ఏమని పిస్తోంది. భవిష్యత్తు ను గురించిన ఆశలు లేవు-- కానీ నీలాగే నేనూ ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటాను-- ఇంకా కొంచెం మంచి ఉద్యోగం సంపాదించు కుంటాను-- అప్పుడు --అప్పుడు.
    'ఊరుకో సావిత్రీ -- ఎక్సైట్ అవడం మంచిది కాదు-- ఎవరి భవిష్యత్తు ఎలా వుంటుందో! ముందే ఏం చెబుతాం-- నీకేం ఫరవాలేదు-- విశ్రాంతి తీసుకో!' అని ప్రక్క మీద పడుకో బెట్టింది సుమిత్ర. సావిత్రి ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ పదేపదే చెప్పి కన్నీళ్ళ తో వెళ్ళింది ఇందుమతి.
    'సుమిత్రా! విశ్వాని కిక నువ్వు డబ్బు పంపకు-- ఈ ఖర్చు చాలు నీకు -- వాడికి నేను ఉత్తరం వ్రాశాను. సెలవులకి ఇంటికి వస్తాడుగా-- అప్పుడు చెబుతాను-- ఇక నుంచీ నేను పంపుతాను--' అన్నది రైల్లో కూర్చుని.
    'దానిదే ముంది లే వదినా!' అన్నది సుమిత్ర.
    'నువ్వు ఎంత కష్టపడ్డావో -- నాకు తెలుసు-- ఇంకా ఇంకా నిన్ను కష్టపెట్టడం భావ్యం కాదమ్మా! ఒక్కమాట చెబుతాను-- బసవరాజు యోగ్యుడైనవాడు-- అన్ని విధాల నీకు తగినవాడు-- అతన్ని పెళ్ళాడే అవకాశాన్ని జారవిడుచుకోకు--' అర్ద్రమైన కంఠం తో అన్నది ఇందుమతి.
    'అతని కుటుంబం సనాతనమైన ఆచారాలకు నిలయం వదినా-- చిన్న వదిన కులం సంగతి , మన సావిత్రి సంగతి ఇవన్నీ తెలిస్తే వాళ్ళు నన్ను యిష్ట పడరు -- అందుకే అతను ఎన్నిసార్లు ఆహ్వానించినా నేను వాళ్ళింటికి వెళ్ళలేదు. ఈ పెళ్లి ఆ కుటుంబా ని కంతకూ సంబంధించిన విషయం కదా!' అన్నది సుమిత్ర.
    'అవునమ్మా- మనం చేసే పొరపాట్ల కి అనుభవించే శిక్షలు కొన్ని-- ఇతరుల చేసే పొరపాట్ల కి అనుభవించే శిక్షలు కొన్ని. మొదటి నుంచీ నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకుంటూన్నావు-- ఈ ముఖ్య విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటావనే నేను అనుకుంటున్నాను --' అన్నది ఇందుమతి.

                       
    'ఉంటానమ్మా-' అన్నది సావిత్రి.
    'మంచిది తల్లీ- అత్తకీ ఈ ఊళ్ళో వున్న పేరు ప్రతిష్ట లకి నీ వునికి గొడ్డలి పెట్టు కాకుండా చూసుకో సావిత్రీ!' అని కళ్ళు తుడుచుకుంది ఇందుమతి.
    రైలు కదిలింది.
    'అమ్మకి నేనంటే ప్రాణం -- నాన్నకి నామీద కోపం వచ్చింది ఆరోజున. నా మీద తారా జువ్వలా లేచాడు-- కానీ అమ్మ నన్ను ఒక్కమాట అనలేదు. నెమ్మదిగా బ్రతిమిలాడి , బుజ్జగించి అడిగింది. చివరికి ఇక్కడికి తీసుకుని వచ్చింది --' అన్నది సావిత్రి, దూరమై పోతున్న రైలు వైపు చూస్తూ --
    'మీ అమ్మ చాలా తెలివి కలది సావిత్రీ! సమస్యలకి పరిష్కారాలు వెతకాలి గానీ , గోల చేసుకుని తలలు బాదుకోడం మంచిది కాదని గ్రహించింది --' అన్నది సుమిత్ర.
    
                                                  *    *    *    *
    ఎండ ప్రభావం తగ్గిపోయి , చల్లని గాలి ప్రజల సేద తీరుస్తూన్న సమయంలో, షాపుల నిండా లైట్లు వెలిగాయి. బజారులో జనం రద్దీ ఎక్కువైంది . ప్లాస్టిక్ బుట్ట నిండా ప్యాకెట్ల తో ఫ్యాన్సీ షాపులో నుంచీ బయట పడింది సుమిత్ర.
    బనారస్ లో తను వాడుకోడానికి, ఇక్కడ సావిత్రికి కివ్వడానికి, రోజూ అవసరం అయ్యే వస్తువులు చాలా కొన్నది. రిక్షా కోసం పేవ్ మెంటు మీద నిలబడి వాచీ చూసుకుంది. ఆరున్నర అయింది. ఇంత బరువైన బుట్టతో ఆ సమయంలో సిటీ బస్ ఎక్కడం అసాధ్యం. నలుదిక్కులా చూస్తూ నిలబడిన సుమిత్ర కి రోడ్డు క్రాసు చేసి వస్తున్న బసవరాజూ, అతని చిన్న చెల్లెలూ కనపడ్డారు.
    బసవరాజు చెల్లెలు అతనంత పొడుగ్గానూ వుంది. చెవులకి ముత్యాల లోలక్కులు పెట్టింది. ఖరీదైన సిల్కు చీరే ధరించింది. చిన్న చిన్న కళ్ళకి వెడల్పుగా కాటుక దిద్దింది. చక్కగా కత్తిరించిన పొడుగాటి గోళ్ళకి రంగు వేసింది. జుత్తు పైకి దువ్వి ముడి వేసింది.
    'ఈవిడే వసంతా, సుమిత్ర గారంటే!' అన్నాడు బసవరాజు , దగ్గరగా వచ్చి నిలబడి --
    సుమిత్ర నవ్వింది -- ' ఈమె నా చెల్లెలు వసంత-- బొంబాయి లో వుంటుంది-- వీళ్ళాయన అక్కడ పెద్ద బట్టల మిల్లులో అసిస్టెంట్ మేనేజర్' అన్నాడు బసవరాజు.
    వసంత విలాసంగా నవ్వి, 'మా అన్నయ్య చెప్పేదాన్ని బట్టి మీరు యెలా ఉంటారో నని ఊహించలేక చచ్సెదాన్ని-- వాడికి గోరంత ని కొండంత చేసి చెప్పడం మొదటీ నుంచీ అలవాటే!' అన్నది.
    ఆమె అల్లా అన్నప్పుడు చిన్నబోయిన ముఖంతో తనని తాను చూసుకుంది సుమిత్ర.
    ముప్పై రూపాయలకి మించని వాయిల్ చీరే, చేతులకి మట్టి గాజులు, చెవులకు పదేళ్ళ క్రితం చేయించుకున్న మెరుపు లేని దుద్దులూ!
    'అవును-- మీలాగా నాకు ఖరీదైన దుస్తులూ, విలువైన నగలూ లేవు -- అప్ట్రాల్ నేనొక బ్యాంక్ గుమస్తాను--' అనేసింది సుమిత్ర వెంటనే.
    బసవరాజు నవ్వుకున్నాడు. వసంత కి ఆమె మాటలు వినిపించుకునే వోపిక లేదు కాబోలు, 'అయ్య బాబోయ్ , ఇంత బరువుతో బస్ కోసం నిలబడ్డారా !' అన్నది మళ్ళీ=-
    'మనని చూసి అగినట్టున్నారు-' అన్నాడు బసవరాజు ఇబ్బందిగా.
    'ఓ! అలాగా! రండి సుమిత్రా! కాఫీ తీసుకుని పోదాం -' అని ఆహ్వానించింది వసంత.
    ఆవిడ కంఠం కృత్రిమ మర్యాదని కప్పి పుచ్చే ప్రయత్నమేమీ చెయ్యలేదు. బసవరాజు తో వసంత ని పోల్చుకుని నవ్వుకుంది సుమిత్ర.
    'చాలా అలసటగా కనపడుతున్నారు-- టిఫిన్ ఏదైనా తినండి సుమిత్రా!' అన్నాడు బసవరాజు ఆప్యాయంగా.
    'వద్దులెండి థాంక్స్.' అంది సుమిత్ర.
    'మనిషికి మంచి పర్సనాలిటీ వుండాలి-- ఇలా పిట్టంత వుండకూడదు-- పర్సనాలిటీ డెవలప్ కావాలంటే ఆహారం బాగా తినాలి. ఊ-- కానివ్వండి . స్వీట్ తెమ్మను అన్నయ్యా !' అన్నది వసంత గబగబ.
    'మనిషికి కావాలసింది పర్సనాలిటీ కాదు-- మెదడు. హృదయం -- ' అనాలనుకుంది సుమిత్ర.
    'మీ ప్రయాణం ఎప్పుడు ?' అన్నాడు బసవరాజు. ఆ ఇద్దరి సంభాషణ అతనికి చాలా వెగటుగా కనిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS